సీమలో ఉషోదయ ప్రభాత గీతాన్ని ఆలపిస్తున్న రజిత



'నేను నారిని,మ్రోగించిన సమరభేరిని' అంటూ తన్ను తాను నిర్వచించుకున్న కొండసాని రజిత అయ్యగారి నారాయణరెడ్డి సునందమ్మల దంపతులకు  మొదటి సంతానంగా 13 ఆగష్టు1985లో ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన పుట్టపర్తికి మండలం లోని గువ్వలగుట్టపల్లిలో జన్మించారు.
బాల్యం విద్యాభ్యాసం సుబ్బరాయనిపల్లి లోని అమ్మమ్మ తాతయ్య రామకృష్ణమ్మ నారాయణ రెడ్డి  వద్ద సాగింది.
జూనియర్ కళాశాల చదువు మాత్రం అమ్మగారింట  పూర్తయింది.
ఇంటర్ పూర్తికాగానే తన మేనమామ కొండసాని బయపరెడ్డి తో 3 జూన్ 2003 న వివాహం జరిగింది. వీరి కుమారుడు ప్రణీత్ కుమార్ రెడ్డి కూడా తల్లి బాటలో పయనిస్తూ కథలు
రాయడం విశేషం.
వివాహాం తర్వాత కూడా చదువును కొనసాగిస్తూ 2012లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా దూరవిద్య లో డిగ్రీ (బి.ఎ) పూర్తి చేశారు.ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా ఎమ్మెస్ డబ్ల్యూ కోర్సును పూర్తి చేశారు.
ఈమె 14 ఫిబ్రవరి 2007 నుండి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది.2017 డిసెంబర్ నుండి 2018 ఆగష్టు వరకు అంగన్వాడీ మినీ సూపర్వైజర్ గా కూడా పనిచేశారు.
 
          వ్యవసాయ కుటుంబం నేపథ్యంగా ఉండటం వల్ల రైతుల కష్టాలను కన్నీళ్లను దగ్గరగా చూడటంతో ఈమె రైతుకవితను  సునాయాసంగా రాసింది. 'రైతు నేడు నేతల పాలిట ఓట్లు గుడ్డు పెట్టే బంగారు బాతు' అంటూ రైతుల గురించి ప్రస్తావించింది. వీరి సాహిత్యంలో భావుకతతో పాటు సామాజిక,స్త్రీవాద ముద్ర కనిపిస్తుంది. 
తొలి ప్రయత్నంలోనే రైతు అంశం పై రాసిన 'నా దేశపు వెన్నెముక' కవితకు డాక్టర్ వేంపల్లి రెడ్డి తేజశ్రీ స్మారక జాతీయస్థాయి పురస్కారం 2018 లో లభించింది. కళా సరస్వతి మదర్ తెరిస్సా జాతీయస్థాయి 2018 పురస్కారం, వరంగల్  కళానిలయం సాహితీ వేదిక  ప్రధానం చేసింది.  2019లో చిత్రావతీ కళా పురస్కారం అప్పటి యమ్.యల్.ఎ పల్లె రఘనాథరెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు.
మూడు వందల కవితలు,
పదిహేను కథలు రాశారు."ఒక కల రెండు కళ్ళు" పేరుతో ఒక కవితా సంపుటిని 2019 లో ప్రచురించింది.
తాను పనిచేస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ లోని ప్రజల కోసం ఉన్న అనేక పథకాల గురించి కథలను కూడా ప్రచురిస్తున్నారు.
తన తాత గారి పేరిట కొండసాని నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేసి 2019 నుండి ప్రముఖ రచయితలకు ఇస్తున్నారు.
మొదటి పురస్కారాన్ని నవంబర్ 2019లో
కడపజిల్లాకు చెందిన ప్రముఖ కవి సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన "బడి" కవితా సంపుటికి, 
గుంటూరు కు చెందిన యమ్.వి రామిరెడ్డి రాసిన "వెంటవచ్చునది" 'కథా సంపుటికి కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. 

ఒక వైపు తన ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సాహిత్య పోషకురాలిగా సాహితీ కార్యకర్తగా కూడా తన వంతు సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
విశ్వసాహితీ సమితిలో సహాయ కార్యదర్శిగా,
తెలుగు రక్షణ వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తూ వివిధ సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విరజాజులు సాహితీ వేదిక ద్వారా వివిధ సాహితీ ప్రక్రియలలో పోటీలను నిర్వహిస్తూ సాహితీకారులను ప్రోత్సహిస్తున్నారు.

వివిధ సాహిత్య సంస్థలు వేర్వేరు సందర్భాల్లో నిర్వహించిన కవి సమ్మేళనాల్లో సాహిత్య కార్యక్రమాల్లో ఆమెకు అనేక పురస్కారాలు లభించాయి.
ఉదయసాహితీ సాహితీవేదిక (హుస్నాబాద్)వారు 2019 'కవితాభూషణ్ ' బిరుదును కూడా ప్రదానం చేశారు.
రజిత కలం నుండి జాలువారిన " ఒక కల రెండు కళ్ళు" కవితా సంపుటిలో 36 కవితలు ఉన్నాయి.. ఇందులో దాదాపు 12 కవితలు వివిధ సామాజిక అంశాలపైన ఉన్నాయి. తక్కిన కవితలన్నీ అనుభూతి, భావ కవిత్వాలు. వర్తమాన సాహిత్యం ఈ అనుభూతి సాహిత్యాన్ని భావకవిత్వాన్ని చాలా కాలం కిందటే పక్కకు నెట్టింది.కానీ ప్రారంభ దశలో ప్రతి కవి భావ కవిత్వం వైపుమొగ్గు చూపడం సహజం.  మెల్లమెల్లగా సమాజంలోకి తొంగి చూసే కొద్దీ అనేక సామాజిక అంశాలను భావుకతతో చిత్రీకరిస్తాడు. ఈ కవితా సంపుటిలో వున్న కొన్ని కవితలలోకి తొంగి  చూద్దాం.

ప్రేమ రెండు విధాలు ఉంటాయని ప్లేటో అన్నాడు. ఒకటి స్త్రీ సౌందర్యాన్ని చూసి పురుషుడుప్రేమించడం.రెండోది పురుషుల మధ్య ఉండే ప్రేమ ఇది హోమో సెక్సువల్ గా కాక మానసికంగా ఉంటుంది. అయితే స్త్రీ పురుషుల మధ్య ఉండే మానసిక బంధమే ప్లేటోనిక్ లవ్ అని ఎక్కువ మంది అభిప్రాయపడు తున్నారు.దీన్ని అమలిన శృంగారం అని కూడా అంటూంటారు. ప్రబంధ యుగం లో  స్త్రీ పురుషుల మధ్య శారీరక ఆకర్షణ లే ప్రధానంగా ఉన్న రోజులనుంచి విడి విడి  భావకవిత్వం ప్రారంభమైన తొలిరోజుల్లో  ప్రేయసీ ప్రియుల మధ్య అమలిన శృంగారం ప్రస్ఫుటంగా  కనిపించింది. ఈ ప్లేటోనిక్ లవ్ రజిత రాసిన ఈ కవితా సంపుటి నిండా కనిపిస్తుంది.

ప్రేయసీ ప్రియుల మధ్య ఊహలు గుసగుసలాడు
తూంటాయి. కళ్ళలో కలత నిద్రలో సైతం కమ్మని కలలు వస్తుంటాయి. ప్రేయసికి ప్రియునిరాకకోసం నిరీక్షించడం లో ఎంతో మధురంగా ఉంటుంది.  "గజ్జలు ఘళ్ళు ఘళ్ళు మంటూ కుచ్చిళ్ళు  ఎత్తిపట్టి నడిచివచ్చే నెచ్చెలీ, నీ కోసం పరిచినాను  నా హృదయాన్ని" అంటూ నెచ్చెలి ని ఆహ్వానిస్తాడు. అదే ప్రియురాలు అయితే
"నాకోసం నువ్వు నడిచి వచ్చే దారిలో పూలవనాలు వికసిస్తాయి" అనంటుందని రజిత చెపుతోంది తన ' కల నిజం చేసేందుకైనా' కవితలో.
            ప్రియుడు తన కోసం వస్తున్నాడని తెలిసినప్పుడు ప్రియురాలు ఏం  చేస్తుందో       దేవులపల్లి ఇలా చెప్పుతాడు.
"ముందు తెలిసెనా ప్రభూ/ ఈ మందిర మిటులుండేనా/ నువ్వు వచ్చు ముందు క్షణమేదో కాస్త". ప్రియుని రాక ముందే తెలిస్తే ప్రియురాలి మదిలో ఎలాంటి  మధురిమ భావాలు ఉత్పన్నమవుతాయో రజిత రాగరంజిత భావాలలో ఇలా చెప్తుంది.
"నీ ఆగమనం గురించి తెలిసి /నా బుగ్గల్లో సిగ్గు పూలు పూయించేందుకు/మంకెనలు మందారాలు ఒకదానినొకటి పోటీ పడతాయి."

"అన్ని రోగములకు ఔషధంబుండియు/
 ప్రణయ రోగమునకు కనము మందు" అనంటాడు గాలిబ్. ప్రణయమనేది ఆత్మాశ్రయ మైనది.ప్రేమ పిపాసి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి తనలో తానొక ఏకాంత మందిరాన్ని నిర్మించు కుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోక పోవడం అన్నది ఆధునిక కవుల్లో ముఖ్యంగా వర్తమాన కవుల్లో కనిపించదు. కానీ రజిత అందుకు మినహాయింపు అనుకోవాలి.
          రజిత తన కవితల్లో తన అనుభూతులను గాఢంగా భావ చిత్రాల్లో  లిఖించింది. ప్రేమలో పడిన వారు ఏదో ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు.సఖుడు చేసే   చిన్న చిన్న చిలిపి ఊసులు ఎదను తడిమి నప్పుడెల్లా ఏదో తెలియని మత్తు ఆవహిస్తుంది. దరికి చేరాలని మది గోల పెడుతుంది.
            ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడిరాతిరి తొలి వేకువ రేఖ అంటూ ప్రేయసి ఒక కొత్త భావ చిత్రాన్ని మనకు   రూపు కట్టిస్తే రజిత కూడా తన "అద్దానికి కి సైతం..." కవితలో
"నన్ను మళ్ళీ చిగురింప చేయడానికి/ అతడు కురిసే మేఘం అవుతాడు/ వసంతమై పలకరిస్తాడు"అంటూ భావస్ఫోరకంగా ప్రియరాగాలను పలికిస్తుంది.
 
          "నేను మరణించాక నామె చింతింపదొడగె  /ఎంత తొందరగా కరుణించె నన్ను" అంటూ మరణంతో నైనా ప్రేయసి తన్ను   కరుణించిందని ఆనందిస్తాడు గాలిబ్. ఇదే తరహాలో రజిత తన ప్రియుని కోసం పరితపిస్తున్న వైనాన్ని 
"ఇకనైనా మౌనం వీడి ఇన్నేళ్ల నా నిరీక్షణని
నీతో నా ఎడబాటుని 
నీ మాటతో కరిగించు 
కరుణించు,కనికరించు
 నన్ను కదిలించు"
అంటూ తన "మౌనమేలనోయి" కవితలో వ్యక్తం చేస్తుంది.
          రజిత రాసే కవిత్వం ఇలా ప్రేమ లోకంలోనే విహరిస్తూనే ఉంటుందని ఎల్లకాలము ఇలాగే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే రాయలసీమలో ఉన్న కవి తన ప్రేమను సమాజంపై కురిపిస్తాడు.ఈ కరువు సీమలో రైతులు పడుతున్న వేదన పైన, మహిళల పైన, దానికి కారణమైన ఈ రాజకీయ వ్యవస్థ పైన తన ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేడు. అందుకేనేమో ఈ కవితా సంపుటి లోనే అలాంటి కవితలు కొన్ని కనిపిస్తాయి.
       "నిన్నటి మొన్నటి దాకా నటులు/ నాయకుల అవతారమెత్తారు 
కానీ చిత్రంగా నేడు నాయకులే 
ఓట్ల కోసం సీట్ల కోసం పోటీలుపడి నటిస్తున్నారు"అంటూ రజిత నేటి రాజకీయ విన్యాసాన్ని  గురించి తన "మహానటులు"కవితలో చెబుతుంది.
కవి ఎప్పుడో ఒక చోట తన కవిత్వంలో తానెవరో చెప్పుకుంటాడు.అలాగే రజిత తానెవరో చెప్పుకుంది. "నేను ఆలపించే గీతం ఉషోదయ ప్రభాతం"అంటూ తన "కీర్తిపతాకను" కవితలో ప్రకటించుకుంది.ఈ ప్రభాత గీతాన్ని రజిత ముందు  ముందు  నిరంతరంగా వినిపించాలని, వినిపిస్తుందని ఆశిద్దాం.


పిళ్లా విజయ్
9490122229






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి