యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి


యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కటకం కృష్ణవేణి

                కటకం కృష్ణవేణి

             శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యంతో పాటు శాంతిని సాధించే మార్గమే యోగా. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమేకాదు. మన శరీరాన్ని ప్రకృతికి చేరువచేసే మార్గం. యోగాతో సమాజాన్ని చూసే దృక్పథం మారుతుంది. నేను అనే అహం నుంచి మనం అన్న వైపు ప్రయాణించే సాధనమే యోగా ప్రక్రియ. మానసిక శారీరక అనారోగ్యాలతో బాధపడేవారికి యోగా చక్కని మార్గదర్శిని గా భావించిన కృష్ణవేణి యోగాలో మాస్టర్ డిగ్రీ చేసి యోగవేణిగా ప్రసిద్ధురాలైంది.

           పుట్టింది కడప జిల్లాలో అయినా పెరిగింది మాత్రం కదిరిలోనే. 8.10.78 లో కడప లో బి.రామచంద్రారెడ్డి,బి. రామాంజనమ్మ లకు జన్మించిన కృష్ణవేణి బాల్యమంతా కదిరిలోనే గడిపింది. కదిరిలో బాలికల ఉన్నత పాఠశాలలో హైస్కూల్ చదువును బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ను పూర్తి చేసింది. బిఏ డిగ్రీ ని ఎస్కే యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఇక్కడే వివాహం చేసుకుంది. ఆమెకు సంగీత, సుమంత్ రెడ్డి ఇరువురు పిల్లలు కలిగారు.వారు ఉన్నత చదువులు చదువుతున్నారు. 

         భర్త అమర్నాథ్ రెడ్డి ఆర్డిటిలో పనిచేస్తూ ఉద్యోగరీత్యా అనంతపురం బదిలీ కావడంతో అనంతపురంలో స్వామి వివేకానంద యోగాకేంద్ర ఆధ్వర్యంలో యోగా గురువులైన వెంకటేశ్వరగుప్త, మారుతీప్రసాద్ వద్ద శిక్షణపొందారు. ఆ తర్వాత ఆమె యోగాతో పాటు పవిత్ర సేవ అనే సంస్థను స్వచ్ఛంద సంస్థను 20111లో స్థాపించి ఎంతోమంది పేదలకు అనాధ పిల్లలకు వృద్ధులకు ఆపన్న హస్తం అందించింది. ఈ సంస్థ ద్వారా అనాధ పిల్లలకు ఆరోగ్య సేవను అందించింది పేదల నివసించే ప్రాంతాలలో ఉన్న వృద్ధులకు బట్టలను అందించింది వారికి వైద్య సేవలను ఉచితంగా ఏర్పాటు చేయించింది శీతాకాలంలో రోడ్డుమీద బస్టాండ్లలో రైల్వే స్టేషన్లో పడుకొని ఉండే అనాధలకు పేదలకు దుప్పట్లను అందజేసింది.
           
         యోగా లో భాగంగా చేసే ఆసనాలతో శరీరం ధృడపడుతుందని, ప్రాణాయామంతో శ్వాసక్రియ లోపాలను సరి చేసుకోవచ్చని ఆమె పలువురికి యోగా నేర్పిస్తున్నారు. ఎక్కడ యోగా పోటీలు జరిగినా ఆమె పాల్గొని బహుమతులు సాధించారు. పోషక విలువలు కల్గిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల అలసట ఏర్పడుతుంది. నిద్ర కరవు, ఊబకాయం ,ఎసిడిటి,రక్తపోటు, మధుమేహం వంటి శారీరక సమస్యలు మనిషి జీవన శైలి ద్వారా వస్తున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం యోగ ద్వారా లభిస్తుందని ఆమె చెబుతోంది.
      పంజాబ్లోని పాటియాల పోలీసు మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన 43వ యోగా పోటీల్లో 11-14 సంవత్సరాల బాలికల విభాగంలో ఆరోస్థానాన్ని సాధించిన నందిని కృష్ణవేణి దగ్గర శిక్షణ పొందింది. నందిని అనంతపురం జిల్లాలోని శెట్టూరు గ్రామానికి చెందినది. ఇలా ఎంతో మంది విద్యార్థులను ఆమె తీర్చిదిద్దారు.ప్రపంచమంతటా ప్రతి ఏటా జూన్ 21న 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే యోగాదినోత్సవాలలో యోగ విన్యాసాలను కృష్ణవేణి క్రమం తప్పకుండా చేస్తున్నారు.
        యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్న కటకం కృష్ణవేణిని ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రత్యేక అతిథిగా న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో జరిగే 2024 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి నామినేట్ చేసింది.

___పిళ్లా కుమారస్వామి,9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి