లలిత కవి కోకిల తలమర్ల కళానిధి






         

          నిమ్న కులములో పుట్టినా పేదరికంతో బాధపడినా ఎంతో కష్టపడి సాహిత్యరంగంలో విశిష్ట స్థాయిని సాధించుకున్న సాహిత్యకారుడు తలమర్ల కళానిధి.
        కొత్తచెరువు మండలం తలమర్లలలో ఓబమ్మ, ఓబన్న దంపతులకు జనవరి 1915లో తలమర్ల కళానిధి జన్మించారు. ఇతను జన్మించినపుడు పెట్టిన పేరు కొల్లప్ప. ఈ కొల్లప్ప కవితా సాహచర్యంతో కళానిధి అయ్యాడు. తలమర్ల నుండి చెప్పులు లేకుండా నాలుగుమైళ్ళు నడుస్తూ ఎండకు వానకు ఓర్చి చదువుకొన్న‌మొదటి వ్యక్తి ఈయనే. స్వగ్రామములో ప్రైవేటు టీచరుగా పనిచేస్తూ ఎస్.ఎస్.యల్.సి. పరీక్షలు ప్రైవేటుగాపాసయ్యాడు. తరువాత హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్‌ముగించి ఉపా ధ్యాయుడయ్యాడు.
         తలమర్ల కళానిధి రచించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. అవి ప్రధానంగా మణీమనోహరులు (కథాసంపుటి), ప్రేమపూజ (కథాసంపుటి), నవనాథ చరిత్రము (అనువాదము), కథాలహరి (కథాసంపుటి) గేయ సుమమాల, హరిజనోద్ధరణ
మొదలగునవి. ఇవిగాక దక్షిణేశ్వర భాగవతం రాశారు. అలాగే కళాసౌధము రాశారు.
           బెళ్ళూరి, కళానిధి, తోలేటి నరసింహారెడ్డి ముగ్గురు కలిసి కవితాభ్యాసము, సాహిత్యాధ్య యనము చేశారు. అయినప్పటికి తలమర్ల కళానిధి బెళ్ళూరి శ్రీనివాసమూర్తిని గురుతుల్యులుగా భావించారు. బెళ్ళూరి 'రెడ్డి రాజ్యమహోదయము' వంటి మహా కావ్యాన్ని, తోలేటి చిగ్గగనానంద చరితామృత సాగరం వంటి పురాణాన్ని రాయగా, కళానిధిగారు కళాసౌధము, దక్షిణేశ్వర భాగవతము,
కబీరు సూక్తులు, బైబిలు సూక్తులు రచించారు.
        షేక్స్పియరు తన 'యాజ్ యు లైక్ ఇట్' లో చెప్పినట్లు ప్రకృతే ప్రథమ బోధకుడు ( నేచర్ ఈజ్ ఏ టీచర్), బుక్స్ ఇన్ ది రన్నింగ్ జోక్స్ లైక్ ద సెర్మోనిస్
ఇన్ ద స్టోన్స్' అని అన్నారు. బెళ్ళూరి ఈ మాటలకు తార్కికంగా 'తపోవనం' రాస్తే కళానిధి 'కళాసౌధం' రాశాడు. రెండింటిలో సమస్థాయిలో 'ముగ్ధమోహన
పల్లె వాతావరణము', పులకలెత్తించే ప్రకృతి మాధుర్యము, మూగజీవుల రాగమయదృక్కులు, వివిధ పక్షుల నృత్యాలు, కలరవాలు కనిపిస్తాయి.
పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయనకు 'లలిత కవికోకిల' అనే బిరుదు నివ్వగా, శ్రీ వెంకటేశ్వరానందస్వామి 'విద్యారత్న' బిరుదును ప్రసాదించారు.
       కళానిధికి మాత్రం ' లలితకవికోకిల'యే ఇష్టం.
ఒకానొక సందర్భంలో చూపోపనివాళ్లు 'నీవూ కవిత్వం రాస్తావా? ఈ పద్యాలు ఎక్కడ కాపీ కొట్టావని' ఎగతాళి చేసినప్పుడు కళానిధి ఎంతో బాధకు లోనై 'అమ్మా ! కులం లేని నన్ను ఎందుకు వరించావు, నాకు వశమయ్యావని ఓర్వలేని లోకం ఆడిపోసికుంటోంది ' అని ఆవేదన చెందాడు 'ఒక కవితలో'. కళానిధి తన రచనలను తపస్సుగా భావించి రాశారు. అలా రాసిన వాటిలో 'రామాయణ నిధి' ఒకటి. ఆయన రచనలలో విస్పష్టమైన వాక్య విన్యాసం ఉంటుంది. కావ్య ప్రాణమైన సూక్తులను ఎంతో నేర్పుతో ఉటంకించడం ఆయన రచనా కౌశల్యాన్ని వ్యక్తం చేస్తుంది. పాఠకున్ని తన వెంట తీసుకువెళ్ళగలిగే కథనం ఆయన రచనల్లో మనం దర్శించవచ్చు.
          పెద్దన 'మనుచరిత్ర' రాస్తే ఆయన శిష్యుడు రామరాజభూషణుడు 'వసుచరిత్ర' రాసినట్లుగా, గురువు బెళ్లూరి ద్విపదలో 'వివేకానంద' రాస్తే , కళానిధి 'దక్షిణేశ్వర భాగవతం'ను మంజరీ ద్విపదలో రాశాడు. మంజరీ ద్విపద అనేది ద్విపద పద్యం, పాట, గద్యాల త్రివేణీ సంగమం. ఈ రచన పండిత పామర జనరంజకంగా సాగింది. సరస, సరళ, మధుర మంజులగా నడిచింది. 'గంగ‌ పారుచుండు కదలని గతితోడు' అన్నట్లు కావ్యం 'గాంభీర్యం' సంతరించుకొనింది.ప్రతి వాక్యంలో ఆర్తి కనిపిస్తుంది.
       ఆయన రాసిన 'వర్ణాంతర వివాహాలు (నాటిక) లో యువతీయువకులు కులం, మతం, ఆచారాలకు బానిసలై మూర్ఖులుగా వ్యవహరించే పెద్దల్ని లెక్క చేయనక్కర లేదనే ఉపదేశం ఉంది. ఇందులో హరిజన కులస్థుడైన ప్రకాష్, అగ్రకులానికి చెందిన శోభ, హరిజన కులస్తురాలైన లలిత , అగ్రకులానికి చెందిన మూర్తి పరస్పరం ప్రేమించుకుంటారు. వారిద్దరు పెళ్ళి చేసుకోవాలను కున్నప్పుడు
పెద్దలు తొలుత అంగీకరించరు. బలమైన ఆశయంగల ఆ జంటలు తమను ఎదురిస్తారని తెలిసి పెళ్లికి అంగీకరిస్తారు. ఈ కథ యువతీ యువకుల ఆత్మవిశ్వాసానికి తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన పద్ధతికి నిదర్శనంగా
నిలుస్తుంది.
         తలమర్ల రాసిన తన 'ఆత్మకథ' ప్రతి ఒక్కరు చదవదగినది. తన కాలం నాటి సమాజాన్ని ఇది పట్టిస్తుంది. ఆయన వ్యక్తిత్వాన్ని తేటతెల్లం అంశాలు
ఎక్కువగా కనిపిస్తాయి. తానొక హృదయవాదిగా సంఘ సంస్కరణోద్యమం,దేశభక్తిగల ఉత్తమ పౌరుడుగా దర్శనమిస్తాడు. సామాన్య జనాలు నిత్యజీవితంలో వాడే అనేక సామెతలను సందర్భానుసారంగా వాడి నుడికారాల పుట్టగా ఈ
గ్రంథాన్ని తీర్చిదిద్దారు. ఈ గ్రంథంలో ఆనాడు దళితులపై జరిగే అనేక చిత్రహింసలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. ఇందులో 1) అస్పృశ్యతా జాడ్యస్వరూపం2) దేవాలయ ప్రవేశ నిరాకరణ 3) పాచి పనులకు రాని ఆడవాళ్ళను వీధుల్లో
కొప్పులు పట్టి ఈడ్చి కొట్టడం 4) ఊటకాల్వల దగ్గర బట్టలు ఉతుకుతుంటే వాటిని చించి పోగులు పెట్టడం 5) చివరకు అగ్రవర్ణాలవారి దిబ్బలపై గింజలు ఏరుకొని తినే కోళ్ళను కర్రలతో బాది పట్టుకొని ఒండుకొని తినడం 6) అధిక వడ్డీలకు
అప్పులు 7) దొంగ ప్రామిసరీ నోట్లురాయించుకోవడం 8) పిల్లల్ని జీతాలకు ఉంచుకోవటం 9) ఇళ్ళను, పొలాల్ని కూటపు విక్రయ దస్తావేజులు సృష్టించి
ఆక్రమించుకోవడం 10) బడిలోకి చేర్చుకోకపోవడం 11) అస్పృశ్యుల్ని ఎదగనీక కుటిల పన్నాగాలు పన్నడం మొదలైన దృశ్యాలు మనకు దర్శన మిస్తాయి.
         ప్రపంచీకరణ దెబ్బకు కనుమరుగవుతున్న చెడుగుడు, కోతికొమ్మచ్చి, చిల్లాకట్టి, బొంగరం,‌ గోళీలు, ఈత, వెన్నెలకుప్పలు, వీధినాటకాలు మొదలైన గ్రామీణ క్రీడలు గురించి ఆత్మకథలో మనం చదువుతున్నప్పుడు మన చిన్ననాటి దృశ్యాలు మన కళ్ళముందు కదలాడుతాయి. ఇవేకాక గుణింతము, ఎక్కాలు, డిక్టేషన్, పొడుపు కథలు, రాతను తొలుత ఇసుకపై తర్వాత పలకలపై రాయడం, మట్టి ప్రమదల్ని ఆవు పేడ పై పెట్టి మైసూరా నూనెతో వెలిగించటం మొదలైనవి కనిపించి మనల్ని మైమరిపిస్తాయి. తలమర్ల కళానిధి రచనలు పాఠకులను తనతో పాటు తీసుకెళ్తాయి.
        చదువు దూరంగా నెట్టబడిన  దళిత కుటుంబంలో జన్మించినా రచనా వ్యాసంగంలో దిట్టగా మారి ఆశావాది (నాలాంటి) లాంటి వార్లకు ఎంతో స్ఫూర్తిదాయకమై నిలిచిన తలమర్ల, 89 యేండ్లు జీవించి 6-3-2004లో పరమ పదించారు.

"గుణమెరుగువారు సహృదయ
లణువును కొండంతగా దయామతికనుచున్
ప్రణుతింతు రౌట వారికి
ప్రణామములు భాగవత సిగ్ధస్థమణులకున్"

 __డా|| ఆశావాది ప్రకాశరావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి