పల్లెతనం వదలని బిజివేముల రమణారెడ్డి





కడప జిల్లా రచయితలు ఎవరు రాసినా పల్లె జీవితం మీద పూర్తి పట్టు కలిగి ఉంటారు. పల్లెల్లో వస్తున్న మార్పుల్ని పట్టుకుని స్థానిక రాజకీయాలను ఎండగడతారు. రారా, సొదుం, కేతు, వైసివి రెడ్డి వంటి దిగ్గజాల దగ్గర్నుంచి పాలగిరి, సన్నపురెడ్డి, బత్తుల ప్రసాద్ దాక ప్రతి ఒక్కరూ ఆ కోవలోనే తెలుగు సాహిత్యం మీద తమదైన ముద్ర వేశారు.

ఇప్పుడు బిజివేముల రమణారెడ్డి వంతు. ఈయన కడప జిల్లా, పాపిరెడ్డి పల్లెకు చెందిన కథా రచయిత. నాకు తెలిసి 2004లో మొదలయ్యాడు. ఓ రెండేళ్లపాటు కథలు రాసి తర్వాత ఎందుకనో కొంత విరామం తీసుకున్నాడు. వృత్తి రీత్య జర్నలిస్టు కావడంతో ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇప్పుడు సొంత ఊరు చేరాడు. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ కలం పట్టాడు. గత రెండేళ్లలో మరికొన్ని కథలు రాసి ‘ఏటి జేడేలు’ అనే అచ్చమైన రాయలసీమ పేరుతో పుస్తకం తెచ్చాడు. ఈ ‘ఏటి జేడెలు’ అంటే ఏంటో స్వయంగా పుస్తకం చదివి తెలుసుంటేనే బావుంటుంది.

‘డిశ్చార్జ్’, ‘ఆశ’ వంటి కథలు ఈ పుస్తకంలో ఆకట్టుకుంటాయి. రచయితకు స్థానిక జీవితం మీద, సొంత ఊరు మీద ఎంత ప్రేముందో ‘ఊరికి బోయెచ్చిన’ కథ చెబుతుంది. ఇతను పేద జీవుల పట్ల కనికరం పుష్కలంగా ఉన్నవాడు. కొంతకాలం రాజకీయాల్లో ఉన్నా కల్మషం అంటకుండా జాగ్రత్త పడ్డవాడు.

ఈ పుస్తకంలో కథలు ఒక ఎత్తు అయితే కేతు మాష్టారు, పాలగిరి విశ్వప్రసాద్, సన్నపురెడ్డి రాసిన ముందుమాటలు మరో ఎత్తు. కడప జిల్లాకు సంబంధించి పాలగిరి ముందుమాటలో రాసిన ఒక పరిశీలనను ఉన్నది ఉన్నట్టు ఇస్తున్నాను.

‘ .......... ఈ సందర్భంలోనే సాహిత్యం అనేక పాయలుగా చీలిపోయింది. స్త్రీ వాదం, ముస్లిం, మైనార్టీ వాదం, దళిత వాదం తదితర వాదాల రూపమెత్తింది. కడప జిల్లా కథా సాహిత్యంలో ఈ వాదాలు ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా కనిపించలేదు కానీ ఈ వాదాల సారాన్ని రాయలసీమ గ్రామీణ జీవితం నుండే వ్యక్తపరిచింది’


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి