ప్రథమ దళిత కథ
*రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత కథ*
*' చిరంజీవి 'కథఅని కిన్నెర శ్రీదేవి భావించారు.కానీ కొత్త గా చేసిన పరిశోధన లో తెలిసిన విషయం ఏమంటే ఈ కథ కంటే ముందే ఆదిమాంధ్ర భక్తుని జీవిత చరిత్ర అనే కథను 1928లోనే శ్రీరాములు రెడ్డి రాసినట్లు దానిని సీమకథా శిలాజాలు లో(రాయలసీమ తొలితరం కథలు 1927-1930) తప్పెట రామచంద్రారెడ్డి సంకలనం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథలను తవ్వా వెంకటయ్య వెలికి తీశారు*
గుత్తి రామకృష్ణ రాసిన 'చిరంజీవి'కథ సాధన పత్రికలో 1941 మార్చి 26 సంచికలో ప్రచురించబడింది.ఇది దళిత కథ. అగ్రవర్ణ వ్యవసాయ దారులు దళితులకు అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీలు లెక్కలు కట్టి వాళ్ళతో వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేయించుకొనే భూస్వామ్య దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది . దళితులకు స్వంత జీవితమే లేకుండా చేసిన సాంఘిక , ఆర్థిక పరిస్థితుల్ని ఈ కథ చిత్రించింది .
వెంకటరాముని ముత్తాత తన పెండ్లికి రెడ్డి దగ్గర అప్పుచేస్తాడు . ఆ అప్పు తీర్చడానికి ముత్తాత , తాత , తండ్రుల తరాలు గడిచి పోయాయి . వాళ్ళ తరువాత వెంకట్రాముని వంతు వచ్చింది . ఆ కుటుంబంలోని ఆడవాళ్ళు , పిల్లలు కూడా అతనితో పాటు పనిచేసినా ఆ అప్పు మాత్రం తీరదు . ఒక రోజు జబ్బుతో ఉన్న వెంకట్రాముని తల్లి పనిలోకి రాలేదని అతన్ని మాటలతోనూ , చేతలతోనూ హింసిస్తాడు రెడ్డి. తనలాంటి ఆధిపత్య కులాల దౌష్ట్యానికి ఉదాహరణగా ఈ క్రింది వాక్యాలను గమనించవచ్చు .
" ధూ . . . యెందరికి పుట్టినావురా . . రుణపాతకం నా కొడకా . . ఈనమ్మ ముండ పనికిరాక మూడు దినాలాయ".
భూస్వామి చేతిలో చావుదెబ్బతిన్న వెంకట్రాముడు తల్లికి సంగటి తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఆమె చనిపోయి వుంటుంది . రచయిత కరుణ రసాత్మకంగా చిత్రించిన ఈ కథ భూస్వామ్య వ్యవస్థలో భూస్వామికి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్లకు మధ్యగల ఫ్యూడల్ సంబంధాలలో ఒకలాంటి ప్రేమ ఉండేదని గ్రామీణ జీవితాన్ని వ్యవసాయ దారుల ఉదాత్తతను గ్లోరిఫై చేసే వాళ్ళ కళ్ళు తెరిపిస్తుంది.
____&____
*(ఈ కథ అప్పిరెడ్డి హరనాథ రెడ్డి సంకలనం చేసిన మొదటితరం రాయలసీమ కథలు లో పునర్ముద్రించబడింది)*
*చిరంజీవి*
__గుత్తి రామకృష్ణ
ఇంకా పెదింత పొద్దుంది . వెంకటరాముడు అప్పుడే పనులన్నిటిని గదుముకొని ఇంటికి వస్తూ వున్నాడు . కుర్రలు చౌకలించుతూ , రంకెలేస్తూ వస్తున్నాయి . వెంకట్రాముడు తన చిక్కాన్ని కట్టెకు తగిలించి భుజాన వ్రేలాడేసుకొని చలకోలతో మందను తోలుతూ ముందుపడి వస్తున్నాడు . ఊరి ముందుకు వచ్చిన తర్వాత సుబ్బన్న మామ యెదురై అడిగినాడు . 'యేరా ! యంగట్రాముడూ ! ఇంకా పొద్దుండగానే యింటికి తోలుతావుండావేమీ . రెడ్డి అరచడాయేమి ?'
వెంకట్రాముడు యేమీ బదులు చెప్పలేదు . ' ఉండు మామా ' అన్నాడు . అంతే . ఆత్రంగా ప్రక్క దోవలు పడుతూ వున్న పసరాలను వూర్లోకి మళ్లించి ముందుకు పడిపోతూ ఉన్నాడు .
ఊర్లోకి పసులొచ్చింది చూసి కొంతమంది పిల్లలు వెంకటరాముని వద్దకు పరుగెత్తి వచ్చినారు . ప్రతి దినము వెంకట్రాముడు చేనినుంచి వచ్చేటప్పుడు సద్దకంకులో ,
పెసరకాయలో , తెచ్చి యిచ్చే అలవాటు . ఈ దినం ఆ పొలకనేమి కనపడక పిల్లలు యెగాదిగా చూసి వెళ్లిపోయినారు .
కొంత దూరము పోయిన తర్వాత యెదురింటి అచ్చమ్మవ్వ యెదురై అడిగింది . ' యేరా యెంగట్రాముడూ ! నేను చెప్పిన ఆకు తెస్తివా ? "
' తెస్తాలెవ్వా ' అని పరధ్యానంగా బదులు చెప్పి ముందుకు నడిచినాడు .
ఇంతలో నారమ్మ అత్త దగ్గుతో అగ్గి తీసుకుపోతూ వచ్చింది . ' ఏమి యంగట్రా ముడూ ! మీ యమ్మకు యెట్లుంది ' అని అడిగింది . 'అట్లే ఉందత్తా' అని బదులు చెప్పి ప్రక్కకు తిరిగి చూచినాడు . పశువులన్నీ రెడ్డి యింటి ముఖం పట్టిపోతు న్నాయి . పోతాయిలే అనుకుంటూ , తాను తన గుడిసె యింటికి పోయినాడు .
వెంకట్రాముడు తడిక తీసి గుడిసెలో ప్రవేశించాడు . తల్లి కుక్కి మంచములో పడి మూలుగుతూ ఉంది . అమ్మా . . . ఓం మ్మా ! అని పలకరించాడు . తల్లి కొంచెం కదిలి . ' యేమి నాయనా వస్తివా , నీవు వచ్చేదంకన్న వుంటానో లేదో అనుకుంటి ' అని కొడుకును దగ్గరగా
తీసుకుంది .
' నాయనా . . . యంగట్రాముడూ . . . యింక నేను బ్రతకునురా , చచ్చేదాన్ని యట్లా సస్తాను . . . . . నిన్నో . . . యింటోన్నన్నా . . చేసి చచ్చివుంటే . . . . నా ప్రాణానికి బాగుండేది . రెడ్డికి గూడ ఈ సంగతి చెప్పితి . ' నాయనా , ముసిలి ముండనయినాను . నా బొందిలో ప్రాణ ముండగానే
నా కొడుక్కు పెండ్లి చెయ్యి . . . నా జీవితంలో ఆ సంబరమన్నాచూసి సస్తాను ' అని . . . కాని
ఆ మారాజు చెవులోనన్నా వేసుకోలా ' .
వెంకట్రామునికి చావంటే భయం , తన తండ్రి చచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని అనుభవించినాడు . ఇప్పుడు మళ్లీ తల్లి చావును జ్ఞాపకం చేస్తూ వుంది . ఆ భయాన్నంతా దిగమింగి తల్లిని ఓదార్చుదామనుకొని నేను బాగా పెద్ద అయిన తరువాత సంపాదించి చేసుకుంటా లేమ్మా . నువ్వేమీ దిగులు పడొద్దు ' అన్నాడు .
దిగులెందుకు నాయనా , నాకెందుకు దిగులు , అంతా రెడ్డోరే చూసుకుంటారు . మీ నాయన పెండ్లి చేసింది . వాండ్లే కదా ? మీ తాత పెండ్లి కూడా రెడ్డోరే చేసినారట . ఇంక
నీ పెండ్లికి మాత్రము లోటు చేస్తారా నాయనా , నువ్వు సంపాయించేదెప్పుడు ? మీకు సంపాయించే రాతే వుంటే , యిప్పటికి రెడ్డోరి బాకీ తీరేవుండును . ఎప్పుడో మీ ముత్తాత పెండ్లికి గాను మూడు యిరవైలు రెడ్డోరితో అప్పు తీసుకుండారంట . ఆ అప్పు అట్లే వస్తావుంది . వడ్డీ కట్టలేక
తల్లులు పిల్లలు యింటి చాకిరీ చేస్తావుండాము . చాకిరీ చేస్తే వాండ్లో యింత కూడు గుడ్డా యేస్తారు . వాండ్లనే నమ్ముకుంటే నీకు పెండ్లి కూడా చేస్తారు . నా కండ్ల ముందర కాకున్నా . . . . .
అమ్మయ్యా ! . . వెంకటేశుడా . . . నారాయణ మూర్తీ . . . యిన్ని నీళ్లు యీ నాయినా , నోరు ఆరుకొస్తావుంది ' .
' గంజి తెస్తాను తాగమ్మా , పొద్దున్నుంచి కడుపులోకి యేమీ పోలేదు "
' గంజి యెవరు చేసిస్తారు . నాయనా మనకు '
" పోనీ సంగటే తెస్తాను నీళ్లలో పిసికితే గంజి అవుతుంది '
' పో , పోయి బిరీనరా '
వెంకటరాముడు రెడ్డి యింటికి పోతూ వున్నాడు . దోవలో యెక్కడలేని ఆలోచనలు తట్టాయి. వచ్చేటప్పుడు పశువులను గాటిపాట్న కట్టేసి రాలేదు . కోడెలన్నీ పోట్లాడి యిల్లంతా గగ్గోలు పట్టించి వుంటాయి . పసిగిత్త మందలో ఉండినట్లే లేదు . కట్టి వేయనందువల్ల , ఆవులన్నీ పాలుచేపి దూడలను తాపుకొని వుంటాయి . ఈరాత్రికి పాలు లేనట్లే . ఇదంతా చూసి రెడ్డి ఉగ్రుడై ఉంటాడు . ఆలోచనలతోనే వెంకట్రాముడు రెడ్డింటి వాకిలి తొక్కినాడు . రెడ్డి గర్జనలు వినపడినాయి . ఎదుటపడినాడు . వెంటనే రెడ్డి అందుకున్నాడు
' థూ . యెందరికి పుట్టింటివిరా , రుణపాతకం నాకొడుకా . . . ఈనికి పెండ్లంట . పెండ్లి.ఈ నమ్మ ముండ పనికిరాక మూడు దినాలాయ , ఈ లంజ కొడుకు . . . . '.
నోటి దురద తీరేదంకా రెడ్డి తిట్టినాడు . చేతిలోని బర్ర విరిగేదంకా కొట్టినాడు . వెంకట్రాముడు కిమిక్కు మనలేదు . ఒక చోట కుప్పైకూచున్నాడు . ఆవేశము తగ్గిన తర్వాత రెడ్డి
వెళ్లిపోయాడు .
రెడ్డి భార్య లక్ష్మమ్మ దయగల తల్లి . వెంకటరామున్ని పిలిచింది . అతనితో సంగతంతావిని , పుటకగంప నిండా సంగటి ముద్దలు నింపింది . ఇంత ముంతకు చారుపోసి
వెంకటరామునికి యిచ్చింది .
వెంకటరాముడు తీసుకొని బిరబిర యింటికి పోయినాడు . ఇంటిలో అమ్మ మూలుగు వినపడ లేదు . పలుకరించాడు .
“ అమ్మా ! ఓం మ్మా ! " అమ్మ పలుకలేదు .
- 26 మార్చి 1941 , విజయవాణి పత్రిక
( ఉగాది ప్రత్యేక సంచిక )
( సేకరణ:పిళ్లా విజయ్)
9490122229
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి