చంద్రవదన మొహియార్ అమర ప్రేమ గాథ



       చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యధార్థ సంఘటన.
  
      1509_29లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో పర్షియా(నేటి ఇరాన్) దేశంనుంచి కొంతమంది వజ్రాల వ్యాపారస్తులు వచ్చారు. వారు హంపీ తదితర ప్రాంతాలను చూసుకుంటూ కదిరికి కూడా వచ్చినారు.
కొన్నాళ్ళు ఇక్కడ కూడా వ్యాపారం చేసినారు. ఆ వ్యాపారస్తుల్లో మొహియార్ అనే యువకుడు  ఉండేవాడు. పాతర్లపట్నంకు చెందిన శ్రీరంగరాయలు కుమార్తె చంద్రవదన ఒక రోజు కదిరికి వచ్చింది. ఆమె మొహియార్‌ను చూసింది. మొహియార్ ఆమెను చూశాడు. వారిద్దరు పరస్పరం ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకున్న అన్నిరకాల అడ్డంకులనూ, మత కట్టుబాట్లనూ అధిగమించి వివాహ బంధంతో ఒక్కటైనారని ఒక కథనం ఉంది. వేర్వేరు మతాలకు చెందిన వీరి ప్రేమ గాథ కదిరిలో మతసామంస్యానికి ప్రతీకగా నిలిచివుంది. 
         వీరిని గుర్తుచేసుకుంటూ కదిరి పురపాలక
సంఘం ఒక ప్రాథమిక పాఠశాలను నెలకొల్పింది.

మరో కథ ప్రకారం 
       విజయనగర సామ్రాజ్యపు సామంత రాజు శ్రీరంగరాయలు పాతర్లపట్నంలో ఉండేవాడు.
ఆ పాతర్లపట్నంను నేడు పట్నంగా పిలుస్తున్నారు. ఆయన ఏకైక పుత్రిక చంద్రవదన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేది. పర్షియానుండి వజ్రాల వ్యాపారులు వచ్చారు. ఒకరోజు చంద్రవదన పర్షియా వ్యాపారస్తుడు మొహియార్ దుకాణం వద్దకు వెళ్లింది.
     ఆమె మొహియార్ను చూడగానే అతని ఠీవి, దర్పాన్ని చూసి తొలిచూపులోనే అతన్ని మోహించింది.
       ఆమెలో ప్రేమ మొగ్గతొడిగింది. అతను కూడా చంద్రవదన అందాన్ని చూసి, గుండెల్లో
ముద్రవేసుకున్నాడు. పరస్పర ఆకర్షణల మధ్య ఒకరినొకరు మధుర ప్రేమలు పంచుకున్నారు.
         ఆమె బాహ్య ప్రపంచంలోకి వచ్చి తనస్థితి, స్థాయినీ గుర్తుతెచ్చుకొని వేగంగా కదిలి తన
నివాసమందిరానికి వెళ్లింది. కాని మనసు మొహియార్ చుట్టూ తిరుగుతూనే ఉంది.
కొన్ని నిముషాలుమెరుపులా మెరిసి తనమదిలో ముద్రపడిన చంద్రవదనను మొహియార్ మరవలేక పోయాడు. ఆ తరువాత రోజులన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చాయి. ప్రతిక్షణం చంద్రవదనే మదిలో తలపులు రేపుతూ, నిద్రాహారాలను దూరం చేసింది. కానీ తన స్థాయి వేరు. పైగా మతం వేరు. అంతఃపురంలో చంద్రవదన పరిస్థితీ అలానే ఉంది. తన ప్రేమకు అర్థం లేదని భావించింది. ప్రేమను మరిచిపోవడానికి మనసురాక విలవిలలాడింది.
 వచ్చిన వ్యాపారస్తులు కదిరిని విడిచి వెళ్లి పోయారు.కాని మొహియార్ ఆమె కోసం కదిరిని విడిచి పోకుండా ఆమె ప్రేమ కోసం పరితపించ సాగాడు.
       ఒకరోజు మొహియార్ చంద్రవదనని ఎలాగైనా చూడాలని గాఢమైన కోరికతో ఆమె అంత:పుర
భవనం ముందుకు వచ్చాడు. అక్కడ రాజభటులు అతన్ని అడ్డగించారు. అతను చంద్రవదనపై
ప్రేమతో పిచ్చివాడిగా మారి ఆమెనే కలవరిస్తుండ టంతో రాజభటులు అతని మాటలు విని పిచ్చివాడిగా భావించి బలవంతంగా అతన్ని తోసేసినారు. అతను ప్రక్కన వున్న గోడకు తలతగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. గొడవంతా తెలిసిన శ్రీరంగనాయకులు స్వయంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. చనిపోయిన వ్యక్తి ఫలానా అని తెలిసిన చంద్రవదన కూడా అక్కడికి వచ్చి అతని స్థితిని చూసి చలించిపోయి ఆమె కూడా అమాంతంగా మొహియార్ శరీరంపై పడిపోయి ప్రాణాలు విడిచింది.
   శ్రీరంగరాయలు విషయం తెలుసుకొని, మొదట వారిద్దరి మధ్య జరిగిన స్పందన, ప్రేమలను
అర్థం చేసుకుని తన కొలువులోని గురువులను, పెద్దలను సంప్రదించి అందరి సలహాతో చంద్రవదన,
మొహియార్ శవాలను ఒకే ప్రదేశంలో ఖననం చేయించాడు. 
          హిందూ, ముస్లింల సమైక్యతను
చాటుతూ వారి సమాధులను హిందూ ముస్లిం సంప్రదాయాల సమ్మేళనంతో నిర్మించాడు.
మొహియార్ శవాన్ని అంత్యక్రియలకోసం తీసుకెళదామని ఎంతమంది వచ్చి కదిపినా అది
కదలలేదనీ చివరికి ఘోర దుఖంలో ఉన్న చంద్రవదన వచ్చి అతని శవాన్ని తాకిన మీదటనే దానిని లేపగలిగారనీ, చంద్రవదనకూడా మొహియార్ ఎడబాటును సహించలేక అతనితో పాటు సజీవసమాధి అయ్యిందని వారిది దైవికమైన అమర ప్రేమగా అప్పటి ప్రజలు భావించారనీ మరో కథ ప్రచారంలో ఉంది. 
        చంద్రవదన మొహియార్ సమాధి మందిరాన్ని అటు ముస్లింలు ఇటు హిందువులు అనేక మంది సందర్శించి తమ ప్రేమలు ఫలించాల ని మొక్కుకుంటారు. తాము ఆ జన్మాంతమూ విడిపోకూడదనుకునే ప్రేమికులూ దంపతులు కూడా ఈ సమాధిపై ఉంచిన కుంకుమ ను నేటికీ భక్తి శ్రద్ధలతో తీసుకెళు తుంటారు.
          వీరి సమాధి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ముస్లిముల శ్మశానస్థలంలో
ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు సాహిత్యానికి ఒకనాటి పుట్టినిల్లు కోగటం

The unexplored relics of Rayalaseema