రాయలసీమ కథాగానం

రాయలసీమ కథాగానం
                 __ సి.రమాదేవి
              (సేకరణ: పిళ్లా విజయ్)
                9490122229

రాయలసీమ జానపద విజ్ఞానానికి గని లాంటిది సీమ జానపద సాహిత్యం. కళలు ప్రజల సాంఘిక,చారిత్రక జీవన విధానంలోంచి పుట్టుకొస్తాయు. ఇవి వారి సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతాయి.
        జానపదుల మౌఖిక ప్రచారం ద్వారా కథాగానాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించబడు తున్నాయి. సామాన్యంగా ఈ కథాగానాలు ఒక రాత్రిలోనే పూర్తి అయ్యే నిడివి కలిగి ఉంటాయి. వీటిని 'ఒక సామ్యం' లేక 'ఒక జాము కథ'లు అని అంటారు.కొన్ని కథాగానాలు ఎక్కువ నిడివి గలిగి రెండు నుంచి ఏడు రాత్రుల వరకు చెప్పేవి కూడ వున్నాయి.
            ఇతివృత్తాన్ని బట్టి కథాగానాలను చారిత్రక, సాంఘిక, దైవసంబంధ కథాగానాలుగా విభజించవచ్చు. వీటి ఆధారంగా చారిత్రక, సాంఘిక,సాంస్కృతిక ఆధ్యాత్మికాంశాలను అధ్యయనం చేయవచ్చు.
            రాయలసీమలోని  కథాగానాలు సంగీత
సాహిత్యాల సమ్మేళనాలు. మౌఖిక ప్రచారంలో ఉండడం
వల్ల కథాక్రమంలో కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఒకరి నుంచి ఇంకొకరు విని నేర్చుకోవడం లో జరిగే లోపాల వల్ల అక్కడక్కడ
కొన్ని మార్పులు, చేర్పులు కనిపిస్తాయి. జిల్లాను బట్టి
కూడా కథాగానాల్లో కొన్ని మార్పులు వస్తాయి.
వీటిని ఎక్కువగా వృత్తి గాయకులే పాడుతుంటారు. వీరు వ్యవసాయ పనులు లేని తీరిక సమయాల్లో, జాతర్లు, ఉత్సవాలు, పండుగల సమయాల్లో, ప్రత్యేక సందర్భాల్లో తమ కళను ప్రదర్శిస్తారు.

రాయలసీమ కథాగానాలలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబ జీవనమే కనిపిస్తుంది. తల్లిదండ్రులు, వారి అవివాహి తులైన ఆడ, మగ బిడ్డలు, వివాహితులైన కుమారులు , వారి బిడ్డలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడిగా జీవిస్తూ, కుటుంబ సభ్యులందరూ ఒకే
వంటను వండుకొని కలిసి భుజిస్తూ ఐకమత్యంగా ఉంటారు. ఉమ్మడి కుటుంబాన్ని నడిపే వ్యక్తి ఇంటియజమాని. అతని ఆజ్ఞను అందరూ శిరసా వహి స్తారు. అతడు ఇంట్లోని అందరి బాగోగులను సమానంగా చూస్తాడు.
        ‌‌      రాయలసీమ ప్రాంతంలో  స్త్రీ పురుషులిద్దరూ సమానంగా కష్టపడుతుంటారు. మగవాళ్ళు పొలం దున్ని సాగు చేస్తుంటే, స్త్రీలు నాట్లు నాటడం,కలుపు తీయడం, పొలాల దగ్గర పని చేస్తున్న వారికి సద్ధి, సంగటి తీసుకుపోవటం మొదలు పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా వుంటారు.
           వర్షాకాలం ప్రారంభం కాగానే ఏరువాక సాగించి, కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఏయేపంటలు పండించాలన్న విషయాన్ని యజమాని చర్చిస్తాడు. వారు వేసే పంటలు కుటుంబ అవసరాలను తీర్చడమే గాక తమ మీద ఆధారపడిన బీద, బిక్కి,వృత్తిగాయకుల ఆకలిని తీర్చేదిగా ఉండేటట్లు చూస్తారు. ఈఅంశాన్ని'పర్వతాలమల్లయ్య కథ'లో చూస్తాం. ఎయ్యాది రెడ్డి
తన ఆరుమంది కొడుకులను ఒకచోట సమావేశపర్చి అనుకున్న సమయంలో ఆరికె,కొర్రపంటలు, సరిగా పండవని, అదే అనుముల పంట వేస్తే, త్వరగా పంట చేతికి వస్తుందని  అనుములు
పండించినట్లు తెలుస్తుంది.

" అరెక వేదమా కొడుకులు లింగా
అరెకలు అయితే ఆర్నెల్ల కొచ్చూ ||
కొర్రలు వేదామా కొడుకులు ||
కొర్రలుఅయితే నాన్నెల్లకొచ్చూ||
అనుములు వేదామా కొడుకులు ||
అనుములు అయితే అవసరానికొచ్చు లింగా"00
అంటూ కుటుంబపు రోజువారి ఖర్చులకు, దీర్ఘకాలిక
పంటల సాగుకు అయ్యే ఖర్చులకు, తమపై ఆధారపడి
బతికే కూలినాలి జనాల ఆకలి తీర్చడానికి అనువుగా
స్వల్పకాలంలోనే చేతికందివచ్చే పంటలైన అనుములు,
కొర్రలను కూడ పండించేవారని పై కథాగానం ద్వారా
వ్యక్తమౌతుంది.

 నేటికీ రాయలసీమ ప్రాంతంలో ఏరువాక సమయానికి ఊరి పెద్దలంతా ఒకచోట సమావేశమై ఏయే పంటలు వేస్తే బాగుంటుందనే విషయాన్ని చర్చించి నిర్ణయం చేసుకుంటారు.
           గ్రామస్థులంతా పూర్వకాలంలో ఒకే కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి జీవించేవారని, ఆ ఛాయలు ఇప్పటికీ ఆ ప్రాంతాలలో  గమనించగలం.అనాది నుండి జానపదులు సంప్రదాయ పంటలనే గాక వాణిజ్య పంటలను కూడా పండిస్తున్నట్లు' గంగమ్మ కథ'ద్వారా తెలుస్తుంది.   
వ్యవసాయ సాగు కోసం భూమిని సిద్ధం చేసేట
ప్పుడు జానపదుడు నేల అనువైనదా! కాదా! నీటి వనరులు
పుష్కలంగా ఉన్నాయా? లేదా? నని జాగ్రత్తగా
పరిశీలిస్తాడు.
' గంగమ్మ కథా'గానంలో గోనబుద్ధారెడ్డి
 " తెగిపోయిన కుంటలున్నాయి
చదరమైన భూములున్నాయి
పచ్చని తంగెడు చెట్లు మాకులైనాయి
ఇక్కడ వరిపైరు పండుతాది
ఇక్కడ పసుపు చెరుకు అల్లం పండుతాది
ఇక్కడ కొర్ర ఆరిక రాగి ఒరిగ పండుతాది" అని
భావిస్తాడు. ఇది జానపదుని పరిశీలనాదక్షతకు
దర్పణం. నేటి ఆధునిక వ్యవసాయ శాస్త్రవేత్తకు
జానపదుడే ఆదర్శం.
సన్న పొదలుగా ఉండే తంగేడుచెట్లు మాన్లుగా
ఎదగడమంటే ఆభూమి చాలా సారవంతమైనదని జాన
పదుడు గుర్తించినట్లు తెలుస్తుంది. ఏయే భూమి ఏయే పైర్లకు అనుకూలమైనదో నిర్ణయించిన తర్వాత ఆ పైర్లను
పండించడానికి సిద్ధమౌతారు.
బీడు భూములను సాగుభూములుగా మార్చ
డమూ, విత్తనాలను సిద్ధం చేసుకోవడమూ, ఏరువాక
సాగించడమూ, భూమిని మెత్తగా దున్నడమూ, ఎరువు
లను చల్లడమూ మొదలైన విషయాల మీద రాయలసీమ
కథా గానాల్లో ప్రస్తావించబడ్డాయి.
 
           బోనబుద్ధారెడ్డి, అతని తమ్ముళ్ళు కలిసి గడ్డపంటలు (వాణిజ్యపంటలు).ధాన్యపుపంటలు పండించి తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబ నిర్వహణ ఖర్చులు పోగా శుభకార్యాల కోసం కొంతమొత్తాన్ని దాచుకున్నట్లు ఈ గంగమ్మ కథ ద్వారా తెలుస్తుంది.
        గొర్రెలు, పొట్టేళ్ళ పెంపకం ద్వారా కొంతమంది కుటుంబా న్ని పోషిస్తూ పదికాసులు మిగిలించుకొని భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకొనే వారని" పర్వతాల మల్లయ్య ' కథ ద్వారా తెలుస్తుంది. ఇందులో గొర్రెల పెంపకం గురించి, గొర్రెల బొచ్చుతో కంబళ్ళు నేసి చింతామణి, కోలారు. మదనపల్లెలో అమ్ముతున్నట్లు ఉంది.
         "గొర్రె బొచ్చు కత్తరించి రాట్నానికే వడికి
         చింతామణి, కోలారు. మదనపల్లె సంతల్లో
         అమ్ముదాం రారా"
          (పర్వతాల మల్లయ్య కథ)
     
           తాను కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయడానికి జానపదులు ఇష్టపడరు. ఎంతటి వారినైన, చివరకు ఇంటి యజమానినైన మిగతా కుటుంబ సభ్యులు ఈ విషయంలో నిలదీసి అడుగుతారు. గంగమ్మ కథలో ఇంటి యజమాని ప్రతిరోజు భరత శత్రుఘ్నులకు ' సోంపాకం ' ఇస్తున్నట్లు గమనించి అతని తమ్ముళ్ళు అనవసరంగా ఖర్చు
పెట్టవద్దని వారించడాన్ని చూడొచ్చు.
రాయలసీమ కథాగానాలు

           నల్లతంగు కథలో లచ్చుమమ్మ అంతిమశ్వాస వదిలే సమయంలో కొడుకును పిలిచి కూతుర్ని ప్రేమతో సాకమని చెబుతూ ఆమెకు ఆస్తిలో సగం వాటా ఇవ్వమని చెప్పడాన్ని చూస్తాం.
 ఓ కొడుకా తంబీరాజా ఘనమైన రాజపుత్రుడా
చిన్నారి నల్లతంగము చీరకట్టను నేర్వలేదురా
వెన్నాముద్దలతోనుగా ఎత్తి బాలను సాకరా
.............................
మిట్టాభూమిలో మేలుభూమిలో చెల్లెలికి సగభాగమీయరా
ఆసనాల బుసనాల సొమ్ములీయరా హస్త కడియాలియ్యరా
ఆవులు తిరిగే గోడల్లోన చెల్లెలికి సగభాగమీయరా "

             భర్తను శత్రువులు చంపడంతో తన కుమారున్ని
శత్రువుల బారినుండి రక్షించుకోడానికి ' నేలమాళిగ'ను
ఏర్పాటు చేసి అక్కడ 12 సం || రాల కొడుకుకు
విద్యాబుద్ధులు నేర్చి పెంచి పెద్ద చేస్తుంది.తల్లికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న కొడుకు తన తండ్రిని చంపిన శత్రువు తల నరికి తల్లికి కానుకగా ఇవ్వడాన్ని *రాజావసుదేవరెడ్డి కథ*లోచూడవచ్చు. అంతేగాక ఈ కథాగానం రాయలసీమలోని ఫ్యాక్షన్ సంస్కృతికి అద్దం పడుతుంది.
" మీగడోళ్ళ మల్లారెడ్డి
తలశిరుసే తెచ్చినాను
ముండలైనా మోయవమ్మా
ముట్టులైనా బాయవమ్మా "

            ‌‌భార్యాభర్తలిద్దరూ సంసార రథానికి రెండు
చక్రాల్లాంటివారు. ఈ రెండు చక్రాలు సమానంగా నడిస్తే
సంసారమనే బండి సజావుగా సాగుతుంది. పరస్పర
అన్యోన్యం, నమ్మకం, గౌరవంతో క్రమశిక్షణతో మెల
గాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉంది. సతీ సహగమనం
చేయడం భారతదేశంలో ఎప్పటినుంచో ఉన్న ఆచారం.
కాని భార్య చనిపోతే భర్త సహగమనం చేయడాన్ని
"* కాముని కథా* " గానంలో చూడవచ్చు. కామాక్షి, కాముడు
అనోన్య దంపతులు. వారి అన్యోన్య ప్రేమకు గుర్తుగా
కామాక్షి గర్భవతి అయింది. అయితే ఎవరో ఆమెకు
విషమిచ్చి చంపుతారు. ఆ విషయాన్ని తెలుసు కున్న
కాముడు తన భార్య కామాక్షితో పాటు సహగమనం
చేశాడు.
" కనకనా కాలేటి గాదెల్లో పడుచా
నీ పక్క నాకైనా చోటియమనెను
....................
వాలానే కాముడు వర్రెన్నులాగా
ఏడు మల్లె పూవాల్డిలా
............."

             ‌‌పంట బాగా పండి కోతకు సిద్ధమైనపుడు
రైతులో ఆనందం అంతా ఇంతా గాదు. కోతకు అనువైన
సమయాన్ని నిర్ణయించి కోత (పంటనూర్పిడి) కు రైతు
సిద్ధమౌతాడు. తమ కుటుంబ సభ్యులతో పాటు
తగినంత మంది కూలీలను ఏర్పాటు చేసుకొని, పంటను
కోసి తోలుతారు, ఓదెలు. కట్టి ఎండిన తర్వాత బండ్లకు ఎత్తి, కల్లానికి తోలుతారు.
            పోలేరమ్మ కథగానాన్ని గమనిస్తే
 " రాగి కోయించినారు వోదెలు వేయించినారు
ఆరెక కోయించినారు వోదెలు వేయించినారు
ఒరిగే కోయించినారు వోదెలు వేయించినారు
జొన్న కోయించినారు వోదెలు వేయించినారు
కట్టలు గట్టించినారు బండ్లకెత్తి కల్లానికి తోలించినారు
కల్లానికి కంకులు వేసి గుండు తిప్పించినారు
తూర్పార పోయగా రామలక్షణ రాసులు"

         పంట మార్పిడి(కోత) విధానంలో రైతు ఒక క్రమపద్ధతిలో శాస్త్రీయ దృష్టితో తీసుకొనే చర్యలు ఉన్నాయి.పంటనూర్పిడి తర్వాత ధాన్యాన్ని బండ్లతో ఇంటికి చేర్చుతారు. తమ అవసరాల కోసం గాదెల్లో, కనజాల్లో, కాగుల్లో భద్రపరుచు కునేవారు. అవసరాలకు మించి పండిన ధాన్యాన్ని వర్తకులకు అమ్మి ఆ వచ్చిన ఆదాయంతో బంగారు, వెండి ఆభరణాలను కొంటారు. ఇదే విషయాన్ని పోలేరమ్మ కథలో చూడవచ్చు.

           రైతులకు వ్యవసాయమెంత ముఖ్యమో పశుపోషణ కూడ అంతే ముఖ్యం. వ్యవసాయోత్పత్తికి పశువులు ఉపయోగపడతాయి. పొలాన్ని దున్నడానికి, ధాన్యాన్ని మోసుకొని పోవడానికి, సుదూర ప్రయాణాలు చేయడానికి పాడి కోసం పశువులను పెంచుతారు. గొర్రెలను మేకలను కూడ పెంచి వాటి మాంసాన్ని తింటారు. వ్యవసాయంలో పనిచేసే ఎద్దులను
ఎంతో ఇష్టంగా పెంచుతారు. వాటిని కన్నబిడ్డల్లా పెంచుకున్నట్లు "చిన్నపురెడ్డి" కథ ద్వారా తెలుస్తుంది. గేదెలను పెంచి వాటి పాల ద్వారా వచ్చిన వెన్నను అమ్మి కుటుంబ అవసరాలు తీర్చుకునే వారని 'యల్లమ్మ' కథలో ఉంది.

           కొర్ర, జొన్న, ఆరిక, ఓరిగ, రాగి, సద్ద,సోమలు
మొదలైన ధాన్యాలు పేదల ఆహారంగా, సన్నవడ్లు, మేలువడ్లును సంపన్నుల ఆహారంగా ఉపయోగిస్తున్నట్లు
కథాగానాల్లో వ్యక్తమౌతుంది. బ్రాహ్మణులు వైశ్యులు శాకాహారులు.మిగిలిన కులాలవాళ్ళు మాంసాహారులు, ధనవంతులు పప్పన్నం తింటున్నట్లు, బీదవారు అంబలిని, గంజిని సేవిస్తున్నట్లు ఈ గానాల్లో కనిపిస్తుంది. అంతేగాక కంది, పెసర, అలసంద, అనుములు, ఉలవలు మొదలైన అపరాలు,
మిరప, సొర, గుమ్మడి, చీర, వంకాయ, మొదలైన కూర
గాయలు. అవిశాకు, మునగాకు, చెంచెలాకు, చింతాకు,
బచ్చలాకు, పల్లెరాకు, పాయలాకు మొదలైన ఆకుకూరలను, జానపదులు ఆహారంగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎక్కువరోజులవరకు నిలువ ఉంచుకునే పచ్చళ్లు కూడా తినేవారు. ఊరగాయలు, ఊరుమిండి,పచ్చిపులుసు మొదలైన వాటిని జానపదులు ఇష్టంగా తినేవారు.
          "సరిదేవికథ"లో సరిదేవి కొడుకులు అడవికి వెళ్ళినప్పుడు వంట వండుకునే విధానం ఉంది
       "బియ్యమేమో దెచ్చినారు. ఒక చెరవేమో దెచ్చివారు 
        చెరవలోన వాళ్ళేమో బియ్యమేమో బోసినారు
        నీళ్ళు బోసి కడిగినారు ఎసురేమో బోసినారు  
        మూడుపక్కల గుండు బెట్టి చెరవనేమోబెట్టినారు
        పొయ్యి కిందా మంట వేసిరి మంటలేమో వేసినారు
        మంటలేమో వేసినారు అన్నాలు అయినాయి"

               ‌కుంటి మల్లారెడ్డి కథలో బ్రాహ్మణ, క్షత్రియ,
వైశ్యశూద్రులు వేరు వేరు వృత్తులను ఎన్నుకున్నట్లు వివరంగా
ఉంది. వర్ణ సంకరం ఉండేది.
              అన్ని కులాలవారు వైద్యం చేసేవారు. ఇప్పటికి రాయలసీమలో కంసాల,మంగలి మొ||న కులాలవారు నాటు వైద్యంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈ వైద్యానికి వనమూలికలను ఉపయోగిస్తారు. మంత్ర తంత్రాలు కూడ చదువుతారు.
       "వేమన్న కథ"లో జబ్బుతో ఉన్న వేమన్నను వైద్యుడు
       "చేతినాడే చూచియున్నారో
        చేతినాడే చిక్కలేదమ్మా
        ముక్కల కాడా జాచియున్నారో
        ముక్కల వూపరి ఇడసాలేదమ్మా" అంటూ
నాడిని చూసి ప్రాణాపాయంలో ఉన్న వేమన్నకు నాటు
వైద్యం భూత వైద్యం చేసినట్లు పైకథాగానంలో ఉంది.
           
           యల్లమ్మ కథలో విశ్వబ్రాహ్మణులు (కంసాలులు)
చెక్కలతో బండ్లను తయారు చేసినట్లుంది. అలాగే వారు
వెండి ఆభరణాలు తయారు చేసేవారని పర్వతాలు అబాట్లు, గాజులు, ఉంగరాలు మొదలైన బంగారు మల్లయ్య కథలో కనిపిస్తుంది. వ్యవసాయానికి పనికివచ్చే పనిముట్లను
కమ్మరి కులస్థులు తయారు చేస్తారు. కాని పోలేరమ్మ      కథాగానంలో
       కోడూరు నుంచి ఈరబయల్ని పిలిపించినారు.
       వెలపట కొలుములు పెట్టించినారు
       ఇనుము కంచుబోసి కలగాచినారు
       మణుగు మణుగు గంటలు చేయించినారు" అని
 ఉంది. ఈ గేయంద్వారా దళితులు, దూదేకుల
కులానికి చెందిన వారు కూడ కొలిమిలో ఇనుమును కాల్చి, మడక కద్రులు, కాడిమాన్లు, బండికమ్మలు, బండి ఇరుసులు, గంటలు తయారు చేసినట్లు ఉంది. దీనిని బట్టి పరిశీలిస్తే జానపదులు కులాలతో నిమిత్తం లేకుండా వారికిష్టమైన వృత్తులను చేపట్టేవారని తెలుస్తుంది. సాలెల కులవృత్తి నేతనేసే పని. వీరు దూదిని ఏకులుగా చేసి నూలు వడికి, పడుగు వేసి వస్త్రాలను నేస్తారు. వీరి కళా నైపుణ్యాన్ని "ముద్దుబయమ్మ" కథా గేయంలో చూడవచ్చు.
        "ఏకులను తీసినాడు రాట్నానికి వేసినాడు
         నూలుతోను తీసినాడు మాలు సిల్వలు చేసినాడు
         చేసినాడు పడుగకేమో వేసినాడు
         చీమకండ్లు చీరనేశా పాము కండ్ల పైట వేశా
         కొంగూకు వచ్చురన్నా కోటి వరహాలన్నా
         అంచూకు వచ్చురన్నా అరవయ్యి వరాలన్నా"
అనే ఈ గేయంలో చేనేత పని గురించి ఎంతో వివరంగా ఉంది. ఏకులను తియ్యడం రాట్నం తిప్పడం, కదురులు చేయడం, పడగవేయడం, చీరెలు నేయడం, తద్వారా వచ్చే ఆదాయం గురించి కూడ ప్రస్తావించారు.
            గీతపని, మట్టిపని మరికొన్ని వృత్తుల ప్రస్తావన ఆయా కథాగానాల్లో కనిపిస్తుంది.
       "గడ్డ పాఠలతోన తొవ్వతా వుంటారు.
        తొవ్వినా మట్టంతా తట్టలో మోస్తారు
        మట్టంత మోస్తారు ఆరుమూడు రాత్రులను
        నేలసొరంగము తొగినారు"
అని "గౌరమ్మకథ"లో ఉంది. రహస్యంగా గౌరమ్మ మేడలోనికి వెళ్ళడానికి పెదవీరమల్లయ్య వడ్డెవాళ్లను పలిచి నేలసొరంగం తవ్విస్తాడు. మట్టి పనివృత్తిగా జీవించేవాళ్ళు వడ్డెవాడు. వీరు రాళ్లు కొట్టడం, బావులు తవ్వడం, కోటలు కట్టడం మొదలైన
పనులు చేస్తారు.
         లక్ష్మమమ్మ కథాగానంలో -
      "చవుడు సున్నం కొంత మూట గట్టింది.
       చాకలమ్మి మయలైన చీరలు రవికెలు చేతబట్టింది ||
       చాకిరేవూ కాడికి కదిలివచ్చింది.
       చవుడు సున్నము పిచికి కమ్ముచేసింది. ||
బట్టలు ఉతికే విధానం వర్ణించబడింది.చర్మకార వృత్తి గురించి, గద్దె చెప్పే ఎరుకల నాంచారుల గురించి కథాగానాల్లో
చాలా చక్కగా వివరించబడింది. పర్వతాల మల్లయ్య కథా గానంలో చేపలవేట సాగించే బెస్త పనివారల గురించి ఉంది. వివిధరకాల చేపల గురించి, చేపకూర వండే విధానం గురించి ఇందులో ఉంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి