యర్రమల కొండప్ప


యర్రమల కొండప్ప  అనంతపుర వాసి.  స్వాతంత్ర్య సమరయోధుడు.  గొప్ప దానశీలి.  నూరేండ్లు జీవించిన  ఏకైక అనంత స్వాతంత్ర్య సమరయోధుడు  ఈయనే.  శ్రీ బాలగంధర్ తిలక్  తన హోంరూల్ ఉద్యమ  పర్యటనలో భాగంగా గుంతకల్లు రైల్వేస్టేషన్ లో  ప్లాట్ ఫారం పై  జనాలను ఉద్దేశించి  ప్రసంగించినాడు.  అక్కడ  పోలీసువిధులు నిర్వర్తిస్తున్న యర్రమల కొండప్ప  తిలక్ ఉపన్యాసంతో  చైతన్యం పొంది, అక్కడికక్కడే  పోలీసు దుస్తులు వదిలేసి. ఆ ఉద్యోగాన్ని ఛీకొట్టి  స్వాతంత్ర్యోద్యమ సమర సైనికు డైనాడు.  1920 సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని  నాలుగు నెలలు   జైలుశిక్ష  అనుభవించినాడు.  జైలునుండి  వచ్చిన తరువాత నిరంతరం గ్రామాలు  తిరుగుతూ ప్రచార కార్యక్రమం  కొనసాగించేవాడు. 1933 డిసెంబర్ లో గాంధీజీ  అనతపురం పర్యటనకు వచ్చినాడు. ఆయన  అనతపురంలో విడిది  చేసినపుడు ఆయనకు వేరుసెనగ పప్పులు, మేకపాలు సమకూర్చే బాధ్యత యర్రమల కొండప్పది.  ఆ బాధ్యతను చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్దలతో  నెరవేర్చినాడు.  అంతే కాదు  గాంధీజీ యిచ్చిన  పిలుపుకు  స్పందించి అప్పటికప్పుడు  రెండెకరాలు  హరిజనోద్యమానికి దానపత్రం రాసి గాంధీజీకి స్వయంగా  అందజేసినాడు. ఉప్పుసత్యాగ్రహం  సమయంలో   యర్రమల కొండప్ప  అనంతపురంలోనే   ఉప్పు  తయారుచేసి వీధులు తిరిగి పంచినాడు. కేశవ విద్యానికేతన్  హాస్టలు  నిర్వహించడానికి ఐదుకల్లు సదాశివన్ తో పాటు, మరో స్వాతంత్ర్య సమరయోధుడు  పసలూరు ఎరికిలప్ప మరి కొందరితో కలసి,  గ్రామాలు   తిరిగి ధాన్యం వసూలుచేసేవారు.  నికేతన్ పిల్లలకు  శుభ్రత నేర్పేవారు.  సదాశివన్ తో కలసి  రైతులను సమీకరించి  వారి సమస్యలపై జిల్లా కలెక్టరుకు  వినతి పత్రాలు  యిచ్చేవారు.
      జనం   ఆయన్ను  “దేశప్రియ కొండప్ప” అని  పిలిచేవారు. 1971 మార్చి 24 వ తేదిన నూరు సంవత్సరాల వయసులో  పరమ పదించినాడు.
  
                                      యర్రమలకొండప్ప  దానంగా యిచ్చిన భూమిలోనే 1935 నవంబర్ 25 సాయంకాలం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్న బాబు రాజేంద్రప్రసాద్  “ కేశవ విద్యానికేతన్ “ ను ప్రారంభించినాడు.  ఈ నికేతన్  దళిత విద్యార్టులకు  గొప్ప సేవ  చేసింది. వారికి  చదువు నేర్పింది. శుభ్రత నేర్పింది.  క్రమశిక్షణ  నేర్పింది.  సామాజిక సేవ చేయటం  నేర్పింది. రాజకీయం  నేర్పింది.  రహస్య రాజకీయ కార్యక్రమ నిర్వహణ నేర్పింది. ఎముకలు నలగొట్టినా, కీళ్ళు విరచినా రహస్యం దాచే  మనోనిబ్బరమూ  నేర్పింది. ఉద్యోగాలు పొందే  అర్హతలు  కలుగజేసింది.
                     అంతేకాదు  ఈ కేశవ విద్యానికేతన్  ఐదుకల్లు సదాశివన్, నీలం సంజీవరెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి, తరిమెల నాగిరెడ్డి విద్వాన్ విశ్వం, కె.వి. రామ కృష్ణా రెడ్డి.  జి. రామ క్రిష్ణ వంటి వారికీ  రాజకీయ కార్య కలాపాల కేంద్రంగా ఉన్నిది. ఉవ్వెత్తుగా వస్తున్న యువకులను ఒక సంఘంగా  సమీకరించదానికి  ఏర్పడిన
 “యువజనసంఘం”   ప్రారంభ సమావేశం  యిక్కడే జరిగింది. యిక్కడి నుంచే  యువజన సంఘం “ ఆకాశవాణి” రహస్య పత్రికను నడిపింది. . ఇదొక  చారిత్రిక ప్రదేశం. అనంత చరిత్ర నిర్మాణానికి తోడ్పడిన ప్రదేశం
                      యిప్పుడు కింది ఫోటో  ఒక్కసారి గమనించండి -  అన్ని రకాల మాలిన్యాలు కుప్పేసిన చెత్తకుండి గా  వున్న ప్రాంతం ప్రజాసేవలో గొప్ప పాత్ర పోషించిన కేశవ విద్యనికేతనమే.  ఆ విగ్రహం  గొప్ప దేశభక్తుడు  శ్రీ యర్రమల కొండప్ప గారిదే. 
                                                 అంటే  ఒక ఉన్నతాశయం కోసం ఆయన యిచ్చిన  స్థలాన్ని, సకల మాలిన్యాల చెత్త దిబ్బగా  మార్చి.  ఆ దిబ్బకు ఆయన్నే కాపలాదారుగా  బండల చాటున  నిలబెట్టారన్న  మాట.  
ఒక ఆకుపచ్చ స్థలంలో, చల్లనిగాలి వీచే వాతావరణం లో , దరహాసాలు చిందిస్తూ తనను చూసే వారందరిలోనూ  దేశభక్తి, త్యాగ నిరతిని ప్రేరేపిస్తున్నవాన్నిగా శ్రీ యర్రమలకొండప్పగారిని  సమున్నత స్థానం లో  నిలబెట్టాలన్నదే నా కోరిక.    స్వాతంత్ర్య సమరయోదులను  సముచితంగా గౌరవించే  గౌరవ స్థానంలో మన జిల్లాను నిలబెట్టే బాద్యత  మన అందరిదీ.     

__విద్వాన్ దస్తగిరి
         

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి