అనంతపురం జిల్లాలో సాహిత్య వికాసం






    
                                     
        “క్షామములెన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞానమృత దృష్టికిన్ కొరతనందని రాయలసీమ లోపలన్” అని డాక్టర్ నండూరి కృష్ణమాచార్యులు చెప్పినట్లు రాయలసీమలోని అనంతపురము జిల్లాలో ప్రాచీన కాలంనుండి నేటి వరకు సాహిత్య వికాసం నిరంతరాయంగా ఫరిడ విల్లుతోంది.
        ప్రాచీన సాహిత్యాన్ని మినహాయిస్తే, ఆధునిక సాహిత్యమంతా సంక్షోభ సమాజ ప్రతిబింబమే. కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న జీవితాన్ని, ఫ్యాక్షన్ రాజకీయాలను, రాజకీయ క్రీనిడల్ని సాహిత్యం ఆవిష్కరిస్తోంది.
        సాహిత్యానికి, ఆర్థిక సామాజిక పరిస్థితులకు,
రాజకీయ పరిస్థితులకు పరస్పర సంబంధముంది. కాలానుగుణంగా సాహిత్యంలో రూపం మారినట్లే,
వస్తువూ మారుతూవస్తోంది. కాకపోతే జిల్లాలో ఉన్న నైసర్గిక స్వభావం వల్ల ఇక్కడ కరువు తాండ వించడం, దానికి తోడు పాలకవర్గాల నిర్లక్ష్యం, ప్రజల అమాయకత్వం వెరసి సాహిత్యంలో వ్యదార్థ జీవన దృశ్యం అణుమాత్రం కూడా మారలేదు. అయితే జిల్లా రాజకీయ పరిణామాల వల్ల, ప్రజా ఉద్యమాల వల్ల, సాహిత్య కారుల్లో సామాజిక చైతన్యం విస్తృతమైంది. ప్రజా జీవితాన్ని కాకుండా
నేలవిడిచి సాముచేసే సాహిత్యం ఇక్కడకనిపించదు. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ప్రభావం సాహిత్యకారు లపై, సాహిత్య విమర్శకులపై ప్రబలంగా ఉండటం వల్ల అనంతపురము జిల్లా సాహిత్యం తెలుగు సాహితీయవనికపై తనదైన ముద్రను వేసుకొంది.
        వ్యవస్థను ప్రశ్నించడం, ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల పాఠకులు తాననుభవిస్తున్న స్థితికి లోనై కళ్ళు చెమర్చుతారు. అదే సందర్భంలో
సాహిత్య కారులకు ప్రత్యామ్నాయ పరిష్కారం లభించక పోవడం వల్ల, పరిష్కారమార్గాలను సరిగా సూచించలేక పోతున్నారు. దాంతో పాఠకులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. సాహిత్యకారులు ఎవరైతే ప్రజా జీవితాన్ని కేవలం వీక్షించకుండా పూర్తిగా తొంగిచూస్తున్నారో వారుప్రత్యమ్నాయాలను అన్వేషించ గలుగుతున్నారు.
        ఏది ఏమైనప్పటికీ ఇక్కడ భూస్వామిక సమాజ వాసన ఇంకా వేళ్ళూనుకొని వుండటం వల్ల ఇప్పటికీ అవధానం పట్ల ప్రజల్లో భ్రమలు బాగా ఉన్నాయి. అవధానాన్ని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ' దొమ్మరోల్ల ఆట' గా అభివర్ణించాడు. వ్యక్తి ఆరాధన విపరీతంగా ఉంది. మూఢ విశ్వాసాలు రాజ్యమేలు తున్నాయి. సామాజిక సంఘర్షణ కన్నా సర్దుబాటు ధోరణులే ఎక్కువగా ఉన్నాయి. వీటి ప్రభావం సాహిత్య కారులపై స్పష్టంగా ఉంది.
       సాహిత్యకారుల రచనల్లో ఉన్న స్పష్టత , వాస్తవ జీవితంలో  కొరవడడానికి ఇదే కారణం. అంటేనిబద్దత లేకపోవడం ఒక బలహీనతగా చెప్పవచ్చు.

___పిళ్లా కుమారస్వామి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి