రాయలసీమలో ప్రాచీన మానవుని అడుగుజాడలు



రాయలసీమలో ప్రాచీన మానవుని అడుగుజాడలు

             తెలుగునేలపై ఆదిమానవుని అడుగు జాడలను రాయలసీమ లో  పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీంతో ప్రాచీన చరిత్రకు సంబంధించిన,మూలవాసుల సంస్క్రతీ సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నోవిశేషాలు వెలుగులోకి వచ్చాయి. . వివిధ ప్రదేశాల్లో దొరికిన అనేక రకాల పనిముట్లను , వాటి పరిమాణాలను బట్టి ఆనాటి మానవుల జీవన విధానాన్ని అంచనా వేశారు.           
            పాతరాతియుగమానవులు నదీ ప్రవాహాల వెంట తిరుగుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహల్లోనూ , చరియల కింద నివసిస్తూండేవారు . ఆహారం కోసం జంతువులను వేటాడి , సంచార జీవనం గడపే , ఆ కాలాన్ని ఆహార సేకరణ దశ అని అన్నారు . వాతావరణం , జీవన గమనంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  కొత్త రాతియుగంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు. కొత్త రాతియుగం తరువాత ఇనుపయుగంలో ఇనుప పనిముట్లు , స్థానికంగా ఉన్న రాతివనరులు , సమాధుల నిర్మాణానికి దోహదం చేసింది.
  
             రాయలసిమలో మధ్య , కొత్త రాతి , ఇనుప యుగాలకు చెందిన శిలాయుగపు చిత్రలేఖనాలున్న స్థావరాలను చింతకుంట , జమ్మలమడుగు , పాలకొండ , ( కడప ) , గాలిబండ ( చిత్తూరు ) , ఆదోని , బొల్లారం , కేతవరం , పులిచెర్ల ( కర్నూలు ) , నాయుడుపల్లి ( ప్రకాశం ) , తెనగల్ , వేల్పు మడుగు ( అనంతపురం ) లలో గుర్తించారు.

       చరిత్ర పూర్వయుగానికి చెందిన దిగువ పాతరాతి యుగం క్రీ . పూ . 1.5 లక్షల నుంచి 1.25 లక్షల సం!!లు , మధ్యపాతరాతి యుగం క్రీ . పూ .1.25 లక్షల నుంచి 40 వేల సం.లు , ఎగువ పాతరాతియుగం క్రీ .పూ . 40 వేల నుంచి 8000 సం.లు , మధ్యసూక్ష్మరాతి యుగం క్రీ . పూ . 8000 నుంచి 3000 సం.లు , కొత్తరాతి యుగం క్రీ .పూ .3000 నుంచి 1000 సం.లు , ఇనుపయుగం క్రీ .పూ.1000 - 600 సం.లుగానూ పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు . 
              ‌చరిత్రపూర్వ యుగంలో ఆదిమానవుడు అడవుల్లో , కొండగుహల్లో , చరియలక్రింద , జీవించాడు .  అందుబాటులో    ఉన్న వనరులతో జీవించాడు .   మనిషి  తన అవసరాల కోసం  ఉపయోగించిన పనిముట్ల స్వభావాలను బట్టి కాలాన్ని రాతి , రాగి , కంచు , ఇనుప యుగాలుగా విభజించారు. ఇప్పటివరకూ జరిపిన 
పరిశోధనల్లో ప్రాచీన శిలాయుగపు చరిత్రకు సంబంధించి , పురావస్తు పరిశోధనల్లో కర్నూలు , కడప , చిత్తూరు,అనంతపురం జిల్లాల్లో పాత రాతియుగపు(క్రీ . పూ . 1.5 లక్షల నుంచి 1.25 లక్షల సం!!లు) ఆధారాలు చాలా లభించాయి . కడప జిల్లాలో సగిలేరు నదిలోయ ప్రాంతాల లోను , చిత్తూరు జిల్లాలో రాళ్ళకాలువ నదీలోయ ప్రాంతాలలోను ,  అనంతపురం జిల్లా గుంతకల్లు , కర్నూలు జిల్లా వీరాపురం , సంగమేశ్వరం , బేతంచర్ల , బిల్లసర్గం ప్రకాశం జిల్లా గిద్దలూరు , ఎర్రగొండపాలెం , కృష్ణాజిల్లా ఉస్తపల్లి వద్ద రాతియుగపు స్థావరాలను గుర్తించారు . గుంటూరు జిల్లా , నాగార్జున కొండ ప్రాంతాల్లో చేతి గొడ్డల్లతో పాటు , క్లీవర్లు గోకుడు రాళ్లు , గులకరాతి పనిముట్లు లభించాయి . రేణిగుంట , ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో బ్లేడ్ , బ్యూరిన్ పరిశ్రమకు చెందిన గోకుడురాళ్ళు , పదును పెట్టని అంచులున్న బ్లేడ్లు , బ్యూరిన్లు , బాణపు మొనలు లభించాయి . ఈ రాతి పనిముట్లతో పాటు , ఎముకలను చీల్చి ముక్కలతో చేసిన గోకుడు పనిముట్లు , బరమాలు , ఉలి అంచుమొనలు , సన్నని బరిశెల వంటి పనిముట్లు కూడా దొరికాయి.

మధ్య రాతి యుగం(క్రీ . పూ .1.25 లక్షల నుంచి 40 వేల సం.లు )

పనిముట్ల తయారీలో కొద్దిపాటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన మధ్యరాతి యుగంలో  ప్రాచీన శిలాయుగం కంటే పనిముట్లు నునుపుగా, పదునుగా ఉండేటట్లు తయారు  చేసుకునేవారు.  ఆనాటి మానవులు జంతువుల బారినుండి కాపాడుకోవడానికి ఎత్తయిన కొండ ప్రాంతాల్లో నివసించే జంతువులను,నదీ తీరాల్లో చేపలను వేటాడుతూ గడిపారు. ఈ యుగానికి చెందిన వర్ణచిత్రాలను కడప జిల్లా చింతకుంట, కర్నూలు జిల్లా కేతవరంలలోగుర్తించారు.

రాగి - రాతి యుగం ( క్రీ . పూ . 2000 - 1000 )

          కొత్తరాతి యుగపు చివరి రోజల్లో మానవులు లోహాన్ని కనిపెట్టి , రకరకాల పనిముట్లు తయారు చేసుకొన్నారు . ముందుగా రాగిని , అటు తరువాత కంచును కనిపెట్టి కత్తులు , గొడ్డళ్లు , చేపలను పట్టే గాలాలతోపాటు , కాలికి తొడుక్కునే కడియాలు , చేతిగాజుల్లాంటి ఆభరణాలు కూడా తయారు చేసుకొన్నట్లు  కర్నూలు జిల్లా రామాపురం , బెలుంగుహలు రుజువు చేశాయి . ఈ కాలంలో మానవులు ఒకే చోట అనేక గుడిసెల్లో కుదుళ్లుగా ఒక చిన్న గ్రామంగా నివసించేవారు . మట్టి పాత్రలపై రంగులద్దుకొన్నారు . కుండ మధ్యభాగంలో తాడులాంటి డిజైన్లు కూడా వేసుకొన్నారు . మధ్య ఈనె , రెండంచులూ సన్నగా ఉండే పొడవాటి రాగి కత్తులను కూడా పోతపోసుకొన్నారు . పట్టుకోవడానికి వీలుగా పిడిభాగంలో అటూ ఇటూ రెండు కొనలుండటం వలన వీటిని మీసాల కత్తులనీ , యాంటెన్నా స్వోర్డులనీ పిలిచారు . క్రీ . శ . 2000 
1000 సం.లమధ్యకాలానికి చెందిన ఇలాంటి కత్తులు గుంటూరు జిల్లా గుత్తికొండ బిలంలోనూ , కర్నూలు జిల్లా  బెలుంగుహలోనూ గుర్తించ బడినాయి . చనిపోయిన వారి అస్తికలను కుండల్లో పెట్టి  భూమిలో పాతి పెట్టేవాళ్లు .

ఇనుప యుగం(క్రీ.పూ.1000_600)

       క్రీ . పూ . 1000 నుండి 600 సంవత్సరాల మధ్య నివసించిన ప్రజలు , రాక్షసగుళ్లు(పాండవగుళ్ళు)గా 
పిలువబడే చుట్టూ రాళ్లను రాసిగా పేర్చి అమర్చిన సమాధులలో , అస్థికలతో పాటు చనిపోయిన వ్యక్తులు , వారి జీవితకాలంలో వాడిన ఇనుప పనిముట్లు , బంగారు ఆభరణాలు , మట్టి పాత్రలు , రాగి పరికరాలను నిక్షిప్తం చేశారు . 
           ఈ సమాధులను కట్టిన విధానాన్ని బట్టి  వాటిని కెయిర్న్ లు , డాల్మెన్లు, సిస్టులు మెన్హిర్లుగా పేర్కొన్నారు.కర్నూలు,చిత్తూరు,అనంతపురం,నెల్లూరు,ప్రకాశం,గుంటూరు  జిల్లాలలో  ఇటువంటి  సమాధులు కనుగొన్నారు.
               

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి