విజయనగర ప్రభువుల ప్రత్యేక శ్రద్ధ
కరువులను పారద్రోలేందుకు విజయనగర ప్రభువులు ప్రత్యేక శ్రద్ధ చూపారు.నీటిపారుదల సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న చెరువులు, కాలువల్లో అధిక శాతం వారి కాలంలో నిర్మించినవే. మొదటి
బుక్కరాయల కుమారుడు, ఉదయగిరి రాజ్య ప్రతినిధి అయిన భాస్కరుడు 1369లో పోరుమామిళ్లలో ఒక పెద్ద చెరువు నిర్మించారు. చెరువుల నిర్మాణంలో పాటించాల్సిన
జాగ్రత్తలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఒక శాసనం కూడా వేయించారు. అందులో పొందుపరచిన సూచనలు .....
1. ప్రజా శ్రేయస్సును కాంక్షించే సమర్థుడైన రాజు,
2. జల విద్యలో నైపుణ్యం కల్గిన బ్రాహ్మణుడు.
3.గట్టి భూమి వున్న ప్రాంతం.
4.ఆ ప్రాంతానికి మూడు యోజనాల(1యోజనం=15కి.మీ)దూరంలో మధురమైన జలముగల నది.
5.చెరువును నిర్మించడానికి అనువైన పర్వత భాగములు ,
6.ఆ కొండల మధ్య నిర్మించే ఆనకట్ట దృఢంగా ఉండాలి . అలాగే మరీ ఎక్కువ పొడవు ఉండరాదు .
7.ఆ రెండు పర్వత శృంగములు వ్యవసాయ భూములకు దూరంగా ఉండాలి .
8.చెరువు స్థలం లోతుగా , వైశాల్యంతోనూ ఉండాలి .
9.ఆనకట్ట నిర్మాణానికి అవసరమైన చక్కని రాళ్లు లభించే గని సమీపంలో ఉండాలి .
10 . చెరువు పరిసర భూములు సారవంతంగాను , చదునుగాను , ఫలవృక్షాలను కలిగి ఉండాలి .
11 . చెరువు తూములు దృఢంగా ఉండాలి .
12 . నిర్మాణంలో నిపుణులైన పనివాళ్లు ఉండాలి.
*దశబంధ ఇనాములు*
చెరువులు , బావులు , కాలువల నిర్మాణం , నిర్వహణ బాధ్యతలను కొంత మందికి అప్పగించేవారు . అలా బాధ్యత తీసుకున్న వ్యక్తులు సొంత ఖర్చు లేదా అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించవచ్చు . ఈ నిర్మాణాలు పూర్తిచేసినవారికి
కొంత భూమిని ఇచ్చేవారు . పనినిబట్టి ఒకటి లేదా రెండు గ్రామాలు ఇనాముగా ఇస్తారు . ఆ భూములపై రాజుకు ఎలాంటి పన్ను కట్టాల్సిన పనిలేదు . వీటిపై వంశపారంపర్య హక్కులు కల్పించారు . వీటినే దశబంధం జనాలు అనేవారు .
రాయచోటి తాలూకా పెద్దినేనికాల్వ గ్రామంలోని అయ్యవారి చెరువు , శెట్టిపల్లెలోని సద్రప్ప చెరువు , చిన్న చెరువు , కలకడ గొల్లపల్లెలోని నాయుని చెరువు , ప్యారంపల్లి లోని మొల్లకాను చెరువు , గాలివీడు పెద్ద చెరువు దశబంధం చెరువులే . ఈ
తాలూకాలో ప్రభుత్వ , రైతుల , దశబంధం చెరువులు మొత్తం కలిపి 808 ఉండగా అందులో 515 ట్యాంక్స్ దశబంధం కింద ఉన్నాయి . బావులు 6 , 667 ఉంటే అందులో 2778 , కాలువలు 267కు గాను 167 , ఆనకట్టలు 23కు గాను 7
దశబంధంవే కావడం విశేషం .
*మన్రో ప్రశంస*
రాయలసీమలోని నీటి పారుదల సౌకర్యాల గురించి ఇక్కడ మన్రో వ్యాఖ్యలు ప్రస్తావనార్హం .
“ కొత్తగా ఇక్కడ చెరువుల నిర్మాణం చేపట్టాలని ప్రయత్నించడం వృధా . ఎందుకంటే , అనుకూలమైన ప్రతి ప్రదేశంలో ఇంతకు మునుపే చెరువులు నిర్మించారు. చెరువులు , కాలువలు ఏర్పాటు చేయటంలో ఇక్కడి వారి కృషి అమోఘం ” .
విజయనగర ప్రభువులు నీటిపారుదల సౌకర్యాలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో మన్రో వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి . జిల్లాలో నేడు 200 పైబడి చెరువులు , కుంటలు దెబ్బతిని పోవడం , ఆక్రమణలకు గురికావడం జరిగిందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి . విజయనగర రాజుల అనంతరం వచ్చిన వారు పన్నులతో ప్రజలను పీడించడం పై చూపిన శ్రద్ధ నీటి పారుదల పై చూపలేదు . ఫలితంగా కరువు కోరలకు ప్రజలు బలికావాల్సి వచ్చింది .
(సేకరణ: పిళ్లా విజయ్)
(భూ పరిపాలన,కడప_ ఫణి, నుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి