చిత్తూరు జిల్లా - వందేళ్ళ కథా సారథులు
చిత్తూరు జిల్లాలో ఆధునిక కథానికకు ఆద్యుడు సి.రాజగోపాలు నాయుడు.ఆయన కథకులుగానే కాక ఆధునిక సాహిత్య ఒరవడికి తెరతీసిన వ్యక్తి. నాటకాలు , వ్యాసాలు , కథలు , నవలలు
ఎక్కువగా వ్రాయడమేకాక విమర్శనా గ్రంథాలు వెలువరించిన వ్యక్తిగా కూడా వారికి మంచి గుర్తింపు వుంది .
చిత్తూరు జిల్లా నడిబొడ్డున ఒక రాజకీయ పాఠశాలను నడిపారు. చిత్తూరు జిల్లా కళాపరిషత్ ను ఏర్పాటు చెయ్యడం ద్వారా జిల్లా యువకులలో చైతన్యవంత మైన కదలికను తీసుకువచ్చి ఎందరినో కథకులుగా తీర్చిదిద్దారు.
చిత్తూరు జిల్లాలో ఆ రోజుల్లో ఆధునిక పత్రిక అంటే 'నాగేలు'. రైతుల సమస్యల్ని దృశ్యమానం చెయ్యడం కోసం పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఆ పత్రికను నెలకొల్పారు . పి . రాజగోపాలు నాయుడు ఈ పత్రికకు సంచాలకత్వం వహించారు . రైతు సమస్యలమీద వారిరువురూ వెలువరించిన రైతు కథలు ఆ పత్రికలో వచ్చాయి .
రాయలసీమకు చెందిన తొలి కథకునిగా,ఆధునిక కథకునిగా గుర్తింపు పొందిన ఈ జిల్లా రచయిత కె.సభా రాసిన మొట్టమొదటి కథ ' కడగండ్లు ' 1944 ఏప్రిల్ నెలలో చిత్రగుప్త అనే పక్షపత్రికలో ప్రచురిత మైంది .
గురజాడ 'దిద్దుబాటు' కథ తరువాత 34 సంవత్సరాలకు ఆలస్యంగా చిత్తూరు జిల్లాలో ఆధునిక కథ ఉద్భవించింది. అందుకు కారణాలను చాలామంది విమర్శకులు చాలా రకాలుగా విశ్లేషించారు. వెనుకబడ్డ ప్రాంతమైన కళింగాంధ్ర ఆ విషయంలో రాయలసీమ కన్నా చాల ముందుందని భావించారు. అయితే ఇటీవలి కాలంలో కొందరి పరిశోధనల ద్వారా చర్చకు వస్తున్న విషయాలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు ఎం.వి. పాపన్నగుప్త 1925-1938 సంవత్సరముల మధ్యకాలంలో అనేక కథలను, 'భానుమతి ' నవలను , కొన్ని పద్యాలు , వ్యాసాలు , ప్రభోదాలను రచించారని తెలుస్తోంది . కడపజిల్లా ప్రొద్దుటూరు నుండి వెలువడిన ఆనాటి పత్రిక ' భారత కథానిధి'లో వీరి కథలు ప్రచురితమయ్యాయి.( ఇటీవల జరిగిన పరిశోధనల్లో 1882 లో నే 'రుతుచర్య' కథ కథకుని పేరు లేకుండా జనవరిలో జన వినోదిని లో వచ్చిందని, వివిన మూర్తి సంపాదకత్వంలో దిద్దుబాటలు లో ఆ కథను ప్రచురించారని అప్పిరెడ్డి హరినాథ రెడ్డి పేర్కొన్నారు. 1918లో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రాసిన 'రోజాంబ, శ్వేతాంబ' కథ సౌందర్యవల్లి పత్రికలో వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టి రాయలసీమ కథా సాహిత్యంలో వెనుకబడలేదని సాహిత్య లోకానికి తెలిసింది)
అతి తక్కువ వ్యవధిలో అనేక కథలు రాసి ఖ్యాతి పొందిన కె . సభా కథలలో " పాతాళగంగ " ప్రసిద్ధమైనది . చిత్తూరు జిల్లా గర్వించదగ్గ కథారచయితలలో ముఖ్యులు మధురాంతకం రాజారాం . కె . సభా రచనలతో ప్రేరణ పొందిన మధురాంతకం రాజారాం మానవ స్వభావాలకు దర్పణం పట్టే , హృదయస్పర్శతో కూడిన కథలు వందలాదిగా రాసి తెలుగు పాఠకలోకాన్ని మెప్పించారు.అనేక సాహిత్య సంస్థలు ,విశ్వవిద్యాలయాలు,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రతిభను గుర్తించి గౌరవించాయి . సంక్రాంతి శంఖం , రాతిలో తేమ లాంటి గొప్ప విలువైన కథలను అలవోకగా వందలాదిగా
వెలువరించి చిత్తూరు జిల్లా ఖ్యాతిని రాష్ట్ర వ్యాపితం చేశారాయన . 1950-60 దశకంలో పత్రికారంగం వారి కథలతో ధగధగలాడిందని చెప్పవచ్చు .
1960 తరువాత వెలుగు చూసిన చిత్తూరు జిల్లా కథా రచయితలలో ముఖ్యలు సి . వేణు , కలువకొలను సదానంద , ముంగర శంకరరాజు , పులికంటి కృష్ణారెడ్డి ,ఆర్.ఎస్ . సుదర్శనం , నూతలపాటి గంగాధరం , వల్లంపాటి వెంకటసుబ్బయ్య ,డా ॥ జోళిపాలెం మంగమ్మ , ఆర్ . వసుంధరాదేవి , ద్వారకా ( సి.హెచ్ వెంకటరత్నం)
ఇరువారం లోకనాధం , నైనారి చిన్నప్ప , ఎ.బి. ఎతిరాజులు మొదలైనవారు . వీరి కథలతో సాహిత్య లోకం క్రొత్త పుంతలు తొక్కడం మొదలు పెట్టింది.వీరిలో కొందరు జిల్లా సాహిత్యానికి దీపధారుల య్యారు.
వీరితో పాటు తమ కలాల్ని కదిలించిన వారిలో గల్లా అరుణకుమారి , కాణిపాకం లింగన్న , సనగరం పార్థసారథి , శ్రీరాములురెడ్డి , వి . వీణావాణి , డా || జె . భాగ్యలక్ష్మి , దొరస్వామి , లంకెపల్లి కన్నయ్య నాయుడు ,
టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి , ఓలేటి కృష్ణ , వేంపల్లి అబ్దుల్ ఖాదర్ , శైలకుమార్ , జావీద్ హుస్సేన్ , మునిసురేష్ పిళ్ళై , వడ్డెర చండీదాస్ , కేశవరెడ్డి , తుమ్మల రామకృష్ణ ,నాయుని కృష్ణమూర్తి మొదలైన వారున్నారు.
తరువాతి తరంలో పేరొందిన రచయితలుగా మధురాంతకంనరేంద్ర, మహేంద్ర , సౌదా , డా ॥ రాసాని , గోపిని కరుణాకర్ , నామిని సుబ్రహ్మణ్యం నాయుడు , కాశీభట్ల వేణుగోపాల్ , మునిసురేష పిళ్ళై , పసుపులేటి గీత , మేర్లపాక మురళి,కె.ఎస్ . రమణ , వేంపల్లి సికిందర్ , వి.నాగమణి ,
అరుణా సహదేవ్ , రాణి పులోమజాదేవి , పసుపులేటి మాణిక్యవీణ , కె.ఎస్.వి. , జి.ఆర్ .మహర్షి , ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు , పలమనేరు బాలాజీ , శ్రీరావు , లెనిన్ ధనిశెట్టి , కె . చంద్రమౌళి , సుంకోజి దేవేంద్రాచారి , జయచంద్రారెడ్డి , జిళ్ళెళ్ళ బాలాజీ , కలువకుంట్ల గురునాథ పిళ్ళై , పేరూరు బాలసుబ్రహ్మణ్యం , పుష్పాంజలి ,
దుర్గమ్మ , శ్రీమతి లక్ష్మీ రాఘవ , పి . శైలజ , పి.వి. ప్రసాద్ , శైలజామిత్ర మొదలైన వారున్నారు .
ఇటీవలి కాలంలో ఎక్కువ కథలు వ్రాయడమేకాక
దాదాపు పది సంపుటాలను స్వల్ప వ్యవధిలో తీసుకొచ్చిన కథా రచయిత సి.ఎన్ . చంద్రశేఖర్ , ఆ తరువాత రాచపూటి రమేష్ ,అల్దీ రామకృష్ణ కవి మొదలైనవారు చిత్తూరు జిల్లా కథకుల జాబితాలో సుస్థిరస్థానం కల్పించుకోగలిగారు .
అప్పుడప్పుడు మాత్రమే కథలు రాసే కథకులూ కొందరున్నారు .వారిలో " పెండ్లి ప్రయాణంలో లాంటి గొప్ప కథలు రాసిన టి . తిప్పారెడ్డి , జింకపిల్ల లాంటి విలువైన కథలు రాసిన కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె,
ఆముదాల మురళి , కె . వేణుగోపాల్ ( సింధూ ), బడబాగ్ని శంకరరాజు , పురాణం త్యాగమూర్తి శర్మ , ఓ.వి.యన్ . గుప్త మొదలైన వారున్నారు .
ఇతర జిల్లాల నుండీ చిత్తూరు జిల్లాకు వచ్చి “ వంజె లాంటి అద్భుతమైన కథలను , ' ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ ' లాంటి కథా సంపుటాలను అందించిన జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి , డి . రామచంద్రరాజు లాంటి కథకులూ కొందరున్నారు జిల్లాలో.
పైన తెలిపిన కథకులలో కొందరు కథా రచనలోనే కాక మిగిలిన సాహితీ ప్రక్రియలన్నింటిలో ఎంతో ప్రతిభ కన్పరచి రాష్ట్ర , దేశ , ప్రపంచ వ్యాప్తంగా జిల్లా పేరును కీర్తి శిఖరాల పైన నిలిపారు .
పొరపాటునో , అవగాహనా లోపం వల్లనో కొందరు చిత్తూరు జిల్లా కథకుల పేర్లు ఇందులో చోటు చేసుకొనకపోయి వుంటే అన్యదా భావించక దయచేసి మన్నించవలసిందిగా కోరుతున్నాను.
(టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి రాసిన చిత్తూరు జిల్లా - వందేళ్ళ కథాసారథులు నుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి