కడప కరువుల చరిత్ర




కడప కరువుల చరిత్ర

          కడప జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని పాతతరం వారిని మీ వయస్సు ఎంత?అని అడిగితే గంజి కరువు, లేదంటే మరో కరువులో పుట్టామని చెప్పడం నేటికీ కనబడుతుంది. కరువులు ఇక్కడి జనజీవనంలో అంతర్భాగమై పోయాయన్నవిషయం దీన్నిబట్టి స్పష్టమౌతుంది. కరువులు, రోగాలు, ఆకలి మరణాలు, వలసలు,నేరాలు, ఘోరాలు ఎన్నో... కలబంద గడ్డలు, దేదారాకు తిని ప్రాణం పట్టుకున్నకాలాలు ఎన్నెన్నో... విజయనగర పాలన మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులు గంజి కేంద్రాలు, కరువు పనులు, రెమిషన్లు, కమిషన్లు, యాగాలు, వగైరాలు మినహా శాశ్వత కరువు నివారణకు చేపట్టిన కార్యక్రమాలు స్వల్పం. చరిత్రను ఓమారు అవలోకిస్తే...

          1791 - 92లో దక్కన్ పీఠభూమి అంతటా కరువు తాండవించింది . రాయలసీమ ప్రాంతం మరీతల్లడిల్లి పోయింది . 
       1810 - 13 ( ఫసలీ 1220 -1222 ) లో జిల్లా కరువుతో వణికింది . వరుణదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు కోసం దేవాలయాల్లో యాగాలు నిర్వహించడానికి కడప కలెక్టర్ రాస్ నిధులు మంజూరు చేశారు . 
       ‌‌1822 నుంచి 1824 వరకు మరో కరువు జిల్లాను 
కాటువేసింది . ఐదు శేర్ల బియ్యం ఒక్కరూపాయి , ఆరు శేర్ల జొన్నలు ఒక్క రూపాయి ధర పలికాయి . అప్పట్లో ఆ ధర చాలా ఎక్కువ . వర్షాలు కురవాలని నాటి కలెక్టర్ హన్బరి 300 వరహాలు మంజూరు చేయించుకుని పుష్పగిరి దేవాలయంలో వరుణ యాగాలు చేయించారు . ఎంత పరాయిపాలకులై నప్పటికీ ఇక్కడి ప్రజల విశ్వాసాలను గౌరవించక తప్పలేదు . 

*' నందన ' లో పెను విషాద కరువు*

1832 - 33లో ఒక భయంకరమైన కరువు సంభవించి జిల్లాలో పెనువిషాదాన్ని సృష్టించింది . నందన నామ సంవత్సరంలో వచ్చింది గనుక దీన్ని నందన కరువుగా పిలుస్తారు . దీని తీవ్రతను గుర్తించడం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి ఇష్టం లేదు . కరువు అనే పదప్రయోగాన్నే వారు జీర్ణించుకోలేక పోయారనడానికి ఒక ఉదాహరణ గురించి ఇక్కడ చెప్పుకోవాలి . సరిగ్గా నందన కరువు సమయంలో 1832 డిసెంబర్ 21వ తేది సి . పి . బ్రౌన్ గుంటూరు జిల్లా 
యాక్టింగ్ కలెక్టర్‌గా డబ్ల్యు . మేసన్ నుంచీ బాధ్యతలు స్వీకరించారు . కరువు కష్టాలు , ఆకలి చావుల గురించి ప్రజలు సమర్పించే అర్జీల ద్వారా బ్రౌన్ తెలుసుకున్నారు . కరువులో నేరాల సంఖ్య పెరగడం సహజం . గుంటూరు జిల్లాలో 
కూడా దొంగతనాలు , దోపిడీలు పెరిగాయి . కలెక్టర్‌గా వీటికి అడ్డుకట్ట వేయడం ఆయన బాధ్యత . అందుకనే 1833 జనవరి 16వ తేది చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో . . . 
           ప్రస్తుతం నెలకొన్న ' కరువు ' ( ఫ్యామిన్ )కారణంగా దొంగతనాలు పెరిగినందున పోలీసు శాఖకు అవసరమైన మందు గుండు సామాగ్రి సరఫరాచేయండంటూ కోరారు . బ్రౌన్ రాసిన లేఖలోని ' కరువు ' ( ఫ్యామిన్ ) అనే పదాన్ని చూసిన చీఫ్ సెక్రటరీకి ఎక్కడో కాలింది . ఎందుకంటే అప్పటి దాకా ఏ కలెక్టర్ కూడా ' FAMINE ' అనే పదాన్ని ఉపయోగించలేదు . అందరూ DROUGHT , In 
SCARCITY , DISTRESS , ADVERSE SEASON వంటి పదాలనే ఉపయోగించారు. ఇప్పటికీ కలెక్టర్లు కమిషనర్ ఫర్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ కు పంపే ప్రతిపాదనల్లో  
ADVERSE SEASONAL CONDITIONS & DROUGHT అనే రాస్తున్నారు . ' కరువు ' అనే తీవ్రమైన పదాన్ని ఉపయోగించే బదులు ' కొరత ' ( Scarcity ) అని 
రాయచ్చు కదా అంటూ బ్రౌన్ ను మందలిస్తూ ఆనాటి చీఫ్ సెక్రటరీ సంజాయిషీ అడిగారు . కరువే నిజమైతే ధరల పరిస్థితి ఎలా ఉందో తెలుపాలని ఆదేశించారు . బ్రౌన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అన్ని వివరాలు పంపారు .

*ది గ్రేట్ ఫ్యామిన్ 1876 - 78* 

              1876లో అతిపెద్ద కరువు సంభవించింది . మద్రాసు ప్రెసిడెన్సీలోని 14 జిల్లాలను కబళించగా , అందులో 8 జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి . ఈ కరువు రాకాసి మూడున్నర మిలియన్ల జనాభాను పొట్టన పెట్టుకుంది . ప్రాణాలు వదిలేసిన పశు సంపదకు లెక్కేలేదు . ఇందులో కడప జిల్లా కూడా ఒకటి . 
              వరుసగా సంభవిస్తున్న అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా 1874 నుంచే కరువు ఛాయలు పొడచూపుతూ వచ్చాయి . 1876 జులై నాటికి తీవ్రతరం 
కావడం ప్రారంభమైంది . తొలుత పులివెందుల , కమలాపురం , బద్వేల్ తాలూకాలు దెబ్బతిన్నాయి . సెప్టెంబర్ ద్వితీయా ర్థానికి జిల్లా అంతటా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి . ఏప్రిల్ లోనే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కరువు ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పిలిపించి రానున్న రోజుల్లో చేపట్టాల్సిన రిలీఫ్ పనులపై ప్రతిపాదనలు స్వీకరించింది . కరువులో పేద ప్రజలను ఆదుకోవడం కోసం 25 వేల రూపాయలు మంజూరు 
చేయాలని ఆనాటి కడప కలెక్టర్ జె . ఆర్ . డేనియల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూను కోరారు . కాగా 10 వేల రూపాయలు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది . భవిష్యత్ గురించి ఆలోచించిన వ్యాపారులు , కొందరు రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని 
మార్కెట్లోకి విడుదల చేయకుండా నిల్వ ఉంచుకున్నారు . అక్టోబర్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి . కూలీ రేట్లు దారుణంగా పడిపోయాయి . 
ప్రజలు ఆకలి బాధ తాళలేక నాగజెముడు ( నాగదారి - Prickly Pear ) , వివిధ రకాల అడవి మొక్కలు , దేవదారి ఆకులు ( The leaves of Sethia Indica ) , కలబంద 
గడ్డలు తింటూ కాలాన్ని భారంగా వెళ్లదీశారని నాటి శానిటరీ కమిషనర్ డాక్టర్ కార్నిష్ పేర్కొనడం చూస్తే ప్రజలు ఎంతటి దారుణ పరిస్థితులు అనుభవించారో తెలుస్తుంది . ప్రభుత్వం రిలీఫ్ వర్క్స్ చేపట్టింది . డిసెంబర్ 16వ తేదీ నాటికి 
జిల్లాలో 1,02,340 మందికి పనులు కల్పించారు . ఇందులో పురుషులు 42,078 , మహిళలు 46,833 కాగా చిన్నపిల్లలు సైతం 13,429 మంది ఉండటం గమనార్హం . ఇంకా 3,308 మందికి గ్రాట్యూషస్ రిలీఫ్ అందించారు . కడప , కర్నూలు , బళ్లారి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం డిపోలు ఏర్పాటుచేసింది . ఈ జిల్లాల గ్రెయిన్ ఏజెంట్ గా థార్న్ హిల్ అనే అతన్ని నియమించారు . ఆయన బళ్లారి కేంద్రం చేసుకోగా , మిగిలిన జిల్లాల్లో డివిజనల్ అధికారులు నియమితులయ్యారు . పశుగ్రాస సమస్య తీవ్రరూపం దాల్చింది . నాగదారి ( నాగజెముడు ) మొక్కలను పశువులకు గ్రాసంగా 
ఉపయోగించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది . ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్క ఆకులు మందంగా , గుండ్రంగా ఉండి వాటి పై బాకుల్లాంటి పదునైన ముళ్లు ఉంటాయి . ఈ మొక్కకు కాసే ఎర్రటి పండ్లు రుచికరంగా కూడా ఉంటాయి . ఒకప్పుడు జిల్లాలో ఎక్కడపడితే అక్కడ విస్తారంగా ఉండిన ఈ మొక్కలు ప్రస్తుతం అంతగా కనిపించడం లేదు . ఈ మొక్కలను పశుగ్రాసంగా 
వినియోగించాలన్న నాటి ప్రభుత్వ ప్రయోగం పాక్షికంగానే విజయవంతమైంది . 
                పశువులను పోషించలేక నామమాత్రపు ధరలకే అమ్ముకున్నారు . పశువులకు జబ్బులు విపరీతమయ్యాయి . 1877 జనవరి రెండవ వారానికి ఇలా రోగాల బారినపడి 
1460 మృతిచెందాయని అధికారిక గణాంకాలు చెబుతున్నా యంటే , ఇక వాస్తవంగా ఎన్ని పశువులు చనిపోయి ఉంటాయో ఊహించుకోవచ్చు . అదేనాటికి కలరా కాటుకు 564 మంది మృతిచెందారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి . ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంట్లు , కరువు పనులు జరిగే ప్రదేశాల్లో జనం పిట్టల్లా రాలిపోయారు . గ్రామాలు స్మశాన వాటికలను తలపించాయి.

గంజితో ప్రాణం పట్టుకుని . . . . 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గంజి తాగి ప్రాణం పట్టుకున్న రోజులవి . ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లెకు చెందిన వీరనాల పెద్దసుబ్బయ్య అనే శత వృద్ధుడు 1957లో విద్వాన్ కట్టా నరసింహులుకు తెలిపిన వివరాలు . . . 
“ రాణెమ్మ ( విక్టోరియా మహారాణి ) కాలంలో పాటి మీద తోపు ( మామిడి తోట ) లో గంజి కాచి పోసేవాళ్లు . రంగూన్ నుంచి తెప్పించిన బియ్యంతో గంజి తయారు చేసేవాళ్లు . ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కొక్కరికి 
ఒక మట్టి ముంత గంజి , ఒక ఎరగడ్డ పంపిణీ చేసేవాళ్లు . రోజూ ఒక ముంత గంజి తాగుతూ ప్రాణాలు పట్టుకున్నాం ” 

        *గంజి కరువు 1951 - 52* 
స్వాతంత్ర్యానంతరం వచ్చిన తొలి అతి పెద్దది గంజి కరువు . ప్రభుత్వం ఏర్పాటు చేసిన ' రిలీఫ్ కిచెన్స్ ' ల్లో ప్రజలు గంజితాగి ప్రాణాలు కాపాడు కున్నారు . అందుకే దీన్ని గంజి కరువు అని పిలుస్తారు . నాటి భయానక కరువుకు సజీవ సాక్షులు నేటికీ ఉన్నారు . 
            1947 - 48 నుంచీ రుతుపవనాలు విఫలమౌతూ వచ్చాయి . దీంతో 1951-52 నాటికి పరిస్థితి ఉగ్రరూపం దాల్చింది . పంటల సాగు దారుణంగా పడిపోయింది . 
అక్కడక్కడా సాగైన పంటలు కూడా వరాలు లేక నిలువునా ఎండిపోయాయి . ప్రజలకు చేయడానికి పనులు లేకుండా పోయాయి . చేతిలో చిల్లిగవ్వ లేనందున కుటుంబాల పోషణ చాలా భారంగా మారింది . ఆకలి బాధను తాళలేక ఎందరో 
ప్రాణాలు వదిలారు . తాగేందుకు గుక్కెడు నీరుకూడా కరువైంది . కలరా మహమ్మారి విజృంభించి ఎందరినో బలితీసుకుంది . 1952 జూన్లో కలరాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టింది . దేదారాకు , కలబంద గడ్డలు ఉడికించుకుని తింటూ ఎందరో ప్రాణాలు కాపాడుకున్నారు . గడిలేక ఎన్నో పశువులు 
మరణించగా , వాటి మూగ వేదన చూడలేని రైతులు అయినకాడికి కబేళాలకు తెగ నమ్ముకున్నారు . గంజి కేంద్రాల ఏర్పాటు ప్రజల ఆకలి తీర్చి వారి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర , రాష్ట్ర నిధులతో ప్రభుత్వం గంజి కేంద్రాలు ఏర్పాటుచేసింది . అనధికారులతో కూడిన కమిటీలకు వీటి నిర్వహణ బాధ్యతను అప్పగించారు . అధికార యంత్రాంగం వీటిని పర్యవేక్షిస్తుండేది . 1952 ఆగస్ట్ నాటికి వీటి సంఖ్య 420కి చేరింది .
                 చేనేత కార్మికుల కోసం ప్రత్యేకించి 19 గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు . ప్రభుత్వం చౌక ధరల దుకాణాలను ఏర్పాటుచేసి ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది . 

ప్రధాని నెహ్రూ జిల్లా సందర్శన 

ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1952 అక్టోబరు 7వ తేదీ రాయచోటిని సందర్శించి ప్రజల దైన్యాన్ని కళ్లారా చూశారు . రిలీఫ్ కిచెన్స కు వెళ్లి ఆయన స్వయంగా గంజి సేవించారు . ఆకలి బాధ తీర్చుకోవడానికి గంజి కేంద్రాల 
వద్ద బీదా బిక్కి పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు.
రాష్ట్ర గవర్నర్ శ్రీ ప్రకాష్, ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలచారి,కేంద్ర ఆహార శాఖ మంత్రి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప ప్రధాని వెంట జిల్లా పర్యటనలో పాల్గొన్నారు.

(సేకరణ: పిళ్లా కుమారస్వామి, 9490122229
(ఫణి రాసిన భూ పరిపాలన,కడప గ్రంథం నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

The unexplored relics of Rayalaseema