వేమన - కడప



2000 వేలకు పైగా సరళ తెలుగులో పద్యాలు రాసి, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను ఎలుగెత్తి ప్రశ్నించిన వేమన ప్రజాకవి.

వేమన పుట్టిన ఊరు ఏదన్న విషయంలో పరిశోధకుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వేమనది కడప జిల్లా అన్నది అత్యధికుల మాట. వేమన పేరుతో కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పారు. మరి వేమన కడప జిల్లాకు చెందినవాడు అనడానికి రుజువులు ఏమిటి ?

వేమన పద్యాలను సేకరించి వెలుగులోకి తెచ్చిన బ్రౌను వేమన పుట్టుపూర్వోత్తరాల గురించి చెపుతూ 
వేమన కాపు కులస్థుడని కర్నూలు ప్రాంతానికి  చెందినవాడని, కాదు గుంటూరు ప్రాంతానికి చెందినవాడని, అది కూడా కాదు కడప జిల్లాలోని   చిట్వేలి గ్రామంలో పుట్టడని కొన్ని వాదనలు ఉన్నాయని అయితే ఖచ్చితంగా ఇదీ వేమన జన్మస్థలం అని నిర్ధారించే సమాచారం ఏదీ దొరకలేదని అంటాడు. 

(వేమన పద్యాలు -The Verses of Vemana - Moral, Relivious and Spiritual - Translated by Charles Philip Brown )

1875లో విడుదల అయిన కడప మాన్యువల్ (The Manual of The District of Cuddapah In the Presidency of Madras ) వేమన గురించి ప్రస్తావిస్తూ కదిరి ప్రాంతంలో (అప్పటికి అనంతపురం జిల్లా ఏర్పడలేదు, కదిరి కడప జిల్లాలో భాగంగా ఉండేది) వేమన అనే గురువు / ఆధ్యాత్మిక వేత్త ప్రభావం ఉందని, అతనికి అనేకమంది అనుచరులు ఉన్నారని, కటారుపల్లిలో వేమన సమాధి ఉందని పేర్కొన్నారు. 

అయితే వేమన కడప జిల్లాలోని చిట్వేలిలో జన్మించాడు అనడానికి జానుమద్ది హనుమచ్ఛాశాస్త్రి గారు కీ. శే. శ్రీ వేదము వెంకట కృష్ణశర్మ గారు కోడూరు ప్రాంతంలో సేకరించి భద్రపరచుకున్న కొన్ని పద్యాలను ఉదహరిస్తారు (రాయలసీమ వైభవం పుస్తకం )

చిట్టివేలి సీమ చెలిగి పుట్టుకనిచ్చే
కొండవీటి చెరుగ గోర్కె తీర్చె
మూగ చింతపల్లె ముక్తి మార్గము చూపె
విశ్వదాభిరామ వినురవేమ.

చిట్టివేలి చెన్ను జేరి కొల్చెను తల్లి
పుట్టుకిచ్చి తాను ముక్తికాగా
కొండగుట్ట చేర గోర్కెలు మెండాయె
విశ్వదాభిరామ వినురవేమ

పై రెండు పద్యములు వేమన  కడప జిల్లా చిట్వేలి వాసి అని తెలియజేస్తున్నాయి.

#సీమరత్నాలు #సీమకవులు #వేమన #కడప #Kadapa

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి