రాయలసీమ మొదటి కథ
*రాయలసీమ మొదటి కథ*
_అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి
(సేకరణ:పిళ్లా విజయ్
9490122229)
ఆధునిక రాయలసీమ కథా సాహిత్యంలో కె.సభా ను ఒక కొండగుర్తుగా చెప్పవచ్చు. కె.సభాకు ముందు, తరువాత రాయలసీమ కథాసాహిత్యం అని స్థూలంగా విభజించు కోవచ్చు. కె. సభా 1944 ఏప్రిల్ నెలలో చిత్రగుప్త పత్రికలో రాసిన ' కడగండ్లు ' కథ మొదలుకొని తరువాత కాలంలో 300 దాకా కథలు రాసి సీమ కథా సాహిత్యంలో చెరగని ముద్రవేశాడు. కథాసాహిత్యంలో తరువాత
తరాలని ప్రభావితం చేసి ఆదర్శప్రాయుడయ్యాడు.
సభా అనంతరం రాయలసీమ కథాసాహిత్యంలో చాలా మార్పులు, పరిశోధనలు జరిగాయి. 1980 ల నుండి రాయలసీమ ప్రాంతీయ అస్థిత్వం ఆధారంగా సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో పెద్ద ప్రయత్నమే
జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమలో వెలువడిన సాహిత్యం సరైన క్రమంలో నిక్షిప్తం కాలేదు. కథాసాహిత్య ప్రక్రియలో ఈ లోటు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.గతానికి సంబంధించి లభిస్తున్న కొద్ది సమాచారాన్నైనా క్రోడీకరించి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
ప్రాచీన సంప్రదాయ సాహిత్యానికి కేంద్రం కావటం, పద్య సాహిత్యమే గొప్ప సాహిత్యంగా భాసిల్లటం, వ్యవహార భాషోద్యమ ప్రభావం లేకపోవటం, విద్యా సౌకర్యాలతో పాటు
సామాజిక, ఆర్థిక రంగాలలో అంతంత మాత్రమే పురోగతి ఉండటం, సమకాలీన సామాజిక జీవితాన్ని వెనుకబాటు తనాన్ని అర్థం చేసుకోలేకపోవటం తదితర అనేక కారణాలవల్ల రాయలసీమలో ఆధునిక సాహిత్య ప్రక్రియలు వేగంగా వికాసం పొందలేదని సీమ సాహిత్య విమర్శకులు ఆయా సందర్భాలలో విశ్లేషించారు. నిజానికి గత కొన్ని శతాబ్దాల తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే అన్ని సందర్భాల లోనూ రాయలసీమ ప్రాంతం మిగతా ప్రాంతాలతోపాటు సమాంతరంగా కాస్త అటు ఇటు అడుగులు వేస్తోందనే చెప్పాలి. తొలి తెలుగు వచనశాసనం, ప్రబంధ సాహిత్యం, శతకసాహిత్యం, సంకీర్తన సాహిత్యం, వచనకావ్యాల
వికాసం, నాటకం, నవల ఇలా అన్ని సాహిత్య ప్రక్రియల పురోగతికి సీమ ప్రాంతం తన వంతు ప్రాతినిధ్యం వహించింది. ఆ సాహిత్య చరిత్ర పరిణామాలను సరైన పద్ధతులలో దాఖలు చేసుకోకపోవడమే మన తప్పిదం. ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా మనల్ని మనమే వెనుకబడి పోయామనే ఒక రకమైన ఆత్మన్యూనతా భావంలో కొట్టుమిట్టాడు తున్నాం. ఇదే
భావం ఆధునిక సాహిత్య ప్రక్రియలోను కొనసాగింది.
1947 సం ॥ దాకా మనకు తెలిసినంతలోనే రాయలసీమలో అరవై దాకా పత్రికలు వెలువడినాయి. ఈ పత్రికలన్నీ కూడా ఈ ప్రాంత సాహిత్య, సామాజిక, సాంస్కృతిక వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. మన దురదృష్టవశాత్తు వాటిలో ఏ కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. ఇంకా చాలా అక్కడక్కడ అటకలపై మిగిలే ఉన్నాయి. యాభై ఏళ్ల క్రితం ప్రచురితమైన అనేక పుస్తకాలు ప్రస్తుతం అలభ్యాలుగా ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. ఇవన్నీ
వెలుగులోకి వచ్చి పరిశోధనలు జరిగితే వెనుకబడిన ప్రాంతాలలో తమకున్న పరిమితుల్లోనే ఏ మేరకు సమకాలీన స్పృహతో, సామాజిక చైతన్యంతో కొనసాగారో స్పష్టమవుతుంది.
ప్రస్తుతం రాయలసీమ కథా విషయానికొస్తే .. ఉద్యోగ రీత్యా ఈ ప్రాంతంలో వుండిన చింతా దీక్షితులు సీమలోని గిరిజనుల జీవిత మాధారంగా 'సుగాలీ కుటుంబం ' కథను
చిత్రించడంతో ఈకథనే రాయలసీమ జీవితమున్న తొలికథగా విమర్శకులు గుర్తించారు. 1941 లో 'చిరంజీవి' కథను అనంతపురములో ఉండే గుత్తి రామకృష్ణ రాశారు. వీరినే
రాయలసీమ తొలి కథకుడిగా ఇన్నాళ్లు భావిస్తూ వచ్చాం. పరిశోధకులు, విమర్శకులకు సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ అభిప్రాయాలలోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో సరికొత్త ఆధారాలు లభిస్తుండడంతో రాయలసీమ కథా సాహిత్య విషయమై చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
' శ్రీసాధన పత్రిక ' 1926 ఆగస్టు 14 నుండి వారపత్రికగా పప్పూరు రామాచార్యుల సంపాదకత్వంలో అనంతపురం కేంద్రంగా తెలువడింది. ఇవి 2010 సంవత్సరంలో లభ్యమయ్యాయి. ఈ పత్రికలో 1926 అక్టోబరు నెల మొదలుకొని 1941 దాకా దాదాపు 21కథలు ప్రచురించారు. ఈ కథలన్నింటిని ఒక సంకలనంగా ప్రచురిస్తే బాగుంటుందని అనిపించింది. లభిస్తున్న మరికొన్ని పత్రికలలోని కథలను కూడా ఇందులో చేర్చి సమగ్రంగా ఉంటుందని భావించి 'మొదటితరం రాయలసీమ కథలు' పేరుతో ఒక సంకలనాన్ని వెలురించాను.
1926జూలై నుండి ప్రొద్దుటూరు కేంద్రంగా వెలువడిన ' భారత కథానిధి ' పత్రిక ను రాయలసీమ
కథలపై పరిశోధన చేస్తున్న తవ్వా వెంకటయ్య పరిశీలించాడు.ఈ పత్రిక వ్యవస్థాపకుడు పైడిమర్రి పిచ్చయ్యచౌదరి కాగా, ప్రకాశకులుగా యన్.సుబ్బయ్య శ్రేష్టి ఉండేవారు. ప్రధాన
సంపాదకులుగా సి.నరసింహ శాస్త్రి కొనసాగారు. అన్ని రకాల కథలకు ఈ పత్రిక విశేష ప్రాధాన్యమిచ్చేది. ఆ పత్రికలోని రాయలసీమ కథా విషయాలను ' 1941 కి ముందూ సీమకథ ' అనే వ్యాసంలో (21-1-2013ఆంధ్రజ్యోతిలో) తవ్వా వెంకటయ్య తెలియజేశాడు. 1926
జూన్ నెలలో ' మతబేధం ', ' మీనాక్షి ' అనే కథలను రాసిన అయ్యగారి నరసింహమూర్తి,
బొగ్గవరపు నాగవరదయ్య శ్రేష్టలను లభిస్తున్నంతలో తొలి రాయలసీమ కథకులుగా
పేర్కొన్నాడు. ఆధునిక కథాలక్షణాలతో కూడిన కథలు ఈ పత్రికలో 50 దాకా ఉ
న్నట్లు తవ్వా వెంకటయ్య తెలిపారు. వాటిలో 1926-27 సం || లలోని 25 కథలను 'రాయలసీమ తొలితరం కథలు'
పేరుతో ప్రత్యేక సంకలనంగా ప్రచురించాడు. తవ్వా వెంకటయ్య రాసిన వ్యాసానికి ప్రతిస్పందనగా 1918 లోనే సీమ తొలికథ ' (10-02-2013 ఆంధ్రజ్యోతి) అనే
వ్యాసాన్ని తెలంగాణ ప్రాంతంలోని సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్ రాశారు. 1918 అక్టోబరు నెలలో సౌందర్యవల్లి మాసపత్రికలో రచయిత పేరు లేకుండా ప్రచురితమైన ' కడపటి పైసా ' కథను రాయలసీమ తొలి కథగా తెలియజేశారు.ఈ కథను గాడిచర్ల హరి సర్వోత్తమరావు రాసి వుండవచ్చని వీరు అభిప్రాయపడ్డారు. 1918 సెప్టెంబరు నెలలో గాడిచర్ల హరిసర్వోత్తరావు జీవితసహచరి రామాబాయి
సంపాదకత్వాన సౌందర్య వల్లి మాస పత్రిక వెలువడింది. ఆ పత్రిక అక్టోబర్ సంచిక మాత్రమే లభిస్తోంది. మిగతా సంచికలు కూడా లభిస్తే సీమ తొలి కథల విషయంపై మరింత స్పష్టత వస్తుంది.
సంగిశెట్టి శ్రీనివాస్ 1913 అక్టోబరు 1న 'హిందూసుందరి'
పత్రికలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన ' రోజాంబ-శ్వేతాంబ ' కథ వివరాలను తెలియజేశారు. ఈ కథ ప్రాచీన రూపంగా, అద్భుత కథగా అనిపించినప్పటికీ శిల్పపరంగా కథ ఒదిగిన తీరు చాలా నైపుణ్యంగా ఉంది. ప్రత్యేకించి రాయలసీమ జీవితం లేకున్నా, రాయలసీమ ప్రాంతం వారైన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఈ కథను రాశారు.1882 జులై నెల నుండి 1883 ఏప్రిల్ వరకు జనవినోదిని పత్రికలో 'ఒక సంవత్సరము పల్లెటూరి యందునికి ' లేక ' రుతుచర్య ' అనే శీర్షికన అయిదు భాగాలుగా ప్రచురించిన ఒక పెద్ద కథను వివినమూర్తి తాను ప్రచురించిన 'దిద్దుబాటలు' సంకలనంలో సమకూర్చాడు. 'జనవినోదిని ' పత్రిక 1875 లో ప్రారంభమైంది. Madras School and Vernacular Literature Soceity వారు ఈ పత్రికను ప్రచురించేవారు. ఈ పత్రికలో వెలువడిన పై కథ బహుశా తెలుగులో తొలివరుస కథ కావచ్చునని 'వివినమూర్తి' పేర్కొన్నారు. కథకుడి పేరులేకుండా వెలువడిన ఈ కథ గ్రాంథిక భాషతో రుతువుల వర్ణనతో సాగుతుంది.ఈ కథ రాయలసీమలోని ఒక పల్లె కేంద్రంగా నడుస్తుంది. కథ భాగమంతా హేమంత శిశిర ఋతువులో జరుగుతుంది. అప్పటి రాయలసీమ ప్రాంతంలోని గ్రామీణ జీవనం సంప్రదాయాలు,ఉత్సవాలు, పండుగలు, వ్యవసాయం, పశువులు,అడవులు ఇలా అనేక అంశాలను ప్రతిబింబిస్తుంది.ఈ కథను రాయలసీమ స్థానిక జీవితం తెలిసినవారే రాసి ఉంటారు. ఇప్పటిదాకా లభిస్తున్న అంతలో 1882లో ఈ 'రుతుచర్య' కథనే రాయలసీమలో తొలికథ గాను, రాయలసీమ ప్రాంత జీవితం ఉన్న తొలికథగానూ పేర్కొనవచ్చు.
2013 అక్టోబరులో హిందూ సుందర పత్రికలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రాసిన కథలో స్పష్టంగా కథ కూడా పేరు ఉంది 2018 నాటికి సౌందర్య పత్రికలో' కడపటి పైసా 'తో సీమ కథ వస్తు శిల్పాలను భాషాపరంగా స్పష్టమైన రూపం తీసుకుంది.19 21_ 23 సంవత్సరాల లో వెలువడిన 'సుగాలి కుటుంబం','అచ్చు బాటు కాని చదువు' కథలతో సీమ కథ ముందడుగు వేసింది.1882 నుండి 1925 వరకు నాలుగు దశాబ్దాల కాలంలో రాయలసీమ జీవితానికి సంబంధించి లేదా రాయలసీమ కథలకు సంబంధించి కేవలం నాలుగైదు కథలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కోస్తాంధ్ర ప్రాంతంలో కథ వేగవంతంగా అభివృద్ధి చెందింది.ఆ పత్రికలలోనే అడపాదడపా రాయలసీమ కథలు కూడా వచ్చాయి.కోస్తా ప్రాంతంలో 1875 నుంచి అనేక పత్రికలు వెలువడ్డాయి. ఇంచుమించుగా అదే కాలంలో రాయలసీమలో కూడా అనేక పత్రికలు వెలువడ్డాయి.1835లో బళ్ళారిలో ప్రారంభమైందని అనుకొంటున్న 'సత్యదూత' మొదలుకొని శ్రీ యక్షిణి, భారతి, సన్మార్గ బోధని, ప్రబుద్ధాంధ్ర ,విజ్ఞాన వర్దిని, ప్రభావతి ,పూర్ణిమ తదితర పత్రికలు 1900 దాకా వెలువడ్డాయి.1910 నుండి
1925 దాకా హంస, ఆంధ్ర చంద్రిక, శంకర విజయం, రామకథాసుధ, అరుణోదయం ఆనంద చంద్రిక, బాల భారతి మాతృ సేవ, లోకమాన్య, బ్రహ్మానందిని, భారత మహిళ తదితర పత్రికలు రాయలసీమలో వెలువడ్డాయి.1920 దాకా మొత్తం 30 దాకా పత్రికలు రాయలసీమలో వెలువడినప్పటికీ అందులో సౌందర్యవల్లి పత్రిక ఒక సంచిక మాత్రమే లభిస్తోంది.అప్పటి మరిన్ని పత్రికలు లభిస్తే రాయలసీమ ఆధునిక కథా సాహిత్యం ఆవిర్భావం వికాసాలను మరింత సాధికారికంగా అధ్యయనం చేయవచ్చు.భవిష్యత్తులో రాయలసీమ కథలపై మరింత లోతైన అధ్యయనం జరిగితే సీమ తొలి కథల విషయమై మరింత తెలిసే అవకాశం ఉంది.
(మొదటి తరం రాయలసీమ కథలు --సంకలనానికి రాసిన సంపాదకుని మాట నుంచి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి