సీమ నవలల కళకళలు!
పాశ్చాత్య సాహిత్యం ప్రభావంతో భారతీయ భాషల్లోకి ప్రవేశించిన ప్రక్రియ నవల. భారతీయ నవలా పితామహుడిగా పేరుగాంచిన బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘దుర్గేశనందిని’ని తొలి భారతీయ నవలగా సాహిత్య చరిత్రకారులు పరిగణిస్తున్నారు. ఈ నవల రచనా కాలం 1865. అంటే భారతీయ నవలది 150 ఏళ్ల చరిత్ర. బెంగాల్‌లో పుట్టిన నవల తర్వాత ఏడెనిమిదేళ్లకు తెలుగు నేలమీద అవతరించింది. అదీ రాయలసీమలో! 1872- 1950 మధ్యకాలంలో తొలితరం సీమ నవలా ప్రస్థానమిది...
విస్తృతమైన సామాజిక జీవితాన్ని సాధ్యమైనంత సమగ్రంగా చిత్రించే ప్రక్రియ నవల. తెలుగు నవల మీద పాశ్చాత్య, బెంగాలీ ప్రభావాలు ఉన్నాయి. స్థానిక ఆచార వ్యవహారాలను చిత్రిస్తూ ఏదైనా రచన చేయమని రచద్యిఇ్తఅలను కోరుతూ నాటి గవర్నర్ జనరల్ (1866- 69) లార్డ్ మేయో ఓ ప్రకటన జారీ చేశారు. ఆ పిలుపు అందుకున్న నరహరి గోపాలకృష్ణమ శెట్టి ప్రయత్నంలోంచి పుట్టిందే ‘శ్రీరంగరాజు చరిత్ర’. రచనా కాలం 1872. అయితే ఇందులో చారిత్రకాంశం లేదనీ, నవలా లక్షణాలు లేవనీ దాని ఆద్యతను ఆధునిక విమర్శకులు తిరస్కరించారు. 1878 నాటి కందుకూరి ‘రాజశేఖర చరిత్రము’ను తొలి తెలుగు నవలగా (నిన్నమొన్నటి వరకు) గుర్తించారు.
అలా కోస్తా ప్రాంతంలో 1878 నుంచే నవలా సాహిత్యం కనిపిస్తుంది. ఇక వట్టికోట ‘ప్రజలమనిషి’ని తెలంగాణ తొలి నవలగా పేర్కొన్నా, 1895 నాటికే ఆ ప్రాంతం నుంచీ నవలలు వచ్చాయని అంటున్నారు. సీమ విషయానికి వస్తే ‘శ్రీరంగరాజు చరిత్ర’, ‘రేనాటివీరుడు’ మినహాయిస్తే 1950 దాకా నవలలు రాలేదన్నది విమర్శకుల మాట. సీమ సాహిత్యం మీద విశేష కృషి చేసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కూడా, ‘శ్రీరంగరాజుచరిత్ర’ను కాకుండా 1925నాటి ‘రేనాటివీరుడు’ను సీమ తొలి నవలగా ప్రకటించారు. ఆ తర్వాత 1950ల దాక ఈ ప్రాంతం నుంచి నవలలు రాలేదని చెప్పారు. విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తన రచన ‘కొన్ని కావ్యాలు- కొందరు కవులు’లోనూ 1950కి ముందు సీమ నవలా ప్రస్థానాన్ని గురించి మాట్లాడలేదు. కానీ, నవలా సాహిత్యంలో తెలుగునాట మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీమ ఏమంత వెనకపడలేదు. 1950కి ముందే ఇక్కడి నుంచి ‘శ్రీరంగరాజు చరిత్ర’తో కలిపి 20 మంది రచయితలు సృజించిన నవలలు 27 దాకా వచ్చాయి.
సంఘ సంస్కరణే నేపథ్యం
‘శ్రీరంగరాజు చరిత్ర’ రూపపరంగా ఆధునికం కాకపోయినా వస్తుపరంగా, ప్రక్రియపరంగా ఆధునిక రచనే. ఒకరాజు ఓ లంబాడి స్త్రీని ప్రేమించి పెళ్లాడటం ఇందులో వస్తువు. కుల కట్టుబాట్లు తీవ్రంగా ఉన్న కాలంలో కులవ్యవస్థను కాపాడే రాజుకు, తండాలో నివసించే లంబాడీ స్త్రీకి మధ్య ప్రేమ కల్పించడం, పెళ్లి చేయడం ఇందులోని ప్రగతిశీల చింతన. 1908లో దేవమణి సత్యనాథన్ ‘లలిత’ నవల వచ్చింది. ఇది స్త్రీ విద్య ప్రాధాన్యాన్ని ఆవిష్కరిస్తూ స్త్రీ వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని నిరూపిస్తూ సాగింది. ఇందులో ప్రధానపాత్ర లలిత అక్కను, తల్లిని పోగొట్టుకుంటుంది. తండ్రి పిచ్చివాడైపోతాడు. అన్నదమ్ములు బిచ్చగాళ్లవుతారు. ఏ ఆసరా లేని తనను బలవంతం చేస్తున్న వసంతుణ్ని తప్పించుకుని ఎన్నో సాహసాల తర్వాత మేనమామ కొడుకు హరిదాసును పెళ్లి చేసుకుంటుంది. సమస్యలకు బెదరకుండా సమాజంలోని మంచివాళ్ల సహకారంతో సమస్యల నుంచి గట్టెక్కిన ఓ యువతి కథ ‘లలిత’.
అనంతగిరి పేరనార్యుడి రచన ‘సుశీల’లో ప్రధానపాత్ర సుశీల విద్యావంతురాలు. జీవితంలో ఎదురైన కష్టాలను దాటుకుని, తనకు దూరమైన భర్తను, తల్లిదండ్రులను కలుపుకుని సమస్యను పరిష్కరించుకుంటుంది. సంఘ సంస్కరణోద్యమ ప్రభావం ఈ నవల మీద కనిపిస్తుంది. సంప్రదాయ భావజాలం కలిగిన రచయిత, నవలలో మాంత్రికులను, కాళికాదేవిని ప్రవేశపెట్టారు. అయితే, ఇందులో స్త్రీ వ్యక్తిత్వానికే ప్రాధాన్యం ఎక్కువ. ఇదే కాలంలో వచ్చిన మరో సాంఘిక నవల కల్వటాల జయరామారావు ‘సువర్ణకేసరీ కృష్ణసేన’. ఇది ప్రేమ పెళ్లిళ్లను సమర్థిస్తుంది. సువర్ణకేసరీ కృష్ణసేనల ప్రేమ వాళ్ల తల్లిదండ్రుల కారణంగా సంక్లిష్టమైపోతుంది. స్నేహితుల సాయంతో వాళ్లు ఒక్కటవడంతో కథ సుఖాంతమవుతుంది. ఆంగ్లేయుల పీడన, స్త్రీ విద్య, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, కరవు వంటి సామాజిక విషయాలెన్నో ఈ నవలలో చిత్రించారు రచయిత.
వరకట్నాన్ని నిరసిస్తూ, సంఘ సంస్కరణ ప్రధానంగా వచ్చిన నవల ‘రత్నబాయి’. దీన్ని బూదూరు రామానుజులరెడ్డి రాశారు. పేదవాడైన రామకిశోరుడనే యువకుడు కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. అలాంటిది తన కూతురు రత్నాబాయి విషయం వచ్చేసరికి వరకట్నం ప్రధానమైపోతుంది. దాంతో రత్నాబాయి పెళ్లికి అవసరమైన ధనం సంపాదించే లోపే ఆమె రజస్వల అవుతుందేమోనని భయపడతాడు. తండ్రి కష్టం గమనించిన రత్నాబాయి ఆత్మహత్య చేసుకుంటుంది. కన్యాశుల్కం, వరకట్నం దురాచార ఫలితాలను గమనించిన రత్నాబాయి తమ్ముడు హరికిశోరుడు సంఘసంస్కర్తగా మారి, వాటి నిర్మూలనకు ఉద్యమిస్తాడు. ఈ నవలకు ముందుమాట రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు ‘రత్నాబాయి’ మీద ‘మాలపల్లి’ ప్రభావం ఉందన్నారు. మరో తొలితరం రచయిత ఎం.వి.పాపన్న గుప్త రాసిన ‘భానుమతి’ సమకాలీన స్థితిగతులకు అద్దంపట్టిన నవల. ఇందులో బాల్య వివాహాల నిరసన, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, మద్యపాన నిషేధం, స్త్రీల సమస్యలను సమర్థŸంగా చిత్రించారు గుప్త.
జాతీయోద్యమ ప్రభావంతో...
19, 20వ శతాబ్దాల సంధిదశలో తెలుగులో చారిత్రక నవలలు చాలానే వచ్చాయి. దీనికి ప్రేరణ భారత జాతీయోద్యమం. సీమ నుంచి వచ్చినవాటిలో మొదటిది దేశాయి వెంకటరావు ‘సిరియాలదేవి’. 1917 నాటి ఈ నవలకు నేపథ్యం కాకతీయుల చరిత్ర. హనుమకొండ రాజ్యాన్ని శత్రువుల నుంచి సిరియాలదేవి రక్షించుకోవడం ఇతివృత్తం. అహ్మద్‌నగర్‌ను పరిపాలించిన చాంద్‌బీబీ ధైర్య సాహసాల చిత్రణతో దూబగుంట వేంకటరమణయ్య రాసిన నవల ‘చాంద్‌సుల్తానా’. ఆయనదే మరో చారిత్రక నవల ‘తానీషా’లో ఔరంగజేబు గోల్కొండ ముట్టడి ఇతివృత్తం. జగన్నాథ పండితుడి జీవితచరిత్ర ఆధారంగా దండిపల్లి వెంకటసుబ్బశాస్త్రి ‘వీరకంకణము’ నవల రాశారు.
సంఘ సంస్కరణ, చారిత్రక నేపథ్యంతోపాటు రాజకీయం ఇతివృత్తంగా నవలలు రాయడం సీమలో 1925 నుంచి మొదలైంది. వీటిలో మొదటిది కల్వటాల జయరామారావు రాసిన ‘రేనాటివీరుడు’. బ్రిటిష్‌వాళ్ల మీద తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా వచ్చిన నవల ఇది. గుంటి సుబ్రహ్మణ్యశర్మ అక్షరీకరించిన ‘మాధవాశ్రమము’ ఉప్పు సత్యాగ్రహం కాలంలో వచ్చింది. సీమలో ముఠా తగాదాల నేపథ్యంతో, గాంధీజీ నిర్మాణ కార్యక్రమాల అవసరాన్ని నొక్కి చెబుతూ రాసిన నవల ఇది. కర్నూలు కలెక్టరేటులో ఉద్యోగి అయిన మాధవశర్మ తన సొంతూరు కరూరుకు వచ్చి రామిరెడ్డి, కరణం మహదేవయ్యల మధ్య గొడవల్ని పరిష్కరించాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో జైలుపాలై, తిరిగివచ్చాక గాంధీమార్గంలో గ్రామ పునర్నిర్మాణానికి ఉద్యమిస్తాడు. కల్లు అంగళ్లు మూయించడం, విదేశీవస్త్ర బహిష్కరణ, జాతీయ పాఠశాల స్థాపన వంటివి చేస్తాడుఆయన ప్రయత్నాలు ఫలించి చివరికి గ్రామస్థులంతా శాంతిమార్గంలోకి మళ్లుతారు.
అంతటి నరసింహం ‘ఆదర్శం’లో ప్రధానపాత్ర కేశవరావు. గాంధీజీ ప్రభావంతో సామాజిక దురాచారాలను నిర్మూలించాలని అనుకుంటాడు. రాజంపేట దగ్గర్లోగల కోట గ్రామంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ, సహోద్యోగి నారాయణతో కలిసి తన ఆదర్శజీవనం మొదలుపెడతాడు. ఆ ఊళ్లోనే సుబ్బారెడ్డి, శాస్త్రి, కరణం మల్లంభొట్లు అమాయకుల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. దళితుడైన ఎల్లప్ప తన కొడుకు శీనును చదివించడం ఊరి పెద్దలకు నచ్చదు. కానీ కేశవరావు ప్రోత్సాహంతో బాగా చదువుకున్న శీను డిప్యూటీ కలెక్టర్ అవుతాడు. సుబ్బారెడ్డి కొడుకు రామిరెడ్డి, శాస్త్రి కొడుకు నాగలింగం శీనుకు సహాధ్యాయులు. వీళ్లు కులాలతో సంబంధం లేకుండా ప్రేమపెళ్లిళ్లకు సిద్ధపడతారు. వీళ్ల ఆదర్శాలకు పెద్దలు అడ్డురావడంతో మద్రాసుకు వెళ్లి రిజిస్టర్ పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక్కడా కేశవరావు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రి మరణించడంతో అతని రెండో భార్య కామాక్షికి నారాయణతో వివాహం జరిపిస్తాడు. తన ఆదర్శాలకు సరితూగకపోవడంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కమలనూ విడిచిపెడతాడు కేశవరావు. అస్పృశ్యత నివారణ, కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహం, దళితోద్ధరణ లాంటి వాటిని ఈ నవలలో స్పృశించారు రచయిత.
కాలక్షేపం ప్రధానంగా
పాలపర్తి సూర్యనారాయణ ‘ప్రియదర్శిని’, ఘూళీ కృష్ణమూర్తి ‘స్వార్థత్యాగం’, హెచ్.దేవదానం ‘ప్రేమసుందరి’, అమిద్యాల కృష్ణమూర్తి ‘ఓనామి (లేక) మదనమోహిని చరిత్రము’ వంటివి కాలక్షేప నవలలు. ‘ప్రియదర్శిని’ చారిత్రక కల్పిత నవల. అయితే ఇందులో స్వాతంత్య్ర కాంక్షకే ప్రాధాన్యమిచ్చి సమకాలీన పరిస్థితులనూ చిత్రించారు రచయిత. మొగలులను ఎదిరించి చిత్తోడ్ రాజపుత్రులు స్వతంత్రం ప్రకటించుకున్న వృత్తాంతం ఇందులో ప్రధానం. కృష్ణమూర్తి రాసిన ‘స్వార్థత్యాగము’ 1931లో బళ్లారి శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల ముద్రించిన మొదటి పుస్తకం. చిత్తోడ్ రాజవంశ చరిత్ర నుంచి కథను సేకరించి దీన్ని రాశారు. కథానాయకుడు చంద్రుడు తనకు దక్కాల్సిన రాజ్యాన్ని సవతి సోదరుడికి ఇచ్చి, రాజ్యం విడిచి వెళ్లిపోతాడు. చంద్రుడు లేని రాజ్యం అస్తవ్యస్తమవుతుంది. అతను తిరిగివచ్చి శత్రువుల నుంచి కాపాడి రాజ్యాన్ని మళ్లీ తమ్ముడికే అప్పగిస్తాడు. ఇది మొదటి త్యాగం. అరుణుడనే మరో పాత్ర తనకు ఆశ్రయం ఇచ్చినందుకు, యుద్ధరంగంలో చంద్రుడి ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టడం రెండో త్యాగం. కథానాయిక చెలికత్తె చంపకమాల రాణి కోసం ప్రాణాలర్పించడం మూడో త్యాగం. అందువల్లే దీనికి ‘స్వార్థత్యాగం’ అని పేరుపెట్టారు.
హెచ్.దేవదానం ‘ప్రేమసుందరి’ ఆంగ్ల అనువాద నవల. శస్త్రపాణి ప్రేమకోసం పరితపించిన ‘ప్రేమసుందరి’ హృదయ వేదనే దీని ఇతివృత్తం. ఈ నవల రెండో భాగం లభించలేదు. అందువల్ల దీని ప్రయోజనం తెలియదు. రాళ్లపల్లి గోపాలకృష్ణశర్మ, దోమా వెంకటస్వామి గుప్త, గుంటి సుబ్రహ్మణ్యశర్మ, పెరుమాల రామచంద్రయ్య తదితరులు అపరాధ పరిశోధన నవలలు రాశారు.
మొత్తానికి ఇతర తెలుగు ప్రాంతాలతో సమాంతరంగా 1950కి ముందు రాయలసీమ నుంచి కూడా వివిధ అంశాల ప్రధానంగా నవలలు గణనీయంగానే వెలువడ్డాయి. వాటిలో సామాజిక అంశాల చిత్రణలో తొలితరం సీమ రచయితల అభ్యుదయ దృక్పథం కనిపిస్తుంది. ఈ తొలినాళ్ల నవలల గురించి పరిశోధన అంతగా జరగలేదన్న మాట వాస్తవం. ఇక్కడ పేర్కొన్నవే కాకుండా ఇంకా కొన్ని నవలలైనా సీమనుంచి వచ్చి ఉంటాయి. ఆ దిశగా ఇంకా పరిశోధించి మరుగున పడిన సాహిత్యాన్ని వెలికితీయాలి. అప్పుడే తెలుగు నవలా చరిత్ర సమగ్రం అనిపించుకుంటుంది.
పొదిలి నాగరాజు,కడప.
తెలుగు వెలుగు,8/2019
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి