పడుగూ పేకల మధ్యన కవితా జీవనం
భారతదేశానికి నాగరికత ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని ,ప్రపంచీకరణ బీజాలు మాత్రం 1991 ఆర్ధిక సంస్కరణలతో వచ్చి పడ్డాయి.బయటి వ్యక్తులని మనదేశంలోని వ్యాపారాలకు ఆహ్వానించడం వంటి ప్రణాళికలు దేశాన్ని కనబడకుండా లోపల నుంచి వేరుతొలుచే పురుగుల్లా తినేసాయి.అలా నష్ట పోయిన ప్రభావం ఎక్కువగా చేతి వృత్తుల మీద పడింది.అలాంటి ఒక వృత్తి చేనేత రంగం.వాళ్ల స్థితి గతుల మీద అలాగే వాళ్ల కి సంబంధించిన కష్టాల మీద రాయబడిన కవిత్వం కూడా తెలుగులో విరివిగానే ఉంది.అయితే అందరికన్నా ముందుగా ఒక వ్యక్తి, ఆ కష్టాల కి అక్షరాల అందాన్ని అద్దాలని ఆశించాడు, వాళ్ల బాధలు దగ్గరుండి చూసాడు, ఆ కుటుంబంలో జన్మించాడు, నలుగురిలో తలెత్తుకునే చదువు చదివాడు చదివి తాను నడిచిన నేలను మర్చిపోకుండా ఆ వెతల మీద ఒక దీర్ఘ కావ్యం రాసాడు.ఆ వ్యక్తి శ్రీ."ఉమ్మడిశెట్టి రాధేయ"
ఆ కావ్యం పేరు"మగ్గం బతుకు".
సరళమైన భాష, ఎక్కడా అడ్డంకులు లేని భావప్రవాహం,చెప్పదలుచుకున్న విషయం పట్ల పూర్తి అవగాహన,కేవలం ఊహాజనీతమైన కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాకుండా,తాను చూసినవి,విన్నవి,ఊరూరా చెప్పుకున్నవి,తాను తడిమి చూసుకున్న జ్ఞాపకం ఇలా తన అనుభవములోకి వచ్చిన ప్రతీ అంశాన్ని వదలకుండా కవిత్వం లోకి తీసుకు వచ్చారు రాధేయ. అందుకే ఈ కావ్యం నన్ను ఇక్కడ వ్యాసం రాసేలా ప్రేరేపించింది.
"ఇది మా యాదార్ధ కథ
చేనేత చిత్ర పటంలో
విరిగిన మగ్గం వ్యథ
చెమటచుక్కలన్ని రాశీ భూతమై
కన్నీటి మడుగులైన కథ
సగం దేహం గుంటలోనూ
సగం ప్రాణం కళ్లలోనూ నిలుపుకొని
ఆర్తిగా చేయి సాచే అన్నార్తుల కథ!."
మొదలవ్వడమే వాస్తవ చిత్రణతో మొదలవుతుంది. యదార్థ కథ అనడం తోనే మనం ఏం చదవబోతున్నామో అనే భావన ముందే పాఠకుడిని తయారు చేయడానికో లేక లేనటువంటి భావాన్ని కలుగ జేసే ఉద్దేశ్యంతోనో రాయడం లేదు.ఉన్న వాస్తవాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేయడానికి చేసిన కృషిలా అనిపిస్తుంది.వాస్తవానికి ఇక్కడ మనం చూడాల్సింది కవి కన్నుతోనే.ఇందులో కవి తాను చూసిన విషయాన్ని తానే ఒక మార్గదర్శి గా మారి పాఠకులని ఆ మగ్గాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేసాడు.
ఎక్కడా కూడా అతిశయోక్తి ప్రదర్సన ఉండదు. నేలవిడిచి సాముచేసే గడబిడా కనబడదు.అంతా ఆకలి బాధ. ఎండిపోయి న డొక్కల మధ్యన నేయబడిన అందమైన తివాచీ చీరల వెనక అసలు బాధ రంగుని బయటకి తెస్తాడు ఈ కవి.
"దీనాతి దీన దుఃఖం
ఈ విధ్వంస విషాదానికి
పల్లవి ప్రపంచీకరణది
చరణం సామ్రాజ్యవాదానిది
పాపం పాలనా యంత్రామ్గానిది!"
ఎక్కడో అమెరికాలో విసిరిన ఉండేలు దెబ్బకు ఇక్కడి మార్కెట్లన్నీ కకావికాలం అయిపోయి దిక్కులేక పిక్కటిల్లేలా అరిచిన శబ్దాన్ని కవి పట్టుకుంటూన్నాడు.ఈ పాటకు పల్లవి చరణాల పాపం ఎవరిది అని ప్రశ్న లేవనెత్తి దానికి పరిహారం ఎవరి చేతుల్లో ఉంది అని ఒక దుఖఃపు జీర గొంతుతో బాధితుల తరపున మాట్లాడుతున్నాడు.
అంతా సరళమైన రహదారిలానే ఉంటుంది కావ్యం మొత్తం. ఎక్కడా కంకర్రాళ్ల లాంటి గంభీర పదాలు కనబడనే కనబడవు.సామాన్య పాఠకుడికి సులువుగా అర్ధమయ్యే రీతిలో శైలి ఉంటుంది.మొదలు పెట్టిన తరవాత ఆపడం ఉండదు. అలా జారుకుంటూ మనం కూడా ఆ దారాల వెంబడి ఆరంగుల్లో కలిసి పోతాం.కాబట్టే ఈ కావ్యం అంతటి జనాదరణ పొందింది. ఇతర భాషల్లోకి అనువాదం అయింది.ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చేనేత కార్మికుల వెత కాదు.ఇది భారత దేశం చేనేత కార్మికుల కష్టం.
ఈ దీర్ఘకావ్యమ్ ముఖ్యంగా మూడు విషయాలు చర్చకి తీసుకుంటుంది.
1.చేనేత కార్మికుల జీవన పరిస్థితి
2.వాళ్ల నైపుణ్యానికి సంబంధించిన ది
3.వాళ్ల కి మిగతా సమాజము వలన,మరియూ ప్రభుత్వము వలన జరుగుతున్న నష్టం.
ఈ మూడు అంశాలను ఎక్కడా ఒకదానితో మరొకటి కలపకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు రచయిత.వాస్తవంగా దీర్ఘ కావ్యాలు రాసేప్పుడు. వస్తువు మనచేతిలోనుంచి మెల్లగా జారిపోయి దాని స్థానంలో శిల్పం వచ్చి కూర్చుని అసలు ప్రయోజనం నెరవేరక పోవచ్చు కానీ ఈయన ఇక్కడ వస్తువు జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఈ కావ్యాన్ని నడిపించాడు.అందుకే దీనికి అసాధారణమైన గుర్తింపు వచ్చింది.
ఒకానొక సమయంలో అగ్గిపెట్టెలో పట్టే చీరని నేసిన చేతులు ఇప్పుడు ఇలా డీలాగా అయిపోయాయి అని బాధపడతారు.మా సొసైటీలు మా శ్రమ ఫలాన్ని మింగేస్తున్నాయి అని బయట ప్రపంచానికి చెబుతున్నాడు. ఇంకా ఇలా అంటారు చూడండి .
"సత్తువ వెక్కిరిస్తున్నా
చాకిరీ ఏడిపిస్తున్నా
'ఆశ'కంటిలో పోగై చుట్టుకుంది
దోనెలో వస్త్రమై మలుపు తిరుగుతుంది
కళ్ళలో వత్తులు వేసుకుని మగ్గం నేసినా
'కరెంట్ బల్బు' కె భారమైన బతుకుమాది"అంటారు.అంటే ఎంత శ్రమ పడినా దక్కాల్సిన ఫలం దక్కడం లేదు. కళ్ళలో వత్తులు వేసుకుని పని చేసినా కనీసం మా ఇళ్ళు కరెంటుకి కూడా నోచుకోవడం లేదని కవి ఆవేదన వ్యక్తం చేస్తాడు.
ఇలాంటి బాధా తప్త కావ్యాలు రాసేప్పుడు.చాలామంది వ్యంగ్య భాషని ఆశ్రయిస్తారు.కొండకచో కొన్నిఅసభ్య పదాలను కూడా వాడే అవకాశమూ ఉంది కాని ఈయన స్వభావానికి అది పూర్తి విరుద్ధం.ఉన్నది ఉన్నట్లు ప్రపంచము దృష్టికి తీసుకు పోతే వాళ్ల నిర్ణయం కి వాళ్లనే వదిలేస్టే వాళ్లు మాత్రమే నిర్ణయించుకుంటారు అని ఒక సదుద్దేశం తో దీన్ని రాశారు.ఆయన కోరిక నెరవేరింది అనే భావంతో నేను కూడా ఏకీభవిస్తాను.ఎక్కడా ఒక అసందర్భ పద ప్రయోగం ఎక్కడా ఒక్కచోట కూడా కనబడదు.అక్కడక్కడా దీర్ఘ కావ్యం కాబట్టి అన్వయ దోషాలు కనబడినా అది పరిగణించబడని అంశం.ఎందుకంటే ఈ ప్రక్రియలో వచ్చిన మొదటి కావ్యం ఇది.వ్యాకరణ సూత్రాలు తప్ప ఎక్కడా శైలి కి సంబంధించిన అంశాలు పెద్దగా లేవు ఒకరకంగా చెప్పాలి అంటే ఈయనే దీనికి ఒక ప్రామాణికం పెట్టారేమో అనుకోవాలి.
ఈ వృత్తిని ఒక ప్రాంతం కి పరిమితం చేయడు కవి ఏమంటాడో చూద్దామా
" సిరిసిల్లలో అప్పుల చావులు
మంగళగిరి లో వలసల బాటలు
వెంకటగిరిలో వెతల పాటల
పోచంపల్లిలో పురుగుల మందుతో చావులు
చీరాల షెడ్డు కూలీలు
కంటి చూపు కోల్పోయినా
కాళ్ళు చేతులు సచ్చు బడిపోయినా
పూత గడవడం కోసం
పాటుపడక తప్పదు."
ఆకలికి ప్రాంతీయ తత్వం లేదంటారు కవి.అటు తెలంగాణా నిండా పరుచుకున్న మగ్గాల మీద కానీ ఇటు బాగా అభివృద్ధి చెందింది అని చెడ్డ పేరు మోస్తున్న కోస్తా ప్రాంతం కానీ ఏదయినా సరే అందులో నేతన్నల బాధలున్నాయి అన్నాడు కవి.ఏ ప్రాంతానికి పోయినా ఆ ప్రాంతానికి చెందిన ఎవరో ఒక చేనేత కుటుంబం పనుల్లేక తనువు చాలించిన ఘటనలు మనం చూసాం దాన్నే కవి ఎప్పుడో దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మనకి కళ్ళకి కట్టినట్టు తన కావ్యంలో రాశారు.
ఇప్పుడంటే యాంత్రీకరణ జరిగిన తరువాత వలసలు పెరిగాక మెజారిటీ ప్రజలు మగ్గం నేయడం లేదు కానీ ఒకప్పుడు ఇదే జీవనాధారం.రెక్కాడితేగాని డొక్కాడని ప్రజలు ఆధారపడిన చేతి వృత్తి.అలాంటి క్రమంలో చాలా మందికి ముడి సరుకు దొరక్క పనిలేక దాదాపుగా ఒకానొక సమయంలో వార్తాపత్రికలు నిండా ఈ ఆకలి చావులే ఉండేవి.సరే తప్పు ఎవరిదియైనా చావు మాత్రం నిజం అదే కవి ఆవేదన చెందుతాడు.ఎలా వాళ్ళ శరీరాలు తృణ ప్రాయంగా ఈ పనికోసం వదులుకుంటారో చెబుతాడు.
"సగం దేహం గుంటలోనూ
సగం ప్రాణం కళ్లలోనూ నిలుపుకొని
ఆర్తిగా చేయి సాచే అన్నార్తుల కథ
మగ్గాల శాలలన్ని
మార్చరీ గదులుగా
రూపాంతరం చెందుతున్న దీనార్ధుల కథ
కండెకు బదులుగా
కదురుకు గుండెను గుచ్చి తిప్పుతూ
చావు గడపలో అడుగిడుతున్న ఓ అవ్వ కథ."
ఈ పుస్తకానికి తన ముందుమాటలో "నందిని.సిదారెడ్డి" కూలబడిపోయిన వృత్తి కోసం కవి అక్కడే సరిగ్గా నిలబడతాడు,నొప్పిని అందుకుంటాడు, నోరవుతాడు,యుద్దానికి దిగుతాడు.మార్కెట్ ఎదురుగా కవిత్వాన్ని నిలబడతాడు అన్నారు ,ఇంకా అంత పెద్ద దేశాల మీద ఇంత చిన్న కలంతో కలబడతాడు ,చిత్త ప్రకంపనతో బజారుకెక్కి పంచాయితీ పెడతాడు ఈ కవి అన్నారు.నిజమే ఎందుకంటే ఈ సాలెల మగ్గం సడుగులు విరిచేసిన పెట్టుబడీదారులని ఎదుర్కొవడానికి ప్రభుత్వం దగ్గర కూడా నివారణ చర్యలు లేవు కానీ కవి తనకు తన సామాజిక వర్గానికి ఆ మాటకి వస్తే,అసలు ఆ సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఈ వృత్తి చేస్తున్న ఎన్నో కులాల కార్మికుల పట్ల వకాల్తా పుచ్చుకున్నాడు. పవర్లూమ్ యంత్రాల చప్పుడులో గొంతెత్తి తన వాణిని వినిపించారు.
"ఆకలి పేగుల్ని కొరికేస్తున్నా
చూపుకి చేతికి దారం అందదు
పోగుకు పోగుకూ మధ్య పొత్తు పొసగదు"
అంటారు కవి ఒకచోట.ఇదంతా ఆగ్రహ వ్యక్తీకరనే ,తన బాధను ఒక చదువుకున్న విద్యావంతుడు బాధని ఎలా బయటకి చెప్పగలడో అలాగే నేర్పుగా ఒక కుట్టులేని చొక్కాని నేసినట్టు చెబుతారు. ఈ కవికి ఆర్తి ఉంది.అభిమానం ఉంది.అన్నిటికీ మించి స్పష్టత ఉంది. యాంత్రీకరణ మగ్గాల ప్రాణాలు తోడేస్తుంది అనే సర్వకాలీన అవగాహన ఉంది కాబట్టే దాన్ని సాధారణ పరిభాషలో పరిణితి శిల్పంతో బలంగా వ్యక్తీకరించారు.
ఈ దీర్ఘ కావ్యం ఈ వస్తువు మీద అప్పటికి ఇదే మొదటిది. చాలా మంది ఆ తరవాత దీర్ఘకవిత్వం రాసినప్పుడు చాలా మందికి ఇది ప్రామాణికం అయింది.పెద్ద కావ్యం కావడం వలన అక్కడక్కడా కాస్త వచనం పాలు ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ అది జీవిత వ్యక్తీకరణ ఎలాంటి సిమిలీలకి,మెటఫర్లకి దొరకనిది కాబట్టి కవి కూడా అక్కడ ఆ పదాలని అలాగే వల్ల కష్టాన్ని ప్రతిబింబించేలా రాశారు.చాలా మంది ప్రముఖ కవులు ఇదే సామాజిక వర్గంలో ఉన్నా సరే కేవలం రాధేయ లాంటి నిబద్ధత ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి ఆకలి వ్యధలను వ్యక్తీకరణ చేయగలిగారు.అందుకే ఆ బాధ మొత్తాన్ని కొన్ని కొన్ని చోట్ల చురకల్లా అంటిస్తారు.
"బడ్జెట్ కేటాయింపుల్లో
తెగినపోగై
భంగపడ్డ వృత్తి మాది
చట్ట సభల్లో సైతం
పదవికోసం కొట్టుకు చస్తారు
ఫోజులిచ్చి మైకులు విరిచేస్తారు గానీ
ఏనాడు పూర్తిగా చర్చకు రాని
శ్రమ జీవన నైరాశ్యం మాది" అంటారు.
నిజమే అనిపిస్తుంటుంది.ఎన్ని ప్రణాళికలు మారినా వ్యవసాయం తరవాత అతి పెద్దదైన ఈ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా పెద్ద నేరం.ఎన్ని పత్రికల్లో వ్యాసాలు వచ్చినా వీళ్లకి న్యాయం జరగలేదనే ఆవేదన కవి కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు.
వాస్తవాలని రాస్తూ పోతే ఈ భూగోళం చాలదు అనే మాటల్ని నిజం చేస్తూ సాగుతున్న ఈ జీవితాలకు చెందిన ఈ దీర్ఘ కావ్యాన్ని రాసిన రచయిత కలం పేరు "రాధేయ". వాన కురవని సీమ వాసి.
___అనిల్ డానీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి