అనంతపురం జిల్లా

 
అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ దిక్కున ఉండే పెద్ద జిల్లా. క్రీ.శ. 1344-1377 మధ్య బుక్కదేవరాయలు ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన చిక్కవడియార్ అనంత సాగరం అనే పెద్ద చెరువుకు ఇరువైపులా అనంతసాగరం, బుక్కరాయసముద్రం అనే రెండు గ్రామాలను నిర్మించాడు. చిక్కవడియార్ రాజుకు అనంతరస అనే బిరుదు కారణంగా నగరానికి అనంతపురం పేరు వచ్చింది.

జిల్లా ఆవిర్భావం

అనంతపురం జిల్లా 1882లో ఆవిర్భవించింది. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి, ముదిగుబ్బ, నల్లమాడ, నంబులపూలకుంట, తలుపుల, నల్లచెరువు, ఓబుళదేవరచెరువు, తనకల్లు, ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి 1956లో బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.

                Ananthapuram map

భౌగోళిక స్వరూపం

అనంతపురం జిల్లా 14°41N77°36E / 14.68°N 77.6°E. ఇది సముద్ర మట్టానికి 335 m/1,099 ft ఎత్తులో ఉంది. హైదరాబాద్ కు356 కి.మీ. దూరంలో   విజయవాడ కు 484 కి.మీ.దూరంలో, కర్నూలుకు148 కి.మీ.దూరంలో ,  బెంగళూరుకు 210 కి.మీ. దూరంలో ఉంది.

సరిహద్దులు

అనంతపురానికి తూర్పు న కడప జిల్లా, పడమర కర్నాటక రాష్ట్రం,ఉత్తరాన కర్నూలు,దక్షిణాన చిత్తూరు జిల్లాలున్నాయి.

రెవెన్యూ డివిజన్ల విభజన

జిల్లా విస్తీర్ణం 19,130 చ.కి.మీ.2011లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40.81లక్షలు.
 జిల్లాను అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం,కదిరి లతో ఐదు రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ లను 2013లో ఏర్పాటు చేశారు.
జిల్లాలో మొత్తం 63 మండలాలున్నాయి. అనంతపురం డివిజన్లో 19 మండలాలు, ధర్మవరం డివిజన్లో 8 మండలాలు, పెనుకొండ డివిజన్లో 13 మండలాలు, కదిరి డివిజన్ లో 12 మండలాలు, కళ్యాణదుర్గం డివిజన్ లో 11 ఉన్నాయి. 964 రెవెన్యూ గ్రామాలు, 1005 గ్రామపంచాయితీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. 

మండలాలు
   జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. అవి:
  1. డి.హిరేహాల్
  2. బొమ్మనహళ్
  3. విడపనకల్లు
  4. వజ్రకరూరు
  5. గుంతకల్లు
  6. గుత్తి
  7. పెద్దవడుగూరు
  8. యాడికి
  9. తాడిపత్రి
  10. పెద్దపప్పూరు
  11. శింగనమల
  12. పామిడి
  13. గార్లదిన్నె
  14. కూడేరు
  15. ఉరవకొండ
  16. బెళుగుప్ప
  17. కణేకల్లు
  18. రాయదుర్గం
  19. గుమ్మగట్ట
  20. బ్రహ్మసముద్రం
  21. శెట్టూరు
  22. కుందుర్పి
  23. కళ్యాణదుర్గం
  24. ఆత్మకూరు
  25. అనంతపురం
  26. బుక్కరాయసముద్రం
  27. నార్పల
  28. పుట్లూరు
  29. యల్లనూరు
  30. తాడిమర్రి
  31. బత్తలపల్లి
  32. రాప్తాడు
  33. కనగానపల్లి
  34. కంబదూరు
  35. రామగిరి
  36. చెన్నేకొత్తపల్లి
  37. ధర్మవరం
  38. ముదిగుబ్బ
  39. తలుపుల
  40. నంబులపూలకుంట
  41. తనకల్లు
  42. నల్లచెరువు
  43. గాండ్లపెంట
  44. కదిరి
  45. అమడగూరు
  46. ఓబులదేవరచెరువు
  47. నల్లమడ
  48. గోరంట్ల
  49. పుట్టపర్తి
  50. బుక్కపట్నం
  51. కొత్తచెరువు
  52. పెనుకొండ
  53. రొద్దం
  54. సోమందేపల్లె
  55. చిలమతూరు
  56. లేపాక్షి
  57. హిందూపురం
  58. పరిగి
  59. మడకశిర
  60. గుడిబండ
  61. అమరాపురం
  62. అగలి
  63. రొల్ల

అసెంబ్లీ నియోజకవర్గాలు

1.అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం
2.ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం
3.కదిరి శాసనసభ నియోజకవర్గం
4.కళ్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం
5.గుంతకల్లు శాసనసభ నియోజకవర్గం
6.తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం
7.ధర్మవరం శాసనసభ నియోజకవర్గం
8.పుట్టపర్తిశాసనసభ నియోజకవర్గం
9.పెనుకొండ శాసనసభ నియోజకవర్గం
10.మడకశిర శాసనసభ నియోజకవర్గం
11.రాప్తాడు శాసనసభ నియోజకవర్గం
12.రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం
13.శింగనమల శాసనసభ నియోజకవర్గం
14.హిందూపురం శాసనసభ నియోజకవర్గం



          జిల్లాలో నాలుగు విశ్వవిద్యాలయాలు న్నాయి.అవి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం,
అనంత జేఎన్‌టీ విశ్వవిద్యాలయం,శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం, కేంద్ర విశ్వవిద్యాలయం.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

         SK University, Ananthapuram
అనంతపురం జిల్లా కేంద్రానికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 10 కిలోమీటర్ల దూరంలో అనంతపురం- చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉంది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 1976లో పోస్టుగ్రాడ్యుయేషన్ సెంటర్‌గా ఉండి 1981లో యూనివర్సిటీగా ఏర్పడింది. 

                      SKU logo
ఇషా ఉపనిషత్తు నుంచి 'విద్యయా అమృత మశ్నుతే' అనే పదాన్ని జోడించి వర్సిటీ చిహ్నం రూపొందించారు. మొత్తం 500 ఎకరాల్లో క్యాంపస్ విస్తరించింది. వర్సిటీ కళాశాలలో 28 విభాగాల్లో 37 పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. 156 అనుబంధ డిగ్రీ కళాశాలలు, 25 పీజీ కళాశాలల్లో ప్రత్యేకంగా పీజీ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. 59 బీఈడీ కళాశాలలు వర్సిటీ పరిధిలో ఉన్నాయి. రెండు లా కళాశాలలు ఉన్నాయి.
Website:http://www.skuniversity.ac.in/

అనంత జేఎన్‌టీ విశ్వవిద్యాలయం
          JNTU, Ananthapuram
అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ కళాశాల 1946లో ఏర్పాటు అయింది. హైదరాబాద్ జేఎన్‌టీయూకి అనుబంధంగా ఉన్న కళాశాల ఆగస్టు 18, 2008లో అనంతపురం జేఎన్‌టీయూ వర్సిటీగా ఏర్పాటు అయింది. 

              JNTU Ananthapuram logo
అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించింది. వర్సిటీ కళాశాలలు అనంతపురం జేఎన్‌టీయూ, పులివెందుల జేఎన్‌టీయూ, అనంతపురం తైల సాంకేతిక అభివృద్ది కేంద్రం ఉన్నాయి. ఐదు జిల్లాల పరిధిలో 114 ఇంజినీరింగ్ కళాశాలలు, 35 ఫార్మసీ కళాశాలలు, 21 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 5 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు ఉన్నాయి. యూజీలో బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ ఉన్నాయి. పీజీలో ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ ఫార్మాడీ (పి.బి.)కోర్సులు ఉన్నాయి. ఎంఎస్, పీహెచ్‌డీలో పరిశోధన చేయడానికి అవకాశం ఉంది.
Website:https://www.jntua.ac.in/


శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం

         Sathyasai university, Ananthapuram
        సత్యసాయి విశ్వవిద్యాలయం ను పుట్టపర్తి సాయిబాబా 1981లో ఏర్పాటు చేశారు.దీనికి నాలుగు చోట్ల కాంపస్ లున్నాయి.అందులో రెండు అనంతపురం జిల్లాలో ఉన్నాయి.ఒకటి మహిళల కోసం అనంతపురం నగరంలో ఉంది.మరొకటి పురుషుల కోసం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉంది. మిగిలినవి బెంగుళూరులో వైట్ ఫీల్డ్ లో, ముదినేహల్లిలో ఉన్నాయి.
 వెబ్సైట్ : http://www.sssihl.edu.in/

కేంద్ర విశ్వవిద్యాలయం

           విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా  ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర విశ్వవిద్యాలయం మంజూరైంది.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని జంతులూరు గ్రామంలో 491.23 ఎకరాల్లోరూ.902.07 కోట్లతో ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వ విద్యాలయం ను నిర్మించనున్నారు.సెంట్రల్‌ యూనివర్సిటీకి ప్రత్యేక స్వరూపముంటుంది. దీనికి రాష్ట్రపతి విజిటర్‌గాను, గవర్నర్‌ చాన్సలర్‌గాను వ్యవహరిస్తారు. వీసీని కేంద్ర ప్రభుత్వమే నామినేట్‌ చేస్తుంది. ఎగ్జిక్యుటివ్‌ కౌన్సిల్‌ సభ్యులను జాతీయ స్థాయి లో ఎంపిక చేస్తారు. వీరి పరిధిలో స్కూల్‌ డీన్స్‌ ఉంటారు. ఈ వర్సిటీ పరిధిలో ఏర్పాటయ్యే స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, స్కూల్‌ ఆఫ్‌ బయలాజికల్‌ సైన్స్‌, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌.. తదిదత బ్రాంచిలకు స్కూల్‌ డీన్స్‌ పర్యవేక్షణాధికారులుగా ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగ నియామకాలను జాతీయస్థాయి రిజర్వేషన్ల ప్రకారమే అమలు చేస్తారు. సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవీవిరమణ వయసు 62సంవత్సరాలు కాగా సెంట్రల్‌ వర్సిటీ ఆచార్యులకు 70ఏళ్లుగా నిర్ణయించారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారానే ప్రవేశాలుంటాయి.
రాష్ట్ర స్థాయిల్లో వర్సిటీల కంటే సెంట్రల్‌ యూనివర్సిటీకి అధిక నిధులు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు, ఆచార్యులు రావ డంతో అనంతపురం భిన్న సంస్కృతులకు నిలయం కానుంది. విద్యార్థులకు ఆధునిక హాస్టళ్లు, పరిశోధనశాలలు, లైబ్రరీలు ఏర్పాటవుతాయి. రాయలసీమ వెనుకబాటుతనంపై పరిశోధనలు చేసే అవకాశం. ఇక్కడి కరువు పరిస్థితులు, పంటలు, సామాజిక సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చు.  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రవాణా సదుపాయా లు మరింత మెరుగుపడతాయి.
      సొంత భవనాల నిర్మాణం పూర్తయ్యేవరకు అనంతపురం jntu లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు.
Website: http://cuap.ac.in
        
              నదులు - ప్రాజెక్టులు

పెన్నా నది

               Penna river at Anantapuram
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపూర్ దగ్గర
నందికొండలో పుట్టి తుంకూరు,కోలారుజిల్లాలలో48 కి.మీ ప్రవహించి అనంతపురం జిల్లాలో కుముద్వతిలో కలుస్తుంది.తరువాత
హిందూపురం మండలం దక్షిణాన చేలూరు గ్రామం వద్ద జయమంగళ లో కలుస్తుంది. జయమంగళ నది తుంకూరులో పుట్టి పెన్నాలో కలుస్తుంది.
పరిగి, రొద్దం, రామగిరి, కంబదూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఉరవకొండ, వజ్రకరూరు, పామిడి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల గుండా ఈ నది ప్రవహిస్తుంది.అక్కడి నుండి అది పాల కొండలలో ప్రవహించిన తరువాత
 కోడూరు గ్రామానికి నైరుతీ దిశగా 3 కి.మీ. దూరంలో కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కుముద్వతి,జయమంగళ, చిత్రావతి,  పాపాఘ్ని పెన్నా నది కిిిి ఉపనదులు.

చిత్రావతి నది

చిత్రావతి నది జిల్లాలో రెండో పెద్ద నది. ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లా నందిదుర్గానికి ఉత్తరంగా ఉన్న హరిహరేశ్వర్ కొండల్లో పుట్టి చిలమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామానికి 2 కి.మీ. దూరంలో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నది గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, యల్లనూరు మండలాల్లో ప్రవహిస్తుంది. కడప జిల్లాలోని గండికోట వద్ద పెన్నానదిలో  సంగమం చేస్తుంది.

హగరి లేదా వేదావతి

           వేద,అవతి రెండు చిన్న నదుల కలయిక తో ఏర్పడిన నది వేదావతి.దీనిని అనంతపురం జిల్లాలో హగరి అని పిలుస్తారు.తుంగభద్ర నదికి ఉపనదిగా ఉన్న ఈ నది కర్ణాటక రాష్ట్రంలోని పడమటి కనుమలలో పుట్టి అనంతపురం జిల్లాలోని గుమ్మగట్ట మండలంలోని భైరవానితిప్ప గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. దీనిపై  భైరవానితిప్ప ప్రాజెక్టును నిర్మించారు. తరువాత రాయదుర్గం, బెళగుప్ప, బ్రహ్మసముద్రం, డీ హీరేహాళ్‌, కళ్యాణదుర్గం, కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల 
మీదుగా సుమారు 100కి.మీ  ప్రవహిస్తోంది. ఈ నదికి ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో పరీవాహక ప్రాంతం ఉంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో అధిక గ్రామాలు తాగునీటికి ఈ నదిపైనే ఆధారపడ్డాయి. చివరకు తుంగభద్రలో కలిసే ఈ నది 20 ఏళ్ల క్రితం వరకూ ఎప్పుడూ నీటితో కళకళలాడేది. ప్రస్తుతం ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. వేదావతి హగరి నదిలో నిల్వ ఉన్న ఇసుక నిర్మాణాల అవసరాల కోసం తరలిపోతోంది.


జయమంగళ

ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పరిగి మండలంలో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పెన్నానదిని, సంగమేశ్వరంపల్లి గ్రామం(పరిగి మండలం) వద్ద కలుస్తుంది.

చిన్ననదులు

పాపాగ్ని నది 
 ఈ నది మన జిల్లా కు సుమారు 180కి.మీ దూరం నందికొండల్లో పుడుతుంది.ఈ నంది కొండలు చిక్కబళ్లాపూర్ అనే జిల్లాలో ఉన్నాయి.ఈ జిల్లా కర్నాటక రాష్ట్రంలో ఉంది.వానలు బాగా పడితే ఈ నదిలో నీళ్లు బాగా పారి కర్నాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ జిల్లాలో ఉండే భూములకు నీళ్లిస్తుంది.అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కు వస్తుంది.మళ్లీ అక్కడి నుంచి మన జిల్లా జిల్లాలో అమడగూరు,తనకల్లు,నల్లచెరువు,కదిరి,ముదిగుబ్బ, తలుపుల,నంబులపూలికుంట మండలాల్లో పారుతుంది.తరువాత   వైఎస్సార్ కడపజిల్లా గాలి‌వీడు మండలంలోకి పోతుంది.
వైఎస్సార్ కడప జిల్లాలోని గాలివీడు మండలంలో పాపాఘ్ని నదిపై నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్‌కు ‘వైఎస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’గా పేరు పెట్టారు. ఇది చివరకు కమలాపురం మండలంలో పెన్నా నదిలో కలుస్తుంది.అంటే ఈ నది పెన్నానది కి ఉప నదన్నమాట.ఈ నది కి వానలు పడి నీళ్లు  వస్తే 8250ఎకరాల నేలలో పంటలు పండించు కోవచ్చు.ఈ నది ఒడ్డునే గండి అనే వూళ్ళో ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది.

చిలమత్తూరు మండలంలోని కుషావతి, అగళి మండలంలోని స్వర్ణముఖి, నల్లమాడ, కదిరి, ముదిగుబ్బ మండలాల్లోని మద్దిలేరు, కనగానపల్లి, రాప్తాడు, అనంతపురం, బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లోని పండమేరు చిన్న నదులు.

      నీటిపారుదల,సాగునీటి వనరులు

అనంతపురం జిల్లా రైతాంగం ప్రధానంగా తుంగభద్ర జలాశాలయాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. తుంగభద్ర నుంచి వచ్చే నీరు తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించాల్సి వస్తోంది. యేటా నీటి లభ్యత ఆధారంగా జిల్లాలోని ఆయకట్టుకు నీటిని వినియోగిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాజెక్టులు వర్షాధారం కింద ఆధారపడి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సిఉంది. ఇటీవల నెలకొన్న తీవ్ర వర్షాభావం వల్ల ఆయకట్టుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులకు ఉన్న ఆయకట్టు విస్తీర్ణంలో సగ భాగం కూడా నీరు అందడం లేదు. పేరుకు మాత్రమే ఆయకట్టు... విస్తీర్ణం అనే రీతిలో ఉన్నాయి.

తుంగభద్ర హైలెవల్ కెనాల్(హెచ్చెల్సీ)

జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టు. దీని కింద సుమారు 1.50లక్షల ఎకరాలకు సాగునీటి పారుదల సౌకర్యం ఉంది. హెచ్చెల్సీ నీరు వివిధ బ్రాంచ్‌కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యం ఉంది. జిల్లావ్యాప్తంగా 26 మండలాల్లో హెచ్చెల్సీకింద ఆయకట్టు సౌకర్యం ఉంది. ఇందుకు టీబీ డ్యాం నుంచి యేటా 32 టీఎంసీల నుంచి 35 టీఎంసీలు కేటాయిస్తున్నారు. 2010-11 యేడాదికిగాను జిల్లావాటాగా 32.5 టీఎంసీలను కేటాయించారు.

తుంగభద్ర ప్రధానకాలువ
దీని కింద 35,541 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా బొమ్మనహాల్, కణేకల్ మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈప్రాంతంలో ఎక్కువగా వరి పంటను సాగు చేయనున్నారు

మిడ్‌పెన్నార్ నార్త్‌కెనాల్
దీని కింద పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈ కెనాల్ కింద మొత్తం 13,325 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. పెద్దవడుగూరులో ఎక్కువగా పత్తి పంటను సాగు చేయనున్నారు.

మిడ్‌పెన్నార్ సౌత్
దీని కింద గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్ మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈ కెనాల్ కింద మొత్తం 33176 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా గార్లదిన్నె, శింగనమల మండలాల్లో అత్యధికంగా వరిని సాగు చేయనున్నారు.

తాడిపత్రి బ్రాంచ్ కెనాల్
మిడ్‌పెన్నార్ సౌత్‌కెనాల్ నుంచి నార్పల మండల మీదుగా ప్రధాన కాలువ పుట్లూరు మండలం సుబ్బరాయసాగర్‌లోకి నీరు వస్తుంది. అక్కడినుంచి ఎ.కొండాపురం మీదుగా తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. ఈ కెనాల్ కింద తాడిపత్రి, పుట్లూరు, పెద్దపప్పూరు, యల్లనూరు మండలాల్లో 31131 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా సగభాగం నీరందిన దాఖలాలు లేవు. యేటా 5వేల ఎకరాల వరకే నీరందుతోంది

గుంతకల్లు బ్రాంచ్ కెనాల్
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు మండలాల్లో ఆయకట్టు ఉంది. మొత్తం 15,792 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. ఈ కెనాల్ కింద వరి, మిరప పంటలను సాగు చేయనున్నారు

గుత్తి బ్రాంచ్ కెనాల్
గుత్తి బ్రాంచ్ కెనాల్ కింద గుత్తి, పామిడి మండలాల్లో ఆయకట్టు ఉంది. గత పదేళ్ల నుంచి ఆయకట్టు పరిధిలో కొంత భాగం భూసేకరణ కారణంగా ఆగిపోయింది. ఇటీవలే భూసేకరణ పూర్తి అయ్యింది. వచ్చే యేడాది నుంచి గుత్తి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఈకెనాల్ కింద 16271 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది అలాగే టీబీ డ్యాం నుంచి తుంగభద్ర జలాలు సరిహద్దులో ఉన్న కర్నూలు, కడప జిల్లాలకు కూడా వెళ్లాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్ పరిధిలో 14255 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా, కడప జిల్లాలోని పులివెందల బ్రాంచ్ కెనాల్ కింద 55,579 ఎకరాలు, మైలవరం నార్త్, సౌత్ కెనాల్ కింద 69922 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంకు నీరు పారాల్సి ఉంది

చెరువులు
జిల్లాలో 1264 చెరువులు ఉన్నాయి. ప్రధానంగా బుక్కపట్నం చెరువు రాయలసీమలోనే అత్యంత పెద్దది. దీని కింద 8200 ఎకరాల ఆయకట్టు ఉంది. తరువాత స్థానంలో శింగనమల చెరువు ఉంది. దీని కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉండగా మూడో స్థానంలో ధర్మవరం చెరువు ఉంది. ఈ చెరువు కింద 2వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. అదేవిధంగా వంద ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 305, వంద ఎకరాలలోపు ఉన్న చెరువులు 959 ఉన్నాయి. జిల్లాలో మొత్తం 118396 ఎకారాల ఆయకట్టు చెరువుల కింద ఉంది. అయితే వర్షాలు లేకపోవడం వల్ల చాలా చెరువుల్లో ఆయకట్టు విస్తీర్ణం పూర్తిగా పడిపోయింది

ప్రధాన పంటలు

దేశంలోనే అత్యల్ప వర్షపాతం కల జిల్లా అనంతపురం. ఇక్కడి రైతులు అనునిత్యం ప్రకృతితో పోటీ పడుతుంటారు. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఖరీఫ్‌లో వేరుసెనగ పంట సాగులో అనంత రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఇటీవల కాలంలో పండ్లతోటల సాగులో కూడా మందంజలో ఉంది. తక్కువ నీటిని వినియోగించుకొని బిందు, తుంపెర పరికరాలతో పండ్లతోటలను సాగు చేస్తున్నారు. 89వేల హెక్టార్లలో ఉద్యానవనపంటలు సాగవుతున్నాయి. యేటా అనంత నుంచి 9.95 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

కొర్ర: 
         జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 636 హెక్టార్లలో కొర్ర పంటను సాగు చేశారు. నీటి వసతితో పాటు వర్షాధారం కింద కూడా కొర్రను సాగు చేశారు. ఈ పంటను మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో పాటు తదుపరి రబీలో కూడా మరోక పంట వేసేందుకు అనువుగా ఉండటంతో పాటు పశువులకు మేత కూడా అవుతుందని రైతులు కొర్ర పంటను సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో కొర్రతో కలిసి మూడు పంటలు పండించవచ్చునని వ్యవసాయశాస్త్రవేత్తలు నిరూపించారు. రెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్తలు కొర్ర సాగులో మెలకువలు  ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.

వేరుసెనగ:
               groundnut crop
        రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుసెనగ పంటను సాగు చేసే జిల్లా అనంతపురం. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు అయ్యే జిల్లా అనంతపురం. వర్షాభావ పరిస్థితికి నిలదొక్కోగలిగే పంట వేరుసెనగ. అందుకే జిల్లాలో ఎక్కువ మంది రైతులు వేరుసెనగ సాగు చేస్తున్నారు. ఎర్రనేలల్లో ఎక్కువగా వేరుసెనగను సాగు చేస్తున్నారు. ప్రతి యేటా ఖరీఫ్‌లో సుమారు 7లక్షల హెక్టార్లకుపై గానే వేరుసెనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ యేడాది 7.06లక్షల హెక్టార్లలో వేరుసెనగ పంటను సాగు చేస్తున్నారు.

మొక్కజొన్న: 

                 maize crop
          జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న సాగు లక్ష్యం, సాధారణ విస్తీర్ణం 7559 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అయితే ఈ యేడాది 13,689 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. కొంత వరకు నీటి వసతి ఉండే పొలాలు మొక్కజొన్నకు అనుకూలం. ప్రస్తుతం మొక్కజొన్న కు గిట్టుబాటు ధర ఉండటంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుండటం, లాభదాయకమైన పంట కావడంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు అయ్యింది.

కంది: 
             జిల్లాలో కంది పంటను ప్రధానంగా వేరుసెనగలో అంతర పంటగా సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రనేలలో ఎక్కువగా కంది పంటను సాగు చేస్తున్నారు. 45705 హెక్టార్లలో కంది పంటను సాగు చేస్తున్నారు. కంది పప్పు ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సాధారణ విస్తీర్ణం కంటే 9వేల హెక్టార్లలో ఎక్కువగా రైతులు కంది పంటను సాగు చేశారు. ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా అంతర పంటగా రైతులు కందిని సాగు చేస్తున్నారు.

పెసర: 
       
      పెసర పంటను కూడా జిల్లాలో ప్రధానంగా వేరుసెనగకు అంతర పంటగా సాగు చేస్తున్నారు. అలాగే ఎర్రటి నేలల్లో, ఇసుక నేలల్లో ఎక్కువగా పెసర పంటను సాగు చేస్తున్నారు.

 శనగ: 
        ప్రధానంగా జిల్లాలో రబీలో పప్పు శనగ పంటను సాగు చేస్తారు. ఈ పంట నల్లరేగడి పొలాల్లో సాగుకు అనుకూలమైనది. చలికాలంలో వచ్చే మంచు బిందువులతో ఎక్కువగా ఈ పంట వస్తుంది. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో పప్పుసెనగను సాగు చేయనున్నారు. ఎక్కువగా విడపనకల్లు, వజ్రకరూరు, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో పప్పుసెనగ పంట రబీలో సాగుచేస్తున్నారు.

పొద్దుతిరుగుడు: 
        నల్లరేగడి నేలల్లో ఎక్కువగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్నారు.అయితే ఈ యేడాది తీవ్ర వర్షాభావం వల్ల ఖరీఫ్‌లో, రబీలో పొద్దుతిరుగుడు పంట సక్రమంగా పడలేదు. ఖరీఫ్‌లో 20085 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా గత ఖరీఫ్‌లో కేవలం 3570 హెకార్టలో మాత్రమే పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో బీడుగా కొంతమేరకు వదిలివేయగా, మరికొంత ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు.

మామిడి: 
        జిల్లా వ్యాప్తంగా 7994 హెక్టార్లలో మామిడి పంటను సాగు చేయబడుతోంది. కదిరి, పెనగొండ, హిందూపురం, తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాంతాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. మిగిలన ప్రాంతాల్లో అక్కడక్కడా మామిడిని సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఇసుక రకం నేలల్లో ఈ మామిడిని సాగు చేస్తున్నారు.

అరటి: 
         తక్కువ నీటి వినియోగం, తక్కువ శ్రమ, ఎక్కువ మంది కూలీలపై ఆధారపడాల్సి అవసరం లేని పంట అరటి. గత పదేళ్ల నుంచి టిష్యూకల్చర్ అరటి పంటను సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7286 హెక్టార్లలో (18215 ఎకరాలు) అరటి పంట సాగు చేయబడుతోంది. మూడు పంటలు వచ్చే అరటి ఒక్కక్క పంటకు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. జిల్లాలో పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రి, పెద్దపప్పూరు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ పంటకు తెగుళ్లు తక్కువ... ఈదురు గాలులు వీస్తే చెట్లు నేలకొరి పంట తినే అవకాశం ఉంది.

చీనీ(బత్తాయి): 
          పండ్లతోటలలో ప్రధానమైన వాటిలో బత్తాయి(చీనీ) పంట ముఖ్యమైనది. చీనీ మెక్క నాటిన ఐదు సంవత్సరాల నుంచి పంట చేతికొస్తుంది. జిల్లాలోగార్లదిన్నె, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బత్తాయిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 49759 హెక్టార్లలో (124397ఎకరాల్లో) బత్తాయి పంట సాగు చేయబడుతోంది. ఇటీవల కాలంలో బత్తాయి చెట్లకు వేరుకుళ్లు తెగుళ్లు ఎక్కువగా రావడంతో రైతులు నష్టపోతున్నారు. చీనీ మార్కెట్‌కు నిలకడ లేని మార్కెట్ వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు.

జామ: 
        ఇసుక నేలలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా జామ పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో పామిడి, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల్లో అత్యధికంగా జామను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2100 హెక్టార్లలో జామ పంట సాగు చేయబడుతోంది. జనవరి నుంచి జామ పంట చేతికొస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన జామ స్థానిక మార్కెట్‌తో పాటు బెంగళూరు, కోలార్, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాకు ఎగుమతి చేస్తారు. జ్యూస్ పరిశ్రమలకు కూడా జామను ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో జామకు ఎండు తెగులు రావడంతో చెట్లు ఎండిపోవడంతో రైతులు ఇబ్బదులు పడుతున్నారు.

సపోట:
         జిల్లా వ్యాప్తంగా 3951 హెక్టార్లలో సపోటా పంటను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సపోటాను సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంట చెనై, హైదరాబాద్, కవిజయవాడ, కొత్తపేట, సింగనూరు (కర్నాటక), మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతోంది.

దానిమ్మ: 
       జిల్లా వ్యాప్తంగా 3363 హెక్టార్లలో దానిమ్మ పంట సాగు చేయబడుతోంది. ధర్మవరం, రాయదుర్గం, యల్లనూరు, పెద్దపప్పూరు, పెనుగొండ తదితర మండలాల్లో అత్యధికంగా దానిమ్మ పంటను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పండించిన దానిమ్మ పంటను చెన్నై, కల్‌కత్తా, బెంగళూరు, కోయంబత్తూరు, విజయవాడ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.

                       పర్యాటకం

రాష్ట్ర పురావస్తు రక్షిత కట్టడాల కింద జిల్లా 44 ఆలయాలున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 23 ఉన్నాయి. జిల్లా చిన్న, పెద్ద దేవాలయాలు 1000 దాకా ఉన్నాయి.


 కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం


            క్రీ.శ. 1274 లో   విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న వీరబుక్కరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఖాద్రి వృక్షాల నీడలో విశ్రమించాడు .
అప్పుడు ఒక చెట్టు కింద కొన్ని శిలలు కనిపించడం తో అక్కడ  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కట్టించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అది అభివృద్ధి చెందడం మొదలైంది. క్రీస్తుశకం 1391లో నరసింహ లక్ష్మన్న అనే దాసరులు ఇద్దరు లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు. వారు ఆ గుడి చుట్టూ ఎత్తైన రాతి స్తంభాలను ఏర్పాటుచేసి, ఆ గుడిలో దీపాలను వెలిగించడం మొదలుపెట్టారు.
గర్భగుడిలో నరసింహస్వామి, ఆయన భక్తుడు ప్రహ్లాదుడు కూడా ఉంటాడు. అందువల్లనే తెలుగు రాష్ట్రాలలో ఉన్న 9 నరసింహస్వామి ఆలయాలలో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టమైనదిగా పేరొందింది. గర్భగుడిలోనే లక్ష్మీదేవి గుడి  కూడా ఉంది.గుడి బయట వున్న జయ విజయుల విగ్రహాల శిల్ప రమణీయత చెప్పనలవి కాదు.ఈ ఆలయం దాదాపు 10 ఎకరాలలో విస్తరించి ఉంది.

   క్రీ.శ.1509లో విజయనగరం సామ్రాజ్యాన్ని అధిష్టించిన తరువాత శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి, గర్భ గుడి ముందర రంగ మండపాన్ని నిర్మింపజేశారు. ఆ తర్వాత వచ్చిన అచ్యుత దేవరాయలు 1545 లో తూర్పు గోపురాన్ని నిర్మించారని , 1469 లో దక్షిణ గోపురాన్ని సాసవల చిన్నమ్మ, పడమర గోపురాన్ని 1556లో కొక్కంటి పాలెగాళ్లు,ఉత్తర గోపురాన్ని టిప్పు సుల్తాన్ కాలం(1782_99)లో ముస్లిం పాలకులు నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. 1569 లో తిరుమల రాయలు 10 మండపాలను, పుష్కరిణి (కోనేరు)ని నిర్మించారని  దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని కొన్ని కథనాలు ఉన్నాయి.
       ప్రతి సంవత్సరం సంక్రాంతి  మరుసటి దినం కనుమ రోజున లక్ష్మీనరసింహుడు సతీ సమేతంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లఘుమ్మ కొండ(కదిరి కొండ_గాండ్లపెంట కు వెళ్ళే దారిలో ఉంది) దగ్గరకు పులి పారువేటకు వస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. పులిపారువేట అంటే పులివేట. మారిన పరిస్థితుల్లో పారువేటను కుందేల్లను వేటాడడంగా మార్చినారు. ఈ పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు.ఈ గుడికి ఎదురుగా లక్ష్మీనరసింహస్వామి రథం ఉంది దీనిని చెక్కతో నిర్మించారు.  దీని బరువు 120 టన్నులు. దీనికి ఆరు చక్రాలున్నాయి. 45 అడుగుల ఎత్తు కలిగి ఉంది.స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుణాల రోజున రథోత్సవం జరుగుతుంది ఆ రోజు లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారువీరిలో చాలామంది రధాన్ని పురవీధుల గుండా గుడి చుట్టూ లాగుతారు ప్రధానికి పెద్ద మోపులు కట్టి దాన్ని ప్రజలు లాగుతూ గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తారు.

1569 లో తిరుమల రాయలు 10 మండపాలను, పుష్కరిణి (కోనేరు)ని నిర్మించారని  దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని కొన్ని కథనాలు ఉన్నాయి.
లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోపల ఒక కోనేరు ఉంది. బయట ఒక కోనేరు ఉంది. లోపల ఉన్న కోనేరు చాలా చిన్నది .బయట ఉన్నది చాలా పెద్దది.

తిమ్మమ్మ మర్రిమాను

తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది.

బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది. ఇది 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషిచేశారు.1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. తాజా సర్వేలో 6,869 ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాల్లో విస్తరించి ఉందని తేలింది. మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి.మర్రిమాను కిందికి వెళ్తే.. ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ ఊడ కనిపిస్తుంది. దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరి, భూమంతా ఆక్రమించిన వటవృక్షాన్ని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిముషాల్లా గడిచిపోతాయి

తిమ్మమాంబ ప్రాతివత్య మహిమకు తిమ్మమ్మ మర్రిమానుగా ప్రాచుర్యం పొందిన ఈ చెట్టును ఆమెకు ప్రతిరూపంగా చెబుతారు. 15వ శతాబ్దం ప్రథమభాగంలో భర్త బాల వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు. తిమ్మమ్మ గంగరాజు ఆస్థానంలో గూటిబయలు సంస్థానానికి ప్రతినిధిగా ఉన్న బాల వీరనాయకుని వివాహం చేసుకుంటుంది. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక సంక్షేమానికి కృషిచేసేది. అయితే కుష్ఠువ్యాధిగ్రస్తుడైన వీరనాయకుణ్ణి గంగరాజు వెలివేస్తాడు. అప్పుడు వూరిబయట ఉన్న తమ పశువుల పాకనే కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది తిమ్మమ్మ. తన పాతివ్రత్య మహిమతో గంగరాజును శపిస్తుంది. ఫలితంగా వాళ్లా కోటను వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతారు. ఆరు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ మర్రి వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. రాయలసీమలో అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో పక్షుల కిలకిలరావాలతో చూపరులను చకితుల్ని చేస్తుంది.

మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు.
ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద "తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మ లకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది" అని చెక్కబడింది.

తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన చోట మొలచబడ్డ మొక్క ఈరోజు ఇంత పెద్ద మర్రిమానుగా వృద్ధి చెందింది అని భక్తులు భావిస్తారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వలన పిల్లలు కలుగుతారు అని భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

తిమ్మమ మర్రిమాను వృక్షము పైన ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతే కాకుండా సాయంత్రము ఆరు గంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టు పై ఉండవు. ప్రస్తుతము ఈ వృక్షపు మొదలువద్ద మరొక మొక్క మొదలు ఆయ్యింది.

ప్రగతిశీల వేమన

         వేేేమన మన వేేమన ఘనవేేేమన

       వేమన కడప జిల్లాలోని ఒక పల్లెటూరులో సామాన్య మధ్యతరగతి రైతు (కాపు) కుటుంబంలో జన్మించాడు.రాయలసీమలో కాపులను రెడ్లు అంటారు. కడప జిల్లాలో గండికోట ప్రాంతంలో వేమన జన్మించి వుంటాడని బ్రౌన్ భావించాడు. 
      వేమన తండ్రి రెడ్డన్న అని కొన్ని పద్యాలు తెలుపుతున్నాయి. తల్లి పేరు కనుమరుగైంది. ఆయనస్వగ్రామం మూగచింతల పల్లెగా చాలా మంది పరిశోధకులు భావించారు. అందుకు ఆధారంగా క్రింది పద్యాన్ని ఉదహరిస్తూ వుంటారు.

ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమవీధి
మూగ చింతల పల్లె మొదటి ఇల్లు
ఎద్దె రెడ్డికుల మదేమని తెల్పుదు
విశ్వదాభిరామ వినురవేమ!!

      వేమన ఉన్నత మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాడని పలువురు భావిస్తుంటారు. ఆయన రాచకుటుంబీకుడు కాదనడానికి చాలా ఆధారాలున్నాయి. ఆయన చెప్పిన క్రింది పద్యం ఇందుకు ప్రజల సాక్ష్యంగా నిలుస్తుంది.

ఎంత సేవచేసి ఏ పాటు పడినను
రాచమూక నమ్మరాదు రన్న
పాముతోడి పొందు పదివేలకైనను .... || విశ్వ

      వేమన పూర్తిగా గ్రామీణ జనజీవితం నుంచి వచ్చిన వాడనడానికి ఆయన పద్యాలల్లో విరివిగా వాడిన గ్రామీణ పదజాలం, వ్యవసాయ సంబంధ పదాలు మనకు ప్రస్ఫుటంగా సాక్ష్యాలుగా నిలుస్తాయి.
ఎన్నో తర్జన భర్జనలు అనంతరం పరిశోధకులు వేమన కాలం 1672గా నిర్ణయించారు. ఫలితంగా ప్రభుత్వం1972లో ఆయన ఫోటోతో ఇరవై పైసల తపాలబిళ్ళను విడుదల చేసింది.
           వేమన తన పద్యాలను రాయలేదు. ఆశువుగా స్పందించి అప్పటికప్పుడు చెప్పేవి శిష్యులు రాసుకునేవారు.తరువాత కాలంలో కొంత మంది ఆయన పద్యాలను అనుకరణ చేసి కొన్ని జతచేర్చారు. పరిశోధకులు, పండితులుఅసలు సిసలైన వేమన పద్యాలను ఏరితే అవి దాదాపు 1200 వరకు వుండవచ్చునన్నది అంచనా. ఏది ఏమైనాఆయన పద్యాలు నేటికీ ప్రజల నాల్కల్లో నాట్యమాడుతున్నాయి.
భావస్వాతంత్ర్యానికి పాటుబడిన వారిలో వేమన ముఖ్యుడని అన్నాదురై అన్నాడు. దీనికి నిదర్శనంగా వేమనపద్యాల భావాలూ, ప్రభావాలూ, సమాజంపై ఇప్పటికీ శాశ్వతంగా వున్నాయి. ఎందువల్ల ?
ఆయన చెప్పిన పద్యాల్లోని భావాలు కొన్ని నిత్యసత్యాలు. సమాజం వున్నంత వరకు నిలిచేవుంటాయి. మరికొన్ని ఆనాటి సమాజం నుంచి తీసుకున్నాడు. కాని ఆనాటి పరిస్థితులే నేటికీ ఇంకా సమాజంలో ప్రబలంగా వున్నాయి.అందువల్లనే ఆ పద్యాలకు జీవం ఇంకా వుంది. ఎంతో ఆధునికం అయిందన్న మన సమాజం, కులం, మతం,మూఢ విశ్వాసాల్లాంటి విషయాల్లో ఆధునికం కాకపోవడం శోచనీయం. దీన్ని మార్చడానికి వేమనలాగ శ్రేయో సమాజాన్ని కాంక్షించేవారు పూనుకోవాలి. ఆయన సమాధి
 కదిరికి పది కి.మీ.దూరంలో కటారుపల్లె లో ఉంది.
                  ఇది   పాత చిత్రం
          ఇది  నేేటిి  చిత్రం  vemana samadhi

చంద్రవదన మొహియార్ అమరప్రేమ కథ
క్రీ.శ1515లో శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో పర్షియా దేశం నుంచి కొంతమంది వజ్రాల వ్యాపారస్తులు వచ్చారు. వారు హంపి తదితర ప్రాంతాల్లో వ్యాపారం చూసుకుంటూ కదిరికి కూడా వచ్చారు. ఇక్కడ కొన్నాళ్ళు వాళ్ళు  వజ్రాల వ్యాపారం చేసినారు.
కృష్ణదేవరాయలకు సామంత రాజుగా ఉన్న శ్రీరంగ రాయలు పాతర్ల పట్నంలో ఉండేవాడు. ఈ పాతర్ల పట్టణాన్ని ఇప్పుడు పట్నం అని పిలుస్తున్నారు. ఇది కదిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరంగ రాయలుకు కూతురు ఉండేది. ఆమె పేరు చంద్రవదన. ఆమె కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళ్తుండేది. పర్షియా నుండి వచ్చిన వ్యాపారస్తులు వజ్రాలను అమ్మేవారు. వారిలో మొహియార్ అనే యువకుడు ఒక వజ్రాల దుకాణాన్ని నడిపేవాడు. చంద్రవదన వజ్రాలను పరిశీలిస్తూ దుకాణాల దగ్గరకు వెళ్లింది. అక్కడ  ఆమె మొహియార్ ను చూడగానే అతని ఠీవిని అందాన్ని చూసి  తొలిచూపులోనే అతనిని మోహించింది .
ఆమె లో ప్రేమ మొగ్గతొడిగింది. మొహియార్ మనసులో కూడా ప్రేమ చిగురించింది.వారిద్దరి
ప్రేమ ఫలించక ఇద్దరూ మరణించారు. వారిద్దరి
సమాధులు నేడు  కదిరిలో ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న ముస్లిం ల ఖబరస్థాన్ లో ఉన్నాయి. ఆ సమాధులను హిందూ ముస్లిం సమైక్యత కు గుర్తుగా  హిందూ ముస్లిం సంప్రదాయాల సమ్మేళనం తో నిర్మించారు.
       వీరి ప్రేమను దైవికమైన అమరప్రేమగా అప్పటి ప్రజలు భావించారు .ఈ సమాధి మందిరాన్నిముస్లింలు ,హిందువులు దర్శించి తమ ప్రేమలు ఫలించాలని   కోరుకుంటూ ఉంటారు. దంపతుల మధ్య ప్రేమ చిగురించడానికి, ప్రేమికులు విడిపోకుండా ఉండడానికి ఈ సమాధి దగ్గర ఉన్న మట్టిని తీసుకుని నీళ్లలో గాని, పాలలో గాని కలుపుకొని పై తేటను తాగుతారని తెలుస్తోంది. ఇది కదిరి ప్రాంతంలో వేమన సమాధి, తిమ్మమ్మ మర్రిమాను, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది.

Persian Mohiyar, Indian Chandravadana tomb in KADIRI at Governament hospital.It stood as a symbolic for Hindu Muslim unity.Mohiar tomb is built in Islam style and chandravadana's built in Indian style.Here in bellow is the tomb.
                  
బుగ్గ రామలింగేశ్వర ఆలయం

రెండో కాశీ క్షేత్రం బుగ్గ రామలింగేశ్వర ఆలయం
తాడిపత్రికే తలమానికమైన బుగ్గరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 25 వరకు జరగనున్నాయి. దేవాదాయ శాఖ, ఆలయ ధర్మకర్తల మండలి విస్తృత ఏర్పాట్లు చేసింది. విజయనగర సామ్రాజ్య ఆరంభ దశలో విద్యారణ్యులు నారాయణభట్టు అనే పండితుణ్ని పినాకిని నది ప్రాంతంలో సంచరించమని అదేశించారు. అప్పటికే భాస్కరక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ప్రాతంలో తాళఫలవృక్షాలు ప్రాంతంలో అధికంగా ఉండటంతో తాటిపల్లెగా నారాయణభట్టులు నామకరణం చేశారని చరిత్ర చెబుతోంది. అది తాడిపత్రిగా రూపాంతరం చెందింది. రాయల కాలానికి ముందు జైన సామంత రాజు ఉదయాదిత్యుడు క్రీ..శ.. 1199లో ఇక్కడ పాలన చేసినట్లు దేవాలయ శిలాశాసనంలో ఉంది.

పుట్టపర్తి
ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం. సత్యసాయి బాబా సమాధిని దర్శించుకోవడానికి విదేశాల నుంచీ భక్తులు వస్తుంటారు. 
అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా 64 కి.మీ. దూరంలో పుట్టపర్తి ఉంది.

వలస పక్షుల కేంద్రం వీరాపురం 
          Painted stark bird from Siberia
హిందూ పురానికి సమీపంలో ఉన్న
వీరాపురం గ్రామం వలస పక్షులకు ఆవాసంగా అలరారుతోంది. ముఖ్యంగా  సైబీరియా నుంచే వచ్చే పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జాతీయ రహదారి ఎన్‌హెచ్-7పై ఉన్న కొడికొండ చెక్‌పోస్టు నుంచి 13కి.మీ. దూరంలో వీరాపురం ఉంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వచ్చే పక్షులను ఈ వూరి ప్రజలు తమ అతిథులుగా చూసుకుంటారు. ఇక్కడకు వచ్చే పక్షిజాతుల్లో  పెయింటెడ్ స్టార్క్ ముఖ్యమైంది. వీరాపురం వాసులు ముద్దుగా ఎర్ర కొంగ అంటారు. అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్ స్టార్క్‌లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతమైన విషయం.రష్యాలోని సైబీరియా లోయ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 150 రకాల నివసిస్తున్నాయి. వివిధ రంగుల్లో ఎత్తయిన సైబీరియా కొంగలు అంతరించి పోతున్న జాబితాలో చేరాయి. వాటి సంఖ్య నానాటికీ తగ్గుతున్నట్లు అమెరికాలోని విస్కాన్సిలో గల క్రేన్ ఫౌండేషన్ ప్రకటించింది. సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో వందల సైబీరియా పక్షులు వలస బాట పడతాయి. సుమారు శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు వలస వస్తాయి. అక్కడే ఆర్నెల్ల పాటు ఉండి, సంతానోత్పత్తి చేసుకుని తిరిగి సైబీరియాకు పయనమవుతాయి.

పెయింటెండ్ స్టార్క్

           పెయింటెడ్ స్టార్క్ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. సికొనిడే జాతికి చెంది పెయింటెడ్ స్టార్క్ శాస్త్రీయ పేరు 'మిక్టీరియాలూకోసిఫల'. ఎత్తు 3-3.5అడుగులు, ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు సుమారు 3.5-4కిలోల వరకు ఉంటుంది.

పెయింటెడ్ స్టార్క్ పక్షులు మన దేశానికి శాశ్వత అతిథులు. మనదేశంలో పలు చోట్ల అవి కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పక్షి కేంద్రం, హార్యానాలోని ఫరీదాబాద్ జిల్లా హోదల్ పరిసరాల్లో,  గుజరాత్‌లోని  విద్యానగర్  సమీపంలో  చెన్నైకు 40కి.మీ.ల దూరంలోని వేదాంతంగల్,  కర్ణాటకలోకి శ్రీరంగపట్టణం, ముద్దూరు వద్ద, గుంటూరుకు 10కి.మీ.ల దూరంలోని ఉప్పలవాడ వద్ద, సూూూళ్లూరుపేట సమీపంలో పులికాట్ సరస్సు వద్ద ఇవి ఎక్కువుగా కనిపిస్తాయి.


లేపాక్షి ఆలయం
           Lepakshi temple
        రావణుడు సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకెళ్తుండగా, జఠాయువు పక్షి అడ్డగించింది. కోపోద్రుక్తుడైన రావణుడు దాని రెక్కలు నరికివేస్తాడు. సీతాన్వేషియై తిరుగుతున్న రాముడు ఈ ప్రాంతానికి రాగా రెక్కలు తెగి ఉన్న జఠావును చూసి లే.. పక్షి అన్నాడని దాంతో ఈ ప్రాంతం లేపాక్షిగా మారిందని ఇతిహాస గాథ.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన నంది
      Nandi at Lepakshi, Ananthapuram
        ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది మరెక్కడా లేదు. 15అడుగుల ఎత్తు, 27అడుగుల పొడవుతో జీవకళ ఉట్టిపడుతూ పైకి లేచివస్తున్నట్లు కనబడే ఈ నంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

పెనుకొండ కోట

పచ్చని అందాలు... విజయనగర రాజుల కట్టడాలు
కోట కలిగిన కొండ... కొండ కలిగిన కోట.. కోట కొండలలో మేటి పెనుకొండగా పేరుగాంచిది పెనుకొండ. విజయనగర రాజులకాలం నాటికట్టడాలు దీనిపై అనేకం ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు 15 శతాబ్దంలో హంపి తరువాత పెనుగొండను రెండో రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. వేసవివిడిదిగా ఇక్కడి వస్తుండేవారు. ఇక్కడ ఒక్క చోటే 365 దేవాలయాలు ఉండటం విశేషం. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా కొన్ని ఆలయాల్లో మాత్రమే ధూప, దీప, నైవేద్యాలు జరుగుతున్నాయి. కొండపై ఉన్న పలుదేవాలయాలు, తటాకాలు, గోపురాలు, బురుజులు, కోనేరులు విజయనగరరాజుల చరిత్రకు అద్దం పడుతున్నాయి.

                        పరిశ్రమలు

జిల్లాలో 80 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల పాడి పరిశ్రమ, ఇతర వస్తు ఉత్పాదక పరిశ్రమలపై ఆధారపడుతున్నారు. కరవు కాటకాల నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలు దోహదపడుతున్నాయి. పట్టణ కూలీలకు ఉపాధిని చూపుతున్నాయి. అసంఘటిత కార్మికులకు చిన్న పరిశ్రమలు వూరటనిస్తున్నాయి. ప్రధానంగా రెండు భారీపరిశ్రమలున్నాయి. సిమెంటు, మైనింగ్ పరిశ్రమల్లో అటు కూలీలు, రవాణా సంస్థల వారు ఉపాధి పొందుతున్నారు. తాడిపత్రి ప్రాంతంలోని కూలీలకు పెన్న, అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలు ఆసరాగా నిలిచాయి. ఎజేకే స్టీల్, కార్పొరేషన్ స్టీల్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి.

పారిశ్రామిక వాడలు

అనంతపురం, హిందూపురం, గుంతకల్లులలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారు. ప్రముఖ నగరం బెంగళూరుకు సమీపంలో హిందూపురం ఉండటంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. హిందూపురంలో సూపర్ స్పిన్నింగ్ మిల్, హిందూపురం వ్యాపార లిమిటెడ్, బొమ్మనహాళ్‌లో శాతవాహన ఇన్స్‌పార్ ఇనుప వస్తువుల తయారీ కంపెనీ, రామగిరిలో ఐఎల్ఎఫ్ కంపెనీ, అనంతపురం సమీపంలోని హంపాపురంలో పీవీసీ పైప్స్ కంపెనీలు చెప్పుకోదగినవి. తాడిపత్రిలో గ్రానెట్ పరిశ్రమలు, ధర్మవరంలో పట్టు, సిల్క్ పరిశ్రమలు, రాయదుర్గంలో గార్మెంట్ పరిశ్రమలు జిల్లాలో ముఖ్యమైనవి.
* భారీ, మధ్యతరహా పరిశ్రమలు 69 ఉన్నాయి. వీటి ద్వారా 20,423 మంది ఉపాధి పొందుతున్నారు.
* చిన్న తరహా పరిశ్రమలు 330 వీటి ద్వారా 2417 మంది ఉపాధి పొందుతున్నారు.
* మైక్రో పరిశ్రమలు 5854 ఉన్నాయి. వీటి ద్వారా 29,374 మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో రూ.10 కోట్లపైగా పెట్టుబడి పెట్టి స్థాపించిన భారీ, మధ్య తరహా పరిశ్రమలు 26 ఉన్నాయి. సిమెంట్, హ్యాండ్‌లూమ్స్, ఇనుపవస్తువుల తయారీ పరిశ్రమలు ఎక్కువ. హిందూ పురం, తాడిపత్రి ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. పరిశ్రమల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో గార్మెంట్, గ్రానైట్ తదితర పరిశ్రమలున్నాయి. జిల్లాలో భారీ మధ్య తరహా పరిశ్రమలు 55 ఉన్నాయి. మరో 35 కొత్త పరిశ్రమలు రానున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 5,983 దాకా ఉన్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి