అనంత సాహితీ కర్షకుడు కల్లూరు రాఘవేంద్రరావు
కల్లూరు రాఘవేంద్రరావు తల్లిదండ్రులు కల్లూరు అహోబలరావు,సీతమ్మ దంపతులు. అహోబలరావు ఉపాధ్యాయులు గా కళ్యాణదుర్గం లో పనిచేస్తున్న సందర్భం లో రాఘవేంద్రరావు 1.6.1946లో ఎనిమిదవ సంతానంగా అక్కడే జన్మించారు.కానీ వీరి కుటుంబ మూలాలు మాత్రం కల్లూరు గ్రామంలో ఉన్నాయి. తన తండ్రి అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. హైస్కూలు విద్యను హిందూపురంలో పూర్తి చేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పొందారు. 1966లో హిందూపురంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే లేపాక్షి మండలంలోని సిరిపురం లో , తదనంతరం 1969లో హిందూపురంలో కూడా పనిచేశారు.
1974లో హిందూపురం మున్సిపాలిటీ అయిన తర్వాత అక్కడే 1998 వరకు వివిధ మున్సిపల్ పాఠశాలల్లో పని చేశారు. 1999లో ప్రధానోపాధ్యాయుని గా పదోన్నతి పొందారు. 2004లో పదవీ విరమణ పొందే వరకు రహమత్ పురం లో పని చేసేవారు.
అహోబల రావు కవి కావడం వల్ల తన కుమారుడు రాఘవేంద్ర రావును కూడా సాహిత్య కారునిగా మారడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని ఇచ్చారు . దాంతో ఆయన చిన్నతనం నుంచే బాలగేయాలు,పిల్లల కథలు రాశారు ."పాలపిట్ట"శీర్షికతో నవ్య వార పత్రికలో అనేక కథలు వచ్చినాయి. "స్వర్గానికి దుప్పట్లు" పేరుతో బాల కథలను, చిలకల తోట పేరుతో బాలగేయాలు ప్రచురించారు. తండ్రి పనిచేస్తున్న పాఠశాలలోనే రాఘవేంద్రరావు చదివారు .ఆ సందర్భంలో పాఠశాలలో జరిగే సభలో ప్రార్థనా గీతాన్ని పాడటానికి రాఘవేంద్రరావు అవకాశం దొరికేది. ఇంట్లో ప్రతిరోజు తండ్రి ద్వారా అనేక శతక పద్యాలు కూడా నేర్చుకున్నారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడే మీసాల పై "మీసాలు" అనే శీర్షికతో కవిత రాశాడు. పాఠశాల పత్రిక నవోదయలో ఆ కవితను కూడా ప్రచురించారు. అప్పుడు ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో చంద్రునిపై "మా వెంట పడ్డాడు నా మేనమామ" అనే గేయాన్ని రాసి కృష్ణా పత్రిక కు పంపిస్తే వారు దాన్ని ప్రచురించారు.
ఉపాధ్యాయులు ఆనాటి దేశ రాజకీయ నాయకుల స్వాతంత్ర పోరాటాన్ని వారి దేశభక్తి గురించి చక్కగా వివరించి చెప్పేవారు. ఆ రకంగా విద్యార్థుల్లో దేశభక్తిని రగిలించే వారు. ఓసారి నెహ్రూ వచ్చినప్పుడు నెహ్రూ చూడాలన్న తపన తో తండ్రి భుజాల మీదకి ఎక్కి నెహ్రూకు జై అన్న సంఘటన ఆయన ఇప్పటికీ గుర్తుంది. అలాగే పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీళ్లు కార్చిన సంఘటన ఆయన జీవితంలో మర్చిపోనిది.
వివిధ పత్రికల్లో వచ్చే బలివాడ కాంతారావు,పెద్దిబొట్ల సుబ్బరామయ్య, శీలా వీర్రాజు ఆదివిష్ణు మొదలైన రచయితలు రాసిన కథలను చదివి అర్థం చేసుకున్నాడు. రచయితలు కథలు రాస్తారని రచయిత్రులు నవలలు రాస్తారని భావించేవాడు మొదట్లో ఆ రోజుల్లో ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఇప్పుడైతే అందరూ అన్నీ రాస్తున్నారు. కథా రచనకు మార్గదర్శి ఎవరూ లేకపోవడం వల్ల తను రాసిన పంపిన కథలన్నీ వెనక్కి తిరిగి వచ్చేవి. అయితే హిందూపురంలో "కథా కల్పనాలయం" ఏర్పడ్డాక కొత్త రచయితలకు సీనియర్ రచయితలు వర్క్ షాప్ ఏర్పాటు చేసేవారు.దాంట్లో రాఘవేంద్రరావు కథలు రాయడం బాగా నేర్చుకున్నారు. తన తొలి కథ ఆంధ్రప్రభలో వచ్చింది.ఆ తర్వాత ఎన్నో కథలు రాశాడు. ఆ కథానికల న్నింటినీ 2013లో "మూడు కాళ్ళ మేక "పేరుతో కథా సంపుటిని వెలువరించారు.
దీనిపై మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం వారు అక్కడ చదివే విద్యార్థులకు ఎం ఫిల్ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆయన కథల్లో కులమతాల ఆచారాలనే అడ్డుగోడలను చేధించాలని, జంతు సంరక్షణ అవసరమని చెప్పే సందేశాలు ఉండేవి. సామాజిక రాజకీయ కుటుంబ స్థితిగతులపై వ్యంగ్యాత్మకంగా హాస్యం స్ఫోరకంగా చురకలు అంటిస్తూ గిలిగింతలు పెడుతూ ఉంటాయి. ఆయన కథలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ మంచి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలని భావించి తనకథలను రాశారాయన. ప్రతి కథలో కొత్త విషయం చెప్పాలని, భిన్నమైన అంశాలను తీసుకురావాలని ఆయన భావిస్తారు. ప్రతి రచయిత తన చుట్టూ ఉన్న సమాజాన్ని తప్పకుండా తన సాహిత్యంలో రాయకుండా ఉండలేడు. ముఖ్యంగా అనంతపురంలో ఆక్టోపస్ లా విస్తరించిన కరువు కోరల గురించి రాఘవేంద్ర తన కథల్లో ప్రస్తావించడం ఆశ్చర్యం కాదు. చెరువు కింద భూములు చిన్నకారు రైతులు కోరుకు (కౌలుకు) తీసుకుని సేద్యం చేస్తుంటారు.
నీళ్లు లేని రైతులు తమ భూములకు సొంత భూమి గల యజమాని దగ్గర్నుంచి డబ్బు చెల్లించి నీళ్లను తోడుకొని చెరుకు తోటలు కాపాడు కుంటూ ఉంటారు. ఆ సందర్భంలో డబ్బు చెల్లించని రైతులతో యజమానులు ఆ రైతులు తమ ఆడబిడ్డలను రాత్రికి పంపమని కోరినప్పుడు ఆ రైతులు పడ్డ మనోవేదనను "ముందుచూపు"కథలో వివరిస్తాడు. కరువు బారిన పడిన కౌలు రైతు జీవితం ఎలా ఉంటుందో తన "దయ్యం కథ"లో వివరిస్తాడు. పక్క రాష్ట్రాలు తమ సరిహద్దు నదులకు ఆనకట్టలు కట్టినప్పుడు అనంతపురం జిల్లా లోని చెరువులకు నీళ్లు రాక పోవడం వంటి సమస్యలను కూడా కథల్లో ప్రస్తావించారు.
విద్యార్థులకు ఆయన అందిస్తున్న సేవలను, పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీస్తున్న ఆయన కృషిని గమనించి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం కూడా ఇచ్చారు.
మచిలీపట్నంలోని ఆంధ్ర సారస్వత సమితి ద్వారా ఉగాది పురస్కారం కూడా లభించింది.
నా పుస్తకం పేరుతో శ్రీకృష్ణ దేవరాయ గ్రంథమాల సంస్థ ద్వారా రచయిత లు ప్రచురించిన పుస్తకాలను సంవత్సరానికి 600 రూపాయలతో సభ్యత్వం తీసుకొన్న వారందరికీ ప్రతి నెలా ఒక పుస్తకాన్ని పంపిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు.రచయితలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆయన "తెగని బంధాలు" నవల కూడా రాశారు. ఇంకో విశేషమేమంటే రాయలసీమ రచయితల గురించి ఆయన తండ్రి నాలుగు సంపుటాలుగా గ్రంథాలను తీసుకొచ్చారు. వాటన్నిటినీ తన చిన్నతనంలోనే తండ్రికి సహకరిస్తూ ఈయన రాశారు. ఇప్పటికీ అనేక కథలు బాలగేయాలు రాస్తూనే ఉన్నారు.భవిష్యత్తులో మంచి రచనలు ఆయన నుంచి ఇంకా రావాలని కోరుకుందాం.
___ పిళ్లా విజయ్9490122229
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి