బాలకొండ ఆంజనేయులు

             
         బి. కుళ్లాయప్ప, సారమ్మల మూడవ సంతానంగా 01.07.1957లో చెన్నో కొత్తపల్లి
మండలంలోని బసినేపల్లి గ్రామంలో బాలకొండ ఆంజనేయులు జన్మించారు. ఆయనకు ఇద్దరు
అక్కగార్లు, ఒక తమ్ముడు ఉన్నారు.బసినేపల్లిలో 
5వ తరగతి పూర్తయ్యాక, ఉన్నత విద్య చెన్నెకొత్తపల్లి, ధర్మవరంలోనూ, బికామ్
డిగ్రి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోనూ పూర్తిచేసినారు. 1980లో జూనియర్ అసిస్టెంట్ గా అనంతపురం పి. టీ.సిలో నియమితులయ్యారు.   
         బాల్యంలో తన గ్రామంలో మహాభారతం, రామాయణం, పారాయణంలో పాల్గొనేవారు. అప్పట్నించి కవిత్వం పట్ల ఆసక్తి ఏర్పడింది. తాను కవిని కావాలన్న కోరిక ఉండేది. ఇంటర్‌లో తెలుగును ఒక ఆప్షన్‌గా తీసుకోవాలనుకుంటే దానిలో ఎవరూ చేరకపోవడంవల్ల ఆ కోర్సును రద్దు చేసినారు. దాంతో తెలుగును చదువలేకపోయారు. అయినప్పటికి పద్యాలు, గేయకవితలు స్వయంగా రాసేవారు.‌1989లో తాను రాసిన 'తొలకరి చినుకులు' గ్రంథాన్ని జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో‌ ప్రచురించి ఆవిష్కరించారు. ఆవిధంగా సాహిత్య రంగంలోకి ప్రవేశించారు. 1991లో 'ఉచ్చు'
అనే కథను రాసినారు. డా॥ కేతుబుచ్చిరెడ్డిగారు పి.టి.సి.లో బోధించటానికి వస్తున్నప్పుడు ఆయన
సాహచర్యంలో తన కథలకు మెరుగులు దిద్దుకున్నారు. ఆవిధంగా ఆయన బాలకొండగారికి సాహితీ గురువైనారు. మొగ్గల్జడ కథ ప్రజాసాహితిలో వచ్చింది. 'విశాలమైన ఇరుకు' కథ ఆకాశవాణిలో
ప్రసారమైంది. 'కడవసగినం' ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇలా అనేక కథలను కలిపి మొగ్గల్జడ
పేరుతో  కథాసంపుటిని 2006లో ఆవిష్కరించారు. పోలీసుశాఖ కోసం 'మార్గదర్శి' అనే ఒక మాన్యువల్
ఒకటి తయారు చేసినారు. 2012లో తిమ్మమాంబ నవలను, 2015లో అందాలు, భవబంధాలు నవలను, 2017లో శివరావణ యుద్ధం నవలను రాసినారు.
        
            రాయలసీమలోని అనంతపురం జిల్లాల నుంచి మంచి కథకులు రావాలని ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. ఇప్పటికే జిల్లాలో ప్రసిద్ధులైనసింగమనేని, బండి నారాయణస్వామి, చిలుకూరి దేవపుత్ర, శాంతినారాయణ, శశికళ, నిర్మలారాణి, మొదలైనవారు వచ్చారు. వారి కోవలో బాలకొండ ఆంజనేయులు ఒకరు.
        'మొగలడ' కథా సంపుటిని తీసుకొచ్చిన బాలకొండ ఆంజనేయులు పోలీసుశాఖలో పనిచేస్తూ, తన గ్రామీణ జీవిత నేపథ్యంలో వచ్చిన అనుభవాలను, పరిశీలించిన సత్యాలను, తన కథల్లో పొందుపరిచారు.
          ఇందులో వున్న 14 కథల్లో బాలకార్మికుల, దళితుల, రైతుల వ్యదార్థ జీవితాల, విచ్చినమవు తున్న కుటుంబాల, మహిళల సామాజిక పరిస్థితుల గురించి వుంది. రచయితలో సమాజంలోని మానవ సంబంధాలను, మనస్థత్వాలను పట్టుకొని, వాటిని కథల్లో చెప్పే నేర్పు వుంది. బాల్యంలోకి పరకాయ ప్రవేశం చేసే శక్తి వుంది. ఇతని హృదయం చిగురాకు లాంటి లేత హృదయంగా కనిపిస్తుంది. ఈ కథ చదివితే.
         కథలను రాసేవారు కథలను ఎలా రాయాలో నేర్చుకోవాలంటే కథలను చదవాలి. కథలను సకలు కొట్టిరాయడం ఒక పద్ధతి. స్వీయ అనుభవాన్ని కల్పనతో రాయడం మరో పద్ధతి. తాము నమ్మిన జీవన సత్యాలను కథల్లో నిర్మిస్తారు. ఇవన్నీ మన సామాజిక చరిత్ర నిర్మాణానికి, చలనానికి దోహదం చేస్తాయి.

        మొగ్గల్జడ సంపుటి లోని కథలన్నీ నేలవిడిచి సాము చేసిన కథలు కావు. ఇందులోని పాత్రలు మన కళ్లెదుట కనబడే మనుషులే. మనుషుల మధ్య వుండే రాగద్వేషాలను చక్కగా చిత్రీకరించారు.
      మొగల్జడ కథలో అలివేలు ఒక బాలకార్మికు రాలు. ఆ అమ్మాయి శాంతమ్మ ఇంట్లో పనిచే మనిషిగా పనిచేస్తూ వుంటుంది. శాంతమ్మ భర్త ఒక వకీలు, శాంతమ్మ కూతరు శిల్ప  వేసుకునే మొగల్జడ లాగా తాను వేసుకోవాలని ఉబలాటపడు తుంది అలివేలు. పండుగకు పల్లెకు పోయినప్పుడు అమ్మతో మొగల్జడ వేయించుకోవాలనుకుంటుంది.
తీరాబయలుదేరే సమయానికి యజమాని శాంతమ్మ అలివేలు జుట్టు చింపిరిగా వుందని గుండు గీయిస్తుంది. ఆమెకు ఎదురు చెప్పలేక బాధతో అప్పుడే వచ్చిన నాన్న దగ్గరకు పోయి ఏడుస్తుంది. ఈ కథలో బాలకార్మికుల పసిహృదయాల్లో
వున్న వేదననే కాక బాల్యంలో బాలలు ఏర్పరచుకొనే కోరికలు, వాటిని పెద్దలు ఎలా తుంచి వేస్తుంటారో చెప్పే కథ ఇది.
        ముళ్ళదారి కథలో కరువు నేపథ్యముంది. శివయ్య ఒక మధ్యతరగతివాడు. పంట చేతికి రాక సతమతమవుతున్న శివయ్యకు పుల్లన్న సలహా నచ్చుతుంది. అదేమంటే చేను చుట్టు వుండే కంపకట్టెలు కొట్టుకొని అనంతపురం టౌనులో
అమ్మడం. ఎన్నోసార్లు పంటనమ్మినోడు కట్టెలసమమ్ముతాడు. ' పూలనమ్మిన చోట కట్టెలమ్మడం ఇందులో కనిపిస్తుంది.'
        'తప్పెట' కథ ఒక నిరుద్యోగి కథ. వెంకటేశులుకు డిగ్రీ వరకు చదువుకున్న ఉద్యోగం రాక కుటుంబ
పరిస్థితిని చూస్తూ నిస్సహాయంగా ఉన్న నిరుద్యోగి. 'దేవుడు లేనివాళ్లు, ఉన్నవాళ్లు తారతమ్యాలు ఎందుకు సృష్టించాడో" అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ రచయిత ప్రశ్నించడం వరకే ఆగిపోయాడు. దానికి సమాధానం ఎక్కడా మరో పాత్ర ద్వారా
చెప్పించడు. ఇక్కడ రచయిత దృక్పథం బయటపడుతుంది. వాస్తవికంగా చిత్రించాలి కానీ రచయిత జోక్యం చేసుకోరాదు అని అనుకుంటారు.  
      కళాత్మకంగా చిత్రీకరించడమంటే  పాఠకున్ని చైతన్యపరిధిని పెంచకుండా వుండటం కాదు. అలా చైతన్యవంతం కాని   కథ టైంపాస్ కథ అవుతుంది. ఇక్కడే రచయితకు సామాజిక దృక్పథం వుండాల్సిన అవసరమనిపిస్తుంది. వెంకటేశులు తిరుపతికి
పోవడానికి కావాల్సిన వందరూపాయల కోసం తన కులవృత్తిగా వున్న 'తప్పెట' పనిని చేస్తాడు. ఉద్యోగం వస్తుందా రాదా అని ఎదురుచూస్తాడు. రచయితకు మార్కిస్టు దృక్పథం వుంటే కథనం మరోలా రాసి వుండేవాడు. ఈ చైతన్యం స్వతహాగా రావడం కష్టం. అయితే దాని అధ్యయనం పరిశీలన ద్వారా నేర్చుకోవచ్చు.
     ఇందులోని కథలన్ని 90లలో వచ్చినవి. చివరి కథ ''కోనేరులో పూచిన తామర" తప్ప. ఒక కథ గల్పిక, గల్పిక అంటే వ్యంగాత్మకంగా ముగింపులేని చిన్న కథ కాని కథ. విశాలమైన రోడ్లు, భవనాలతో అనేక కాలనీలు ఏర్పడి వుంటాయి. దాంట్లో నివసించే మనుషుల మనసులు‌మాత్రం ఇంకోరకంగా మారిపోతాయని తెలిపే కథ 'విశాలమైన ఇరుకు కధ'. సమాజంలో ఆర్థిక వనరులు పెరిగే కొద్ది అంతరాలు పెరిగి కుల,మత వ్యత్యాసాలు పెరిగి మనుషుల మధ్య దూరమవుతున్న సామాజిక సంక్షోభ పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ కథ 2000లో వచ్చింది. ప్రపంచీకరణ ప్రభావం అప్పటికే ప్రారంభమైంది. ఈ రోజుల్లో పల్లెలకూ ప్రాకింది. పల్లెల్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.
బాలకొండయ్య కథ సన్మానం కథ. బహుశా రచయితేనేమో ! ఇది నేటికీ సజీవంగా వుంది.
బాలకొండయ్యకవిత్వం రాసి సన్మానం పొందుతాడు.
కాని తల్లిదండ్రులు అవన్నీ తెలుసుకున్నా బాలకొండయ్య చేసిన పుస్తకాలఖర్చు 'వేస్టు ఖర్చు' గా జమచేస్తారు. "పనికి మాలిన్నాకొడుకు"గా కీర్తిస్తారు. నాలుగుదుడ్లు వేనకేసుకుంటేనే ఎవరన్నా
మాట్లాడిచ్చేది' అంటారు. 'మనిషి బతకడానికి ఎంత డబ్బు కావాలో, నీటి బుడగలాంటి ఈ జీవితం నిలవటానికి వెల్లువ లాంటి ధనం అవసరమా?' అన్న ప్రశ్నతో ముగిసే ఈ కథ, టాల్ స్టాయ్ రాసిన “ ఎంత నేల కావాలి ?” కథను గుర్తుకు తెస్తుంది.
'మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు' అనే పాటలో మానవ సంబంధాలు విచ్ఛినత గురించి కవి పడే ఆవేదన తెలుస్తుంది. ఉగాది ఉషస్సు కథలో కుటుంబంలో తల్లి మారెక్క పట్ల కొడుకుల తీరు ఈ పతనమవుతున్న 'మానవ సంబంధాలకు అద్దం పడుతుంది. 'మూడు ముళ్లు, ఒక గల్పిక' వరకట్నం సమస్యపై వ్రాసిన కథ. ప్రతి ఆడపిల్ల తండ్రి పడే ఆవేదన ఇందులో కనిపిస్తుంది. దీనిని పొడిగిస్తే, మరో పెద్ద కథ తయారవుతుంది. రాజారావుకు సకాలంలో డబ్బు చేతికి అందక కూతురు పెళ్లి ఆగిపోతుంది. ఆ పెళ్లి పూర్తి కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు అందదు. అతను విసురుగా విసరిన గడియారం ముక్కలైనట్లు అతని హృదయం ముక్కలైందని ప్రతీకాత్మకంగా చెపుతాడు. ఇందులో రచయిత దీనికి పరిష్కారం కాని, దీనికి కారణాలు గాని ఎక్కడా చెప్పకపోవడం శోచనీయం.
         'కడవసగినం' కథ మూఢనమ్మకాలపై ఒక వ్యంగ్యాస్త్రం.'నిప్పుకు చెదలు' కుటుంబంలో భార్య భర్తల మధ్య వచ్చే అపార్థం కథ ఇది. తాను వేసక్టమీ చేయించుకున్నా భార్య గర్భవతి అని పరీక్షల్లో తేలుతుంది. దాంతో అతనికి అనుమానం వస్తుంది. కానీ జరిగింది తెలుసుకుని భర్త సిగ్గుపడతాడు.
గర్భం దాల్చిన పని మనిషి తన మూత్రాన్ని ఒలికిపోయిన సీసాలో ఇవ్వడంతో ఈ చిక్కు ఏర్పడుతుంది. ఇదొక సస్పెన్స్ కథ.
బ్రతుకు బండి కథలో కుటుంబ సభ్యుల విచ్ఛిన్నత వుంది. దీనిని 94లో రాశారు. విడిపోవడం సాధారణమై పోతున్న సంధి దశలో వున్న కాలంలో వచ్చింది. అదే నేడు సాధారణమైంది. అప్పుల్లో వున్న వెంకటరెడ్డి కొడుకులు ఎవరికి వారు విడిపోవాలనుకున్నారు. అందుకు పెద్దమనుషులు కూడా తోడై విడగొడతారు ఆస్తుల్ని పంచడంతో, ఉ
మ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడం నేటి వ్యవస్థ లక్షణం. ఆఖరుకు అంబానీ కుటుంబాలు కూడా విడిపోయాయి. ఇప్పుడు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి పెరిగింది. భార్యభర్తలు విడిపోవడం కూడా సాధారణమైపోతాంది.
వ్యక్తిస్వామ్యం పెరిగేకొద్ది ఇలాంటి లక్షణాలు వస్తాయి. సమిష్టితత్వం బలహీనపడుతోంది.
తప్పెవరిది ? కథలో మద్యం వల్ల మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఎత్తిచూపింది. పోలీసుల నిర్లక్ష్య
ధోరణి కనిపిస్తుంది. ఆమె చావుకు కారకులెవరన్న ప్రశ్న సమాజాన్ని, పాఠకుల్ని నిలదీస్తుంది.
చెరువుకట్ట కథ 'ముసలమ్మ మరణం' కథలాంటిది. కొండమ్మ చెరువు కట్టను తెగ్గొట్టడాన్ని వ్యతిరేకించి
రక్షిస్తుంది. ఆమె నిస్వార్థం, త్యాగం ఇందులో కనిపిస్తాయి. మనిషి మనిషిగా నిలబడుతున్న తీరును రచయిత ఈ కథలో తీర్చిదిద్దాడు.
"కోనేరులో పూచిన తామర' కథలో వ్యవస్థ ఏర్పరచిన కులాల అడ్డుగోడల్ని గురించి ఉంది. అగ్రకుల ఆధిపత్యభావం వదిలించుకోవడంతో ముగుస్తుంది. నేటికీ కనువిప్పు కలిగించే కథ ఇది.
కథల్లో సామాజిక సంఘర్షణ వుంది. అనేక సామెతులు ఉన్నాయి. మాండలికాలు వున్నాయి. 'నారు పోసిన వాడు నీరు పోయకుండా వుంటాడా' , 'కొనబోతే కొరివి అమ్మబోతే అడవి' అన్నట్లుంది. 'పూలమ్మిన కట్టెలమ్మడం‌అలాగే జేతి మీద కూర్చొని, పిల్లోడు యాప్పుల్ల పట్టుకొని నీళ్లు యాడ పడేది కరెట్టుగా చెప్పతాడంట అన్నా', భలేవాడివే మామా ఆ పాపన్న మాటింటావా' ఇలాంటి మాండలికాలు ఉన్నాయి. బాలకొండ తన చుట్టూ వున్న జీవితాన్ని స్వీయ అనుభవాలను, ప్రాంతాన్ని, ప్రేమిస్తూ సామెతలను, పలుకుళ్లను బాగా ఉపయోగిస్తూ తన 'మొగ్గల్జడ' కథా సంపుటిని పాఠకుల ముందుంచారు.
          ప్రస్తుతం కవిత్వానికి ప్రాధాన్యహెచ్చి కథలు తక్కువగా వస్తున్నాయని భావిస్తున్నారు. నవలలు చదివేవారు‌ తగ్గిపోయారన్నారు. సోషల్ మీడియా బాగా పెరిగిందన్నారు. కులమత భేదాభిప్రాయాలు సమసిపోయి అందరూ సమానంగా ఉండాలన్నది తన దృక్పథమని చెప్పినారు. సినిమాల ద్వారా ప్రజలను చైతన్యం చేయవచ్చని ఆయన అభిప్రాయపడినారు.
        సమాజంలో నిలబడే సాహిత్యం రావాలని ఆయన కోరుతున్నారు. యువతరం సమాజంలో
ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో సాహిత్యం చదవడం ద్వారా నేర్చుకోవచ్చు. కుల మతాలను
పట్టించుకోని సమాజంకై యువతరం కృషి చేయాలన్నారు.
         2013లో విశాపట్నంలో ఆంధ్రరత్న అవార్డును పొందినారు. 2016లో ఉగాది పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందినారు. సాహిత్య సంఘాలు పెరిగి పోవడం చాలామంచిదని అభిప్రాయపడినారు. కొత్తవాళ్ళను వారు ప్రోత్సమిస్తారన్నారు. 1991 నుంచి పదేళ్ళపాటు జిరసం కార్యనిర్వాహక సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం అనంత సినీ కళావాహిని అనే సంస్థను స్థాపించి సినిమాలకు స్క్రిప్టు ఎలా రాయాలో యువతరానికి నేర్పించాలన్న ఆశయంతో ఉన్నారు.

      __పిళ్లా విజయ్, 949022229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

The unexplored relics of Rayalaseema