కదిరిలో వికసిస్తున్న కవితా మునీంద్రుడు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
భోగినేని మునీంద్ర జూన్ 1న 1974 లో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం లోని రెడ్డిపల్లి గ్రామంలో నరసమ్మ ఓబులేసు దంపతులకు జన్మించారు. ప్రాథమిక ఉన్నత విద్య తన స్వగ్రామంలో ముగించుకొని తనకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కదిరి లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ డిగ్రీ ని 1994లో పూర్తిచేశారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చరిత్రను తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగును 2001లో పూర్తి చేశారు.
2005 డిసెంబర్ లో సునందను వివాహం చేసుకున్నారు.వారికి గగన,రేవంతులు జన్మించారు.తెలుగు భాష పై ఉన్న అభిమానంతో బిఏలో స్పెషల్ తెలుగు తీసుకోవడమే కాక కవిత్వ రచనకు పూనుకున్నారు. ఆయన రాసిన కవితలు,వ్యాసాలు కడప ,తిరుపతి ,అనంతపురం ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
2014లో తాను రాసిన గేయ మంజరి కవితా సంపుటిని ప్రచురించారు. ఈ కవితా సంపుటికి2015లో శ్రీశ్రీ స్మారక పురస్కారం విజయవాడ మానస సాహిత్య సాంస్కృతిక సంస్థ ద్వారా లభించింది.భోగి నేని మునీంద్ర తన రచనల్ని మాతాశ్రీ అనే కలం పేరుతో రాస్తున్నారు. ఆయన కదిరి ప్రాంతం లో కొత్త తరానికి మార్గదర్శకులుగా కవిత్వం రాస్తూ ముందుకు వెళ్తున్నారు. యువతరానికి ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు.విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉంటారు .ఆయన ప్రస్తుతంఎస్ ఎమ్ జె ఎల్ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
'తరగని సిరి నా భాష చెరగని మచ్చ నా భాష
విడదీయలేని బంధం వీడని మోహం నా భాష
తరతరాల నా భాష తరిగిపోదు మన భాష'
అంటూ తెలుగు భాషపై మమకారాన్ని 'నా భాష' కవితలో వ్యక్తీకరిస్తాడు.
కదిరి లో కరువు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. వర్షాలు రాక నీళ్లు లేక ఎడారి లక్షణాలతో కదిరి ఉంటుంది ఇక్కడ రైతుల బాధలను చూసి చలించని వాడుండడు.అయితే వీటికి పరిష్కారం కవులు ఆలోచించడం లేదు.
మునీంద్ర 'వరుణా కరుణించు' కవితలో వరుణుడు కరుణించాలని కోరుతాడు గాని కరుణించని పరిస్థితిలో ప్రత్యామ్నాయ మార్గాలు పాఠకులకు సూచించలేదు.
"నలుగుతున్న ప్రజానీకాన్ని చూసి
వర్షపు ధారలు కురిపించవా
వలసలతో అల్లాడుతున్న జనం కష్టాలు కడగండ్లు కనిపించలేదా వినిపించలేదా?"
అంటూ వరుణుడిని ప్రశ్నిస్తున్నాడు .ఇదొక ప్రకృతి వైపరీత్యం .దీన్ని మార్చడానికి పాలకులు ప్రయత్నాలు చేయాలి. చెట్లను పెంచాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లను ఈ ప్రాంతంలో ప్రవహింప చేయాలి ఇటీవల బ్రాహ్మణపల్లి జలాశయము నిర్మించారు కానీ అది సరిపోదు. మరొక సమాంతర కాలువ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఉంది.
కరువుకాటకాల కడలి లోగిళ్లను
'సకల ప్రజానీక ముఖారవిందాలను
పగ ప్రతీకారాలను నీవైనా చల్లార్చి పో '
అంటూ ఉగాదికి స్వాగతం పలుకుతాడు మునీంద్ర.
'అసూయ ద్వేషం వద్దు
కులం వద్దు మతం వద్దు
కలిసిమెలిసి సాగుదాం
అప్పుడే మన జన్మకు సార్థకత '
అంటూ 2002 లో రాసిన' ఓ మనిషి ఆలోచించూ' కవిత వర్తమాన కాలానికి కూడా చాలా చక్కగా వర్తిస్తుంది.పౌరసత్వ సవరణ చట్టం మత వైషమ్యాలకు దారితీసింది .నేటి రాజకీయ క్రీనీడలో ఒక వికృతమైన అంశమిది. ఈ సందర్భంలో ఇలాంటి చట్టాలు సరైనవి కావని ఇది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆయన భావిస్తున్నారు.అందుకే ఈ కవికి భవిష్యత్తు పై నిఘా ఉంది.
"నాకు చేయూత నిస్తే సమాజానికి అవసరమైన ఇస్తా" అంటూ ప్రతి వ్యక్తికి తోడ్పాటు నందిస్తే అతను మళ్ళీ తనచేతనైనంత సమాజం కోసం పాటుపడతారని ఆయన భావించాడు. 'లంచం లేనిదే కొంచెం అయినా పని జరగదా ఇదేనా ప్రజాస్వామ్యం,లేదు స్వేచ్ఛ పేదవానికి' అని చెబుతూ ప్రజాస్వామ్యంలో పేదవానికి సమానత్వం సౌభ్రాతృత్వం సాటి మనిషికి అందడం లేదని వాపోయాడు. తన మృత్యువు కవితలో భోగినేని.
'క్షణం ఓర్పు_ తెస్తుంది మార్పు, ఓటుకు నోటు_ తెచ్చును చేటు' వంటి చరణాలు 'నేనే మనిషిని'కవితలోనివి. పాఠకుని మదిలోకి బలంగా చెప్పే సందేశాత్మక కవిత వాక్యాలివి.అయితే ఇవి కవితలుగా రాణించవు.
మనుషుల మధ్య మంచి సంబంధాలు బలపడాలంటే మాట ముఖ్యమని మునీంద్ర అభిప్రాయం. కోపం మనుషుల్ని దూరం చేస్తుందంటారు తన మాట కవితలో.
"నవ్వుతూ ఎందరితో నైనా ఉండొచ్చు ఐక్యంగా.కోపంతో కొందరితోనూ ఉండలేం సఖ్యంగా
రాదు రాదు తిరిగి రాదు మాట ' అని చెప్తాడు కవితలో భోగినేని.
గేయమంజరిలో 50 కవితలున్నాయి. ఈ కవితలలో ముఖ్యంగా తెలుగు భాష , మహిళా సమస్యలు,స్నేహం, మృత్యువు మొదలైన అంశాలపై రాసిన కవితలు ఎక్కువగా ఉన్నాయి. కవితలలో మెరుగు పర్చాల్సినవి అధికంగా ఉన్నాయి .కానీ భావాలపరంగా చూస్తే ఈ కవితలు పాఠకునిలో ఉత్తమ భావాలను ప్రేరేపిస్తాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని,తన చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందాలని తన కవిత్వంలో బలంగా వ్యక్తీకరించిన భోగినేని మునీంద్ర కలం నుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుందాం.
___ పిళ్లా విజయ్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి