చేనేత సమస్యకు మూలాలు : పరిష్కార మార్గాలు


                  

1. పత్తి సరఫరా : విదేశాలకు ఎగుమతి 

పత్తి చేనేతకు ముడిపదార్ధం. ఇందులో (పత్తి వాడకం : చేనేతకు  50% , టెక్స్టైల్ పరిశ్రమలకు  50% కేటాయించాలని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి) 
దేశీయ అవసరాలు తీరకుండానే , విదేశీ మారకద్రవ్యం వస్తుందనే దురాశతో , స్థానిక అమ్మకం రేట్లకన్నా తక్కువ రేట్లకు మన దేశ కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పత్తిని ఎగుమతి చేస్తున్నది. అందువలన స్వదేశీ పరిశ్రమల్లో ముఖ్యమైన చేనేతకు ముడిసరుకైను పత్తి సరఫరా తగ్గిపోయింది. తత్ఫలితంగా పత్తి రేట్లు దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. 
(ఇది పత్తి బ్లాక్ మార్కెట్ లకు దారితీసింది)

పరిష్కారం : 

1. తక్షణం పత్తి విదేశీ ఎగుమతులు నిలుపుదల చేయాలి. 
2. (ఒకవేళ విదేశీ ఎగుమతులు తప్పనిసరి ఐనపక్షంలో )  పత్తి ఎగుమతి ద్వారా వచ్చిన విదేశీమారకంలో  50% చేనేతరంగానికి, చేనేత కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి.

2. స్పిన్నింగ్ మిల్లుల మోసం : 

        ముడి పత్తిని చేనేత, టెక్స్టైల్ పరిశ్రమల వినియోగానికి అనుకూలంగా మార్చేపని స్పిన్నింగ్ మిల్లులు నిర్వహిస్తాయి. వాటికి సరఫరా ఐన పత్తిలో 
 1.చేనేతకు అవసరమైన "చిలప నూలు" 50%
 2. టెక్స్టైల్ పరిశ్రమలకు అవసరమైన "కండె నూలు" 50% తయారుచేయవలసి ఉంటుంది. 
ఐతే , టెక్స్టైల్ పరిశ్రమదారుల ఆకర్షణలకు , లంచాలకు లోనైన స్పిన్నింగ్ మిల్లులవారు  టెక్స్టైల్ రంగానికి  ఉపయోగపడే కండెనూలు 75% , చేనేత రంగానికి ఉపయోగపడే చిలప నూలు 25% మాత్రమే తయారు చేస్తున్నారు. 
ఆవిధంగా స్పిన్నింగ్ మిల్లులవారి మోసానికి గురై 50% స్థానంలో 25% మాత్రమే ముడిపదార్ధమైన చిల‌ప నూలును పొందుతోంది. దాంతో చిలపనూలు కొరత ఏర్పడి , అధికధరలకు అమ్ముడౌతోంది. (బ్లాక్ మార్కెట్లో కూడా అందనంత ధరలున్నాయి)

పరిష్కారం : 

1. చిలపనూలు 50% తయారు చేయించాలి :         కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పిన్నింగ్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకొని , అందుబాటులోని పత్తిలో 50% చిలపనూలు తయారు చేయించితే  చేనేత రంగం నూలుకొరతనుంచి బైటపడుతుంది, నూలు రేట్లు తగ్గుతాయి, చౌకరేట్లకు  అధిక ఉత్పత్తికి దారితీసి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. 
2. స్పిన్నింగ్ మిల్లుల అవినీతి, లంచగొండితనం నిర్మూలించాలి , చిలపనూలు బ్లాక్ మార్కెట్లోకి తరలిపోకుండా నివారించాలి.
3. చిలపనూలు నేరుగా చేనేత ఉత్పత్తి సహకార సంఘాలకు నేరుగా సరఫరా జరిగే మార్గం లోపభూయిష్టంగా ఏర్పాటు చేయాలి. వ్యక్తులకు నూలు అమ్మకాలు నిషేధించాలి.

3. అందుబాటులో లేని  రంగులు, రసాయనాలు ధరలు  :

        నూలుతోపాటు చేనేత రంగానికి రంగులు, రసాయనాలు కూడా ముడిపదార్ధాలే. వీటి ధరలు ఎక్కువగా ఉండటం వలన చేనేత వస్త్రాల ఉత్పత్తి ధరలు అధికంగావుండి , కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోతున్నాయి. 

పరిష్కారం : 

1. చేనేత వస్త్రాల రంగులు వెలిసిపోకుండా నాణ్యత పెంచాలంటే ఈ రంగులు రసాయనాలు సబ్సిడీ/కంట్రోలు ధరలపై గవర్నమెంట్ సరఫరా చేయాలి. 
2. చెట్ల బెరడులు , ఇతర మూలికలద్వారా తయారుకాబడే సహజరంగులు వాడకంద్వారా ఉత్పత్తి ధరలు తగ్గడమేకాక పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది.

4. చేనేత ఉత్పత్తి & విక్రయాలు చేనేత సహకార సంస్థలకే రిజర్వు చేయాలి : 

              చేనేత వస్త్రాల విక్రయాలు చేసే వాణిజ్యం అందరకూ వీలుకల్పించడం వలన ఆయా విక్రయదారులు నాణ్యతలేని పవర్ మిల్లు వస్త్రాలు మొదలగువాటిని చేనేత వస్త్రాలుగా వినియోగదారులను మోసగించి అమ్మకాలు చేయడం వలన అసలైన చేనేత వస్త్రాల అమ్మకాలకు నష్టం వస్తున్నది , చేనేత వస్త్రాలపై  వినియోగదారుల నమ్మకం కోల్పోయేవిధంగా నష్టపడటం జరుగుతున్నది.

పరిష్కారం : 

1. చేనేత వస్త్రాలకు "ట్రేడ్ మార్క్" సింబల్ను కేటాయించాలి. 
2. చేనేత వస్త్రాల అమ్మకాలకు లైసెన్సు చేనేత వర్గాలవారికే రిజర్వు చేయడం వలన అమ్మకాలలో మోసాలు నివారించవచ్చును. ఉత్పత్తి దారులే తమ శ్రమకష్టం ద్వారా వచ్చిన లాభాలు అనుభవించే ప్రాధమిక హక్కును పొందగలుగుతారు. 

3.  కులవృత్తుల ఉత్పత్తి, విక్రయాలపై హక్కు కోల్పోయినచో , ఇంక కులమెందుకు ? కులవృత్తులు ఎందుకు ??

        కులవృత్తుల ఉత్పత్తి, అమ్మకాలపై అధికారం కోల్పోయిన కులాలు తమకు ఆర్థిక సమానత్వం కల్పించి , కులవ్యవస్థను రద్దుచేయమని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక సమానత్వం మన ప్రభుత్వాలు ఎలాగూ చేయలేవు / చేయడానికి సిద్ధంగా లేవు కాబట్టి, ఉత్పత్తి విక్రయా‌లను వృత్తిదారులకే రిజర్వుచేయడం తేలిక.

5. చేనేత కార్మికులకు  ఇల్లు +వర్క్ షెడ్ లు ఒకేచోట ప్రభుత్వం నిర్మించాలి. నివాసం, పనిచోటులు వేరువేరుగా ఉండటం వలన నష్టం జరుగుతున్నది. 

పరిష్కారం : 

1. భారత రాజ్యాంగం లోని ప్రాధమిక హక్కుల ప్రకారం  ప్రభుత్వాలు ఎలాగూ ప్రజలకు ఆరోగ్యవంతమైన పరిసరాలలో నివాసయోగ్యమైన గృహాలు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పనిలో పనిగా  గృహనిర్మాణం సమయంలోనే నివాస గృహాలతోపాటుగా చేనేత మగ్గాలషెడ్ లు నిర్మించడం ద్వారా పనికి అంతరాయాలు తొలిగి ఉత్పత్తులు అధికంగా తయారౌతాయి. 
2. చేనేత కార్మికులకు వాహనాలు ఉండవు. కావున అపార్ట్ మెంట్లలోని  పార్కింగ్ ప్లేస్ లో మగ్గాలకు వర్క్ షెడ్ లు , పై అంతస్థుల్లో నివాసం కల్పించడం ద్వారా ప్రభుత్వం అటు తమకు , ఇటు చేనేతవర్గాలకు మేలుచేసినవారౌతారు.
3. చేనేత కార్మికుల నివాసానికి ప్రభుత్వం అపార్ట్ మెంట్లు నిర్మించడం ద్వారా తక్కువ స్థలం నివాసానికి పోగా , మిగిలిన స్థలంలో  ఉత్పత్తి లో అవసరమైన పడుగులు బాగుచేసుకొనే పనికి , రంగులు వేసుకునే పనికి , విక్రయశాలల ఏర్పాట్లకు ఉపయోగకరంగా ఉంటుంది. 

6. చేనేతకు రిజర్వైన వస్త్రాల ఉత్పత్తిని ప్రభుత్వం కాపాడాలి. ఆ రిజర్వేషన్లు ప్రభుత్వం పాటించకపోవడం వలన చేనేత రంగానికి ఆర్థిక నష్టం , గుడ్ విల్ నష్టం కలుగుతున్నాయి : 

పరిష్కారం : 

1. చేనేతకు రిజర్వుచేయబడిన వస్త్రాలు టెక్స్టైల్ మిల్లులు, మరమగ్గాలపై ఉత్పత్తి కాకుండా నిరోధించడం ద్వారా చేనేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. 
వినియోగదారుల నమ్మకాన్ని తిరిగి పొందడం ద్వారా వస్త్రాల వ్యాపారం బాగా జరిగి కార్మికుల ఆదాయం మెరుగవుతుంది. ఇది జరగడం ప్రభుత్వానికి కూడా లాభమే. 

7. చేనేత రంగం అభివృద్ధి ప్రభుత్వానికి లాభం, లేనిచో నష్టం : 

పరిష్కారం : 

1. చేనేతరంగంలో 19 ఉపకులాలవారు వృత్తిని చేస్తున్నారు.  వారిది స్వతంత్రంగా ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపని వృత్తి, ఉద్యోగాలు చూపించాల్సిన అవసరంలేని వృత్తి.  కాబట్టి చేనేత కార్మికులు ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉంటే ప్రభుత్వానికి తలనొప్పి ఉండదు. 

2. చేనేత ఉత్పత్తి పర్యావరణానికి హాని చేయదు.  కాబట్టి పర్యావరణ కార్యక్రమంలో ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 

8. వృత్తి రక్షణ చర్యలు చేపట్టకుండా , కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు పరిమితమవ్వడం ప్రభుత్వానికి నష్టం : 

పరిష్కారం : 

1. "వృత్తులకు రక్షణ కల్పిస్తే అవి వృత్తిదారులను పోషించుకో గలవు "
   ప్రజల వృత్తులు ఏవైనా ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేయవలసిందే.  కానీ వృత్తి రక్షణ సరైన పద్ధతిలో చేస్తే , వృత్తి వృత్తిదారులను బ్రతికించుకోగలవు.  కాబట్టి వృత్తి రక్షణ చర్యలు తీసుకోవడం ఇక్కడ ప్రధానం. అంతేగాని చేనేత కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అందరితోపాటు చేయవలసిందే. కానీ ఆ కార్యక్రమాలు వృత్తిని బ్రతికించలేవు. 

2. కొందరు దళారీ చేనేత నాయకులు వృత్తి రక్షణ బదులు చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు అమలుజరపమని ప్రభుత్వాన్ని అడగడం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఇందువలన చేనేత వృత్తి రక్షణ జరగదు. 

9. ఆప్కో సంస్థవలన చేనేతకు కీడు జరుగుతున్నది. 

         చేనేత సహకార సంఘాల మూలధనంతో , చేనేత ఉత్పత్తుల అమ్మకం సులభతరం చేయడానికి ఏర్పాటు చేసుకున్నదే "ఆప్కో" సంస్థ. అది చేనేత ఉత్పత్తులను చేనేత సహకారసంఘాలనుంచి సేకరించి , విక్రయదుకాణాలు నిర్వహించాల్సిన బాధ్యతలు చేయకపోగా ఒక పే......ద్ద "తెల్ల ఏనుగు" లాగా తయారైంది. తమ సిబ్బంది జీతభత్యాలు, విక్రయశాలల నిర్వహణ నిమిత్తం అవి సహకారసంఘాల వద్ద కమీషన్లు కొడుతున్నాయి. 
          పైగా అవి ఉత్పత్తులు చేనేత సహకార సంఘాలనుంచి అప్పుగా తీసుకొని , తర్వాత అమ్మకం ఖరీదులు ఇచ్చే పద్ధతిలో నడుస్తున్నాయి. పైగా పేరుకుపోతున్న ఉత్పత్తులు ఆప్కోకి ఇవ్వడానికి కూడా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు రావాల్సిన డబ్బులు రాబట్టేందుకు కూడా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. 

పరిష్కారం : 
1. ఆప్కో విక్రయకేంద్రాలను ప్రభుత్వం నిర్వహించాలి.  
2. ఆప్కో విక్రయకేంద్రాల ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి వారి జీతభత్యాలు ప్రభుత్వమే భరించాలి. 
3. ఆప్కో ఉద్యోగాలు చేనేత రంగంలోనివారికే రిజర్వు చేయాలి. 

చేనేతపై పూర్తి అవగాహనతో ఉన్నవారికి
మాత్రమే చేనేత రంగానికి చెందిన బాధ్యతలు ప్రభుత్వం కేటాయిస్తే చేనేత రంగం బాగుపడుతుంది. కానీ అలాంటి నిస్వార్ధపరులకు మన ప్రభుత్వాలు పదవులు ఇవ్వరుగదా ! లంచగొండులైన దళారీలకే పదవులు లభిస్తున్న కాలమిది. 

 "చేనేతను రక్షించడం మానాన్ని కాపాడ్డం !"


స్వతంత్రానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో  "ధామస్ కమిషన్" ఇచ్చిన నివేదికను అమలు పరచడమే !!

(చేనేత దినోత్సవం (ఆగస్టు7) సందర్భంగా)
                       -- ఆకురాతి మురళీ కృష్ణ,



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి