రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ


జాతీయోద్యమానికి దేశం యావత్తూ ఒకటై నడుం బిగించడానికి ముందే ఆంగ్లేయుల నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో పోరాటాలు నడిచాయి . రాయలసీమలో పాలెగాళ్లు వీరోచిత పోరాటాలు చేశారు . వివిధ కారణాల వల్ల అవి సఫలం కాకపోయినా , ఆ తర్వాతి కాలంలో జరిగిన స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చాయనడం లో సందేహం లేదు . 

*అమర నాయంకరులు* 
                  పాలెగాళ్ల వ్యవస్థ విజయనగర రాజుల కాలం నుంచీ చరిత్రలో మనకు కనబడుతుంది . ఈ వ్యవస్థ గురించి తెలుసుకునే ముందు నాటి రాజ్య నిర్మాణం గురించి తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది . పరిపాలనా సౌలభ్యం కోసం విజయనగర చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని పలు రాజ్యాలుగా విభజించారు . ఒక బలమైన దుర్గం కేంద్రంగా దాని పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను ఒక రాజ్యంగాఏర్పాటు చేసేవారు. వీటిని సీమలు అనికూడా పిలుస్తారు. గండికోట సీమ, సిద్ధవటం సీమ, గుత్తి సీమ ఇందుకు ఉదాహరణలు. దుర్గాన్ని కేంద్రం చేసుకుని 'సీమ'ను పాలించే పాలనాధికారిని దుర్గాధ్యక్షుడు లేదా నాయకుడు అంటారు. చక్రవర్తి తనసార్వభౌమాధి కారాన్ని అంగీకరించిన వ్యక్తులకు దుర్గాధ్యక్షులుగా
నియమిస్తాడు. వీరికి జీతాలు ఉండవు. తమకు అప్పగించిన 'సీమ' నుంచి వచ్చే ఆదాయంలో ప్రతి ఏటా నిర్ణీత కప్పాన్ని చక్రవర్తికి చెల్లించాలి. మిగిలిన ధనాన్ని వారు ఉపయోగించుకోవచ్చు. యుద్ధ సమయాల్లో చక్రవర్తికి సహాయంగా పంపేందుకు కొంత సైన్యాన్ని వీరు పోషించాలి. దీన్ని 'అమర నాయంకర' పద్ధతి అని పిలుస్తారు. దీన్ని మిలటరీ టెన్యూర్ గా పరిగణించవచ్చు.

*పారుపత్యదారు*
                 అమరనాయంకరులు రాజధాని అయిన విజయనగరంలో ఉండాల్సి వచ్చినందున తమ తరపున 'సీమ'ల్లో పరిపాలనా వ్యవహారాలు నడిపేందుకు ఒక ప్రతినిధిని నియమించేవాళ్లు. ఈ ప్రతినిధిని పారుపత్యదారు లేదా కార్యకర్త అని పిలుస్తారు. ఇతను రెవెన్యూ అధికారిగాను, కావలిగాళ్లపై అధిపతిగాను, న్యాయాధికారి గాను వ్యవహరించే వాడు.

*నాయంకరులు*

గండికోట అమరనాయంకరులు తమకు విశ్వాసపాత్రులై సేవించిన వారికి తమ రాజ్యంలోని కొన్ని 'సీమ'లను నాయంకరములుగా ఇచ్చారు. దువ్వూరు సీమ, కడప సీమ, చెన్నూరు సీమ, పులివెందుల సీమ, సకిలి సీమ ఇలా నాయంకరములుగా ఇచ్చినవే. ఒక్కోసారి గ్రామాలను కూడా నాయంకరములుగా ఇచ్చారు. అలా పొందిన వారిని నాయంకరులు అంటారు.

*కావలిగాళ్లు*

సరిహద్దు ప్రాంతాలు, అటవీ మార్గాల్లో ప్రజలకు రక్షణ కల్పించి, శాంతి భద్రతలను నిర్వహించడం కోసం కావలిగాళ్లను ఏర్పాటుచేశారు. వీరి వద్ద సాయుధ కట్టుబడులు ఉంటారు. వీరి పోషణ కోసం కొన్ని గ్రామాలను ఇచ్చేవాళ్లు. ఆగ్రామాల్లో శిస్తు వసూలు చేసి కొంత భాగాన్ని రాజుకు చెల్లించి మిగిలింది. తమ ఖర్చుల కోసం ఉంచుకునేవారు. రాజులకు యుద్ధ సమయాల్లో సైన్యాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. ఇలా పోలీసు, రెవెన్యూ విధుల్ని వీరు నిర్వహించే వారు. నియమబద్ద శిస్తు వసూళ్లతో ఆగకుండా ప్రజల ఆస్తుల్ని లూటీ చేస్తూ హింసాత్మక పాలన సాగిస్తూ వచ్చారు. 1565 తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోవడంతో వీరు స్వాతంత్ర్యం ప్రకటించుకుని పాలెగాళ్లుగాఅవతరించారన్నది
ఒక వాదన. నాయంకరులే పాలెగాళ్లు అనేది మరో వాదన ఉంది. నాయంకరులంటే కొంత పెద్దస్థాయి పాలెగాళ్లు. కావలిగాళ్లంటే కొంత చిన్నస్తాయి పాలెగాళ్లుగా
పరిగణించవచ్చు.
                 చిన్న చిన్న పాలెగాళ్లు ఒక పెద్ద పాలెగాడిని ఆశ్రయించి ఉంటారు. అతను రాజుకు లోబడి ఉంటాడు. ఎంత చిన్న పాలెగాడికైనా ఒక చిన్నపాటి కోట,రాజాస్థానం ఉండటం విశేషం. పెద్దరాజుల ఆస్థానాల్లో ఉన్న విధంగా వీరివద్ద కూడా అవే హోదాలు కల్గిన అధికారులుంటారు. వీరి వద్ద కట్టుబడి సైన్యం ఉంటుంది. వీరికి జీతాలు ఉండవు. యుద్ధాలలో పొరుగు గ్రామాలను దోచుకుంటారు. శాంతి సమయాల్లో కూడా అదేపని చేస్తుంటారు. పాలెగాళ్ల
ఆధీనంలోని జాగీర్ల పరిధి తక్కువ కాబట్టి దాదాపు ప్రతి గ్రామం పొరుగు పాలెగాడి సైనికుల దౌర్జన్యాలకు గురౌతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటారు. అందుకే ప్రతి
పాత గ్రామంలో ఇప్పటికీ బురుజులు (Watch Towers) కనిపిస్తాయి. కొంత సంపన్న గ్రామమైతే కోట గోడలు కూడా అగుపిస్తాయి. ఒక పొరుగూరి పాలెగాడి దౌర్జన్యాల నుంచి తనను తాను రక్షించుకునే సామర్థ్యం ఒక గ్రామం సంతరించుకుందంటే, త్వరలోనే అది ఆత్మరక్షణ వదలిపెట్టి పక్క గ్రామాలపై దాడులు చేయడం ప్రారంభిస్తుంది. ఆ ఊరి పెద్ద దీనికి నాయకుడవుతాడు. అప్పటి వరకు తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం గ్రామస్తులు నియమించుకున్న వ్యక్తులు గ్రామ పెద్ద అజమాయిషిలోకి వెళ్లిపోతారు. ఆ గ్రామపెద్ద తానే ఒక పాలెగాడిగా తయారౌతాడు.
                     కొన్ని ఏండ్లు ఇలా గడిస్తే అతను కూడా రాజాస్థానాన్ని నెలకొల్పి, అధికారులను దోచుకుని జీవించడం ప్రారంభిస్తాడు.
     పాలెగార్ అనేది ఒక పదవి. వివిధ కులాలకు చెందిన వ్యక్తులు పాలెగాళ్లు గా పనిచేశారు. కడప జిల్లాలో ఎక్కువగా ఏకిల కులానికి చెందిన వారు పాలెగాళ్లు గా కనిపిస్తారు. రాయచోటి ప్రాంతంలో వీరు అధికం. వీరి వంశీకులను నాయునివారు అని నేటికీ పిలుస్తుంటారు. కొండ ప్రాంతాల్లో చిన్న చిన్న రాతి కోటలు నిర్మించుకుని అందులో జీవిస్తుండేవాళ్లు.

*సిబ్బంది - ఆయుధాలు*

పాలెగాళ్ల వద్ద కట్టుబడి సిబ్బంది ఉంటారు. అత్యవసర సమయాల్లో కిరాయి సైనికులనుఉపయోగించు
కుంటారు. ప్రతిఫలంగా డబ్బు, ధాన్యం ఇస్తారు. ఫిరంగులు, తుపాకులు, కత్తులు, డాళ్లు, ఈటెలు, బాణాలు వీరి ఆయుధాలు. బారెడు పొడవు ఉండే సెవన్నీటెలను రెండు చేతులతో తిప్పగలరు. ఇక పెట్లు కొయ్య అనేది మరో ఆయుధం. ఇది తుపాకీ లాగా పనిచేస్తుంది. బారెడు పొడవుగల వెదురు కొయ్యకు ఇనుప బొంగు తొడుగుతారు. ఆ ఇనుప బొంగునిండా
నల్లమందు నింపుతారు. ఇనుప బొంగుకు చింతకొయ్య తొడుగుతారు. ఇది వాడిగా మొనదేలి ఉంటుంది. ఇనుప బొంగుకు పక్కన ఉన్న రంధ్రంలో నిప్పు అంటిస్తారు. దీంతో చింత కొయ్య తుపాకీ గుండులా శత్రువుల గుండెల్ని
చీల్చుకుంటూ వెళ్తుంది. బూమరాంగ్ అనే ఆయుధాన్ని ఉపయోగించేవారు. అలాగే మంత్రశక్తిని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించే వారనే ప్రచారం ఉంది.

*స్వతంత్రం ప్రకటించుకున్న పాలెగాళ్లు*

1565 జనవరి 23వ తేది తళ్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పతనమైంది. దీంతో తాము ఎవరికీ సామంతులం కాదంటూ పాలెగాళ్లు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇక అప్పటినుంచి విజృంభించారు. ప్రజలను రకరకాలుగా
పీడిస్తూ విపరీతమైన అరాచకాలకు పాల్పడ్డారు. గోల్కొండ నవాబుల అధికారం బలహీనపడిపోతుండటాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి శిస్తు చెల్లింపులు తగ్గించి వేశారు. 1756లో మహారాష్ట్రులు కడప నవాబును ఓడించి సగం రాజ్యాన్ని వశపరచుకున్నారు. హైదరాలి, టిప్పు సుల్తాన్ నుంచి సనద్ ల ద్వారా అధికారికంగా పొందని భూములను పాలెగాళ్ల నుంచి మహారాష్ట్రులు స్వాధీనం చేసుకున్నారు . శిస్తు చెల్లింపుల విషయంలో తప్పుడు లెక్కలకు అడ్డుకట్టవేసి పాలెగాళ్లను కొంత 
మేర అదుపులోఉంచగలిగారు . ఆ తర్వాతి కాలంలో కప్పం చెల్లించే పద్ధతిపై పాలెగాళ్లకు కొన్ని గ్రామాలు అదనంగా దక్కాయి . 
               ఇలా విజయనగర ప్రభువులు , మొగలాయీలు , నైజాం ,మహారాష్ట్రులు ,హైదర్ , టిప్పు పాలనల్లో కప్పం చెల్లిస్తూ కొనసాగిన పాలెగాళ్ల పాలనకు బ్రిటిష్ పాలనతో తెరపడింది .
(భూ పరిపాలన,కడప గ్రంథం నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి