నిత్య పూజ కోన .
లంకమల అడవిలో అందాల ఆధ్యాత్మిక క్షేత్రం
==============================
కడప జిల్లా శివాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి కొండకోనల్లో చాలావరకు శివుడి ఆలయాలు కనిపిస్తాయి. అలాంటి ఆధ్యాత్మిక ప్రదేశమే నిత్యపూజ కోన క్షేత్రం. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు గుట్టల మధ్య ప్రయాణం ... ఇవీ నిత్యపూజకోనకు వెళ్లే మార్గం లోని అనుభూతులు. దీనికి తోడు ఉరికే జలపాతాలు, ఎత్తైన చెట్ల మధ్య లో సవ్వడి చేసే సెలయేళ్ళు అక్కడి అందాలను మరింత ధ్విగిణీకృతం చేస్తుంటాయి .
ఈ క్షేత్రానికి నిత్య పూజ కోన అనే పేరు రావటానికి కారణం అక్కడ దేవతలు శివుణ్ణి నిత్యం పూజిస్తుంటారు కనుక ఆపేరు వచ్చింది .... కోరిన కోర్కెలను తీర్చే నిజమైన స్వామిగా పూజలందుకుంటున్న నిత్య పూజ స్వామి లీలలు అన్నీ ఇన్నీ కావని చెబుతారు భక్తులు.
అక్కడికి ఎలా వెళ్ళాలి ?
రవాణా మార్గం కడప నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దవటం చేరుకోవాలి.అక్కడి నుంచి దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. బస్సు మార్గంలో అయితే 12 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. కడప నుంచి ప్రతి సోమవారం ఒక ఆర్టీసీ బస్సు ఉంది.
నడక మార్గం పంచలింగాల గుడి నుంచి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది
అలా మార్గం వెంబడి నడుచుకుంటూ వెళితే ముందుగా కనిపించేది అందమైన జలపాతం. భక్తులు ఆ జలపాతం లో స్నానాలు ఆచరించి నిత్య పూజస్వామి దర్శనానికి మెట్ల మార్గాన వెళతారు. అలా చివరకు వెళ్ళిన తరువాత ఒకపక్క లోయ, మరో పక్క బండరాళ్ల కొండ కనిపిస్తుంది. దాని కింద నిత్య పూజస్వామి లింగం రూపంలో దర్శనం ఇస్తాడు. అలాగే కాస్త ముందుకు వెళితే ఒక గుహలో ఆవిర్భవించిన లింగం సాక్షాత్కరిస్తుంది. కానీ గుహలోకి వెళ్ళటమే పెద్ద కష్టం.
సాక్షాత్తూ శివుడే నిత్యానంద ఋషి అవతారమెత్తి కొండ సొరంగ మార్గంలోని గుహలో తపస్సు చేస్తూ శివలింగం గా మారినట్లు స్థానిక పూజారులు చెబుతారు.
ఈ క్షేత్రంలో వారంలో ఒకరోజు (సోమవారం) అన్నదానం నిర్వహిస్తారు. క్షేత్రంలోని పరిసర ప్రకృతి అందాలు పర్యాటకులను, భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వర్షాకాలం అయితే నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి