అనంత సాహిత్యవనంలో సాహితీ వటవృక్షం ఆశావాది ప్రకాశరావు




        అనంత సాహిత్యవనంలో సాహితీ వటవృక్షం ఆశావాది ప్రకాశరావు
            
            అనంత సాహిత్య రంగంలో పద్యానికి, అవధానానికి చిరునామాగా మారిన ఆశావాది ప్రకాశరావు 1944వ సంవత్సరం ఆగస్టు 2న అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కొరివిపల్లి గ్రామంలో కుళాయమ్మ. పక్కీరప్ప దంపతులకు జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, పైగా తెలుగుభాషాభిమాని. దాంతో ఆశావాదికితెలుగుభాష పట్ల మమకారం సహజం గానే ఏర్పడింది.
          ప్రాథమిక విద్యను బెళుగుప్ప మండలం శిరిపి గ్రామంలో మొదలైంది. ఉన్నతవిద్య అనంతపురం పట్టణంలో కొనసాగింది. బి.ఎ. స్పెషల్ తెలుగును పూర్తిచేశాడు.  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పాసై పబ్లిక్ వర్క్స్ లో మూడునెలలు పనిచేశారు. ఉపాధ్యాయునిగా నియామకం అయ్యాక పాత ఉద్యోగాన్ని త్యజించాడు. 
          ఉపాధ్యాయునిగా ఉంటూనే శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగులో ఎం.ఎ. పూర్తిచేశాడు. అధ్యాపకునిగా పదోన్నతి పొంది రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలోఅధ్యాపకునిగా
కొంతకాలం పనిచేశారు. అనంతపురం, గుంతకల్లు, నగరి, పుంగనూరు, పెనుగొండ, డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశాడు. పెనుగొండ కళాశాలలో  ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు తీసుకుని అక్కడే పదవీ విరమణ పొందారు.
ఆశావాది కుటుంబం కూడా విద్యారంగంలో చక్కగా రాణించింది. ఆయన సతీమణి ఆశావాది లక్ష్మిదేవి. ఎస్ఎస్ఎస్సీ వరకు చదివారు. ఆమె 2006లో ఆస్తమించారు. ఆశావాది కుమారుల్లో శశాంక మౌళి
హిందీ ఆధ్యాపకులుగా, అనంతమూర్తి ఇంగ్లీషు
అధ్యాపకులుగా, సుధామవంశీ సంస్కృత
అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 
        ఆశావాది తెలుగుభాషకు చేసిన సేవ అమోఘమైనది. సంప్రదాయ సాహిత్యంలో ఆశావాది ఎన్నో కష్టనష్టాలకోర్చి స్వయం కృషితో పాండిత్యాన్ని సంపాదించుకున్నాడు. తెలుగు పద్యానికి, అవధానానికి, వర్తమానకాలంలో ప్రసిద్ధుడైన ఆశావాది ఎన్నో వందల అవధానాలు దేశవ్యాప్తంగా చేశారు. అంతేగాక అనేక గ్రంధాలు దాదాపు 40 దాకా రాశారు. ఆయన కవిగా, వక్తగా, రచయితగా, సాహితీ కార్యకర్తగా, విద్యావేత్తగా ప్రముఖ అవధానిగా ఆశావాది ప్రకాశరావు అనంత‌ సాహితీ వనంలో ఏపుగా పెరిగిన పెద్ద సాహితీ వటవృక్షం.
          అవధాన ప్రక్రియలో కొన్ని వర్గాలే ముఖ్యంగా బ్రాహ్మణులది అందెవేసిన చేయి  అన్న అభిప్రాయాన్ని బద్దలు చేస్తూ దళితుడైన డాక్టర్ ఆశావాది ప్రకాశరావు స్వయంశక్తితో అవధానవిద్యలో సాధికారత సాధించారు. వీరి అవధానం లో ప్రత్యేకత పద్యాన్ని సౌందర్య‌ సమూ పేతంగా అల్లటం, "వీరి పద్యం లయబద్దంగా ఉండి, వినడానికి ఇంపుగా ఉంటుంది.  హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. కవితకు వన్నె తెస్తుంది" అని తెనుతెంక తుమ్మల సీతారామమూర్తి ప్రశంసించారు.
           అవధానం ప్రక్రియలో నిషిద్ధాక్షరి, దత్తపది, సమస్య వర్ణన, ఆశువు, పురాణము, కోస్యము, ఘంటాగణనం, అనే అష్టపదుల సాహిత్య విన్యాసం ఉంటుంది. ఒక సమస్యను అడిగే వాడిని పృచ్ఛకుడు అని అంటారు. కొన్ని పదాలు వాడ కుండా పద్యాన్ని అల్లమని అవధానిని అడుగుతాడు. నిషిద్ధాక్షరిలో, 'దత్తపది'లో ఇవ్వబడిన పదాలను వాడి భావస్పోరక పద్యాన్ని తయారు చేయాలి. సమస్యలో మంచి భావాలున్న పద్యంలో ఇవ్వబడిన సమస్యను పూరించాలి. అప్రస్తుత రంగంలో పృచ్ఛకుడు  హాస్యాన్ని కలిగించే వాటినిఅడిగితే వాటికి తగినట్లు హాస్య స్పోరకంగా సమాధానం ఇవ్వాలి. ఈ అవధానం ఒక రసవత్తరమైన సాహిత్య ప్రక్రియ.  ఈ క్రీడ వంద మందితో జరిపితేశతావధానం అంటారు. ఎనిమిది మందితోజరిగితే అష్టావధానం అంటారు. దీనిలో ఆశావాది దిట్ట. ఎన్నో అవధానాలు చేసిన ఆశావాది తన అనుభవాల్ని అక్షరబద్ధం చేసి
ఆనేక రచనలు రాశారు. వీటిలో అవధానదీపిక, అవధాన కౌముది,అవధానకళాతోరణము, అవధాన వసంతము మొదలైనవి ఉన్నాయి. ఇవిగాక వరదరాజు శతకం, పార్వతీశతకం, మెరుపు తీగలు వంటి కావ్యాలు కూడా ఉన్నాయి. 
         ఆశావాది పద్యరచనతో పాటు  ఆధునిక వచన కవితలో కూడా ప్రవేశం ఉంది. ఆర్కెస్ట్రా, అంతరంగ తరంగాలు వీటిలో ముఖ్యమైనవి. అయితే ఆయన పద్యకవిగానే స్థిరపడిపోయారు. తన అవధాన విశిష్టతకు కారణం డాక్టరు సివి
సుబ్బన్నగారే నని ఆయనే తన అవధానగురువని ఆయన వినమ్రంగా చెప్పుకుంటారు.
       వర్తమాన తెలుగు సాహిత్యం భావ కవిత్వంలో
 సామాజిక స్పృహతో, రైతాంగ సమస్యలపై ప్రపంచీకరణ పడగనీడలపై, సంక్షోభ జీవితంపై ఎక్కువగా వస్తోంది. దీని ప్రభావం కారణంగా ఆశావాది తన  అవధానాల్లో  కూడా ఇలాంటి అంశాలనే స్పృశిస్తూ పద్యాలను ఆశువుగా చెప్పేవారు.వారి సాహిత్యం పై సాహితీ స్రవంతి 2019లో సదస్సు నిర్వహించింది.
        పద్యం గొప్పతనమంతా ధారణలో ఉంది.
ఒకసారి పద్యం నేర్చుకుంటే దాన్ని అలవోకగా
మళ్ళీ చెప్పవచ్చు. అయితే ప్రస్తుతమున్న
వ్యవస్థలో పద్యం కేవలం కొందరి సాహిత్యమే.
అదిప్పుడు వచన కవిత్వంగా మారి అందరి
పరమైంది. ప్రజాస్వామికమైంది. వర్తమానంలో
 వచన కవిత, మినీ కవిత, నానీలు మొదలైనవి
వచ్చాయి. 
       ఆయన రచనలపై పరిశోధలు‌కూడా వెలువడినాయి. జాషువా పద్యరూపంలో తన
భావాలను ఆధునికంగా చెప్పినాడు.వర్ణవ్యవస్థను ధిక్కరించాడు. ఆశావాది మాత్రం సంప్రదాయ హిందూధార్మిక వ్యవస్థలోని భావాలను పద్య రూపంలో చెబుతూనే నిమ్నకులాలు పడే కష్టాలను కూడా తన పద్యాల్లో వివరించారు. ఇది ఆశావాదిని సామాజిక వాదిగా నిలబెట్టింది.
         ఆశావాది సాహిత్య రంగంలో ఎన్నో సత్కారాలు పొందాడు. 1976లో దళితుల్లో ప్రథమ
అవధానిగా 'తెలుగు వెలుగు' పురస్కారాన్ని
రాష్ట్రప్రభుత్వం నుంచి పొందాడు. 1986లో
తెలుగు విశ్వవిద్యాలయం 'రాష్ట్రకవి'గా
సత్కరించింది. 1994లో ఉగాది పురస్కారాన్ని
రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. పొట్టి శ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం 2000సంవత్సరంలో డిలిట్ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది. 2005లో హరిజన సేవాసంఘం ద్వారా గాంధేయ వాద పురస్కారం పొందాడు.అధికార భాషాసంఘం నుండి 'భాషాభిజ్ఞు' పురష్కారాన్ని పొందాడు. ఆశావాది జీవితంలో అపూర్వఘట్టం పూర్వం అల్లసాని పెద్దనలా 'స్వర్ణగండ పెండేర సన్మానం' పొందడం.

అనంతపురం జిల్లా పెనుగొండలో ఆయన తన
సాహితీ ప్రజ్ఞకు గుర్తుగా ఆయన ఈ సన్మానాన్ని
పొందడం విశేషం. ఆశావాది అనంత సాహితీ
క్షేత్రంలో సాహితీ వారసత్వంగా ఎన్నో తెలుగు విత్తనాలు వేసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన స్వయంగా 'రాయలకళాగోష్టి' సంస్థ స్థాపించి దానికి కార్యదర్శిగా పనిచేశాడు. 'ఆంధ్రపద్య కవితాసదస్సు' రాష్ట్ర కార్యదర్శిగా పది సంవత్సరాల పాటు 1993 నుండి పనిచేసి ఎంతోమంది సాహిత్య కారులును వెలుగులోకి తెచ్చారు. 'ఆంధ్రప్రదేశ్సా హిత్య అకాడమీ' సభ్యునిగా కూడాపనిచేశారు.  2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది.
       సామాజికంగా నిమ్న కులంలో జన్మించిన ఆశావాది ప్రకాశరావు బాల్యం నుండి ఎన్నో కష్టాలు, కడగండ్లు, అవమానాలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొని సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు దాటాడు. తనదే కులమని అడిగిన వారిని తనది. కవితా కులమని సగర్వంగా చెప్పినసాహితీమూర్తి ఆశావాది ఆనంత సాహిత్యరంగంలో అవధానానికి చెరగని చిరునామా.

   __ పిళ్లా కుమారస్వామి,9490122229




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి