నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
నిస్వార్థ ప్రజానాయకుడు — వై. ఈశ్వర రెడ్డి
రాయలసీమ రాజకీయ చరిత్రలో ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకులలో వై. ఈశ్వర రెడ్డి గారు (1915–1986) ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించారు. రైతాంగం, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన, కమ్యూనిస్టు ఉద్యమానికి కడప జిల్లాలో బలమైన పునాది వేశారు. ఆయన జీవితం కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు; అది ఒక సామాజిక ఉద్యమ చరిత్ర.
జననం మరియు విద్యాభ్యాసం
వై. ఈశ్వర రెడ్డి 1915లో కడప జిల్లా పెద్దముడియం మండలంలోని పెద్దపసుపుల గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి, మల్లమ్మ దంపతులకు జన్మించారు.వారిది భూస్వామ్య కుటుంబం అయినప్పటికీ, ఫ్యూడల్ జీవనశైలిని వదిలి సాధారణ ప్రజల మధ్య జీవించడాన్ని ఎంచుకున్నారు.
వీరు1936లో నుఅనంతపురంలోని డి.సి. కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ సమయంలోనే జాతీయోద్యమం, రైతాంగ సమస్యలు, సామాజిక అసమానతలపై అవగాహన పెంచుకున్నారు.1936లో కాంగ్రెస్ పార్టీ లో చేరినారు.
రైతాంగ ఉద్యమాల్లో భాగస్వామ్యం
1930లలో ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాల ప్రభావం కడప జిల్లాపై కూడా పడింది. పెద్దపసుపుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో రైతుల సంఘటిత ఉద్యమాలకు ఈశ్వర రెడ్డి నాయకత్వం వహించారు.
1939లో పాలూరులో జరిగిన రైతుసంఘం జిల్లా మహాసభలు కడప జిల్లా రైతాంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం.
స్వాతంత్ర్యోద్యమం, జైలు జీవితం
చెన్నూరులో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి 28-5-1941న సత్యాగ్రహం చేసినాడు. ఆయనకు 3నెలల జైలు శిక్ష, 100 రూపాయల జరిమానా విధించింది బ్రిటీష్ ప్రభుత్వం.
1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. జైలు జీవితం ఆయన రాజకీయ దృక్పథాన్ని మరింత పదునెక్కించింది. ఆ సమయంలో ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకుడు ఎ.కె. గోపాలన్ రాసిన సాహిత్యం ద్వారా మార్క్సిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు.
1942 లో పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకుల ప్రేరణతో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.అప్పటి నుంచి ఈశ్వర రెడ్డి కడప జిల్లా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫీసును కడపలో ఏర్పాటుచేసినారు. పార్టీ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు పరిచేందుకు ఆయన కృషి చేశారు.
1947 అక్టోబర్ 17న పులివెందులలో జరిగిన కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభలో ఆయన జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇది కడప జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ విస్తరణకు ఒక కీలక ఘట్టం.
కడప, రాజంపేటలో కార్మికసంఘాలను నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో పొన్నతోట వెంకటరెడ్డి, సంగమేశ్వరరెడ్డి, పంజం నరసింహారెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కె.వి. నాగిరెడ్డి, వరదారెడ్డిలతో కలిసి పని చేస్తూ ఈశ్వరరెడ్డి పార్టీ రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించారు.
ఈయన తనజీవితంమంతా హరిజనుల, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణకోసం శ్రమించారు. అప్పట్లో జిల్లాలో భూస్వాములు హరిజనులపై ఎక్కడ దాడి చేసినా ఈశ్వరరెడ్డి ఆగ్రామానికి వెళ్ళి పోరాడేవాడు.
పార్లమెంటరీ జీవితం — నాలుగు సార్లు విజయం
వై. ఈశ్వర రెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి 1952లో సిపిఐ అభ్యర్థిగా, అప్పటి జాతీయ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడిగా ఉన్న పెంచికల బసిరెడ్డిపై గెలుపొందారు. అనంతరం 1962, 1967, 1971 ఎన్నికల్లో కూడా నెగ్గారు. 1957లో మాత్రం వి. రామి రెడ్డి (కాంగ్రెస్) చేతిలో ఓటమి పాలయ్యారు — తర్వాత 1962లో తిరిగి విజయం సాధించి నియోజకవర్గాన్ని పునరుద్ధరించారు. అంతేకాక 1958–62 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా కూడా పనిచేశారు
పార్లమెంట్‌లో ఆయన ప్రధానంగా రైతాంగ సమస్యలు, కరవు పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమ వెనుకబాటుతనం, కార్మిక హక్కులు వంటి అంశాలపై గళం విప్పారు.
కడప జిల్లా అభివృద్ధి కృషి
కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈశ్వరరెడ్డి కృషిని జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేరు. పార్లమెంటు డిబేట్స్‌ను గ్రంథస్తం చేయించి, జిల్లా గ్రంథాలయానికి సమర్పించి, భావితరాలకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కృషి చేశారు.
కరవు ప్రాంతాలకు కేంద్ర సహాయం, రాయలసీమ సాగునీటి అవసరాలపై ఆయన నిరంతరం పోరాడారు. గండికోట ప్రాజెక్టు అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా దానికి “ఎద్దుల ఈశ్వర రెడ్డి ప్రాజెక్టు” అని పేరు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
వ్యక్తిత్వం — నిరాడంబరత
''కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు''. అన్న మార్క్సిస్టు తాత్విక చింతనను అణువణువునా వంట పట్టించుకున్న వ్యక్తి ఎద్దుల ఈశ్వరరెడ్డి. ఈయన పార్టీ కే అంకితమై పెళ్లి కూడా చేసుకోలేదు.
ఆయన వ్యక్తిత్వంలోని అత్యంత గొప్ప లక్షణం — నిరాడంబరత. వందల ఎకరాల భూమి ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, పేదల పక్షాన నిలబడి సామాజిక సమానత్వం కోసం పోరాడారు. హరిజనులు, గిరిజనులు, రైతులు, కార్మికులు ఎదుర్కొన్న అన్యాయాలపై గ్రామాలకు వెళ్లి ప్రత్యక్షంగా పోరాటాలు నిర్వహించేవారు.
1986 ఆగస్టు 3న ఆయన కన్నుమూశారు.ఎద్దుల ఈశ్వర్ రెడ్డి విగ్రహాన్ని 2021 నవంబర్ 8వ తేదీ జమ్మలమడుగు పాత బస్టాండ్‌లో పునఃప్రతిష్టించారు. ప్రొద్దుటూరులో ఓ ప్రాంతానికి ఈశ్వరరెడ్డినగర్" అని పేరు పెట్టారు.
https://telangana.thefederal.com/category/states/south/andhra-pradesh/yeddula-eswar-reddy-is-role-model-for-every-politician-119902
https://telangana.thefederal.com/category/states/south/andhra-pradesh/yeddula-eswar-reddy-is-role-model-for-every-politician-119902
https://telangana.thefederal.com/category/states/south/andhra-pradesh/yeddula-eswar-reddy-is-role-model-for-every-politician-119902
__పిళ్లా కుమారస్వామి,9490122229
ప్రధాన మూలాధారాలు:
లోక్‌సభ బయోప్రొఫైల్ డేటాబేస్ (lok sabha.nic.in — Biodata 1402)
Wikipedia: Y. Eswara Reddy (English)
Wikipedia: వై. ఈశ్వర రెడ్డి (Telugu)
Lok Sabha Debates, Lok Sabha Secretariat, 1986 (obituary references)
Wikipedia: Vutukuru Rami Reddy (కడప నియోజకవర్గ చరిత్ర సందర్భంగా)
ఆ.ప్ర. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, రాయలసీమ స్వాతంత్ర సమర చరిత్ర, ఆంధ్ర జ్యోతి, idreampost,rayalaseemainfo.com)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి