తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం
తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం
కడప నుంచి ఎర్రగుంట్ల కు వెళ్లే మార్గమధ్యంలో' కోగటం గ్రామం కనిపిస్తుంది.ఈ గ్రామం కమలాపురం మండలం పరిధిలో ఉంది. కమలాపురం చౌరస్తాలో అల్లసాని పెద్దన విగ్రహం కనిపిస్తుంది.
కోగటం మండల కేంద్రమైన కమలాపురం నుండి 10 కి. మీ. దూరం లోను, కడప నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 గణాంకాల ప్రకారం ఈ గ్రామం 848 ఇళ్లతో, 3400 జనాభాతో 2389 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో పురుషులు 1722, మహిళలు 1678. షెడ్యూల్డ్ కులాలు 448 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యుల శాతం60.4 % (2053). అందులో మహిళా అక్షరాస్యులు25.4 % (863).
కోగటం పేరు వినగానే గుర్తు కొచ్చే కవి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ప్రబంధ యుగానికి ఆది పురుషుడు. విజయనగర సామ్రాజ్య సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు పెద్దన.కృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన కు ఇచ్చిన దానాల్లో'' కోగటం' అగ్రహారం కూడా ఉంది.
'' కోగట గ్రామాద్యనేక అగ్రహారములన్ అడిగిన సీమలయందు నిచ్చె'' అని పెద్దన ఒకచోట రాసుకున్నాడు. పెద్దనకు కోగటం గ్రామాన్ని 'ఉంచిలి' (పన్ను లేని అగ్రహారం) గా ఇచ్చినట్లు, పాపాఘ్ని నది నుండి ఈ గ్రామమునకు పెద్దన కాలువ త్రవ్వించి నట్లు , గ్రామంలో ఉన్న సకల లింగేశ్వర స్వామికి , అలాగే చెన్నకేశవ స్వామికి కూడా దానాలు చేసినట్లు , మరింత సమాచారం కోగటం కైఫియత్తు లో చూడవచ్చని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రాసిన 'యుగకర్త పెద్దనామాత్యుడు' అనే వ్యాసంలో కొంత వివరణ ఉంది. ఈ ఊరికి సమీపంలోనే పెద్దన జన్మించిన 'పెద్దనపాడు' అనే గ్రామం కూడా ఉంది. పెద్దన తండ్రి పేరు చొక్కన.
కృష్ణ దేవరాయల కోరికపై పెద్దన 'మనుచరిత్ర' కావ్యాన్ని రచించాడు. ఈ మనుచరిత్రకే 'స్వారోచిష మనుసంభవం' అనే మరోపేరు కూడా ఉంది. ప్రసిద్ధి చెందిన అందరికీ తెలిసిన వరూధిని ప్రవరాఖ్యుల కథ ఇందులోనిదే. మనుచరిత్రను కృషదేవరాయలకు అంకితం ఇచ్చాడు. పెద్దన మనుచరిత్ర కాక "హరికథా సారము" అనే గ్రంధాన్ని కూడా రాశాడు. దానిని తన గురువైన శఠకోపయతికి అంకితం ఇచ్చాడు.
అందరికీ ఏదో వంకలు పెట్టే కవి చౌడప్ప పెద్దన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనను పొగుడుతూ ఇలా చెప్పినాడు తన కవితలో.
పెద్దన వలె కృతిచెప్పిన పెద్దన వలె, నల్పకవిని పెద్ద నవలనా?
యద్దన వలె మొద్దన వలె గ్రద్దనవలె కుందరవరపు కవి చౌడప్పా!
''అల్లసాని అల్లిక జిగిబిగి''- అనే నానుడి ఉంది. ఇది పెద్దన కవిత్వశైలి ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. పుణ్యక్షేత్రాలను వర్ణించటంలో, యుద్ధవర్ణన చేయటంలో, వృక్షాలనూ, లతలనూ కవిత్వీకరించడంలో పెద్దన పాండిత్యం అద్వితీయం. సామెతలనూ, జాతీయాలనూ ప్రయోగించటంలో ఆయన దిట్ట. మనం మాట్లాడుకునే మాటలను యథాతథంగా పద్యాలలో ఉపయోగించటం పెద్దన కు అలవాటు. మనుచరిత్ర తప్ప పెద్దన రాసిన కావ్యాలేవీ మనకు లభించటం లేదు.
కోగటానికి సమీపాన ఉన్న పెద్దనపాడులో జన్మించిన అల్లసాని పెద్దన కోగటం అగ్రహారంలో పెరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ పెద్దన కుటుంబీకులకు బంధువులు ఉండడంతో ఈ గ్రామంలో పెరిగినట్లు కోగటంలోని కోటేశ్వర చెన్నకేశవస్వామివారి ఆలయాల చరిత్ర చెబుతోంది.
కోగటంలోని కోటేశ్వర చెన్నకేశవస్వామివారి ఆలయాలు అతి పురాతనమైనవి. అల్లసాని పెద్దన శివారాధకుడు.ఆయనకు ఈ పురాతన కోటేశ్వర, చెన్నకేశవ ఆలయాలు అప్పజెప్పినట్లు ఆలయంలో ఆధారాలున్నాయి. ఎంతో పురాతనమైన శిల్ప సంపద కూడా ఇక్కడ ఉంది. 1998లో దేవదాయ, ధర్మదాయశాఖ శ్రేయోనిధి , గండ్లూరి పోతులూరు వీరప్రతాప్ రెడ్డి విరాళంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మాణ సందర్భంలో కొన్ని మూలవిరాట్ విగ్రహాలు దెబ్బతినడంతో వాటి స్థానంలో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేశారు. గతంలో కోటేశ్వరాలయం, చెన్నకేశవాలయం వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం రెండు ఆలయాలు ఒకే ఆలయంగా మారాయి. ప్రస్తుతం ఉన్న కోటేశ్వరస్వామి మూలవిరాట్‌ను కాశి నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు.వీరభద్రస్వామి, సిద్ధివినాయక విగ్రహాలు కూడా ఆలయ నూతన నిర్మాణంతో పాటు ప్రతిష్ఠించినవే. పార్వతీదేవి విగ్రహం, చెన్నకేశవస్వామి విగ్రహాలు పూర్వం నుంచి ఉన్న విగ్రహాలే. ఆలయంలో పెద్ద నంది విగ్రహం కూడా ఉంది. చాలాకాలం నుంచి నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆలయం పక్కనే కోనేరు ఉండేది. ప్రస్తుతం ఆ కోనేటిలో వివిధ మొక్కలు పెంపకం చేపట్టారు. ఈ ప్రాంత ప్రజల భక్తుల కొంగుబంగారంగా కోటేశ్వర శివకేశవాలయం నిలుస్తోంది. కార్తీకమాసంలో ఈ ఆలయాన్ని ఎక్కువ మంది భక్తులు సందర్శిస్తారు.
ఈ గ్రామం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారి సొంతూరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఆయన హయాంలో కోగటంలో కొంత మేరకు అభివృద్ధి పనులు జరిగినా ప్రస్తుతం అవి అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఆ గ్రామంలో డ్రైనేజీలు లేక వర్షం వస్తే రోడ్డుపైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. తెలుగు సాహిత్యానికి వన్నెతెచ్చిన పెద్దన సొంతూరును ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి అక్కడ పెద్దన స్మారక మందిరాన్ని తెలుగు భాషా సంబంధ పరిశోధన సంస్థ ను ఏర్పాటు చేయాలని సాహిత్యకారులు, ఇంటాక్ సభ్యులు కోరుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి