బహుముఖ ప్రజ్ఞాశాలి డా|| ఎం.వి.రమణారెడ్డి

బహుముఖ ప్రజ్ఞాశాలి డా|| ఎం.వి.రమణారెడ్డి
                       
        ఎం.వి.రమణారెడ్డిగా, ఎం వి ఆర్ గా ప్రసిద్ది పొందిన మల్లెల వెంకట రమణారెడ్డి ప్రొద్దుటూరు లో ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో 4.3.1944 లో మల్లెల వెంకటమ్మ, ఓబుల్ రెడ్డి దంపతులకు
జన్మించారు.ఆయన జీవితం వైవిధ్య భరితం గా సాగింది. ఆయన గుంటూరు లో యం. బి.బి. ఎస్ చదివాడు. డాక్టరు గా పనిచేశాడు. యల్. ఎల్. బి. కూడా చదివాడు. కొంతకాలం లాయారుగా కూడా పనిచేశాడు.ప్రొద్దుటూరులో డాక్టర్ గా ప్రాక్టీసు ప్రారంభించి  పేదలకు ఉచితంగా వైద్యం చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో అనేక మంది కార్మికులు ఆయన దగ్గరికి రావడం, వారు తాను రాయించిన మందులు కూడా కొనుక్కోలేని స్థితిని గమనించి, వారి పేదరికాన్ని చూసి చలించి పోయాడు. ఆ క్రమంలో  వారికి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ విధంగా ఆయన కార్మిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు.చదువుకునే రోజుల్లో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. అలా అతను రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. అటు తర్వాత ఎన్నో రచనలు చేసి సాహితీవేత్త కూడా సాహితీవేత్తగా కూడా ప్రసిద్ది పొందారు.

           గుంటూరులో వైద్యుడిగా ఉన్నప్పుడే ఎం.వి.ఆర్‌. అక్షరయాత్ర ప్రారంభమైంది. తొలుత 'కవిత' అనే మాసపత్రికను ప్రారంభించాడు. తరువాత ఆయన ప్రభంజనం అనే రాజకీయ పత్రికను కడప జిల్లాలోని ప్రొద్దుటూరు లో ప్రారంభించాడు.
          1970లో విరసం స్థాపకుల్లో ఎం.వి.ఆర్‌. ఒకరు. స్వంత వ్యక్తిత్వం గల యం.వి.ఆర్‌. సిద్ధాంతం పట్ల కమిట్‌మెంట్‌ ఉంటే చాలని భావించేవాడు. కవిగా కలం పట్టడమే గాక సైనికుడిగా ఆయుధమూ పట్టాలని భావించేది విరసం. దీంతో ఆయన విరసంతో విభేదించి పైగంబర కవులతో పాటు బయటకు వచ్చేశారు.
కరపత్ర రచనలతో మొదలైన ఆయన అక్షరయానం కవిగా, కధకునిగా, నవలాకారుడిగా, అనువాదకునిగా, వ్యాకరణ రచయితగా, సంపాదకుడిగా, రాజకీయ సామాజకి రంగాల వ్యాసరచయితగా బహుముఖ ప్రజ్ఞతో సాగిన ఆయన సాహితీ ప్రస్థానం మరణించేదాకా సాగింది.
       ప్రముఖ కవి పుట్టపర్తి సత్యనారాయణాచార్యులు గారి ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. తాను పుట్టపర్తి గారికి ఏకలవ్య శిష్యుడిని చెప్పుకున్నాడు.  అయినప్పటికీ ఆయన తన ప్రగతిశీల భావాలు ఏ మాత్రం వీడలేదు. 

      ఎన్టీ రామారావు ఆహ్వానం తో  ఎం వి ఆర్1983లో  తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ నాటి ఎన్నికల ప్రభంజనంతోను, తన స్వంత పలుకుబడి తోను ఆయన పెద్ద మెజారిటీతో గెలిచాడు. 1985లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ విమోచన సమితి ని ఏర్పాటు చేశాడు.  ప్రజావాణి ను బలంగా వినిపించినా తన ముక్కుసూటితనం తో రాజకీయరంగంలో పెద్దగా రాణించలేకపోయారు. దీన్ని ఆయన స్వయంగా చెప్పుకునేవారు.
       శ్రీబాగ్‌ ఒప్పంద పత్రం విడుదలైన 48 ఏళ్ళ తరువాత,  రాయలసీమ ఉద్యమం ఊపందుకున్న రోజులలో, రాయలసీమ కన్నీళ్ళను, కడగండ్లను, వాటికి గల పరిష్కార మార్గాలను వివరిస్తూ "రాయలసీమ కన్నీటి గాథ" రాశారు. ఇది రాయలసీమ ప్రజల మాగ్నాకార్టాగా ప్రసిద్ధి పొందింది.
         వేమన, తిక్కన, గురజాడ లను తెలుగువారి కవిత్రయంగా
శ్రీశ్రీ భావించాడు. తిక్కన తన అనువాదం లో తెలుగు  నుడికారం వాడి తెలుగుకు చిక్కదనాన్ని తెచ్చాడని శ్రీశ్రీకి తిక్కనంటే ఇష్టం. శ్రీశ్రీ లాగా యం.వి.ఆర్‌. కు కూడా తిక్కనంటే ఇష్టం. అందువల్లే 'మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది' అనే పరిశోధనా గ్రంథాన్ని యం.వి.రమణారెడ్డి వెలువరించారు.
      'తెలుగు సినిమా - స్వర్ణయుగం' అనే గ్రంథాన్ని సినిమా రంగంపై చారిత్రక విశ్లేషణతో ఆయన రాశారు.తెలుగు ప్రజలకు పెద్దగా అవసరం రాని, చిన్నయసూరి తరువాత ఎవరూ తలపెట్టని 'తెలుగు వ్యాకరణం' గ్రంథాన్ని ఆయన తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా రాశారు. ఇందులో వ్యాసాలు ఎలా రాయాలి, అనువాదాలు ఎలా చేయాలి వంటి అంశాలు కూడా పొందుపరిచారు. ఇంత అద్భుత గ్రంథాన్ని మన తెలుగువారు సరిగా ఉపయోగించుకోవడమన్నది భవిష్యత్‌ తరాల మీదే ఆధారపడి ఉంటుంది.
          యం.వి.ఆర్‌. కథా రచయిత కూడా. ఆయన కథల సంపుటి 'పరిష్కారం' రాయలసీమ కథా రచయితలలో ఒకనిగా నిల్పింది. ఆయన కథలు కొ.కు. శైలిలో వుంటాయని సీనియర్‌ పాత్రికేయుడు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
         డా|| మల్లెల వెంకట రమణారెడ్డి బహుగ్రంథాల అధ్యయనశీలి. ఒక ఆంగ్ల పుస్తకం చదివాక అది తెలుగు ప్రజలకు అందాల్సిన గ్రంథమని భావిస్తే వెంటనే ఇతరులు ఎవరైనా అనువాదం చేశారేమోనని పరిశీలించేవారు. ఇంకా అనువాదం రాలేదంటే దానిని సులభశైలిలో తెలుగు పలుకుబడులతో, నుడికారంతో అనువదించేవారు. అనువాదంలో వున్న సమస్యలను కూడా ఒకచోట ప్రస్తావించారు.
         హెచ్‌.జి.వెల్స్‌ రాసిన 'అవుట్‌ లైన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ హిస్టరీ' ని తెలుగులో 'టూకీగా ప్రపంచ చరిత్ర' గా నాలుగు సంపుటాలు రాశాడు. ఆకాశవాణి వారు దానిని ధారావాహికగా ప్రసారం చేశారు.
హెన్రీషాయర్‌ రాసిన 'పాపియాన్‌' ను 'రెక్కలు చాచిన పంజరం' పేరుతో అనువదించారు. స్వేచ్ఛాపిపాసి అయిన ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన తీరు, జైలర్ల చేతిలో ఖైదీలు పడే హింస మొదలైన అంశాలను దృశ్యమానం చేశాడీ గ్రంథంలో. స్వేచ్ఛకోసం పరితపించే మనిషి మానసిక స్థితిని వివరిస్తుందీ గ్రంథం. ఇది యం.వి.ఆర్‌. వ్యక్తిత్వానికి దగ్గరగా వుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.
        ఆర్‌.కె. నారాయణన్‌ రాసిన ' ఏ టైగర్‌ ఫర్‌ మాల్గుడి' నవలను 'పెద్దపులి ఆత్మకథ' గా అనువదించారు. వన్యప్రాణుల సంరక్షణ అవసరమని ఈ నవల చెపుతుంది.ఆర్‌.కె. రాసిన మరో నవల టాకేటివ్ మ్యాన్‌ ను 'మాటకారి' పేరుతో అనువదించారు. ఇది అనువాదం లాగా కాకుండా ఆయన స్వంత రచన అన్నంతగా వుంటుంది ఆయన అనువాదం.
       మార్గరేట్‌ మిషల్‌ రాసిన 'గాన్‌ విత్‌ ది విండ్‌' ను 'చివరికి మిగిలేది?' అని తెలుగులోకి అనువదించారు. రాయలసీమ మాండలికంలో ఇందులోని సంభాషణలు రాశాడు. ఇంగ్లీషు సామెతలతో సమానంగా తెలుగు జాతీయాలను వాడాడు. నవలకు తెలుగుతనాన్ని తెచ్చాడు రచయిత.మాక్సిం గోర్కీ రాసిన అమ్మ నవలను కడుపుతీపి పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు.

       రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన రాసిన వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనాయి. వాటిని 'శంఖారావం' పేరుతో వ్యాసాల సంపుటిని వెలువరించారు. ఇందులో 'మగవాళ్ళ పార్లమెంటులో మగువల బిల్లు,' పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌పై రాద్దాంతం' మొదలైన అంశాలున్నాయి. రాయలసీమ వారిని నరహంతకులుగా చిత్రీకరించే సినిమాలపై విరుచుకు పడ్డారాయన.

నాలుగేళ్ల క్రితం ఆయనకు ఓపిసిడి ( క్రానికల్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్)   వ్యాధి సోకింది. దాంతో ఆయన ఊపిరితిత్తులు క్షీణించాయి.  డాక్టర్ల  ఆయనకు  బైపాస్ మిషన్, కాన్సన్ట్రేటర్ మాస్కులు అమర్చారు. వీటి ఆధారంగా జీవిస్తూనే ఆయన అనేక రచనలు అనువాదాలు చేయడం ఆయన వ్యక్తిత్వానికి, పోరాట పటిమకు నిదర్శనంగా నిలుస్తాయి.

          రాయలసీమ ఉద్యమకారునిగా ప్రజల మనస్సుల్లో ఉన్నా, సాహిత్యరంగంలో  ఆయన చేసిన  అపారమైన  కృషి ఆయనను  సాహితీవేత్తగా సాహిత్య రంగంలో శాస్వతంగానిలిపింది. అలాగే రాయలసీమ సమస్యలపై ఆయన చేసిన రచనలు పోరాటాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.  ఆచరణాత్మక రాజకీయవేత్త గా, సాహితీ వేత్త గా  ఆయన  ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

         - పిళ్ళా కుమారస్వామి, 9490122229



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి