సామాజిక సమతా స్థితిని కాపాడుతున్న రాయలసీమ ముస్లిం కథ
సామాజిక సమతా స్థితిని కాపాడుతున్న రాయలసీమ ముస్లిం కథ
-వేంపల్లె షరీఫ్
తెలుగులో ముస్లిం మైనార్టీ కథా సాహిత్యానికి పుట్టినిల్లు రాయసీమ. 1988లో కడపజిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సత్యాగ్ని ‘పాచికలు’ కథ రాయడంతో తొగులో ముస్లిం మైనార్టీ కథాసాహిత్యం మొదలైంది.
అంతవరకు తెలుగులో ముస్లిములు రాసిన ముస్లిమేతర సాహిత్యం, ముస్లిమేతరులు రాసిన ముస్లిం సాహిత్యం ఉంది కానీ ముస్లిములు రాసిన ముస్లిం కథా సాహిత్యం లేదు.
ఆ లోటును తీర్చడానికి రాయసీమకు చెందిన ప్రసిద్ధ సాహితీ వేత్తలు మధురాంతకం రాజారాం, వల్లంపాటి వెంకటసుబ్బయ్య గార్లు చేసిన సూచన మేరకు తాను కలం పట్టానని రచయితే స్వయంగా తన కథపుస్తకంలో చెప్పుకోవడం విశేషం.
పూర్తి భిన్నమైన సామాజిక, సాంస్కృతిక జీవితం ఉన్న ముస్లిముల గురించి ముస్లిములే రాసుకోవడం వల్ల అనేక విషయాలు మరింత లోతుగా తెలుగు సాహితీ లోకానికి తెలుస్తాయనే ఉద్దేశ్యంతో వారు ఈ సూచన చేసుండొచ్చు.
ఏదేమైనా తెలుగులో ముస్లిం మైనార్టీ కథాసాహిత్యం అంతర్గత సంస్కరణాభిలాశతో మొదలవడానికి వాళ్లూ ఒక కారణమయ్యారు.
తొలి కథ ‘పాచికలు’లో రచయిత షేక్ హుస్సేన్ సత్యాగ్ని ఇస్లాం మతంలో ‘తలాఖ్’ పద్ధతి దుర్వినియోగం అవుతున్న తీరును కళ్లకు కట్టినట్టు రాశారు. దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది మతపెద్దలు ఆడే ఆటలో పాచికల్లా మారుతున్న స్త్రీ జీవితాను హృద్యంగా చిత్రించారు.
తెలుగులో తొలి మైనార్టీ ముస్లిం కథ మరో ప్రాంతంలో పుట్టి ఉంటే దాని తీరు తెన్నులు ఎలా ఉండేవో తెలియదు కానీ రాయసీమలో పుట్టడం వల్ల అది లోపలి, బయటి సమస్యల్ని నిస్సంకోచంగా చీల్చి చెండాడే పదునైన కత్తిగా తయారైందని మాత్రం చెప్పగలను.
ఎందుకంటే రాయలసీమ మొదటి నుంచి కూడా హిందూముస్లిముల ఐక్యతకు చిహ్నం. ఒకరి పట్ల ఒకరు సహానుభూతి కలిగి సహజీవనం చేసే సంస్కృతి రాయలసీమలో ఉంది. కులమతాలకు అతీతంగా ఇక్కడ ఒకర్నొకరు వరసలు పెట్టి పిల్చుకుంటారు. అందుకే బయటి ప్రాంతాల్లో జరిగే అనేక సంఘటనలు ఇక్కడ అంత తొందరగా ప్రభావం చూపవు. పైగా ఎంత క్లిష్టపరిస్థితిలో అయినా రెండు సమూహాలు పరస్పరం శాంతి, నిగ్రహంతో మెలగడం ఇక్కడ చూస్తాం. ఇక్కడివాళ్లకు మొదట మానవీయత ఆ తర్వాతే మతం.
అందుకే ఎంత పెద్ద కథావస్తువునైనా సహానుభూతి ధోరణిలోనే చిత్రించడం ఇక్కడి ముస్లిం రచయితల ప్రత్యేకత. ఒకవైపు అంతర్గత సమాజంలోని చిన్న చిన్న లోపాను ఎత్తిచూపుతూనే మరోవైపు మెజార్టీ సమాజంలో సహానుభూతిని పొందే లక్ష్యంతో ఇక్కడి కథ వెల్లి విరిసింది.
రాయసీమ ముస్లిం కథను 2002 సంవత్సరానికి ముందు ఆ తర్వాతగా విభజించుకుని పరిశీలిస్తే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి.
మొదటితరం రచయితలు ఇంతకుమునుపు చెప్పుకున్నట్టు ముస్లిం సంప్రదాయాల్లో ఉన్న లోటుపాట్లను చర్చకు పెడితే మలితరం రచయితలు సామాజిక వెనకబాటు, నిరక్షరాస్యత, నిర్లక్ష్యం, వివక్ష, హక్కు, సమానత్వం గురించి మాట్లాడారు.
షేక్ హుస్సేన్ తర్వాత ముస్లిం సంప్రదాయాలు, కట్టుబాట్లను కథనం చేసే ఒరవడిని కొనసాగించిన రచయిత్రి షహనాజ్. అనంతపురం జిల్లాకు చెందిన ఈమె 1996 ఆగస్టులో ‘మానవత్వం మకాం వేసిన చోట’ అనే కథ రాశారు.
ఈ కథ కూడా పూర్తిగా అంతర్గత సాంప్రదాయ స్త్రీ సమస్య అంశంగానే నడుస్తుంది. మొదటి భార్యకు తలాఖ్ ఇచ్చి ఇద్దత్ చెల్లిస్తూ రెండోభార్యతో సంసారం చేస్తున్న భర్త హఠాత్తుగా చనిపోతే షరియత్ ప్రకారం ఇద్దరి భార్యలకు న్యాయం ఎలా జరగాలి అనే అంశంపై చక్కగా అల్లిన కథ ఇది.
ఈ కథరాసి షహనాజ్ రాయసీమ నుంచి వచ్చిన తొలి ముస్లిం మైనార్టీ కథారచయిత్రిగా కూడా తెలుగు సాహిత్యంలో నమోదై ఉన్నారు.
ముస్లిముల్లో తలాక్ సంప్రదాయంపై ఇటీవ విపరీతమైన చర్చ జరిగిన నేపథ్యంలో తనదైన శైలిలో ‘ముసుగు’ అనే కథ రాసి చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత వేంపల్లి అబ్దుల్ ఖాదర్ కూడా ఈ ఒరవడిని అందుకున్నారు.
వరుస క్రమంలో చూసుకుంటే షహనాజ్ తర్వాత రాయసీమలో కనబడే పేరు ఎన్నెస్ ఖలందర్. ఈయన ‘మున్నీబేగం’ కథను 2001లో వార్తదినపత్రికలో రాశారు. ఇంచుమించు ఇదే కాలంలో కడపజిల్లాకే చెందిన మహమూద్ విజయ విహారంలో ‘హజారా’ అనే కథ రాసినట్టు గుర్తు కానీ పూర్తి వివరాలు తెలియడం లేదు.
మొదట వచ్చిన రెండు (పాచికలు, మానవత్వం మకాం వేసిన చోట) కథలతో పోల్చుకుంటే మున్నీబేగం కథ కొంత భిన్నంగా ఉంటుంది. అంతిమంగా ముస్లిం స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన కథే అయినప్పటికీ ఇందులో రాయసీమ స్థానిక సమస్య కూడా కనబడుతుంది.
మొదటి రెండు కథల్లో ముస్లిం స్త్రీ పాత్రకు ఎదురైన ఆయా సంప్రదాయ సమస్యలను పురుషులు జోక్యం చేసుకుని పరిష్కరిస్తారు. కానీ ‘మున్నీ బేగం’ కథలో స్త్రీ పాత్ర తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కుంటుంది. భర్త మీద సున్నితంగా నిరసన తెలపడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. పైగా పొట్టకూటి కోసం పురుషులు గల్ఫ్ వెళ్లిన ముస్లిం కుటుంబాల్లో స్త్రీలు ఎంత నిర్లక్ష్యానికి గురవుతారో ఈ కథ ఆర్ద్రంగా చిత్రించి కన్నీళ్లుపెట్టిస్తుంది.
రాయసీమలో ఉన్న 13 శాతం మంది (2011 లెక్క ప్రకారం) ముస్లిముల్లో చాలామంది పేదలు. టీ కొట్లు, మటన్‌షాపు, రిపేర్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లు, పంక్చర్ షాపు, వెల్డింగ్ షాపు, కూరగాయాలు, పండ్లు, తిను బండారాలు, కూల్ డ్రింకు షాపులు నడుపుకుంటూ కనిపిస్తారు.
మరికొంతమంది చిన్నచిన్న చేతి వృత్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. చదువుకున్న వాళ్లు తక్కువ. ఎంతోకొంత చదువుకున్నా అది ఎందుకూ పనికిరాక డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ వంటి పనులు నేర్చుకుని సౌది, కువైట్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు.
కడపజిల్లాలోని రాజంపేట, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో వీరి సంఖ్య ఎక్కువ. స్వయంగా ప్రొద్దుటూరు వాసి కావడంతో ఏమో ఖలందర్ ఈ కథను ఆకట్టుకునేలా రాయగలిగారు. ఆ తర్వాతి కాంలో మహమూద్, వేంపల్లె షరీఫ్ వంటి వారు కూడా ఈ అంశంపై ఒకట్రెండు కథలు రాసి ఉన్నారు.
అసలే కరువు ప్రాంతమైన రాయసీమలో రైతులు ప్రత్యక్ష బాధితులైతే ఇతర సమూహాల వాళ్లు పరోక్ష బాధితులుగా ఉంటారు. ఏళ్లతరబడి ఉన్న పాలకుల నిర్లక్ష్యం, వనరులు వినియోగించుకోలేనితనం ఈ ప్రాంతానికి శాపంగా మారాయి. దీనికి తోడు నిరక్షరాస్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏవీ ఉండకపోవడం వంటి సమస్యలతో ఇక్కడి ముస్లిముల జీవితం మరింత దుర్భరంగా మారింది. సచార్ కమిటీ చెప్పినట్టు దళితుల కన్నా వెనుకపడ్డ పేదరికం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
పైగా చాలామంది ముస్లిం రచయితలు పేద కుటుంబాల నుంచే వచ్చినవారు కావడంతో ఇక్కడి కథల్లో ఎక్కువగా పేదరికం, దైన్యం, నిస్సహాయత కనిపిస్తుంది.
తోడబుట్టిన అన్నకు సాంప్రదాయం ప్రకారం ‘సాంగెం’ తీసుకెళ్లలేని దైన్యం, సాంగెం తీసుకొచ్చిన చెల్లికి బట్టలు పెట్టలేని అన్న నిస్సహాయతను ‘జైతూన్’ (2004) కథలో కళ్లకు కట్టినట్టు వివరించి కదిలిస్తాడు రచయిత అక్కంపేట ఇబ్రహీం.
షేక్ బేపారి రహమతుల్లా (శశిశ్రీ) రాసిన ‘ముజక్కర్’ (2009) కథ కూడా ఇలాంటి పేదరికాన్నే చూపిస్తుంది. ఒక పూట గడిస్తే మరో పూట గడవడం ప్రశ్నార్థకంగా ఉన్న పెళ్లిళ్ల పూజారి ‘ఖాజీ సాబ్ ’ కథ ఇది. అనంతపురం జిల్లాకు చెందిన నవ యువ కథకుడు మహమ్మద్ గౌస్ రాసిన ‘రెండోజత’ (2020) కథ కూడా `కనీసం బట్టలు కొనుక్కొని పండగ జరుపుకోలేని దైన్యాన్ని చిత్రిస్తుంది.
అయితే ఈ కథన్నింటిలోనూ పేదరికం ఉందే తప్ప ఆ పేదరికానికి ఉన్న సామాజిక కారణాలు చర్చలో లేవు. అది కథా గమనానికి ఆటంకమని రచయితలు అనుకోని ఉండొచ్చు కానీ ఆ లోటును తీరుస్తూ కూడా కొన్ని కథలు వచ్చాయి.
రచయిత ఎస్. నూరుల్లా గరీబ్ జిందగీ’ (2004) అనే కథ రాశారు. ఈయన రాసింది ఒక్క కథే అయినప్పటికీ ఇది ముస్లిముల పేదరికపు మూలాల్లోని ఒక శకం గురించి చెబుతుంది. కథలోని ఇద్దరు మిత్రుల్లో ఒకరైన జాకోబుకు రిజర్వేషన్ వల్ల ఉద్యోగం వస్తుంది. ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అబ్దుల్లాకు ఉద్యోగం రాదు. ఆ విషయాన్ని స్వయంగా జాకోబే చెబుతూ ఇకనైనా ముస్లిములు మేల్కొని సరైన నాయకత్వాన్ని తయారు చేసుకుని ఉద్యమించకపోతే పుట్టగతులు ఉండవని సూచిస్తాడు. ఓ రకంగా ఇది బహుజన తాత్విక ఐక్యతను సూచించే కథ కూడా.
ఇలాంటి అంశమే మహమూద్ రాసిన ‘కాసింత నీడ’ (2004) కథలో కనిపిస్తుంది. ఇంటి ఓనరు రహమతుల్లా తోటి ముస్లిం అయి ఉండి కూడా పేద ఖాసింని ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లమంటాడు. పేదసాదాని బతకనివ్వకుండా ఖాళీ చేయించి అక్కడ మిద్దెలు కట్టి మరిన్ని అద్దెలు వసూలు చేయాలని రహమతుల్లా ప్లాన్. డబ్బు ఏ కులం, ఏ మతం వాడి దగ్గరున్నా వాడి ఆలోచనలు ఎప్పుడూ ఆర్థిక సూత్రాల చుట్టే తిరుగుతాయని ఈ కథలో చెబుతాడు మహమూద్. అంతేకాదు చివరికి ఖాసీంని ఊరి చివర ఉన్న దళితులు అక్కున చేర్చుకుని కాసింత నీడ ఇవ్వడంతో కథ ముగుస్తుంది.
నిజానికి ఒక్క మున్నీబేగం తప్ప మిగతా కథన్నీ గుజరాత్ ఊచకోత ఘటన తర్వాత వచ్చినవే. 1992నాటి బాబ్రీ మసీదు ఘటన, 2002 నాటి గుజరాత్ ఊచకోత ఘటన తొగు ముస్లిం మైనార్టీ కథని తీవ్రంగా ప్రభావితం చేసింది.
మొదటి ఘటన సమయంలో హైదరాబాద్ కేంద్రంగా కొంతమంది ముస్లిం కవులు, రచయితలు తీవ్రంగా స్పందించారు. కవితలు, కథల రూపంలో తమ అస్తిత్వ ప్రకటన చేశారు. అప్పటికే అస్తిత్వ వాదాల కాలం నడుస్తుండటంతో క్రమంగా ముస్లిం అస్తిత్వం కూడా ఒక వాదంగా బయల్దేరింది. అయినప్పటికీ రాయసీమ ముస్లిం కథని అది పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. కానీ రెండో ఘటన తర్వాత రాయసీమ ముస్లిం కథకు కూడా సామాజిక అంశాలపై ఎక్కువగా తమ కథల్ని పదును పెట్టారు.
అందుకు 2004లో వచ్చిన ‘వతన్’ ముస్లిం కథా సంకలనం కూడా కొంత ప్రభావితం చూపిందని చెప్పవచ్చు. ఎందుకంటే వతన్ కథాసంకలనం కోసం రాసిన కొంతమంది ముస్లిం రచయితలు ఆ తర్వాతి కాంలో ఒక కథ కూడా రాయకుండా ఆగిపోయారు.
2003లో వచ్చిన ‘పురుడు’ గుజరాత్ అ్లర్ల మీద రాసిన కథ. కర్నూలుకు చెందిన ఇనయ్‌తుల్లా ఈ కథను రాశారు. అల్లరల్లో అహమ్మదాబాద్‌కు చెందిన కౌసర్ అనే గర్భిణిని పొట్టన పెట్టుకున్నాయి కొన్ని అల్లరిమూకలు. ఒకవేళ ఈ కౌసర్ రాయసీమకు చెందిన బిడ్డే అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించి, పరితపించి అక్కున చేర్చుకుని రాసిన కథ. ఇంతటి దు:ఖంలోనూ రచయిత చివర్లో సామరస్యాన్ని కోరుకుంటూ ముగించడం అతని సంయమనానికి నిదర్శనం. రాయసీమ ప్రాంతీయ అస్తిత్వమే ఇక్కడి రచయితకు ఇంతటి సంయమనాన్ని ఇచ్చిందని భావించాలి.
ఎందుకంటే పులివీడు గఫార్ రాసిన ‘ఖబుతరా’ (2004) కథ కూడా ఇలాంటి సామరస్యాన్ని కోరుకున్నదే. అప్పటికప్పుడు పైకి కనిపించకపోయినా బాబ్రీ ఘటన రాయసీమ లాంటి సామరస్య ప్రాంతంలో కూడా రెండు ప్రధాన సమూహాల మధ్య పెద్ద విభజన రేఖను గీసేందుకు ప్రయత్నించిందని ఈ కథ చదివితే అర్థమవుతుంది.
అలాగే అనంతపురం నుంచి జి. బాషా రాసిన ‘బైపాస్ రైడర్స్’ (2005)కథ కూడా ఒంటి నిండా సామరస్య భావాన్ని పులుముకుని కనిపిస్తుంది. బస్సులోని రెడ్డి- ముస్లిం మహిళను అనుమానంగా చూసి అవమానించినా చివరికి ఆ బస్సులోనే రెడ్డి కూతురికి పురుడు పోసి సామరస్యాన్ని, మానవత్వాన్ని చాటుకుంటుంది ఆ మహిళ. ఈ కథలన్నీ చాలావరకు రాయసీమ మాండలికంలో ఉండటం వల్ల కూడా వీటికి అదనపు సొబగు అబ్బింది.
ముస్లిముమీద ఉన్న భాషాపరమైన వివక్షను మహమ్మద్ రఫీ రాసిన ‘అచ్చులూ.. హల్లులూ’ (2018) కథ ఎదుర్కొంటే వారి తిండి మీద ఉన్న అనుమానాన్ని వేంపల్లి సికిందర్ రాసిన ‘కష్టం ముద్ద’ (2014) కథ ఎదుర్కొంటుంది. ఈదేశంలో చట్టాలు అందరికీ ఒకేలా వర్తించడం లేదన్న సత్యాన్ని ఎస్. సికిందర్ బాషా రాసిన ‘వివక్ష’ (2004) అనే కథ చర్చకు పెడుతుంది.
మరోవైపు ముస్లిముల్లో ఉన్న కులవివక్షను కడిగే కథలు కూడా రాయలసీమ నుంచి వచ్చాయి. కచ్చితమైన లెక్కలైతే లేవు కానీ రాయసీమలో దూదేకుల జనాభా కూడా ఎక్కువే. వీళ్ల అస్తిత్వం ముస్లిముల అస్తిత్వమే. ముస్లిములని చెప్పు కోవడం వల్ల బయటి సమాజం నుంచి ఎదుర్కొనే వివక్షకు తోడు ఇటు ముస్లిం సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష వీరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ఆవేదన నుంచి వచ్చిన కథే తిరుపతికి చెందిన షాజిదా రాసిన ‘అజ్ఞానపు రైలు’.
చాలా సాధారణంగా కనిపిస్తూనే అనేక విషయాలను చర్చకు పెడుతుంది ఈ కథ. రైలెక్కిన అమ్మలక్కలు ఊరికే కూర్చోకుండా తమకు తెలియకుండానే ముస్లిములపట్ల, దూదేకుల పట్ల ఎంత నిర్దయతో ప్రవర్తిస్తారో చక్కగా కళ్లకు కడుతుంది. అంతేకాదు ముస్లిముల్లో దూదేకుల పట్ల ఉన్న చిన్నచూపు పోయి వాళ్లంతా ఏకమవ్వాలని కోరుకుంటుంది. ఆ అనివార్యతను కూడా అది సూచిస్తుంది.
రాయలసీమ ముస్లిం మైనార్టీ కథకుల్లో మహిళలు చాలా తక్కువ. తెలుగు చదువుకున్న వాళ్లు పెద్దగా లేకపోవడం, ఉన్నవాళ్లను సృజన రంగంవైపుకు ప్రేరేపించే దిశగా చర్యలేమీ తీసుకోకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. షహనాజ్ తర్వాత రాయసీమలో ఎన్నో ఏళ్లకు కనబడుతున్న పేరు షాజిద.
ఇంత పెనుగులాటలోనూ నిగ్రహంగా నిబడి సర్వమానవ సమానత్వాన్ని కోరుకుంటున్న కథలూ ఉన్నాయి. దాదాహయాత్ రాసిన ప్రసిద్ధ కథ ‘మసీదు పావురం’, కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బాషా రాసిన ‘మనిషి’ కథలు ఈ కోవకు చెందుతాయి.
ముస్లిముల మీద వివక్ష ఈనాటిది కాదు. 1857 సిపాయి తిరుగుబాటు నుంచి అది ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉందని మనకు చరిత్ర చెబుతోంది. ఇస్లాం ఒక దుర్మార్గమైన మతమని, అది హింసని, మూర్ఖత్వాన్ని, తిరుగుబాటును తప్ప మరి దేన్నీ బోధించదనే జరిగే ప్రచారం ఒకవైపైతే ఆ మతాన్ని అవలంబించే ముస్లిములు మూర్ఖుని, సంఘవ్యతిరేకులని, దేశద్రోహులని, పరాయివాళ్లని, అంటరానివారని, నీతి నియమాలు లేని వాళ్లు అని జరిగే ప్రచారం మరోవైపు. ఈ ప్రచారాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యతను కూడా ఆధునిక రాయలసీమ ముస్లిం మైనార్టీ కథ తీసుకుంటోంది.
కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఇటీవల ప్రత్యేకంగా ఒక మతసమూహం మీద ఎంతటి విష ప్రచారం జరిగిందో తెలిసిందే. దీన్ని తిప్పి కొట్టి అపోహ ద్వారా సామాన్యుడి మనసు కలుషితం కాకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తుంది షేక్ షబ్బీర్ హుస్సేన్ రాసిన ‘బూచి’ (2020) కథ. అలాగే ఎన్నార్సీ, సిఏఏ విషయంలో నిజానిజాలేంటో చర్చించే ప్రయత్నం ఎస్.డివి. అజీజ్ రాసిన ‘కాఫిర్’ (2020)కథ చేస్తుంది.
రాయసీమ ముస్లిం కథ పూర్తి సామాజిక బాధ్యతతో ముందుకు నడుస్తోంది. నిజానికి వర్తమాన ముస్లిం కథకుల ఎజెండాని పాలకులే నిర్దేశిస్తున్నారేమో అన్న అనుమానం కూడా ఈ కథలు చదివితే కుగుతుంది. కానీ అది పూర్తిగా అబద్ధమైతే కాదు. ఒక రాయసీమ ముస్లిం కథ ఎజెండానే కాదు పూర్తిగా తెలుగు వర్తమాన ముస్లి కథా ఎజెండానే పాలకులు నిర్దేశిస్తున్నారు. వారు వేస్తున్న మతరాజకీయ ముద్రలను చెరిపేసుకోవడానికే ముస్లిం మైనార్టీ కథా సాహిత్యానికి సమయం సరిపోవడం లేదు.
ఒకవైపు తమను తాము చైతన్యం చేసుకుంటూ, మరోవైపు హక్కుల గురించి పోరాడుతూ, ఇంకోవైపు మతరాజకీయ ముద్రలను చిత్తు చేసుకుంటూ ఒక ఉద్యమంలా ముందుకెళ్లడం అంటే అది మామూలు విషయం కాదు.
పైగా రాయసీమ ముస్లిం మైనార్టీ కథ ఇన్ని కష్టాల్లోనూ, దు:ఖాల్లోనూ, దుర్ఘటనల్లోనూ ఒక ఆశావాద దృక్పథాన్న యితే వదులుకోలేదు. సామాజిక సంబంధాలను కాపాడే పరిధిలోంచే తన గొంతును వినిపిస్తోంది. ఈ గొంతు మరింత బలపడాలి.
నిత్యం అనేక సమస్యలతో పరుగులు పెట్టే మనం ఒక్క క్షణం వీరికోసం ఆగుదాం. ఏం చెబుతున్నారో విందాం. వీలైతే సహానుభూతి పొంది మతం పేరుతో జరిగే మకిలి నుంచి దూరంగా ఉందాం.
(సాహిత్య ప్రస్థానం, ఫిబ్రవరి,2021)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి