నందవరం కేశవరెడ్డి

                    
            నందవరం రామిరెడ్డి, రంగమ్మల చివరి సంతానంగా నందవరం కేశవరెడ్డి తాడిపత్రికి
సమీపంలో ఉన్న పెద్ద వడుగూరు మండలంలోని పెద్ద ఎక్కలూరు గ్రామంలో 01.07.1948లో
జన్మించారు. అదే గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. 1959లో 6వ తరగతికి ప్రవేశపరీక్ష
రాసి పాసై డోస్ దగ్గర నున్న ప్యాపిలిలో రామాంజులు నాయుడు పేదపిల్లలకు ఏర్పాటుచేసిన
హాస్టలులో ఉంటూ అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు.
           1965లో పి. యూ, సిలో సీటు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతుండటంతో, ఉద్యోగం
వెంటనే వస్తుందన్న ఉద్దేశ్యంతో తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ కోర్సు చదివారు.
అప్పట్లో వారు స్టైఫండు కూడా పొందేవారు.
నందవరం కేశవరెడ్డికి నలుగురు అన్నలు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 1969లో విద్వాన్ కోర్సును సెకండ్ క్లాస్ లో పాసయ్యారు.తరిమెల రామచంద్రా రెడ్డిగారు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు వారికి పెద్ద పప్పూరు దగ్గర పోస్టింగ్ ఇచ్చినారు. అప్పట్లో ఒక చిన్న తెల్లకాగితపై రాసిచ్చిన దానిని అప్లికేషనుగా స్వీకరించేవారు. 5 నెలలు పనిచేశాక ఆ ఉద్యోగం వదిలివేసి కర్నూలులోని టి.పి.టి కోర్సును ఆరు నెలలో పూర్తి చేసినారు.      12.10.1970లో నార్పలలో జెడ్.పి. హైస్కూలులో తెలుగు పండితులుగా చేరినారు.
      తిరుపతిలో విద్వాన్ చదువుతున్న సమయంలో సహవిద్యార్థిగా శాంతినారాయణ, సీనియర్
విద్యార్థిగా సింగమనేని నారాయణ ఉండేవారు. వారికి ప్రముఖ మార్క్సిస్టు విమర్శకులు త్రిపురనేని
మధుసూధనరావు అధ్యాపకులుగా వచ్చేవారు. శ్రీశ్రీ, దిగంబర కవులు, కొడవటిగంటి కుటుంబరావు లతో జరిగే సాహిత్య సభలకు హాజరయ్యేవారు. ఆరకంగా వారిపై వామపక్ష భావజాలం ప్రభావం పడింది.
          1973లో జూన్ 10న రేణుకాదేవిగారితో ఆయనకు వివాహం జరిగింది. ఆమెది పులివెందుల
స్వంతవూరు. 7వ తరగతి వరకు చదువుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు. వీరిద్దరు బెంగళూరు,
హైదరాబాదులలో స్థిరపడినారు.
        ఉద్యోగం చేస్తూనే ప్రవేటుగా బి.ఏ(తెలుగు), యం.ఏ., బిఎడ్, యం, ఎడ్ కోర్సులను ఎస్.వి
యూనివర్సిటీ నుంచి పూర్తి చేసినారు. అప్పట్లో ప్రజల్లో భాషా సమైక్యత కోసం కొందరు టీచర్లను
గుర్తించి వారికి ఇతర ప్రాంతీయ భాషలు నేర్చుకోవడానికి మైసూరులో శిక్షణ ఇచ్చారు. అప్పుడు నందవరం కన్నడభాషను నేర్చుకున్నారు.
కన్నడభాష రావడం వల్ల లంకేష్ పత్రికను క్రమం తప్పకుండా చదివేవారు. దాంతో పలు కన్నడ కథలను తెలుగులోకి అనువాదం చేసినారు. అవన్నీ విపుల పత్రికలో ప్రచురితమైనాయి.
           1958లో ఓరియంటల్ కళాశాలలో చదివేటప్పుడు ఆశ అనే కవిత రాసినారు. 'ఆశే ఆటంబాంబు',ఆశే ఆశాజ్యోతి' అనే కవిత అందరినీ ఆరోజుల్లో ఆకట్టుకుంది.
          అనేకచోట్ల ఉద్యోగాలు చేస్తూ కదిరిలోని నంబులపూలకుంట మండలంలోకి బదిలీ
అయ్యారు. 1992లో అక్కడ వున్నప్పుడు 'మెదడు తిన్న పురుగులు' అనే కథ ప్రథమంగా రాసినారు.
అది 'రచన' అనే మాసపత్రికలో ప్రచురితమైంది. 'ముడివడని ముళ్ళు' అనే కథ ఆంధ్రజ్యోతిలో
ప్రచురితమైంది. 'ఆహ్వానం' పత్రికలో 'పేగుతెగిన బంధం' కథ రాసినారు. నందవరం రాసిన
కవితలు అనేకం ప్రజాసాహితిలో వచ్చేవి. 1995లో యం. ఈ.ఓ.గా పనిచేసేవారు. అప్పటి
అనుభవాలతో 'అవాంఛితం' కథను రాసినారు.  
        1998లో 116 పద్యాలతో ఒక శతకం కూడా
రాసినారు. తరువాత కామాలే, ఆనందవనం (రెక్కలు), వ్యాసనందనం ప్రచురించారు.
            యాడికిలో పనిచేస్తున్నప్పుడు రాయల కళాసమితి ఏర్పాటు చేసి ఆశావాది, దత్తాత్రేయ
ప్రసాద్ తో అవధానం కార్యక్రమాలు నిర్వహించారు. 2003లో 'పినాకిని కళాసమితి' ని ఏర్పాటుచేసి
అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.
సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలని నందవరం భావిస్తారు. అందులో అభ్యుదయం ఉండాలి. ఆధునికత ఉండాలి. భవిష్యత్తు పట్ల ఒక దృక్పథం ఉండాలి. 
         వర్తమాన సాహిత్యకారులు గతకాలపు సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఆయన కోరారు. అధ్యయనం చేయకుండా వూరకే రాయరాదని ఆయన చెపుతారు.ఎక్కువ ప్రచార యావతో పుంఖానుపుంఖాలుగా రాసే కవిత్వం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఒక సామాజిక దృక్పథం ఏర్పరచుకోవాలని ఆయన కోరారు.
        సాహిత్య రంగం గురించి చెబుతూ ప్రస్తుతం సాహిత్య రంగంలో కథకు మంచి విలువ
ఉందన్నారు. "కవిత్వం వస్తూ ఉంది కానీ కవిత్వంలో తీసుకున్న వస్తువులో, అభివ్యక్తిలో దాని ప్రత్యేకత ఉంది. యార్లగడ్డ రాఘవేంద్రరావు, పతంజలి, వారధి, దేవిప్రియ, కె. శివారెడ్డిగార్ల కవిత్వాన్ని యువతరం అధ్యయనం చేయాలి. సామాజిక సమస్యలపై కవిత్వం సరిగా రావడం లేదు,
రాయడంలేదు.”
      సమాజంలో మార్పుకు దోహద పడేవిధంగా సాహిత్యంలో వస్తున్న పరిణామాలను సాహిత్య సంఘాలు యువతరానికి అందించాలి. సాహిత్యాన్ని విశాలం చేయడమే సాహిత్య సంఘాల పని అని ఆయన చెపుతారు.
        2018లో ఉగాది పురస్కారాన్ని ప్రభుత్వం నుంచి అందుకున్నారు. 2015లో అభోవిభో
సంస్థ ద్వారా సన్మానం, అనేకసార్లు ఉగాది పురస్కారాలను పొందినారు. బెస్ట్ టీచర్ అవార్డును
తిరస్కరించారు.
        భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రభుత్వం పూనుకోవాలని ఆయన కోరారు. పాఠశాల,
కళాశాలలో తెలుగుభాష మరణావస్థలో ఉందన్నారు. అధికారా భాషా సంఘానికి అధ్యక్షుని నియమించి భాషా వికాసానికి తోడ్పడాలని ఆయన కోరుతున్నారు. కవులను కళాకారులను ప్రభుత్వం
గౌరవించాలన్నారు. ప్రస్తుతం మొక్కుబడిగా జరుగుతోందన్నారు.

____విజయ్ 9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

The unexplored relics of Rayalaseema