రాయలసీమ పాలెగాళ్ల పై బ్రిటిష్ ఉక్కుపాదం


 బ్రిటీష్ వారి కంపెనీకి నిజాం ఇచ్చిన దత్త మండలంలో  80మంది పాలెగాళ్లు ఉండేవారు . ఉత్తర సర్కార్ లోని రాజులు , జమీందారుల వలె ఈ పాలెగాళ్లు శక్తివంతులు. స్థానిక సైన్యానికి అధిపతులు.బలవత్తరమైన కోటలు కట్టుకొని
అందులో నివసించేవారు . శిస్తు వసూలు చేసే అధికారం వారికి ఉండేది . నిజాంకు అవసరమైనపుడు , సైన్యాన్ని సరఫరా చేయడం , మిగిలిన సమయాలలో నిర్ణీత కాలంలో వసూలు చేసిన శిస్తును జమచేయడం వారి బాధ్యతలు . 18వ శతాబ్దంలో తరచూ వారి అధిపతులు మారుతూ రావడంలో పై అధికారులను లెక్క చేసేవారుకాదు . నిజాం , మరాఠా , మైసూరు రాజుల అధికారంవలె బ్రిటీష్ అధికారం కూడా తాత్కాలికమే అని వారు భావించారు .1.11.1800లో
దత్తమండల జిల్లాలకు ప్రధాన కలెక్టరుగా సర్ థామస్ మన్రో ను కంపెనీ నియమించింది. ఆయనకు సహాయంగా నలుగురు సబ్ కలెక్టర్ లను పంపించారు కడప బళ్లారి ఆదోని ఖమ్మం ప్రాంతాల్లో వారి కార్యాలయాలు ఏర్పాటు చేశారు మేజర్ డుగాల్డ్ క్యాంప్ బెల్ దత్త మండలాలకు కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండేవాడు.
         ఆయన బాధ్యతలు చేపట్టిన నాటికి దత్తమండ లాల్లో ఉన్న 80 మంది  పాలెగాళ్ల దగ్గర 30 వేలకు పైబడి సాయుధ కట్టుబడులు ఉండేవారు . ఒక్క కడప జిల్లాలోనే 49 మంది పాలెగాళ్లు ఉండేవారు . కడప జిల్లాలో గట్టు , పుంగనూరు , కొక్కంటి , మల్లేల పాలెగాళ్లు చాలా శక్తివంతులు . గుర్రంకొండ , గట్టు పాలెగాళ్లకు సొంత టంకశాలలు ఉండేవి . మదనపల్లె తాలూకా గట్టు పాలెగాని కింద వెయ్యిమంది కట్టుబడులు ఉండేవారు . మల్లేల , కొక్కంటి పాలెగాళ్లు ఐదారు వేల కట్టుబడులను సమకూర్చుకోగల శక్తిపరులు . 
           దత్త మండలాల్లో తమ పరిపాలన సుస్థిరంచేసుకోవడం ద్వారా కంపెనీకి ఆదాయం పెంచేందుకు ఆయన సమాయత్తమయ్యారు . పాలెగాళ్ల వ్యవస్థను ఉక్కు పాదం మోపాలనుకున్నాడు మన్రో. అయితే పాలెగాళ్లపై యుద్ధం ప్రకటించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ సుముఖంగా లేదు . స్థానిక తిరుగుబాట్లకు అవకాశం కల్పించకుండా తమ పాలనను సుస్థిరం చేసుకోవాలని ఆ కంపెనీ డైరెక్టర్లు భావించడం ఇందుకు కారణం . ఈ విషయాన్ని గ్రహించిన మన్రో తనదైన శైలిలో పాలెగాళ్ల అణచివేతకు వ్యూహరచన చేశారు . 

" కంపెనీకి తెలియకుండా ఎవరూ రైతుల నుంచి శిస్తులు వసూలు చేయరాదు . కంపెనీ తరపున శిస్తు వసూలుచేసే వారిని ఎవరూ అడ్డగించరాదు . కోటలు , బురుజులు వంటి నిర్మాణాలు చేపట్టరాదు . ప్రైవేటు సైన్యాలు ఎవరి వద్దా ఉండరాదు ”అంటూ మన్రో అదేశాలు జారీచేశారు . తన ఆదేశాలు పాటించని వారిని తిరుగుబాటుదారులుగా 
పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేశారు . అలాగే సన్నద్ ల( దానపత్రాలు ) ద్వారా హక్కులు పొందిన వారు భూమిశిస్తు చెల్లించాలని , వసూళ్ల వివరాలను కలెక్టర్ కచ్చేరికి పంపాలని ఉత్తర్వులు జారీచేశారు . 
              మన్రో ఆదేశాలను ధిక్కరిస్తూ పాలెగాళ్లు ఎదురు తిరిగారు . చిన్న చిన్న పాలెగాళ్లు దౌర్జన్యాలకు దిగారు . తమకు ఎలాంటి హక్కులు లేని పక్క గ్రామాల పైబడి శిస్తు వసూళ్లు చేశారు . అమిల్ దారు ( తహశీల్దారు ) బంట్రోతులను తరిమికొట్టారు . కంపెనీ ప్రభుత్వాన్ని ఎదిరించలేమని భావించిన వాళ్లు చిక్కకుండా పారిపోయారు . ముఖ్యంగా ఇలాంటి సమస్యలు అప్పటి కడప జిల్లాలో భాగంగా ఉండిన గుర్రంకొండ ప్రాంతంలో తలెత్తాయి . దీంతో    పాలెగారులను అణచడానికి మన్రోకి 18 నెలలు కాలం పట్టింది . మేజర్ క్యాంప్ బెల్ సారధ్యంలో బ్రిటిష్ సేనలు పాలెగాళ్ల పైకి కదిలాయి . పాలెగాళ్ల కోటలను ధ్వంసం చేశారు . ప్రైవేటు సైన్యాన్ని తుదముట్టించారు . పలువురు పాలెగాళ్లను పట్టుకెళ్లి గుత్తికోటలో బంధించడమో , చంపడమో జరిగింది . 

 కర్నూలు పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లో కంపెనీపై తిరుగుబాటు చేసి , కోయిలకుంట్లలోని బ్రిటీషు ఖజానాను కొల్లగొట్టి , కంబంపై దాడికి వెళ్తాడు . బ్రిటీషు ఆధికారి నోల్టు అతన్ని ఎదిరించగా , పారిపోయిన నరసింహారెడ్డిని బ్రిటిషు సైన్యాలు బంధించి , కోయిలకుంట్ల వద్ద ఉరితీసి , తిరుగుబాటును అణచారు . 

              చిత్తూరు జిల్లాలోని పాలెగాళ్లు ఆర్కాటు నవాబు పాలనలో స్వతంత్ర పాలకులు .   బ్రిటీష్ ప్రభుత్వం వారిని పన్ను చెల్లించమని కోరింది.  ప్రజల నుంచి వసూలు చేసే కావలి పన్నును  వదులుకోమనింది. దాంతో వారు ఎదురు తిరిగారు . వీరిలో నరగతి పాలెగాడు శిస్తును ఆపి 
తిరుగుబాటు చేశాడు . ఇతన్ని కలెక్టర్ బంధించాడు.కానీ అతను బకాయిలను తీరుస్తానని మాట ఇచ్చి విడుదలైనాడు . కానీ శిస్తు చెల్లించక   పోయేసరికి బ్రిటీష్ ప్రభుత్వం సైనిక దళాన్ని పంపింది. నాగపట్ల వద్ద జరిగిన 
భీకర పోరాటంలో అనేకమంది పాలెగాళ్లు ఓటమి పాలయ్యారు.
       బ్రిటీషుకు వ్యతిరేకంగా ఆదోని ప్రాంతంలోని తరణికల్లు పటేలు 1801 లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడించి , 
పట్టపగలే కొందరిని చంపాడు . తిరిగి తన కోటకు చేరుకుని , తనను ఎదిరించిన బ్రిటీష్ సైన్యాన్ని ఓడించాడు . 
బ్రిటీష్ ప్రభుత్వం పెద్ద సైన్యాన్ని పంపి అతన్ని ఓడించి ఉరితీసింది .    
        1803లో సుల్తాన్ ఖాన్ గుర్రాల దళంతో అకస్మాత్తుగా కడపపై దాడి చేసి , దానిని ఆక్రమించాలని ప్రయత్నం చేసాడు . ఈ వార్త ముందుగానే తెలిసిన మన్రో , తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని  సుల్తాన్ ఖాన్ ని బంధించాడు. 
       చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలో గట్టు గ్రామం ఉంది. దీనికి పాలెగాడు నర్సం నాయర్. ఇప్పుడు ఆధ్వర్యంలో పది గ్రామాలు ఉండేవి. ఇతను కూడా మన్రో ఆదేశాలను ధిక్కరిస్తూ శిస్తు చెల్లించడానికి నిరాకరించాడు. ఇతన్ని బ్రిటిష్ కంపెనీ సైన్యం పట్టుకుని గుత్తి కోట లో చంపేశారు.
      అనంతపురం జిల్లా లోని కొక్కంటి గ్రామం వికీ ఒక పాలగాడు ఉండేవాడు అతని ఆధీనంలో పది గ్రామాలు ఉండేవి. టిప్పు కాలంలో శిస్తు సక్రమంగా చెల్లించే వాడు. కంపెనీ ప్రభుత్వానికి కూడా సమర్థవంతంగా శిస్తు కట్టడంతో మరో రెండు గ్రామాలు అప్పజెప్పింది. ఇతని తర్వాత పాలగాని పదవి చేపట్టిన మల్లప్పనాయుడు కూడా అదేవిధంగా శిస్తు కట్టేవాడు.

    ఇలా  కొద్దిమంది పాలెగాళ్ళు లొంగి పోయారు.మరికొందరు  పోరాడి ఓటమి పొందాక  బ్రిటీష్ ప్రభుత్వానికి లొంగిపోయారు.లొంగిపోయిన పాలెగాళ్ల ఆధీనంలోని భూములను కంపెనీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వారికి కొంత పెన్షన్ సౌకర్యం ఏర్పాటుచేసింది.
              చివరికి  పాలెగాళ్లు రెండు సంవత్సరాల తరువాత పోరాటం విరమించి బ్రిటీష్ ఆధిపత్యాన్ని అంగీకరించారు . వారి ఎస్టేట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రాయలసీమ ప్రాంతంలో రైత్వారీ భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రాలో రాజులు, జమీందారులు , దత్త మండలాల్లో పాలెగాళ్లు బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఎదిరించి నప్పటికీ , చివరకు వారి ఆధిపత్యాన్ని అంగీకరించక తప్పలేదు .
(సేకరణ:పిళ్లా విజయ్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి