కదిరి

    కదిరి పరిసర ప్రాంతాలను 3 వ శతాబ్దంలో పల్లవ రాజులు, 7వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజులు పాలించారు. క్రీ.శ 985 _1076  మధ్యకాలంలో పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. కదిరి లో లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నిర్మించక ముందు చాళుక్యులు క్రీ.శ. 965-1076 కాలంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. దుర్గాదేవి విగ్రహాన్ని కృష్ణవర్ణశిలతో అతి సుందరంగా చెక్కించి తమకాలపు ప్రత్యేకతను నాటి రాజులు చాటుకున్నారు. వీరి తరువాత క్రీ.శ1191 సంవత్సరం వరకు పశ్చిమ చాళుక్యులు , క్రీ.శ.1212 వరకు హొయసల వంశస్థులైన బల్లాల రాజులు పరిపాలించారు. క్రీ.శ. 1274లో  వీర బుక్కరాయలు విజయనగరమహా సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన ఆ నాటి ఖాద్రి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ భృగుమహర్షి పూజించిన స్థలాన్ని గుర్తించి ఒక మండపాన్ని నిర్మించాడు. దీన్ని క్రీ.శ 1275లో   నిర్మించినట్లు ఇక్కడి శాసనాలు చెపుతున్నాయి . 

      పూర్వపు కదిరి తాలూకా ప్రస్తుతం ఉన్న గాండ్లపెంట మండలంలో ఉండేది. ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది ఇక్కడ ఖాద్రీ వృక్షాలతో  ఉన్న మనోహరణ్యాన్ని నివాసయోగ్యంగా ఆనాటి  మునులు మార్చుకున్నారు. యజ్ఞయాగాదులు చేసే వారు. ఖాద్రీ వృక్షాలతో ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఖదిరా అని పిలిచేవారు.అది అందరి నోళ్లలో  ఖదిరీ అయింది. క్రమంగా కదిరి పేరుతో పిలిచారు. ఖదిరి చెట్టు ను చండ్ర చెట్టు అని కూడా పిలుస్తారు.
      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కదిరి ఒక ముఖ్య పట్టణం ,ఒక మండలం .పిన్ కోడ్ 515591. ఎస్.టి.డి కోడ్ 08494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకా వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా రాష్ట్రములోనే అతి పెద్ద తాలూకా గా ఉండేది. కదిరి చుట్టూ 10 మండలాలు ఉండేవి.5 మండలాలను పుట్టపర్తి లో కలిపి ఒక నియోజక వర్గం చేశారు. ప్రస్తుతం కదిరి నియోజక వర్గం లో 10 మండలాలు ఉన్నాయి.
       కదిరి మల్లెపూలకు,  కనకాంబరాల పూలకు ప్రసిద్ధి గాంచింది. కదిరి కుంకుమకు ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. 
 కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం.


 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం.
            క్రీ.శ. 1274 లో   విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న వీరబుక్కరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఖాద్రి వృక్షాల నీడలో విశ్రమించాడు .అప్పుడు ఒక చెట్టు కింద కొన్ని శిలలు కనిపించడం తో అక్కడ  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కట్టించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అది అభివృద్ధి చెందడం మొదలైంది. క్రీస్తుశకం 1391లో నరసింహ లక్ష్మన్న అనే దాసరులు ఇద్దరు లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు. వారు ఆ గుడి చుట్టూ ఎత్తైన రాతి స్తంభాలను ఏర్పాటుచేసి, ఆ గుడిలో దీపాలను వెలిగించడం మొదలుపెట్టారు. 
ఇక్కడి విశిష్టత ఏమిటంటే మరే నారసింహ క్షేత్రములో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతముగా దర్శనమిస్తారు. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణాపథం,ముఖ మంటపం, అర్ధ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్తంభాలపై ఉన్న కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. 
అందువల్లనే తెలుగు రాష్ట్రాలలో ఉన్న యాదగిరి, పానకాల,సింహాచలం వంటి  తొమ్మిది నరసింహస్వామి ఆలయాలలో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టమైనదిగా పేరొందింది. బేట్రాయి సామి దేవుడా.. నన్నేలినోడా.. బేట్రాయి సామి దేవుడా కదిరి నరసింహుడా.. కాటమరాయడా...అంటూ జానపదులతో కొనియాడబడే ఈ నరసింహ స్వామి విశిష్టత చాలా గొప్పది.

       ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో
నుండి కాకుండా ఒక బండపైనే అలా నిలబెట్టి ఉంది
        
      ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా జరుగుతాయి.
         బ్రహ్మగరుడ సేవ,   బ్రహ్మ రథోత్సవం(తేరు) అతి వైభవంగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక,తమిళనాడు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. తేరు రోజున కదిరి జనసంద్రాన్ని తలపిస్తుంది. 
        దేవస్థానానికి సంబంధించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థం(కోనేరు), ద్రౌపది తీర్ధం, కుంతి తీర్ధం, పాండవ తీర్ధం, వ్యాస తీర్ధం మొదలైనవి.
.
       గర్భగుడిలోనే లక్ష్మీదేవి గుడి  కూడా ఉంది.
ఈ విగ్రహం అఖండ శిల్ప రమణీయతకు ప్రతిరూపం.
       ఆలయం హొయసుల వాస్తు శైలిని కలిగి ఉంటుంది. శిల్పాలన్నీ విజయనగర కాలం నాటి శిల్పాలను పోలి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని మండపాల్లో అశ్వం, ఏనుగు ... మొదలైన జంతువుల శిల్పాలను అందంగా చెక్కారు.

దేవాలయం పై గల కామ సూత్ర శిల్పాలు అపురూపంగా దర్శనమిస్తాయి. తేరుపైన చారు శిల్పాలు వర్ణింపనలవిగావు.
గుడి బయట వున్న జయ విజయుల విగ్రహాల శిల్ప రమణీయత చెప్పనలవి కాదు.ఈ ఆలయం దాదాపు 10 ఎకరాలలో విస్తరించి ఉంది.
        క్రీ.శ.1509లో విజయనగరం సామ్రాజ్యాన్ని అధిష్టించిన తరువాత శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి, గర్భ గుడి ముందర 

రంగ మండపాన్ని నిర్మింపజేశారు. ఆ తర్వాత వచ్చిన అచ్యుత దేవరాయలు 1545 లో తూర్పు గోపురాన్ని నిర్మించారని , 1469 లో దక్షిణ గోపురాన్ని సాసవల చిన్నమ్మ, పడమర గోపురాన్ని 

1556లో కొక్కంటి పాలెగాళ్లు,ఉత్తర గోపురాన్ని టిప్పు సుల్తాన్ కాలం(1782_99)లో ముస్లిం పాలకులు నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. 


             క్రీ.శ.1569 లో తిరుమల రాయలు 10 మండ పాలను, పుష్కరిణి (కోనేరు)ని నిర్మించారని  దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని కొన్ని కథనాలు ఉన్నాయి.
           లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోపల ఒక కోనేరు ఉంది. బయట ఒక కోనేరు ఉంది. లోపల ఉన్న కోనేరు చాలా చిన్నది .బయట ఉన్నది చాలా పెద్దది .అయితే బయట ఉన్న పుష్కరిణిలో నీరు  పరిశుభ్రంగా లేనందున ఎవరూ అక్కడ స్నానం చేయట్లేదు. 

స్నానపు గదుల్లో స్నానం చేస్తున్నారు.అందువలన 
పుష్కరిణి ని బాగుచేయటం కోసం  పాలక వర్గం ప్రస్తుతం మరమ్మత్తులు చేయిస్తోంది.
        ప్రతి గుడికి ఒక కోనేరు ఉంటుంది. కారణ మేంటంటే గుడికి చుట్టూ నాలుగు గోపురాలు కట్టేటప్పుడు కింద నుంచి రాళ్లు తీసుకెళ్లడానికి గోపురం చుట్టూ మట్టిని ఏటవాలుగా పోస్తారు .ఆ మట్టిపై రాళ్లను ఏటవాలుగా దొర్లించుకుంటూ పైకి తీసుకెళ్తారు .అలా గోపురాన్ని నిర్మిస్తారు. కోనేరు కోసం తవ్వినప్పుడు వచ్చిన మట్టినే వాడు కుంటారు. అలా కోనేరును తప్పనిసరిగా  ఏర్పాటు చేస్తారు. ఇది పూర్వ కాలంలో  అన్ని చోట్లా జరిగింది.

ఈ గుడికి ఎదురుగా లక్ష్మీనరసింహస్వామి రథం ఉంది దీనిని చెక్కతో నిర్మించారు.  దీని బరువు 120 టన్నులు. దీనికి ఆరు చక్రాలున్నాయి. 45 అడుగుల ఎత్తు కలిగి ఉంది.దీనిపై చెక్కిన కళాఖండాలు ఆనాటి విజయనగర రాజుల కళా కౌశ్యలానికి ఈ  రథం ప్రత్యేకంగా నిలుస్తోంది. 


ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా
సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవిలతో కలిసి నరసింహుడు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లఘుమ్మ కొండ(కదిరి కొండ_గాండ్లపెంట కు వెళ్ళే దారిలో ఉంది) దగ్గర పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం.
          పారువేట అనంతరం స్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 
          స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుణాల రోజున రథోత్సవం జరుగుతుంది ఆ రోజు లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారువీరిలో చాలామంది రధాన్ని పురవీధుల గుండా గుడి చుట్టూ లాగుతారు ప్రధానికి పెద్ద మోపులు కట్టి దాన్ని ప్రజలు లాగుతూ గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తారు.ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దపణం, పండ్లు ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రిందపడిన వీటిని ప్రసాదంగా‌భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక.

       ప్రతి సంవత్సరం సంక్రాంతి  మరుసటి దినం కనుమ రోజున లక్ష్మీనరసింహుడు సతీ సమేతంగా  దగ్గరకు పులి పారువేటకు వస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. పులిపారువేట అంటే పులివేట. మారిన పరిస్థితుల్లో పారువేటను కుందేల్లను వేటాడడంగా మార్చినారు. ఈ పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు

       బ్రహ్మాత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాసముంటారు. ఏటా ఈ ఆలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూలతిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, ఆషాడ పౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.
          ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే... ఉత్సవాల సమయంలో
ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. 
        
ఇతర దేవాలయాలు

          కదిరిలో  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చూడచక్కగా  విరాజిల్లుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆరాధన మహెూత్సవాల సందర్భంగా తిరునాల నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.
      ప్రపంచం లో నే మొట్టమొదటి   మరకత మహాలక్ష్మి ఆలయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో  అనంతపురం వెళ్లే దారిలో మెయిన్ రోడ్డు పక్కన ఉంది. మహాలక్ష్మి దేవి మహావిష్ణువు హృదయేశ్వరి. ఆమె విగ్రహాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి  స్వహస్తాలతో ప్రతిష్టించారు.  

       ఈ ఆలయం  లో గణపతి , 

   దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు.

కదిరి కి సమీపాన 138 కి. మీ ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, 145 కి.మీ ల దూరంలో తిరుపతి విమానాశ్రయం,120 కి.మీ దూరంలో కడప విమానాశ్రయం ఉన్నాయి.
ఈ మూడు విమానాశ్రయాల నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో  రెండు లేదా మూడు గంటలలో
కదిరి చేరుకోవచ్చు.

కదిరి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది పాకాల-ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది.తిరుపతి,  హైదరాబాద్, సికింద్రాబాద్ ,చెన్నై తదితర ప్రాంతాల నుండి కదిరి స్టేషన్ మీదుగా రైళ్లు వెళుతుంటాయి.

కదిరికి బస్సు/రోడ్డు మార్గం 
          ధర్మవరం, అనంతపురం, కర్నూలు, బెంగ ళూరు, హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు, కడప తదితర ప్రాంతాల నుండి కదిరికి చక్కటి రోడ్డు మార్గం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి