వల్లూరు కోట - ఆరు ఊర్లు



వల్లూరు కోట - ఆరు ఊర్లు 

     నేటి వల్లూరు పట్టణం ఒకనాడు వల్లూరు కోట. ఈ వల్లూరును గతంలో వల్లూరు పట్టణం, కోట వల్లూరు, త్రైలోక్య వల్లభాపురం వంటి పేర్లతో పిలిచేవారు.వల్లూరు కోట కట్టించి దాదాపు 1000 సంవత్సరాలయ్యింది. వివిధ రాజవంశాలకు రాజధానిగా, దాదాపు 250 సంవత్సరాలు ములికినాటిసీమలో ప్రధాన పట్టణంగా ఉన్నది. ఇప్పుడు కోటలేదు, దాని ఆనవాళ్లు లేవు. అయినప్పటికీ వల్లూరు పట్టణం, వల్లూరును అనుకుని తుడుములదిన్నె, గోటూరు, తప్పెట్ల, కొప్పోలు, కొట్లూరు, కొమ్మలూరు గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి, నాటి వల్లూరు కోట చరిత్రకు సాక్షీభూతంగా.ఇవన్నీ   ఆనాటి  కోటలో పనిచేసే పనివారి పేరుమీద ఆ కోట చుట్టుపక్కల ఏర్పడిన  ఆరు గ్రామాలు. ఆ పేర్లే ఇప్పటికీ ఉన్నాయి.
‌      వైయస్సార్ జిల్లాలో వల్లూరు ఒక మండలం. ఇది కడప నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011  గణాంకాల ప్రకారం ఈ గ్రామంలో 1516 ఇళ్లున్నాయి. 5776 మంది  జనాభా ఉన్నారు .1471 హెక్టార్లలో విస్తరించి ఉంది. పురుషులు 2939, మహిళలు 2837మంది ఉన్నారు.షెడ్యూల్డ్ కులాలు 1915 , షెడ్యూల్డ్ తెగలు98 ఉన్నాయి.
     అలనాటి వల్లభాపురం నేడు  వల్లూరు.  ఇప్పుడిది చిన్న పట్టణమే అయినా ఒకనాడు కాయస్తుల రాజ్యానికి అది రాజధాని.ఈ ఈ కాయస్తులు స్వతంత్య్ర రాజులు. వీరు  నల్గొండ నుండి కోలార్ వరకు, ఒంగోలు నుండి గుత్తి వరకు విస్తరించి పాలించారు.   సా.శ.1287 నాటి అంబదేవుని అత్తిరాల శాసనంలో  రాజధాని వల్లూరుపట్టణాన్ని, ఏరువ, పొత్తపినాడు, ములికినాడు, గండికోట, రేనాడు, పెనదాడి, పెదకల్లు, సకిలి రాజ్య విభాగాలను ప్రస్తావించారు.
        త్రిపురాంతకం వద్ద గల సా.శ.1212 (సా.శ. 1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని తెలుస్తోంది.పెద్దనపాడు శాసనంలో అంబదేవుడు గండికోట నుండి పాలించినట్లు పేర్కొన్నారు.
      సా.శ.12వ శతాబ్దంలో ప్రస్తుత కడపజిల్లా కళ్యాణీ (పశ్చిమ) చాళుక్యుల పాలనలో ఉండేది. అప్పటి కళ్యాణి చాళుక్య ప్రభువు త్రైలోక్య వల్లభరాజు తన పేరు మీద ములికినాటి  సీమ(కడప జిల్లా‌ప్రాంతం)లో త్రైలోక్య వల్లభాపురం కట్టించారు.ఆ త్రైలోక్య వల్లభాపురమే నేటి వల్లూరు. ఈ త్రైలోక్యవల్లభాపురం /వల్లూరు పట్టణం నుండే త్రైలోక్యమల్ల మహారాజు కొంత కాలం పరిపాలించాడని, ములికినాటి సీమను త్రైలోక్యమల్లుడు  నియమించిన ప్రతినిధి కాకరాజు   సా.శ. 1123 లో గండికోటను కట్టించాడని గండికోట కైఫీయత్తు లో రాసినారు.భువనేకమల్ల రాజు తరువాత చేసిన త్రైలోక్య మల్లదేవ మహారాజు రాజ్యపాలన చేశాడన, అతనికే త్రైలోక్య వల్లభరాజు అనే పేరు కూడా ఉందని, ఈ త్రైలోక్యవల్లభుడే తనపేరు మీద త్రైలోక్య వల్లభాపురం అనే కోట, పట్టణం కట్టించాడని కమలాపురం కైఫీయత్తు తెల్పుతుంది.
 కైఫీయత్తు అన్నది బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి కోలిన్ మెకంజీ  హయాంలో గ్రామాధికారులతో రాయబడిన  ఒక రికార్డు. కైఫీయత్తు  ఉర్దూ పదం.
      కైఫీయత్తుల్లో పేర్కొన్న కాలం, పుష్పగిరి శాసనాల ప్రకారము చూస్తే కళ్యాణి చాళుక్య రాజులలో అత్యంత ప్రసిద్ధి చెందిన త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్య మహారాజే ఈ త్రైలోక్య మల్ల / త్రైలోక్య వల్లభ మహారాజు అని రూఢీ అవుతుంది.

       వల్లూరు కోటలోని అంతఃపురస్త్రీలకు సైరంధ్రిత్వం(బ్యూటీషిన్) చేసేవారికి, కొప్పులు ముడిచేవారికి జాగీరుగా ఇచ్చిన స్థలంలో వాళ్లు కట్టించిన గ్రామానికి కొప్పోలు అని పేరు ఏర్పడింది

వల్లూరు కోట రక్షణకు నాలుగు వైపులా నాలుగు పహారా బురుజులు(watchtowers) ఉండేవి. ఉత్తర బురుజుకు ఉత్తరాన మిట్ట ప్రాంతంలో(దిన్నె) ఒక చౌకీ ఉండేది.అక్కడ కొంతమంది కాపలామనుషులు తుడిమెలు(ఒకరకమైన వాద్య పరికరం) , కొమ్ములు వంటి వాయిద్యాలతో నిత్యం పహారా కాసేవారు. వారిపేరున తుడుములదిన్నె గ్రామం ఏర్పడింది. ఇప్పటికీ అక్కడక్కడ పాడుబడిన బురుజులు ఉన్నాయి.

అలాగే తప్పెట్లు వాయించేవారు ఉండే గ్రామం తప్పెట్ల అవ్వగా కొమ్ములు వాయించేవారు ఉండే గ్రామం కొమ్మలూరు అయ్యింది.

కోటకట్టిన కామాట్లు ఉండే ఊరు కొట్లూరు అయ్యింది

కోటలో ఉండే గొటగస్తీ వారు(గోట గస్తీ / కోట గస్తీ / కాపలా?) ఉండేవారు ఇళ్లు కట్టుకుని ఉండే గ్రామం గోటూరు అయ్యింది

ఈ కొట్లూరు గ్రామానికి సమీపంలో వల్లూరు పట్టణ చరిత్రకు సాక్షిగా పుష్పగిరి ఉంది.

___ పిళ్లా కుమారస్వామి,9490122229

(ఆధారం: వికిపీడియా,సోషల్ మీడియా) 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి