శశిశ్రీ

శశిశ్రీ
 ‌      __ ఖలందర్
  

             దాదాపు అరవై వసంతాలు నింపుకొని, అస్తమించిన శశిశ్రీ, సాహిత్యా కాశంలోని శశియే! ఈయన అసలు పేరు షేక్ బేపారి రహమతుల్లా.కడప జిల్లా సిద్ధవటం జన్మస్థలం. కార్యక్షేత్రం కడప నగరం.
             ఆధునిక కవిగా, జీవితాన్ని దృశ్యీకరించే కథారచయితగా, సీనియర్ జర్నలిస్టుగా మంచి పేరు పొందిన శశిశ్రీ వక్త గా కూడా ప్రసిద్ధుడు.ఈయన గురువు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు.ఆయనే ఈయనకు ' శశిశ్రీ ' అని నామకరణం చేశారు.శశిశ్రీ చివరి రోజుల్లో తనగురువు గారి జీవిత చరిత్రను వ్రాసి, విద్యార్థులకు అది ఎంతో ఉపయోగకరంగా ఉండాలని కాలేజీలెన్నో తిరిగి, ప్రసంగించి, తన అనర్ఘళమైనఉపన్యాసంతో విద్యార్థులను వుర్రూతలూగించారు.

       పుట్టపర్తి నారాయణా చార్యుల వద్ద ప్రాచీన సాహిత్యం, వైసివిరెడ్డి, డా.గజ్జెల మల్లారెడ్డి ఆచార్య కేతువిశ్వనాధరెడ్డి ద్వారా అభ్యుదయ సాహిత్యాన్ని బహుముఖంగా అధ్యయనం చేశారీయన. దాదాహయాత్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పాలగిరి విశ్వప్రసాద్, ఖలందర్, మహమూద్, రామచంద్ర, తవ్వా ఓబుళరెడ్డి,సొదుం రమణ ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు.  షేక్ హుస్సేన్ సత్యాగ్ని ఆయనకు బాల్యమిత్రుడు.
         1975-1980లో ఆయన ' మనోరంజని'అనే లిఖిత మాసపత్రికను, 1995 నుంచీ ' సాహిత్యనేత్రం 'పత్రికను స్థాపించి దానికి సంపాదకుడిగా వ్యవహరించారు.ఇది  భారతి
పత్రిక లాంటి విశిష్టత కలిగినదని  విమర్శకులచేత ప్రశంసలు అందుకుంది. రాయలసీమ ప్రాంత కవులకూ, రచయితలకు సాహిత్య నేత్రం ఆత్మీయ నేస్తంగా వుండింది. 
ఆ పత్రికలో యువకవి  నూకారాంప్రసాద్ రెడ్డి   సర్ఎడిటర్ గా పనిచేశాడు. ఖలందర్(వ్యాస రచయిత) కూడా కొంతకాలం సర్ఎడిటర్‌గా అందులో పనిచేశాడు.
        జీవితంలో సాహిత్యం,
పాత్రికేయం - ఈ రెండింటి ని తన శ్వాసగా చేసుకుని జీవించారాయన. అనేక సందర్భాలలో ఈ విషయాన్నే ప్రస్తావించేవాడు.బతుకు తెరువు కోసం పాత్రికేయం, మానవీయ విలువల కోసం రచయితగా  ఆయన తన జీవిత ప్రస్థానం సాగించారు. 
           వంద కథలు, రెండు వందల సాహిత్య వ్యాసాలు, అరవై వరకూ పాటలు, యాభైకి పైగా సాహిత్యపరమైన ఇంటర్వ్యూలు, చాలా కవిత్వం రాశారు.చివరి రోజుల్లో పుట్టపర్తి నారాయణాచార్యుల జీవిత చరిత్రను రాశారు.   
              పల్లవి,శబ్దానికి స్వాగతం, జేబులో సూర్యుడు వీరి వచన కావ్యాలు. ' సీమ గీతం 'పద్యకావ్యం, జేబులో సూర్యుడు (2006) ఉర్దూలో ' జేబ్ మే సూరజ్” పేరిట
వెలువడి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రాతిలోతేమ కథా సంపుటి ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇది 
' ట్యూన్ ఆఫ్ లైఫ్'గా  ఆంగ్లంలోకి అనువదించబడింది కూడా. ఈయన కథలన్నీ ఆంగ్లం,హిందీ, ఉర్దూ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువ దింప బడ్డాయి.
          
            ప్రముఖ సాహితీ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య,సింగమనేని నారాయణలు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలోముస్లిం కుటుంబాలకు చెందిన జీవితాలు వెలుగులోకి రాలేదని,ఆ ఖాళీని పూరించమని శశిశ్రీని కోరారు.
దాంతో శశిశ్రీ గుండెతడిలో  రేగిన అలజడి, ముస్లిం జీవితాల గురించి కొన్ని  కథలు ఆయనతో  రాయించింది. అయితే  ముస్లిం సోదరుల జీవితంపైనే గాకుండా మొత్తం  సామాజిక జీవితం మీదనే ఆయన దృష్టంతా వుండేది. 
ఆయన రాసిన కథలను "రాతిలో తేమ" పేరుతో కథా సంపుటిగా వెలువరించారు. రాతిలో తేమ,ఆత్మబంధువు, అలికిడి వంటి కథలు సమాజంలోని తెలుగు వారి జీవిత కథలు. ఇనామ్,దహేజ్, వలీమా వంటి కథలు
ముస్లిం జీవితానికి సంబంధించిన కథలు.వీటిల్లో  ముస్లిం పేదల బతుకులను చిత్రీకరించారు. సత్తార్ వలీమాకు అందరినీ పిలిచి చదివింపులకోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే వలీమాకైన అప్పులు తీర్చేందుకు.శశిశ్రీ ఒడుపుగా కథ చెబుతూ చివరలో కరీంతో చెప్పించే సంభాషణ ఆయన  కథానిర్మాణ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.కసాయి కరీం "నేను వృత్తి కోసం కసాయి పనిచేస్తున్నానే గాని మనుషుల్ని పశువులుగా భావించే కర్కోటకుడిని కాను.ఈ ఉంగరం నీ వేలిలో ఉండటమే శుభకరం. బాకీ సంగతి సరే.డబ్బులు, చదివింపులు వచ్చి ఉంటే తప్పక తీసుకుందును. అన్నట్టు నేను వేరే వలీమాలో భోంచేసి రాలేదు .నీ తోటే భోంచేద్దామని వచ్చాను."అని సత్తార్ తో అంటాడు.
   ‌‌       పెళ్లి కోసం,మాంసం కోసం అప్పులు చేయడం పేద ముస్లిం ల్లో కనిపిస్తుంది.  దీన్ని  శశిశ్రీ కథ ద్వారా రికార్డు చేయగలిగారు.  వరకట్నానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజంలో సంస్కరణ దృష్టి తో రాయబడిన కథ 'దహేజ్.'
కట్నం డబ్బులు ముందుగా ఇచ్చినా కానుకల  విషయానికి వచ్చేటప్పటికీ కలర్ టీవీ కావాలని వియ్యపురాలు నిలదీస్తుంది. ఆత్మాభిమానం గల పెళ్లి కూతురు తండ్రి వెంటనే ఆగమేఘాల మీద కలర్ టి.వి. తెచ్చి సరి పోయిందా? అని గట్టిగా అడుగుతాడు. దహేజ్ లాంటి దురాచారాలు రూపు మాసి పోయినప్పుడే ఆడపిల్ల పరాధీన బతుకు బతుకే దుస్థితి పోతుందని, ఆడపిల్లల తల్లిదండ్రులలో దిగులు పోతుందని చెప్పాడు రచయిత.
        "ఆనవాళ్ళు" కథ రంజాన్ నెలలో ఇచ్చే ఇఫ్తార్ విందు 
ప్రస్తావనతో కొనసాగుతుంది. ఇందులో జకాత్ (పేదలకిచ్చే దానం)గురించి రచయిత వివరిస్తాడు.ఇస్లాం ధర్మాన్ని ఇది పరిచయం చేస్తుంది. నకాష్ ఫకీర్ల డప్పులు  ఇందులో వినిపిస్తాయి. పేదరికం  గీత దాటిన ఒక ముస్లిం యువకుడి ఆత్మాభిమానం ఈ కథలో మనకు తెలుస్తుంది. సౌదీ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లడం వల్ల పేదలు ఏవిధంగా బాగుపడిందీ ఈ కథలో తెలుస్తుంది.
      శశిశ్రీ రాసిన  'జల్లెడ', 'శబ్దానికి స్వాగతం'  కావ్యాలలో మనిషి ఛిద్రమైపోతున్న పరిస్థితిని, రాయలసీమ ప్రాంతం నుంచి పదవులు పొందిన వారు రాయలసీమ అభివృద్ధి గురించి  నిర్లక్ష్యం వహించడాన్ని, వీధి బాలల గురించి, పర్యావరణంపై కరువు గురించి అనేక కవితలున్నాయి.వర్తమానం కవితలో "కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి గాని కన్నీరు కార్చడానికి సిద్ధంగా లేవు","నాలుక చేతులు ఉన్నాయి కానీ సగం విరిగిన కొమ్మలైనాయి" అంటూ మనిషితనం పతనమవుతున్న విధానాన్ని శశిశ్రీ తెలియ జేస్తాడు."నీవు నడక ఆఖరి చేసే వరకు వెన్నంటి నడిచే నీడ ఈ చీకటే"  అంటూ చీకటి గొప్పదనాన్ని చెప్తాడు వెన్నంటి నడిచే నీడ కవితలో.'నేను పెద్దోల్ల రిపోర్టర్ ని కాను పేదోళ్ల రిపోర్టర్ని 'అంటూ సగర్వంగా చెప్పుకున్నారు శశిశ్రీ తన జర్నలిజం గురించి.
"చెట్టు జీవితం తెలుసు", "చెట్లు చేతులు" కవితలు పర్యావరణ నేపథ్యంలో సాగుతాయి. 'కడప' కవితలోకడప వాసుల గురించి ఇలా చెపుతాడు "ఇక్కడ కరువే తలవంచి కాళ్ళు పట్టాలి, వాడు కడపవాడు బక్కపలచనోడు అనుకోకు అగ్నివంటి ఆత్మశుద్ధి వాని యావదాస్తి"అంటూ కడప వాడి గురించి  గొప్పగా కీర్తించాడు. ఇలా తన  కవిత్వంలో రాయలసీమ జీవన గతిని మానవీయ సంబంధాలను వ్యక్తం చేశాడు.
శశిశ్రీ పలు సాహిత్య పురస్కారాలు పొందారు.  ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారభాషా సంఘం హైదరాబాద్ వారిచే 2004, 2006 లో రెండు పర్యాయాలు భాషా పురస్కారాలు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి- “ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2010, శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పట్టాభి రామిరెడ్డి లిటరరీ అవార్డును 2008లో స్వీకరించారు. నందలూరు కథానిలయం నుండి ఉత్తమ సాహిత్య సంపాదకుడు అవార్డు పొందారు. పాత్రికేయరంగ ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డును 2007లో స్వీకరించారు. అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్ వారి ప్రతిష్టాత్మకమైన యూనిసెఫ్
అవార్డును2010 లో అందు కున్నారు. ఈయన విద్యారంగ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ చే యోగివేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా నియమితులై కొంతకాలం సేవ చేశారు. అరసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులుగా పనిచేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి