కడపజిల్లా గతవైభవాల కలికితురాయి-గండికోట



*కడపజిల్లా గతవైభవాల కలికితురాయి-గండికోట*
          - డా.కోడూరు ప్రభాకరరెడ్డి

             కడపజిల్లాలోని జమ్మలమడుగుకు 10 కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రసిద్ధ గిరిదుర్గం *గండికోట.* పినాకిని(పెన్నానది) గండికి కుడివైపున సముద్రమట్టానికి 1670 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపైన ఈ కోటను నిర్మించారు.ఇక్కడ పెన్నానది 5 కిలోమీటర్ల మేర గండి కోసి లోతైన ప్రవాహంగా దుర్గానికి పెట్టని కందకంగా ఉండటం వల్ల  ఈ కోట శత్రుదుర్భేద్యంగా అలరారుతూ ఉంది.గండిపైన నిర్మించిన కోట కాబట్టి దీనికి *గండికోట* అనే పేరొచ్చింది.
*చరిత్ర కథనం*:
       కైఫియత్ ప్రకారం గండికోట దుర్గం త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వర మహారాజు కల్యాణి పట్టణాన్ని రాజధానిగా పాలిస్తూ ములికినాటిసీమలో తన ప్రతినిధిగా కాకరాజును(అసలు పేరు చిద్దన చోళమహారాజు) నియమించాడు.ములికినాడులో అప్పట్లో కడపజిల్లాలోని కమలాపురం,ఎర్రగుంట్ల, ముద్దనూరు,వేముల,వేoపల్లె,వీరపనాయునిపల్లె,తొండూరు,సింహాద్రిపురం,పులివెందుల,జమ్మలమడుగు మొదలైన ప్రాంతాలుండేవి.అప్పట్లో ఒకరోజు కాకరాజు మృగాయావినోదార్థియై తన రాజ్యానికి సమీపంలో ఉండే కొండచరియలకు సైనికులతో,12 మంది ఆయగాండ్లతోను,26 మంది గురికాoడ్ల తోను, వెయ్యిమంది గడేకాండ్లతోను,వెయ్యిమంది వడ్డెవాoడ్లతోను,పురోహితులతోను పెన్నానది ఒడ్డున గండ్లూరు దగ్గరున్న భానుకోటి మలను,దానిపైనున్న అతి చల్లని మధురమైన నీటితో నిండిన కుండాన్ని చూసి అక్కడ కోట కట్టుకోవాలనుకున్నాడు.అలాగే ఆక్కడ తన కెదురైన విచిత్ర సంఘటనను(ఒక శ్వేతవరాహం ప్రస్తుత రఘునాథాలయం గల స్థలంలో కనిపించటం) తన ఆస్థాన జ్యోతిష్యులకు ఎరుకపరిచాడు.ఆ జ్యోతిష్యులు సకల శాస్త్రాలను పరిశీలించి ఆ కొండపైన ఒక కోటను నిర్మింపజేస్తే కాక భూపతికి అజారామరమైన కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయని మనవి చేశారు.వారి ఆదేశానుసారం కాకభూపతి గండికోటకు పునాదులు వేసి కోటను 
మట్టితో క్రీ.శ.1123 జనవరి 9వ తేదీన
సర్వాoగసుందరంగా నిర్మింపజేసి దానికి గండికోట అని పేరుపెట్టాడు.
          గండికోటకు చుట్టూ మూడు రాతి ప్రాకారాలు,ఒక కందకం ఉన్నాయి.తూర్పు,పడమటి దిశల్లో రెండు ప్రవేశద్వారాలు,ఒక అగడ్త ఉన్నాయి.ప్రవేశద్వారం పైకప్పులు తోరణాలతో కూడిన కమాన్లతో నిర్మితమై హంపీ లోని పద్మ మహల్ నిర్మాణాన్ని తలపింపజేస్తాయి.కోట గోడలను ఒక టన్ను బరువున్న ఎర్రని సున్నపురాళ్లతో నిర్మించారు.పునాదులు లేకుండానే కొండ బండలపైన కోట గోడలను నిర్మించడం ఈ కోట ప్రత్యేకత.తూర్పు నుండి పడమర వరకు పొడవు 1200 మీటర్లు,వెడల్పు 800 మీటర్లు,ఎత్తు 40 అడుగులు ఉంటుంది ఈ కోట.కోట చుట్టూ 101 బురుజులున్నాయి.వీనిలో 20 వలయాకారంలోను,22 చతురస్రాకారంలోను ఉన్నాయి.ఫిరంగుల ప్రయోగానికి అనువుగా ఈ బురుజులను నిర్మించారు.కోట తూర్పుదిశలో ఉన్న ప్రధాన ప్రవేశద్వారం 20 అడుగుల ఎత్తు ఉంటుంది.తలుపులు ఇనుప గుబ్బలు బిగించి శత్రుదుర్భేద్యంగా నిర్మించారు.కోట తలుపులను మూయటానికి,తెరవటానికి ఏనుగులను ఉపయోగించేవారు.
         మరో ఐతిహ్యం ప్రకారం శాలివాహనశకం 1297(క్రీ.శ.1375)లో
విజయనగర స్థాపకులు హరిహర బుక్కరాయలు తీర్థయాత్రాభిలాషతో కాశీక్షేత్రం దర్శించి తిరుగుప్రయాణంలో
ఒక రాత్రి గోదావరీనదీతీరాన విశ్రమించారు.నాటిరాత్రి వారికి శ్రీమన్నారాయణుడు కలలో కనిపించి వారు నిద్రించిన స్థలంలో గుప్తమై కొన్ని 
దేవతావిగ్రహాలున్నాయనీ,ఆ విగ్రహాలను వెలికితీసి వానికి ఆలయాలు నిర్మించండనీ,అలాచేస్తే వారికి శుభం కలుగుతుందనీ చెప్పాడట.వారు వెంటనే మేల్కొని ఆ
స్థలాన్ని కలియత్రవ్వి వెదకగా వారికి నాలుగు విష్ణు విగ్రహాలు దొరికాయట.బుక్కరాయలు వానిని పామిడి(పద్మనాభస్వామి),గుత్తి,ఒంటిమిట్ట(కోదండరామస్వామి),గండికోట(మాధవస్వామి) ప్రాంతాల్లో ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించాడని జనశ్రుతి.
          క్రీ.శ.1123 నుండి 1791 వరకు గండికోటకు ఎన్నో రాజవంశాలు పాలించాయి.కాకభూపతి తర్వాత క్రీ.శ.1239 నుండి 1304 వరకు(దాదాపు 65 సంవత్సరాలు) కాకతీయకాలంలో కాయస్థ వంశీయులు పరిపాలించారు.కాయస్థ అంబిదేవుడు వల్లూరు(ఇది కమలాపురానికి అతి సమీపంలో ఉంది) నుండి తన రాజధానిని గండికోటకు మార్చినట్లు క్రీ.శ.1290 నాటి త్రిపురాంతక శాసనం 
తెలుపుతున్నది.గండికోటను 'ఖండికోట మనోరథపురం'గా ఈ శాసనం వర్ణిస్తున్నది.కాయస్థ అంబిదేవుడు వల్లూరు,గండికోట రెండింటినీ రాజధానులుగా చేసికొని పాలించినట్లు తెలుస్తున్నది.'గిరి దుర్గమల్ల','జలదుర్గ బడబానల','వనదుర్గ ఆవాలన' అనే బిరుదులు ఆయనకుండేవి.కాయస్థ రాజులలో చివారివాడైన రెండవ త్రిపురారిదేవుడిని కాకతీయ ప్రతాపరుద్రుని సేనాని ఓడించి కొంతకాలం గండికోటను పాలించాడు.ఆ తర్వాత సోయలెంక(1308-1314),జుట్టయలెంక కుమారుడు గొంకారెడ్డి(1314-1319) గండికోటను
పరిపాలించారు.
          కాకతీయుల అనంతరం గండికోట అభివృద్ధి చెందలేదు.మొదటి బుక్కరాయల కాలంలో ఎల్లమరసామాత్యుడు గండికోట పాలకుడుగా ఉండి యోగానంద నృసింహాలయానికి మరమ్మత్తులు చేయించాడు.బుక్కరాయల కాలంలోనే జిల్లెళ్ల చలపతిరాజు ఈ స్థల ప్రాముఖ్యాన్ని గుర్తించి అభివృద్ధి చేశాడని తాడిపత్రి శాసనం తెలుపుతున్నది. రెండవ హరిహరరాయల కాలంలో చలపతిరాజు పెనుగొండ పాలనాధికారిగా ఉండటంవల్ల ఆయన స్థానంలో నంద్యాల వీరరాఘవరాజు గండికోట,ములికినాడు సీమలకు పాలకుడుగా నియమింపబడ్డాడు.బుక్కరాయల కాలంలో కుమారతిమ్మనాయుడు సైనికాధికారిగా అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు.ఆ తర్వాత బుక్కరాయలు కుమారుడు రెండవ దేవరాయల కాలంనుండి పెమ్మసానివారి ప్రాతినిధ్యం పెరిగిందని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది.విజయనగర సంగమ వంశీయుడైన మల్లికార్జునరాయల పాలనలో గండికోట అధిపతిగా పోలేపల్లి బుక్కరాజు వ్యవహరించాడు.అరవీటి బుక్కరాజు మనుమడు బుక్కయ్యదేవమహారాజు
గండికోటలో తిరుగుబాటును అణచినట్లు క్రీ.శ.1485 శాసనం తెలియజేస్తున్నది.శ్రీకృష్ణదేవరాయల కాలంలో సాలువ తిమ్మరసయ్య,అవసరం బేమరుసయ్య,సాలువ గోవిందయ్యలు గండికోట సీమకు అధిపతులుగా వ్యవహరించారు.అచ్యుతరాయల కాలంలో అయ్యపరుసయ్య,బాచారుసు,చంద్రగిరి తిమ్మ రుసయ్యలు గండికోటకు అధికారులయ్యారు.సదశివరాయల కాలంలో గొబ్బూరి అవుబలదేవ మహారాజు,అవుబలరాజు,చిన్న బలేశ్వర మహారాజు,నంద్యాల తిమ్మరాజు,నంద్యాల నరసింహదేవ మహారాజు,పెమ్మసాని తిమ్మానాయుడు గండికోటను పరిపాలించారు.తళ్లికోట యుద్ధం తర్వాత ఆరవీటి రెండవ వెంకటపతి రాయల కాలంలో నంద్యాల నరసింహరాజు నాయకుడుగా ఉండగా గోల్కొండ నవాబు కులీకుతుబ్షా తన మంత్రి అమీర్ ఉల్ ముల్క్ ద్వారా గండికోటను వశపర్చుకున్నాడు.అయితే వెంకటపతి రాయలు(తిరుమలరాయల కుమారుడు)కొద్దిరోజుల్లోనే తన కోటను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.వెంకటపతిరాయలు తనకు విశ్వాసపాత్రుడైన నంద్యాల కృష్ణమరాజును గండికోట పాలకునిగా 
నియమించాడు.తర్వాత శ్రీరంగదేవరాయలకాలంలో(1641-64) గోల్కొండ నవాబు అబ్దుల్ కులీ కుతుబ్షా ప్రధాని,సైన్యాధికారి మీర్ జుమ్లా 1652 ఆగష్టు 25న పెమ్మసాని చినతిమ్మానాయుడిని కుట్ర పన్ని కోటను వశపర్చుకున్నాడు.మీర్ జుమ్లా
జుల్ఫీకర్ ఖాన్ ను గండికోటకు ఖిల్లేదారుగా నియమించాడు.ఇతడు కోటకు దక్షిణాన ఫతేదర్వాజాను,ఒక బురుజును నిర్మించాడు.రాయలచెరువుకు పడమటి దిక్కున ఒక రాజాప్రసాదాన్ని 
కూడ నిర్మించాడు.ఆ తర్వాత నేక్ నామ్ ఖాన్ కోటకు అధిపతిగా నియమింపబడ్డాడు.ఆపైన నేక్ నామ్ ఖాన్ జిల్లే ఫకీర్ ఖాన్ ను ఖిల్లేదారుగా నియమించాడు.జిల్లే ఫకీర్ ఖాన్ 12000 పనివాళ్ళతో కోట తూర్పు,ఉత్తర దిశలలో జిల్లేఫకీర్
బురుజు,ఫతే దర్వాజాలతో రాయల 
చెరువు నుండి పడమర అలంగీర్ బురుజుదాకా 24 బురుజులు నిర్మించాడు.1687లో గోల్కొండరాజ్యం ఔరంగజేబుస్వాధీనం
అయ్యేదాక గండికోట కుతుబ్షాహీల పాలనలోనే ఉండేది.తర్వాత మయానా నవాబు అబ్దుల్ నబీఖాన్ కు గండికోట ఖిల్లేదారుడు మహమ్మద్ నబీఖాన్ కు యుద్ధం జరిగిన సందర్భంలో 2.5 లక్షలు చెల్లించి గండికోటను స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.అబ్దుల్ నబీఖాన్ 1714లో కడపను పాలించాడు.తర్వాత ఆయన కుమారుడు ఖాదర్ ఖాన్ నౌబాతీఖానా,రంగమహల్ లను నిర్మించాడు.ఇతడు మాధవస్వామి ఆలయం వద్దనున్న బురుజుపైని మాధవచక్రం ఫిరంగిని ఖాదర్ ఖాన్ బురుజుపైకి మార్చాడు.మైలవరం సమీపంలో తన పేరుమీద ఖాదరాబాదును నిర్మించాడు.(తర్వాత ఆగ్రామం మైలవరం డ్యామ్ నిర్మాణం వల్ల ముంపుకు గురికావడంతో నిర్వాసితులకు అదే పేరుతో ప్రొద్దుటూరుకు అతిచేరువలో కట్టి పునరావాసం కల్పించింది ప్రభత్వం.)

                              

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి