నాటి మల్లుల కొండే నేటి మల్లేం కొండయ్య
కడప జిల్లా మెఖంజీ కైఫియత్తుల్లో (బొడ్డేచెర్ల గ్రామం
గోపవరం మండలం,బద్వేలు,కడప( వైఎస్సార్) జిల్లా లోని మల్లెం కొండయ్య గురించి
పెదవీరమల్లుడు చినవీరమల్లుడు అనే సోదర రాజులు మల్లెం కొండ ప్రాంతంలో వేటకు వచ్చారు {ఐతే వీరు ఏ ప్రాంతపు రాజులు} పెదవీరమల్లుడు నిండు చూలాలుగా వున్న అడవి పందిని తరుముకుంటూ పోగా, అది ఒక కొండ మీద నుండి కోనలో దూకి ప్రాణాలు విడిచింది. దాని కడుపు పగిలి ఐదు లింగాలు బయటపడ్డాయి {బహుశా మెఖంజీ గారు విషయ సేకరణకెల్లినప్పటికే అసలు చరిత్ర మరుగున పడిపోయి జానపదుల్లో ఈ మహత్యాల జాఢ్యం పేరుకుపోయినట్టు కనిపిస్తోంది} అది శివుని మహిమగా భావించి ఆ సోదరులు ఆ లింగాలను ప్రతిష్టించారు. ఆ ప్రాంతం పంచలింగాల కోన అయ్యింది. ఆ ప్రాంతంలోనే ఆ సోదరులు కోట కట్టుకున్నారు అదే లింగాల కోట అన్నారు { చరిత్రలో ఇలాంటి కథలు జానపదుల్లో చాలానే వుండడం గమనించవచ్చు, ఉదా: హరిహర బుక్కలు ఇలాగే వేటకెల్లి అనువైన ప్రదేశంలో కోట కట్టుకోవడానికై ప్రాచుర్యంలోకొచ్చిన కథ మనకందరికీ తెలిసిందే. అదే విధంగా అనంతపురం బుక్కరాయసంద్రం తర్వాత ఏడావుల పర్తి దయ్యాలకుంట పల్లి తర్వాత వచ్చే దుర్గం అనే అడవి ప్రాంతానికి పాలచెర్ల నుండి వేటకెళ్ళిన సాకే పెంబనాయక తిమ్మనాయకుడనే వాడు అక్కడి పరిసరాలకు అనువుగా వుండేలా స్వర్గాన్ని మించేలా అమరావతిని పోలిన కోట కట్టాలని కొండ నెత్తి మీద తాటికాయంత అక్షరాలతో లాంఛనంగా శిలాఫలకం వేయించినప్పటికీ, బహుశా ఆ శాసనంలో ఎక్కడా అప్పటి దక్షీణాది చక్రవర్తి క్రిష్ణదేవరాయల పేరు లేకపోవడంతో ధిక్కారంగా భావించి బహుశా ఆ కోటను పునాది స్థాయిలోనే హంపీ విజయనగర సైన్యం లేదా స్థానిక ఇతర పాలేగాళ్ళు రాయలు ఆదేశం మేరకు నేలమట్టం చేసినట్టుగా కనిపిస్తోంది, కాకపోతే ఈ విషయం ఇంకా పరిశోధించబడలేదు. ఆ శాసనం కూడా ఆ వూరి ప్రజలు అపోహలతో నాశనం చేసారనుకోండి అది వేరే విషయం}
ఆ రాజులిద్దరికీ మేనల్లుడు ఏరువరాజు. కోటకు తూర్పున విస్తరించి వున్న ఏపి, రేల చెట్లను నరికి ఏపెరేల అనే గ్రామం నిర్మించాడు. దాన్నే ప్రస్తుతం ఎప్పిరాలని పిలుస్తున్నారు {నరకడం వల్ల కాకుండా అక్కడా చెట్లెక్కువగా వుండడం వల్ల ఆ పేరు వచ్చే అవకాశాలే ఎక్కువ లేదంటే నిర్మించినతని పేరొచ్చిండాలిగా} కొంత కాలానికి నెల్లూరు సిద్ధిరాజుకి పొత్తపి పాలకుడు మల్లదేవ సోమదేవులకు దొంగలసాని ప్రాంతంలో యుద్ధం జరిగింది. సిద్ధిరాజుకు సహాయంగా పెదవీరమల్లుడు యుద్ధంలో పాల్గొన్నాడు, వారిద్దరూ ఆ యుద్ధంలో మరణించారు. వారికి సంభందియైన వాడు శివమహాదేవరాజు లింగాల కోట దొరతనం చేస్తూ వున్నాడు {బహుశా అదే యుద్దంలో అన్నతో పాటూ చినవీరమల్లుడు కూడా చనిపోయినట్టున్నాడు} ఆయన మేనత్త కొడుకు రామవద్దేవరాజు తన తోబుట్టువునిచ్చి పెళ్ళి చేసాడు శివమహాదేవరాజు. వారికి గంగరాజనే కుమారుడు జన్మించాడు.
పూర్వం పెద మరియు చినవీరమల్లులకు మండువ కోట పాలకుడు మండువతాతతో వైరం వున్న కారణంగా, అప్పటి ఆ పగని తీర్చుకోవడానికి శివమహాదేవరాజు మండువ కోటపై దాడికి గంగరాజుని పంపాడు {ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పెద చిన వీరమల్లులు దొంగలసాని వద్ద యుద్దంలో మరణించగా గంగరాజు పొత్తపి మీద యుద్దానికి వెళ్ళకుండా మండువ కోటపై దాడికెందుకెళ్ళాడన్నది ప్రశ్నార్థకం} మండువ కోటపై విజయం సాధించిన గంగరాజు మండువతాతను బందీగా పట్టుకొన్నాడు. కానీ యుద్దంలో తగిలిన గాయాల వల్ల కోలుకోలేక పోయిన గంగరాజు కొంతకాలానికి కైవల్యం చెందాడు. లింగాల కోట వద్ద పట్నంలో ప్రజలు గంగరాజు శిలను నిలిపారు. గుర్రం మీద స్వారీ చేస్తూ గొడుగు పట్టబడి ఒక చేతిలో కత్తి వున్నట్లు ఆ శిల మీద చెక్కారు. ఆ శిల్పాన్ని మల్లెం కొండ అనే పర్వతం మీదుంచారు. ఆ గంగరాజు విగ్రహానికి మల్లెం కొండయ్య అని పూజలు చేయడం మొదలెట్టారు. { నాకు తెలిసి ఇదసలు గంగరాజు విగ్రహమే కాదని ఘంటాపథంగా చెప్పగలను ముందుకు చదవండి} ఈ పూజలు ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి, జనం వచ్చి మల్లెం కొండయ్యను దేవుడిగా పూజిస్తూ పొంగళ్ళు పెడుతూ సీడులు సాగిస్తూ దేవాలయం కట్టించి మాన్యాలు యేర్పాటు చేసి తిరుణాల్లు చేస్తూ వున్నారు.
శివమహాదేవరాజు రామవద్దేవరాజులు గతించాకా కోట పాడుపడింది, కోటకున్న కంచు తలుపులు కోటకున్న వుత్తరం వైపు బావిలో వేసారని చెప్తారు {ఎవరు? ఎందుకు! కోటకున్న రాళ్ళే పీక్కెళ్ళి తమిళ్ళకు పునాది రాళ్ళుగా వేసుకునే ప్రజాబాహుళ్యంలో కంచును ఒదిలిపెడతారా!?} ఇప్పటికీ కోట దిబ్బ ప్రాంతంలో శివలింగాలు పానవట్టాలు లభిస్తాయి. ఇప్పుడా ప్రాంతాన్ని రైతులు దున్ని వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఆధారం : 1. మెఖంజీ కైఫియత్తులు కడప జిల్లా నాలుగో భాగం జువ్వల పల్లె
2. వై యస్ ఆర్ జిల్లా ఆరో భాగం సిద్దవటం మహత్యం
ఇక అసలు విషయానికొచ్చి ముందుగా విగ్రహాన్ని పరిశీలిస్తే అందులో ముందుగా గుర్రంపై కూర్చున్న వ్యక్తిని బాగా పరిశీలిస్తే అతని ఆహార్యం రాజోచితమైన అలంకరణ చేతిలో ఖడ్గం మరియు వెనుక సేవకుడు ఛత్రం పట్టడమే కాక ఆ గుర్రాన్ని ఒక రాజాశ్వంగా అలంకరించిన పద్దతిని పట్టి అతనిక ఖచ్చితంగా రాజే అని చెప్పచ్చు. ఇక అతను కైఫియత్తుల్లో చెప్పినట్టుగా గంగరాజు అయ్యే అవకాశమే లేదు, ఎందుకంటే ఆ గుర్రం నిలబడ్డ తీరు గమనించండి. శిల్పశాస్త్రంలో గుర్రం మీద మనిషి స్వారీ చేస్తున్నప్పుడు చెక్కడానికో పద్దతుంది? అదేమంటే గుర్రం నాలుగు కాళ్ళ మీద నిలబడి వుంటే ఆ గుర్రం మీద స్వారీ చేసిన వ్యక్తి మామూలుగా అనారోగ్యంతోనో ముసలితనంతోనో పోయాడని అర్థం, ఇక ముందరి రెండు కాళ్ళలో ఒక్క కాలు మాత్రమే పైకి లేపి మూడు కాళ్ళ మీద వుందంటే దానర్థం ఆ గుర్రం మీద స్వారీ చేసిన వ్యక్తి యుద్దంలో పాల్గొన్నప్పటికీ ఆ యుద్దంలో తగిలిన గాయాల వల్ల తర్వాతెప్పుడో మరణించాడని అర్థం. ఇక ముందు రెండు కాళ్ళూ గుర్రం లేపి నిలుచుందంటే ఆ గుర్రం స్వారీ చేస్తున్న వ్యక్తి ఖచ్చితంగా యుద్దభూమిలోనే వీరమరణం పొంది వుంటాడని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.
కాబట్టి కైఫియత్తుల ప్రకారం యుద్దానంతరం గంగరాజు మరణించినట్లుగా వుండడమే దీనికి ప్రబల నిదర్శనం. మరైతే ఆ విగ్రహం ఎవరిది అన్న ప్రశ్నకు నా సమాధానమేమంటే అది తప్పకుండా పొత్తపితో జరిగిన యుద్దంలో మరణించిన చినవీరమల్లుడుదే అయ్యే అవకాశాలే ఎక్కువ. మరి ఇద్దరు వీరులు కదా మరణీంచింది ఒక్కరిదే అదీ చిన్నవాడి విగ్రహం మాత్రమే ఎలా పెడతారు అంటే? మన వివేక్ లంకమల చెప్పిన ప్రకారం ఇలాంటి విగ్రహం ఏ పైకప్పు లేని దేవాలయంలో మరోటి వుందని కాకపోతే ఆ విగ్రహంలో వున్న వ్యక్తికి మీసాలున్నాయని తెలియజేసాడు. కాబట్టి అగ్రజుడిగా పెదవీరమల్లుడికి రాజపూజ్యమిస్తూ దేవాలయం లోపల అతడి విగ్రహం పెట్టుంటారని నా సంపూర్ణమైన విశ్వాసంతో కూడిన వాదన. ఒకవేల కైఫియత్తుల్లో చెప్పినట్లుగా అక్కడున్నది గంగరాజు విగ్రహమే ఐతే గుర్రం మూడు కాళ్ళ మీదుండాలి ఆ ప్రాంతానికి గంగరాజుకొండనో రాజుల కొండనో పేరొచ్చుండాలి. ఇక్కడ మనకు బాగా అర్థమవుతున్నదేమంటే మల్లుల కొండనే కాలక్రమేణా మల్లెం కొండగా మార్పు సంతరించుకొని వుంటుందని ఇట్టే అర్థమౌతోంది. ఇక పైనున్న శివలింగం శివైక్యానికి గుర్తుగా అతను శివమతావలంబీకుడని చెప్తున్నట్లుగానే కిందున్న రెండు కుక్కలు కొంత ఆలోచనలో పడవేయక మానవు. సామాన్యంగా వేటకెళ్ళేటప్పుడు అట్టహాసంగా కుక్కలతో వెళ్ళడం మామూలే అలా వేటకెల్లిన సంధర్బంలో శత్రువులు దాడి చేయడం వల్ల వీరు మరణించారా అన్నది చరిత్ర పరిశోధకులు నిర్దారించాల్సిన సత్యం.
మరి కైఫియత్తులకే నీవు పేర్లు పెడతావాని నా మీద ఆశ్చర్యపోవచ్చు, మెఖంజీ నిజానికి అంత గాఢంగా ఏదీ పరిశీలించినట్టు లేడు ఆయన గుర్రం మీద వెళుతూ సేవకులు అనుసరిస్తుంటే ఒక్కో ప్రాంతానికి వెళ్ళి అక్కడి స్థానికులు వివరించిన అంశాలను తన సేవకులు తర్జుమా చేయగా రాసి గ్రంధస్థం చేసాడంతేనని భావించాల్సుంటుంది. నిజానికి చరిత్రపై ఆసక్తితో మాన్యనీయులు విజయకుమార్ జాదవ్ గారి పర్యవేక్షణలో నాకున్న పరిజ్ఞానం మేరకు చరిత్రను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న నాకు అవగతం అయిండేదేమంటే రాయలసీమ చరిత్రను సరిగా అధ్యయనం చేయలేదని, ఇక్కడి యూనివర్శిటీల్లోని చరిత్ర పరిశోధకులు తమకు సేవలు చేసుకొని కాపీ పేస్ట్ చేసిన వాల్లకు చరిత్ర అధ్యయనంల డాక్టరేట్లు కట్టబెట్టారని అనిపిస్తోంది నాకు. ప్చ్ మునుపటి పాలకులు ఇక్కడి కరువు ప్రాంతంపై వేసిన శీతకన్నే కాక చైనా స్కూల్లొచ్చి చరిత్రన్న అంశాన్నే విద్యార్థి స్థాయిలోనే నాశనం చేసాకా స్వార్థపరులైన నిధుల వేటగాళ్ళ తవ్వకాలకు సగానికి సగం నాశనమైపోయాకా దేవాదాయశాఖ అభివృద్ధి పేరుతో చారిత్రక ప్రాశస్తాన్ని దుంపనాశనం చేసాకా టూరిజం పేరిట వ్యభిచార కేంద్రాలను నడపడం మొదలెట్టాకా ఇంకా మిగిలిపోయున్న శిథిలాల్లో కంకాళ్ళాల్లాగా చరిత్ర పరిశోధకుల కోసం కాస్తంతైనా వెలుగులోకి రావాలని దింపుడు కళ్ళెం ఆశల్తో ఎదురుచూస్తోందన్నది సత్యం సత్యం సత్యం.
(అశేరా)
Adavala Seshagiri Rayudu
INTACH Life Member
{Indian national trust for arts and cultural heritage }
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి