జిల్లాలో వికసించిన ప్రబంధ, ఆధ్యాత్మిక సాహిత్యం




                 
         ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు 16వ శతాబ్దంలో వసు చరిత్ర రాసిన రామరాజ భూషణుడు కొంతకాలం పెనుకొండలో నివసించినట్లుచారిత్రక ఆధారాలున్నాయి. వసుచరిత్రలో ఆయన వర్ణించిన కోలాహల పర్వతమే పెనుకొండ అనీ, సుక్తిమతీనదే చిత్రావతి నది అని చెపుతారు.

         17వ శతాబ్దంలో పాఠకులకు ఆసక్తి పెంచే 'శుకసప్తతి' కథా కావ్యాన్ని రాసిన 'పాలవేకరి కదిరీపతి' ఈ జిల్లాలోని కదిరి ప్రాంతం వాడనేందుకుచారిత్రక ఆధారాలున్నాయి. ఈ కావ్యంలో ఆనాటి సామాజిక పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తాయి.    అదే 17వ శతాబ్దంలోనే సమాజంలోని కల్మషాన్ని తన పద్యాలతో కడిగేస్తూ, మంచి చెడ్డలను సమీక్షిస్తూ, ప్రజలలో మూఢ విశ్వాసాలను ఖండిస్తూ
ప్రజాచైతన్యం రగిలిస్తూ ఆలవెలదులలో పద్యాలను సరళసుబోధకంగా అల్లిన 'ప్రజాకవి వేమన' కదిరి ప్రాంతంలోనే ఉన్నట్లు, గాండ్లపెంట మండలంలోని కటారుపల్లె గ్రామంలో సమాధి అయినట్లు అనేక చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. 
ప్రాచీన కవుల్లో వేమనది విశిష్ట స్థానం. తన సమకాలీన సామాజిక వ్యవస్థలో వున్న దుర్లక్షణాలను
తీవ్రంగా విమర్శించిన కవి వేమన ఒక్కడే. అస్పృశ్యతను మతఛాందసత్వాన్ని, కర్మ కాండను, మూఢ విశ్వాసాలను, స్త్రీ వ్యామోహం, స్వార్థం, మోసం లాంటి గుణాలను నిస్సంకోచంగా విమర్శించి సామాజిక సంస్కరణకు నడుంకట్టిన కవి వేమన. 'భూమి నాదియన్న ఫక్కున
నవ్వు" అంటూ భూమిపై వున్న వ్యామోహాన్ని తగ్గించు కోవాలన్నాడు. “శ్రమమున బుట్టు సర్వంబు తానౌను" అని శ్రమైక జీవన గౌరవాన్ని వేమన కీర్తించాడు.
        భూస్వామిక సమాజంలో పుట్టి విశేష ఆదరణ పొందిన అవధాన ప్రక్రియ నేటికీ ప్రజాదరణ పొందడం విశేషం. భూస్వామిక భావజాలం ఉన్నచోట వ్యక్తిపూజ, వ్యక్తి ఆరాధన ఉంటుంది. ఇప్పటికీ యువత ఎవరో ఒకరిని కీర్తిస్తూ పూజిస్తూ ఉండడం సహజంగానే ఉంది. భూస్వామిక భావజాలం ఇంకా ప్రజల్లో ప్రబలంగా ఉందనడానికి ఇది నిదర్శనం గా చెప్పవచ్చు. కుంటి మద్ది శ్రీనివాసా
చార్యులు శతావధానం చేసేవారు. కవితానంద వాల్మీకి రామాయణాన్ని రాసిన సోంపల్లి కృష్ణమూర్తి అష్టావధానాలు చేసేవారు. పామురాయిగ్రామానికి చెందిన అల్లసాని రామనాధ కవి కూడా అష్టావధానంలో దిట్ట. వర్తమాన కాలంలో (2015లో) మడకశిర ప్రభావతి ప్రథమ మహిళా శతాధిక అవధానిగా ప్రసిద్ధి పొందారు. 
అవధాన ప్రక్రియలో, పద్యరచనలో ఆశావాది ప్రకాశరావు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆయన ప్రథమ దళిత అవధానిగా ప్రసిద్ధుడు. 
        ఆధ్యాత్మిక విషయాలపై రాసిన వారిలో ఎల్లమరాజు నారాయణ భట్టు, పెనకల పాటి కాగలూరు రుద్రకవి, వేదాంతం లక్ష్మయ్య, రాప్తాటి ఓబిరెడ్డి, మరూరు లక్ష్మీనరసప్ప, మొదలైన వారున్నారు. చిత్రకవిత్వ ప్రక్రియలో కవితా చిత్రములతో 'నిర్యోష్టశతకం' కావ్యాన్ని రాప్తాటి ఓబిరెడ్డి రచించారు. శివతాండవం తదితర గ్రంథాలను రాసి సరస్వతీ పుత్రుడనే బిరుదును
పొందిన పుట్టపర్తి సత్యనారాయణచార్యులు కడపలోనే ఎక్కువగా నివసించినాజన్మస్థలం మాత్రం అనంతపురము జిల్లానే. రాయదుర్గంలోని గుమ్మగుట్ట మండలానికి చెందిన కలుగోడు అశ్వరరావు 'అశ్వర్థ భారతం' రాశారు. కుంటిమద్ది
శేషశర్మ మనుచరిత్రను సంస్కృతంలోకి అనువదించారు. రత్నాకర బాలరాజు
'బౌద్ధయుగం' అనే గ్రంథాన్ని రచించారు. డాక్టర్ సర్వేపల్లి రాసిన బ్రహ్మసూత్రాలుపుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. సి.వి.రామారావు, వి. భీమారావు పెర్ల్ బక్ రాసిన ' గుడ్ ఎర్త్' గ్రంథాన్ని సుక్షేత్రం పేరుతో తెలుగులోకి అనువదించారు. తలమర్ల కళానిధి 'దక్షిణేశ్వరభాగవతం' లాంటి అనేక పద్యకావ్యాలు రచించారు.

     __ పిళ్లా విజయ్,9490122229


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి