'అనంత' సాహిత్యం--ధోరణులు

                     
        'ఉత్తమ సాహిత్యం లౌకికజీవితానికి దూరంగా మడి కట్టుకొన్న ప్రత్యేక ప్రపంచం కాదు. అది సమాజ జీవితంలో ఒక భాగం. మానవ మానసిక
ప్రపంచంలో ఒక అంతర్భాగం. సంస్కారవంతుల మేధోకార్యకలాపాల్లో ఒక కీలకభాగం. ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం సమాజజీవితమైనట్లే దాని గమ్యస్థానం కూడా సమాజ జీవితమే' అని 'సంవేదన' లో ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి చెపుతారు. ఈ నేపథ్యం లో కాలానుగుణమైన మార్పులకు అనుగుణంగా వస్తుపరంగా, రూపపరంగా అనంతపురం జిల్లా నుండి వెలువడిన సాహిత్యాన్ని గమనిస్తే ఆధునిక సాహిత్యంలో ఎంతో సుసంపన్నమైన కవిత్వం
ప్రవహించింది. 
       అనంతపురం జిల్లా సామాజిక నేపథ్యంలో కనిపించే వివిధ సమస్యలు కరువు, ప్రాంతీయ చైతన్యం, కార్మిక, కర్షక జీవితాలు, కృంగిపోతున్న
సంప్రదాయక కులవృత్తులు, స్త్రీ సమస్యలు, దళిత సమస్యలు, బహుజనవాదం,సామ్రాజ్యవాదం, తీవ్రవాదం, గ్లోబలైజేషన్, జాతీయత, భావుకత, జీవనస్మృతులు వంటి అంశాలన్నింటిని కవితా వస్తువులుగా ఎందరో కవులు స్వీకరించి అనంత
సాహితీ సీమలో విస్తారంగా కవితా రచనలను వెలువరిస్తున్నారు.
         'ఏతపస్వి జీవించెనో యీ మనోజ్ఞ / సీమ పూజ్యమౌ రాయలసీమలోన' అంటూ సుప్రసిద్ధ అనంతసాహితీమూర్తి బెళ్లూరి శ్రీనివాసమూర్తి వర్ణింపబడిన రాయలసీమలో దశాబ్దాల తరబడి తీవ్రకరువుచే పీడించబడుతున్న జిల్లా అనంతపురం జిల్లా.'
         రాయలసీమలో పిలిస్తే పలికేది కరువు, అనంతపురం జిల్లాలో పిలవకుండానే పలికేది కరువు' అని 'శ్రీసాధన' పత్రిక సంపాదకుడు పప్పూరు
రామాచార్యులు అంటాడు. 'కనుడోయీ గంజి కేంద్రమిటులా వర్ణింపు డాక్రందనధ్వని హస్తంబులు మట్టి పాత్రలు వహింపన్' అంటూ బెళ్ళూరివారు గత శతాబ్దంలో అనంతపురం జిల్లా దుర్భిక్ష పరిస్థితులను కావ్యగానం గావించాడు. 
       విద్వాన్ విశ్వం తన ప్రసిద్ధ కావ్యం 'పెన్నేటిపాట' లో రాయలసీమ కరువు విషాదచిత్రాన్ని వ్యక్తీకరిస్తూ
'దైవమా ఉంటివా ? చచ్చినావ నీవు' అంటూ ఆక్రోశిస్తాడు.
          అనంతపురం జిల్లా రచయితలు గత శతాబ్దం తొలిదశకాల్లో సంప్రదాయకవిత్వాన్ని, అవధాన విద్యను ప్రోత్సహించినా ఇక్కడి కవులు సీమ వాస్తవదృశ్యాల్ని సైతం తమ సాహిత్యంలో కవిత్వీకరించారు. సీమ సాహిత్యంలో పుట్టపర్తి నారాయణాచార్యులు (మేఘదూతము), విద్వాన్ విశ్వం (పెన్నేటిపాట), బెళ్లూరి శ్రీనివాసమూర్తి (జాముకోడి), వైసివి రెడ్డి (రైతుకావ్యం), దేవదానం
(దీనాలాపములు), సి.వి. సుబ్బన్న (దుర్భిక్షము), భైరవరెడ్డి నారాయణరెడ్డి (రాయలసీమ రైతు), కల్లూరి అహోబిలరావు (కరువు వ్యక్తీకరణ) వంటి వారు ఎందరో గత శతాబ్దంలో రాయలసీమ కరువు కడగండ్లు, భూస్వామ్య దురహంకారం, రైతుల కష్టాలు, గ్రామీణ జీవనం, కార్మికుల వేదనలను
కావ్యాలుగా ఎంతో ప్రశంసనీయంగా రచనలు చేశారు. గత శతాబ్దంలో జాతీయోద్యమకాలంలో ఎంతో విశిష్టమైన కావ్యాలు, కవితలు, రచించి
తెలుగు సాహిత్యంలో తమదైన ప్రత్యేక స్థానం నిలుపుకొన్నారు.
         బ్రిటిష్ వలసపాలన కాలంలో దేశభక్తి, జాతీయతా భావాలను వ్యక్తపరచే ప్రసిద్ధ కావ్యాలు సీమ సాహిత్యంలో మరికొన్ని సైతం అగుపడతాయి.
రాయలసీమ కవుల్లో కల్లూరు వెంకటనారాయణ రావు రచించిన 'శ్రీమదశోకచరిత్రము', కసిరెడ్డి
వేంకటసుబ్బారెడ్డి 'రాణా అమరసింహచరిత్ర', నారునాగనార్య 'పృథ్వీరాజ విజయము' వంటి కావ్యాలు జాతీయోద్యమ ప్రేరణకు తోడ్పడినాయి. స్వాతంత్ర్యానంతర కాలంలో సైతం ఈ ధోరణి కొంతదాకా కొనసాగింది. భూతపురి సుబ్రహ్మణ్య
శర్మ రచన, 'కృష్ణరాయల చరిత్ర' అయినట్టి 'శ్రీకృష్ణభారతం', బెళ్లూరి శ్రీనివాసమూర్తి
'కొండవీటి రెడ్డి రాజ్య మహెూదయము', కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై 'ఓరుగల్లు- వీరుగల్లు', డా|| కోడూరు ప్రభాకరరెడ్డి పల్నాటి భారతం', డా|| మల్లెల గురవయ్య 'శ్రీ సీతారామరాజీయము', జోస్యం జనార్థనశాస్త్రి 'విశ్వజ్యోతి', కలచవీడు
శ్రీనివాసాచార్యులు 'ఆసియాజ్యోతి' వంటి కావ్యాలు సైతం ఈ కాలంలోనే వెలువడినాయి. 
       విద్వాన్ విశ్వం రచించిన 'ఒకనాడు' పద్య కావ్యం అనంతపురం జిల్లాకు చెందిన గుత్తిలోని రైల్వేగేటు కీపర్ గూళ్యపాలెం హంపన్నకు సంబందించిన బ్రిటీష్ కాలంనాటి ఒక చారిత్రక వాస్తవగాథ. దుర్భాకవారి రాణాసంగ్రామసింహుని
గాధకు సంబందించిన 'దాసీ పన్నా' కావ్యం, జోస్యం జనార్థశాస్త్రి రచించిన‌ సొహరాబు, రుస్తుంల పారసీగాథకు చెందిన 'కన్నీటి చుక్కలు' కావ్యం, షేక్
దావూద్ సాహెబ్ రచించిన చంద్రవదన మొహియార్ ప్రేమగాథలు సంబంధించిన కావ్యం వంటివి సైతం ఈ కోవకు చెందినవే.
              బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో దత్తమండలాల్లో భాగంగా వున్న అనంతపురం జిల్లాలో ఆ కాలంలోని సాహిత్యానికి సంబంధించిన అంశాలు కొన్నింటిని అలనాటి “శ్రీసాధన' పత్రిక సంచికలలో మనం గమనించవచ్చు.

'శ్రీసాధన' పత్రిక గత శతాబ్దపు తొలిదినాల్లో నలభై సంవత్సరాలసుదీర్ఘకాలంపాటు ఎందరో స్థానిక కవులకు ప్రోత్సాహం అందించిన ఒక ప్రసిద్ధమైన స్థానిక పత్రిక.  శ్రీసాధన అలనాటి సంచికల్లో కవితలేగాక, అరవై పైగా కథలు 1926-1941 సంవత్సర కాలంలో వచ్చాయి.
         ప్రఖ్యాత పత్రికాసంపాదకుడు విద్వాన్ విశ్వం తొలినాటి కథలు ఎనిమిది, కందాళం శేషాచార్యుల కథలు మరొక ఎనిమిది, ఎన్నో పురాణకథలు,
అనువాదకథలు, స్కెళ్లు, హెచ్. నంజుండరావు 'కథాలక్షణ వ్యాసం' వంటి రచనలు ఎన్నో 1928-30 సంవత్సరం నాటికే అనంతపురం జిల్లా సాహిత్య
రూపాల్లో ఉన్నాయి. ఎన్నో నాటికలు, ఏకాంకికలు, నాటక ప్రదర్శనల ప్రకటనలు 1926 కాలం నుండే 'శ్రీసాధన'లో కనిపిస్తాయి. 
           ఆదోని పురాణ సంఘం వ్యాసాలు, లేఖా సాహిత్యం, యాత్రాచరిత్రలు, పుస్తకశీర్షికలు, పుస్తకపరిచయాలు, విమర్శలు వంటి ఎన్నో సాహిత్య అంశాలు గతకాలంలోని 'శ్రీ సాధన' సంచికల్లో ప్రచురితమయ్యాయి. 'శ్రీసాధన' పత్రిక గతకాలపు సంచికలు అనంతపురం పట్టణంలో లలిత కళాపరిషత్ గ్రంథాలయంలో ప్రస్తుతం లభ్యమవుతున్నా అవి కాలానుగుణమైన
క్షీణదశలో వుండిపోయాయి. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్ రొద్దం ప్రభాకరరావు చౌరవ ఫలితంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు, ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు పొత్తూరు వెంకటేశ్వరరావు
సహకారంతో రూపొందించబడిన కంప్యూటర్ డిస్క్ల ద్వారా 'శ్రీసాధన' పత్రిక పాతసంచికలు ప్రస్తుత కాలంలో సాహితీప్రియులు డా|| పి.రమేష్ నారాయణ, వి.కె.రంగారెడ్డి, కైపనాగరాజు వంటివారి దగ్గర లభ్యమవుతున్నాయి.
        దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ
జిల్లాలో నెలకొన్న సామాజిక స్థితిగతులు, కరువు సమస్యలు, వామపక్ష భావజాలం, సామ్యవాద దృక్పథం వంటి అంశాలు ఇక్కడి కథ, కవిత, వ్యాసము, నవల వంటి సాహిత్య రీతుల్లో చోటు చేసుకొని అనంతపురం జిల్లా రైతాంగ సమస్యలకు, పీడితజన చైతన్యానికి ప్రతీకగా రూపొందినాయి.   
         ప్రకృతి, ప్రణయం, భావుకత, సంప్రదాయకత తాత్వికత వంటి అంశాలు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రైతు చైతన్య యాత్రలు, రైతుల ఆత్మహత్యలు, కరువు తీవ్రత, సామాజికోద్యమ ధోరణులు, దళిత,బహుజనవాద చైతన్యం, కార్మికోద్యమాలు, సీమ సాహిత్యంలో సాహిత్య వస్తువులుగా విశేషప్రచారం పొందుతున్నాయి.

__డా|| పి.రమేష్ నారాయణ




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

The unexplored relics of Rayalaseema