అన్నమయ్య జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు
అన్నమయ్య జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు
2010 లో కడప జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది. 2022 లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు వైఎస్ ఆర్ కడప జిల్లాను వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలుగా విభజించారు.
అన్నమయ్య జిల్లా వంటకాలు ప్రత్యేకమైనవి. రాగి సంగటి, జొన్న రొట్టె లు జిల్లాలో ప్రతి ఇంట్లో వండే వంటలు.రాగి సంఘటితో పాటు శనిక్కాయ చెట్నీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడివి స్టార్ హోటల్లలో కూడా ఉన్నాయి. . సొద్ద రొట్టె లోకి గాని ఇసుర్రాయి లతో విసిరిన జొన్న పిండి రొట్టెలోకి గాని చేపలు పులుసు వేసుకొని తింటుంటారు.
మరికొన్ని ప్రసిద్ధ వంటకాలు బిర్యానీ, కబాబ్‌లు మరియు పులావ్. జిల్లా ప్రసిద్ధి చెందిన ఓలిగ లేదా బొబ్బట్టు వంటి తీపి వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇక్కడ కారం పూసిన దోశ భలే ఉంటుంది.
సియ్యల కూరన్నా,కారం అన్నా కడప వాళ్లకు ఎనలేని ప్రీతి.వొట్టి మిరపకాయలు,, రోన్ని ధనియాలు,అంగుళం పొడవు వుండే దాల్చిన చెక్క,రోన్త వేయించి తెల్లవాయలు,వొట్టి కొబ్బేర,రొంత అల్లం ముక్క రోట్లో దంచితే సియ్యల కూర ఘుమ ఘుమ లాడిపోతుంది.ఈ జిల్లా ప్రజలు ఆప్యాయతలో, ఆతిథ్యంలో దాతృత్వంలో ప్రసిద్ధి చెందారు. ప్రజలు సాధారణంగా స్నేహపూర్వకంగా ఉంటారు. సందర్శకులకు స్వాగతం పలుకుతారు . ఈ ప్రాంతం రెడ్లు, ముస్లింలకే కాక విభిన్న వర్గాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి వర్గానికి దాని స్వంత ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. భిన్నమైన సాంస్కృతిక వారసత్వం తో ఈ జిల్లా ప్రజలు బలమైన గుర్తింపు కలిగి ఉన్నారు.
ప్రజలకు భూమితో అనుబంధం ప్రకృతి కి వృక్షాలకు ఎంత బంధం ఉందో అంత ఉంది.ఈ జిల్లా వరి, మామిడి, వేరుశెనగ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. జిల్లా వ్యవసాయమంతా వర్షాధారమే. పంట మార్పిడి వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు కూడా ప్రసిద్ధి చెందింది.
నీళ్లు లేని కరువు నేల కడప. అందువల్ల ఇక్కడి వాళ్లకు నీళ్లు అంటే ప్రాణం తో సమానం. ఈ నీళ్లు లేకనే చాలా మంది వలస కూలోళ్లు గా మారి పరాయి ఊర్లల్లో, పరాయి దేశాల్లో బేల్దారులుగా, లారీ డ్రైవర్లు గా,పెయింటింగ్ కూలోళ్ళుగా,గొర్ల కాపరులుగా పని చేస్తున్నారు.ఒక్కొక్క రైతు పది బోర్లు ,ఇరబై బోర్లు వేసి అప్పులు తీర్చ లేక ఉరి వేసుకుంటున్నారు. ఈ నీళ్లు లేకనే పిల్లొళ్లను పెద్ద పెద్ద చదువులు చదివించలేక పోతున్నారు. నీళ్లే నాగరికత. నీళ్లే సంస్కృతి.నీళ్లే చరిత్ర.అయినా వైఎస్సార్ జిల్లా ప్రజల చరిత్ర నరుక్కునే చరిత్ర గా , బాంబులేసుకునేచరిత్ర గా సినిమావాళ్ళు సినిమా లలో చూపెడుతున్నారు. ఇక్కడి ఆప్యాయతలు, ఆత్మీయతలు తో వారికేం తెలుసు.
అన్నమయ్య గా పిలువబడే తాళ్ళపాక
అన్నమాచార్యులు,15వ శతాబ్దికి చెందిన తొలి తెలుగు
వాగ్గేయకారుడు.పద కవితా పితామహుడు.సంకీర్తనా
చార్యుడు.
అన్నమయ్య వెంకటేశ్వరని కంకితంగా 32వేల ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనల్ని రచించి ప్రసిద్ధి చెందాడు.
వీరి స్వస్థలం రాజంపేట తాలూకా లోని తాళ్ళపాక గ్రామం.తల్లి దండ్రులు లక్కమాంబ నారాయణ సూరులు.అన్నమయ్య తిమ్మక్క,అక్కులమ్మ
అను ఇరువురు కన్యలను వివాహం చేసుకున్నాడు.
అందులో తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం అన్న ద్విపద కావ్యాన్ని రచించి తొలి తెలుగు కవయిత్రి గా ప్రసిద్ధి చెందారు. అన్నమయ్య కుటుంబంలోకుమారుడు పెదతిరుమలా చార్యుడు,మనుమడు చిన తిరుమలాచార్యుడు(చిన్నన్న) కూడా పద రచనలు చేసి ప్రసిద్ధి చెందిన వారే.
అన్నమయ్య పదాలు భక్తి వైరాగ్యాలుకే కాకుండా, నాటి సాంఘిక పరిస్థితులకూ అద్దం పట్టాయి.అన్నమయ్య పదాల్లో జానపదులు మెచ్చే మేలుకొలుపులు మొదలు, అల్లో నేరేళ్ళో,ఏల,కోలాట,గొబ్బి,జాజర,తందనాన,జోల,లాలి, సువ్వి,సోది,నివాళి,హారతి మొదలైన రచనలెన్నో చేసినాడు. అన్నమయ్య పదాలు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు, భాషకు, భక్తి భావాలకు తరగని నిధులు,
చెరగని ముద్రలు. కాబట్టే ఆయన తన రచనల ద్వారా క్షేత్రయ్య, రామదాసు త్యాగయ్యాది వాగ్గేయకారుల కు మార్గదర్శకుడయ్యాడు.
భారతదేశంలో సర్వత్రా కనిపించే సామాజిక లక్షణాలే కడప జిల్లాలోనూ కనిపిస్తాయి. ఎరుకుల, కురవ ,సుగాలి, గణాలున్నాయి. హిందూ మత శాఖలైన శైవ వైష్ణవ భేధాలకు చెందిన 50కి పైగా వున్న కులాలు కనిపిస్తాయి. తమిళ, మహారాష్ట్ర జాతులు, మహ్మదీయులు, క్రైస్తవులు, గణనీయమైన సంఖ్యలో ఈ జిల్లాలో ఉన్నారు. జైనులు, బౌద్ధులు, ఇప్పుడు స్వల్పంగా వున్నా జైన, బౌద్దమతాల ప్రభావం ఒకప్పుడు జిల్లాలో వుండేవి. ఏడవ శతాబ్దంలో కడప ప్రాంతంలో పర్యటించిన హ్యూయన్‌సాంగ్, ఆనాడే కడప ప్రాంతంలో హిందూ దేవాలయాలు, బౌద్దారామాలు, జైనవిర్గాంతాలున్నట్లు తెలియజేశాడు. దానవులపాడు ఒకప్పుడు జైనులు నివసించిన ప్రాంతం. జిల్లాలో అధిక సంఖ్యాకుల మాతృభాష తెలుగు. కన్నడ, మరాఠీ, హిందీ, తమిళం, ఎరుకల, లంబాడీ బాష వ్యవహారాలు కూడా ఈ జిల్లాలో కొంత మేర ఉన్నాయి. ఈ అంశాలు వైఎస్సార్ జిల్లాలో గల వివిధ భాషా సంస్కృతుల సమ్మేళనాన్ని వ్యక్తం చేస్తాయి. ముద్దనూరు లో చింతకుంట లోని ఆదిమానవుడి చిత్రాలు ఈ ప్రాంతం వారు హోమోసెపియన్ కన్నా ముందరివారని, ఆ లెక్కన ఆర్య ద్రావిడులకన్నా ముందరివారని తెలుస్తోంది.
కడపలో పరమత సహనం తో పాటు సహగమనం కూడా ఉంది.ఈ ఉమ్మడి సంస్కృతి బహుశా ఎక్కడా కనిపించలేదు. దేవుని కడపలో ఉన్న వేంకటేశ్వరుని గుడికి ముస్లింలు వెళతారు. పెద్ద దర్గా కు పోని హిందువులుండరు. కేథడ్రిల్ చర్చిని చూసి హిందూ ముస్లిం సోదరులు ముచ్చట పడుతుంటారు. పీర్ల పండుగ లో పీర్లు హిందువులలో ఐతే,పూజారులు ముస్లింలు.హిందూ ముస్లింల ఐక్యత పీర్ల పండుగ నాడు కనిపిస్తుంది. బహుజనులు ఆరాధించే గుడులు దగ్గర ప్రతి ఏటా జాతరలు జరుగుతాయి. బ్రాహ్మణ పూజారులున్న గుడుల దగ్గర ప్రతిఏటా రథోత్సవాలు, తిరునాళ్ళు జరుగుతాయి. లక్షలాది ప్రజలు వీటిల్లో పాల్గొంటారు. ముస్లింలు దర్గా పై చాలా చోట్ల వస్త్రాలను హిందువులే కప్పుతారు. సూఫీ ప్రభావం తో ముస్లిం బాబాలు వెలిసినారు. ఈ బాబాల వర్థంతులు జయంతుల సందర్భంగా ఉరుసులు జరుగుతుంటాయి. అక్కడ ఖవ్వాలీ కచేరీలు నిర్వహిస్తారు.
17వ శతాబ్దికి చెందిన కడప శైలి చిత్రకళగా ప్రసిద్ధి చెందిన పెయింటింగ్స్ ప్రముఖ కళాచరిత్రకారుడు శివరామమూర్తి వేశారు. ఇవి నాయకరాజుల కాలంలో గుళ్లలో వేసిన బొమ్మల్లాగే ఉన్నాయి.ధర్మరాజు కొలువులో ముస్లిం వేషధారణ, హిందువుల ధోవతీ, చీరలు కలగాపులగంగా ఉన్నాయి. కడప నవాబులు, దిగువ నాయకరాజుల సమ్మిళిత సంస్కృతి ఇందులో కనబడుతుంది. తొలి బొమ్మ యమలోకం, రెండోది ధర్మరాజు దర్బార్.
జిల్లాలో అనేక పురాతన దేవాలయాలు, కోటలు ఉన్నాయి.ఇవన్నీ ఈ ప్రాంత శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతాయి. 13వ శతాబ్దంలో నిర్మించబడిన గండికోట లో వాస్తుశిల్పం ప్రసిద్ధి చెందింది. ఈ కోటను గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మైదుకూరు మండలంలోని ఖాజీపేట్ గ్రామానికి 2 మైళ్ల దూరంలో ఉన్న నాగనాధుని కోన కొత్తగా కనుగొనబడిన బౌద్ధ క్షేత్రం. ఈ ప్రదేశం 2వ శతాబ్దానికి శాతవాహన సామ్రాజ్యం లోనిది.మైదుకూరు నుండి 9 మైళ్ల దూరంలో ఉన్న పుల్లూరు గ్రామం లో పురాతన బుద్ధపాదం ఉంది. పాదముద్ర ఒక చదరపు మీటరు విస్తరించి ఉంది. (దాదాపు 11 చదరపు అడుగులు) చారిత్రక కథనాల ప్రకారం 2వ శతాబ్దం నుండి దాదాపు 600 సంవత్సరాల పాటు కడపలో బౌద్ధమతం వర్ధిల్లింది. చైనీస్ బౌద్ధ సన్యాసి, పండితుడు, అనువాదకుడు అయిన జువాన్‌జంగ్ (602-64)(xuanzang) 7వ శతాబ్దంలో కడపను సందర్శించి బౌద్ధ విహారాల గురించి, అలాగే జైనమత ఆచారాల గురించి రాసినాడు. బుద్ధపాదం అనేది చారిత్రికంగా బుద్ధుని సంకేత ప్రాతినిధ్యాలలో ఒకటి. మధ్యలో దమ్మచక్క (ధమ్మ చక్రం) వంటి ప్రత్యేక గుర్తులను కలిగి ఉంటాయి. బుద్ధునికి ప్రతీకగా చాలా మంది బౌద్ధులు వాటిని భావిస్తారు. మట్టి పాత్రలు, పెద్ద ఎర్ర ఇటుకలు, రాతి స్తంభాలు, శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం, శ్రీ కృష్ణదేవరాయల శిల్పాలు , ఆరు వీరగల్లులు (ఒక గౌరవప్రదమైన మరణాన్ని గుర్తుచేసే స్మారక చిహ్నం) సహా 4వ శతాబ్దానికి చెందిన అనేక ఇతర కళాఖండాలు కూడా ఈ ప్రదేశంలో ఉన్నాయి.
క్రీడల విషయానికొస్తే ఇక్కడి ప్రజలు క్రికెట్, ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఈ రెండు క్రీడలలో ప్రముఖ లైన వారిలో మాజీ భారత క్రికెటర్ వెంకటపతి రాజు , మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఉన్నారు.
వైఎస్సార్ జిల్లా ప్రజలు జానపద కళలకు కూడా ప్రసిద్ధి చెందారు. జిల్లాలో కూచిపూడి నృత్య సంప్రదాయం ప్రసిద్ధి చెందింది, ఇది కృష్ణా జిల్లాలో పుట్టింది. జిల్లాలో బుర్రకథ, ఒగ్గు కథ , లంబాడీ నృత్యం మొదలైన అనేక ఇతర సాంప్రదాయ నృత్య రూపాలు కూడా ఉన్నాయి. పండుగలు , ఇతర సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో ఈ నృత్య రూపాలు ప్రదర్శిస్తుంటారు.తోలుబొమ్మలాట కళారూపం ఈ జిల్లా సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగం. తోలు బొమ్మలను మేక లేదా గొర్రె చర్మాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. తోలుబొమ్మలను సహజ రంగులతో పెయింట్ చేస్తారు. వివిధ కథలను, నాటకాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు.
___ కుమారస్వామి,9490122229
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి