రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు
రాయలసీమలోని ప్రధాన నదులు - వాటి పేర్ల అర్థాలు
“కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్
ఇది కడప గురించి చెప్పబడ్డా, మొత్తం రాయలసీమకు అన్వయించవచ్చు. కృష్ణా, పెన్నా నదులే కాక అనేక నదులు రాయలసీమ జిల్లాల ద్వారా ప్రవహిస్తున్నాయి.
కృష్ణా నది - కృష్ణవేణి - నల్లని నది - నల్లని జడ - కృష్ణ(కణ్ణ) వెణ్ణ(వేణి) నదుల సంగమం - నల్లరేగడి భూముల మీదుగా ప్రవహించునది. శ్రీశైలం వద్ద ఆనకట్ట కట్టబడింది.
తుంగభద్ర - తుంగ నది , భద్ర నది కలయిక వలన ఏర్పడినది - కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది. మల్లాపురం వద్ద తుంగభద్ర బ్యారేజీ ఉన్నది. ప్రసిద్ద క్షేత్రమైన మంత్రాలయం వద్ద ఈ నది రాయలసీమలో ప్రవేశించి ఆలంపూర్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
పాపాఘ్ని - పాపాలను దహించునది - పెన్నా నదికి ఉపనది - వేంపల్లి వద్ద పాపాఘ్ని తీరంలోనే గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రసిద్ద శైవ క్షేత్రం వీరపునాయుని పల్లె వద్ద కల సంగమేశ్వర ఆలయం కూడా పాపాఘ్ని తీరాన ఉన్నది.
పెన్నా -ఉత్తర పినాకిని - పినాకిని అంటే పినాక నుండి ఉద్భవించింది అని అర్థం. శివుని ధనస్సు పినాక రెండు నంది కొండల వద్ద రెండు పాయలుగా ఉత్తర పినకిని (పెన్నా) దక్షిణ పినాకిని(పాలారు) నది అయ్యాయి. ప్రసిద్ద క్షేత్రాలు తాడిపత్రి ఆలయాలు, పుష్పగిరి, గండికోట ఈ నదీ తీరంలోనే ఉన్నాయి
చెయ్యేరు - సంస్కృతంలో బాహుద అని కూడా పేరు - అంటే చెయ్యి ఇచ్చునది అని అర్థం - పెన్నానదికి ఉపనది- ఈ నది తీరంలోనే అత్తిరాల ఆలయ క్షేత్రాలు, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. చెయ్యేరు నది మీద ఆకేపాడు వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు ఉన్నది. ఈ నది పేరు వెనక ఒక కథ ఉన్నది. లిఖితుడు అను బ్రాహ్మణుడు ఒకరోజు ఆకలితో యజమాని అనుమతి లేకుండాఒక తోటలోని చెట్టు పండ్లు తిని, తన తప్పును పొత్తప్పి రాజు దగ్గర అంగీకరించగా, రాజు ఆ బ్రహ్మణుడికి దండనగా చేతులు ఖండించగా, లిఖితుడు తరువాత ఈ నదిలో మునిగి లేయగా తన చేతులు తనకు తిరిగి వచ్చాయి. చెయ్యి ఇచ్చిన నది చెయ్యేరు
కుందేరు - కుందూ నది - సంస్కృతంలో కుముద్వతి అని పేరు - కుముద్వతి అంటే తెల్ల కలువ తీగ - సీతారాముల కుమారుడు కుశుడి భార్య పేరు కూడా కుముద్వతి. కర్నూలు జిల్లాలో సున్నపు నేలల మీదుగా ప్రవహించటం వల్ల తెల్లగా ఉన్న నీటి వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమే రేనాటి సీమ
స్వర్ణముఖి - శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది. మరో కథ ప్రకారం ఆగస్త్యుని తపస్సు మేరకు శివుని అనుగ్రహం వలన గంగమ్మ స్వర్ణ కాంతులతో భూమి మీదకు వచ్చింది కాబట్టి స్వర్ణముఖి అయ్యిందని ఈ నదీ తీరంలో ఇసుక రేణువులు బంగారు వర్ణంలో ఉండటం చేత స్వర్ణముఖి అయ్యిందని ఇంకో కథనం. ప్రసిద్ద శైవ క్షేత్రాలు అయిన కాళహస్తి, గుడిమల్లం ఈ నది తీరంలో ఉన్నాయి. తిరుపతి ప్రధాన నీటి వనరు కళ్యాణి డాం కూడా స్వర్ణముఖి నది మీదే ఉంది.
మాండవ్య నది - బాహుదా నదికి ఉపనది. మాండవ్య మహర్షి పేరు మీద ఈ పేరు వచ్చి ఉండవచ్చు. రాయచోటి వీరభద్రాలయం ఈ నది ఒడ్డున ఉంది
హగరి - వేదవతి : అఖ(పాపాలు) హరి(హరించేది) - పాపాలు హరించే నది కాబట్టి హగరి - ఈ నదినే వేదవతి అని కూడా అంటారు. ఈ నది తుంగభద్ర నదికి ఉపనది
ఇవే కాక ఇతర ముఖ్య నదులు - పింఛా (బాహుదా నది ఉపనది) హంద్రీ (ఆంధ్ర అన్న పదం హంద్రీ నుంచి వచ్చింది అంటారు), సగిలేరు(స్వర్ణబాహు), వక్కిలేరు, చిత్రావతి(పుట్టపర్తి ఈ నదీ తీరంలోనే ఉంది), గాలేరు, నీవా, కాళంగి, పీలేరు నది బుగ్గవంక (కడప పట్టణం మీదుగా ప్రవహిస్తుంది) కుషావతి /కుశావతి (బహుశా సీతారామచంద్రుల కుమారుడు కుశుడు పేరు మీద ఈ పేరు వచ్చి ఉండవచ్చు ) జయమంగళ మొII
దురదృష్టవశాత్తూ వీటిలో జీవనదులు అతిస్వల్పం. దీనికి పాలకుల నిర్లక్ష్యం తోడవడంతో ఇన్ని నదులున్నా రాయలసీమ కరువు కోరల్లో విలవిలలాడుతోంది. ఈ దురవస్థ చూసే పెన్నేటి పాటలో విద్వాన్ విశ్వం గారు ఇలా రాశారు
ఇంత మంచి పెన్నతల్లి
ఎందు కెండి పోయెనో?
ఇంతమంది కన్న తల్లి
ఎందు కిట్లు మారెనో?
___రవితేజ రెడ్డి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి