కష్ట జీవుల విముక్తి కోరిన కలం గుత్తి రామకృష్ణ






          స్వాతంత్ర్య సమరంలో అడుగిడిన నాటి నుండి చివరి శ్వాస వరకు ప్రజాజీవితంలో మార్పు కోసం కృషి చేసిన అనంత అణిముత్యం గుత్తి రామకృష్ణ రాయలసీమ తొలికథకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా, కమ్యునిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడుగా, పాత్రికేయుడిగా ప్రజల మనసులో ముద్రవేసుకున్నారు.
         పేదరికంలో జన్మించి అనేక అవరోధాల మధ్య జీవిస్తూ ప్రజలను చైతన్య పరచటం తన గమ్యంగా భావించిన మహోన్నత వ్యక్తి.
         నాటి కరువుకు స్పందించి 'గంజికోసం' అనే కథ రాశారు. ఆయన చివరి రోజుల్లో రాసిన వ్యాసాలలో కులం, మతం, రాజకీయాల్లో ఎలా చొరబడు తున్నాయో వివరంగా రాశారు. ధనవంతుల రాజకీయం శాశ్వతం కాదని, కష్టజీవుల రాజ్యం వచ్చి తీరుతుందని ప్రగాఢవిశ్వాసంతో చెప్పిన రచయిత ఆయన. పరాయి పాలన పోయినంతమాత్రాన కష్ట జీవుల విముక్తి సాధ్యం కాదని జైలు సహచరులతో చర్చించి శాస్త్రీయ నిర్ధారణ చేసిన రామకృష్ణ జీవితం భవిష్యత్
తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది.
          1915 జూలై 13 వ తేదిన అనంతపురంలో పాతూరులోని అంబారపు వీధిలో గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు రామకృష్ణ జన్మించారు.
మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించడంతో మేనమామ వెంకట
రమణప్ప వద్ద రామకృష్ణ పెరిగారు. ఆయన చదువు అనంతపురం బోర్డుస్కూల్, ట్రైనింగ్ స్కూల్, మున్సిపల్ హైస్కూళ్ళలో సాగింది. చదువుకుంటున్న సమయంలో పాఠ్యపుస్తకాల కన్నా చారిత్రాత్మక,
జనరల్ పుస్తకాల పైనే ఆయన ఆసక్తి
కనపరిచేవారు. ఆయన మేనమామ కాలేజిలో పనిచేయటంతో లైబ్రరి నుండి‌అనేక పుస్తకాలను రామకృష్ణకు తెచ్చిచ్చేవారు. హైస్కూల్ విద్యలోనే వీరేశలింగం రాసిన వ్యాసాలు, సాక్షి వ్యాసాలు ఎంతో ఆసక్తితో చదివారు. చిన్ననాటి నుండి
ఆంగ్లేయుల మీద ద్వేషంతో వున్న రామకృష్ణ ప్రజాచైతన్యం కోసం తనవంతుకృషి చేయాలనే ఆలోచనతో వుండేవారు. ఆంగ్లేయుల పై కోపంతో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివేవాడు కాదు. ఆయన హైస్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్న‌ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్ ను ఉరితీసింది. ఆ సమయంలో పప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, ఎర్రమల కొండప్ప స్కూల్ పిల్లలతో
సమ్మెచేయించారు. ఆ సమ్మెలో రామకృష్ణ పాల్గొన్నారు. 
           ఉద్యమ భావాలను మదినిండా నింపుకున్న రామకృష్ణ కష్టపడి శ్రమించి కమ్యునిస్టు సాహిత్యం
కొనుగోలు చేసిచదివారు. ఆ రోజుల్లోనే మావో జీవిత చరిత్రను చదివారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి కమ్యునిస్టుయోదుల ఉపన్యా సాలు విని చైతన్యవంతు లయ్యారు.
             1934 లో గాంధీ అనంతపురం వచ్చిన సమయంలో ఎర్రమల కొండప్ప రెండు ఎకరాల స్థలం విరాళంగా ఇచ్చారు. ఆ స్థలాన్ని గాంధీ హరిజన సంక్షేమ సంఘానికి కేటాయించారు. 1939లో చదువు ముగించుకుని అనంతపురం తిరిగి
వచ్చిన సదాశివన్ తో పాటు రామకృష్ణ హాస్టల్ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు.
            1941 లో నీలం సంజీవరెడ్డి ఆకాశవాణి జాతీయ పత్రికను రహస్యంగా నిర్వహించే
వారు. బ్రిటిష్ ప్రభుత్వ అరాచకాలను బయట పెట్టుతూ ఉండడంతో ఆ పత్రిక ఎడిటర్ సదాశివన్ ను అరెస్టు చేసి ఆ పత్రిక ముద్రణ ఆపారు. అదే సమయంలో ఆ బాధ్యతలను రామకృష్ణ తీసుకుని పత్రిక నిర్వహణ చేపట్టారు. కానీ ఆయనను
కూడా పోలీసులు అరెస్టు చేశారు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో అక్కడ జరిగిన కాల్పులలో రామకృష్ణ కన్ను పోగొట్టుకున్నారు.
            రామకృష్ణ బ్రిటీష్ హయాంలోనే స్వతంత్ర భారత్, ఆకాశవాణి పత్రికలకు ప్రతినిధిగా ప్రజాసమస్యలపై ఉద్యమించారు. ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, జనశక్తి విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల ప్రారంభ సమయా లలో నుండి తొలి జర్నలిస్టుగా పనిచేశారు.    
          సుమారుగా 70 సంవత్సరాలు విలేకరిగా
పనిచేశారు. అఖిల భారత బంజార సంఘం రంజిత్ నాయక్ ప్రోత్సాహంతో బంజార పత్రికను ఎడిటర్‌గా నిర్వహించారు. తరిమెల నాగిరెడ్డి నిర్వహించిన 'జనప్రభ కు ఎడిటర్‌గా పనిచేశారు. ప్రజాసమస్యలపై ఆయన రాసిన వ్యాసాలు, సంకలనాలు, వార్తలు ఎంతో విలువైనవి.
          చారిత్రక, సామాజిక, రాజకీయ, సాహిత్య చరిత్రకు సంబంధించిన అనేక విషయాలపట్ల రామకృష్ణకు సంపూర్ణ అవగాహన ఉండేది.
గుత్తి రామకృష్ణ సాహిత్య రంగానికి విశేష కృషి చేశారు.
           రాయలసీమ కథారచయితగా గుర్తింపు పొందారు. ప్రధానంగా ఆరు కథలను ఆయన రాశారు. ఆయన రాసిన గంజికోసం కథ రాయలసీమలో కరువును ప్రజలు పడుతున్న
కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రజల కడుపు మాడుతున్న వైనాన్ని ఆయన తన కథలలో ఆవిష్కరించారు. 1941 విజయవాణి పత్రికలో గంజికోసం కథ ప్రచురణ అయ్యింది. కథలో కరువు నేపథ్యంలో కుటుంబ సమస్యలు, అవ్వ, కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు మధ్యగల అనుబంధాల సన్నివేశాలతో అల్లిన కథ గంజికోసం. కరువు దెబ్బతో వలసవెల్లే క్రమంలో ఆ కుటుంబం పడే వేదనను కథలో వ్యక్తపరిచారు. ఉన్న
జీవనాధారం ఐదెకరాల మడి రెడ్డి చేతిలోకి వెల్లగా అవ్వదిగులు చెందుతుంది.తినటానికి తిండి లేక కలబందగడ్డ, గ్యాదరాకు తినిబతుకు సాగిస్తున్న నేపథ్యంలో పొరుగు ప్రాంతాల్లో గంజికి కోసం ప్రజల పాకులాటను కళ్లకు కట్టినట్టు చూపారు.
భూమిలాక్కున్న రెడ్డి కోడలు మానంపై కన్నేయడంతో అవ్వ తీసుకున్న నిర్ణయం మనసులను కట్టిపడేస్తుంది. మనవడు, మనవరాలు ఆకలితో అలమటిస్తుంటే అవ్వ పడిన ఆవేదన కథను ఆద్యంతం ముందుకు నడిపింది. ప్రభుత్వ గంజి కోసం మైళ్ళ దూరం నడిచిన తీరు కరువుకు నిదర్శనంగా కనిపించింది. ఎంతో కష్టపడి
గంజి కేంద్రానికి చేరుకున్న అవ్వకు ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల మాట విని
గుండె జారింది. గంజి కేంద్రం మూయటంతో ఆవ్వ ఆశలు ఆవిరయ్యాయి.
        ఇలా రామకృష్ణ రాసిన చిరంజీవి, శిల్పి, కూటి కరువు, కులము-మతము సాహిత్య చరిత్రలో నిలిచిపో యాయి. ఆయన కలం నిరంతరం ప్రజల సమస్యలు పాలకుల వైఫల్యాలాని ఎండకడుతూ సాగింది.
             కష్టపడే తత్వం, నీతి నిజాయితి, నిరాండంబరత, నిబద్దత తకు నిలువెత్తు
నిదర్శనంగా, మార్గదర్శకంగా భవిషత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు. సమాజాన్ని ప్రభావితం చేసిన గుత్తి రామకృష్ణ 2009 మే 12 న కన్ను మూశారు. అయితే ఆయన సాహిత్యం, ఉద్యమ పటిమ మాత్రం కలకాలం జిల్లా ప్రజల మదిలో
నిలిచే వుంటుంది.


                           ___వల్లెపు రవిచంద్ర కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి