పెనుకొండ కోట – విజయనగర వైభవానికి రెండవ రాజధాని
పెనుకొండ కోట – విజయనగర వైభవానికి రెండవ రాజధాని
పెనుకొండ కోట సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలంలో ఉంది. ఇది అనంతపురం నుండి సుమారు 76 కిలోమీటర్ల దూరంలో, పుట్టపర్తి నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. పెనుకొండ కోట శతృదుర్భేద్యమైన దుర్గంగా పేరు పొందింది. శాసనాల్లో దీనిని “పెనుకొండ ఘనగిరి” అని పిలిచారు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 1941లో రాసిన గేయంలో పెనుకొండ గౌరవాన్ని ఇలా వర్ణించాడు –
“చనిన నాళుల తెనుగు కత్తులు
సానవెట్టిన బండ ఈ పెనుగొండ కొండ
రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల కరితి నీలపు దండ ఈ పెనుగొండ కొండ
వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ ఈ పెనుగొండ కొండ
తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ ఈ పెనుగొండ కొండ."
ఆయన ఈ గేయాన్ని రాయలసీమ మహాసభలో స్వయంగా ఆలపించాడు.
పెనుకొండను మొదట హోయసల రాజులు పాలించారు. వారు జైన మతస్థులైనందున, జైన మతం ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో అనేక జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. జైన దేవాలయాల వద్ద 14వ శతాబ్దానికి చెందిన సంస్కృత, కన్నడ, తెలుగు శాసనాలు లభించాయి. ఇవి జైన మఠాల ఉనికిని నిర్ధారిస్తున్నాయి.
తరువాత చాళుక్యులు, విజయనగర రాజులు, నవాబులు, టిప్పు సుల్తాన్, చివరగా బ్రిటిష్ పాలించారు. హోయసలులు కోటకు పునాది వేసినా, దానిని బలమైన దుర్గంగా మార్చిన ఘనత విజయనగర రాజులకే చెందుతుంది.
1565లో తళ్లికోట యుద్ధం తర్వాత తిరుమల దేవరాయలు రాజధానిని హంపి నుండి పెనుకొండకు మార్చాడు. కొద్ది కాలం పాటు పెనుకొండ విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా నిలిచింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది వేసవి రాజభవనంగా కూడా ఉపయోగించబడింది.
తరువాత వేంకటపతి రాయలు ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని, కోనేటి నాయుడుని పాలకునిగా నియమించాడు. కోనేటి నాయుడు మరియు అతని వంశస్థులు 17 సంవత్సరాల పాటు పెనుకొండ, రాయదుర్గం, కుందుర్పి ప్రాంతాలను పాలించారు.
విజయనగర రాజ్య పతనం తర్వాత, రాజధానిలోని సంపదను కోటలో దాచారని చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే నిధుల కోసం కోటలో తవ్వకాలు జరిగినట్టు కథనాలు చెబుతున్నాయి.
పెనుకొండలో 365 దేవాలయాలు ఉన్నాయని చెబుతారు. ఎర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. విజయనగర రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడే పూజలు చేసేవారని చెబుతారు. కోటలో విజయనగర శైలిలో నిర్మించిన రెండు మెట్ల బావులు, ఒక గోపురం ఉన్నాయి.
1359లో నిర్మించిన అజితనాథ జైన దేవాలయం ఇటీవల పునరుద్ధరించబడింది. కోటలో రామాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం, ముక్తేశ్వరాలయం ఉన్నాయి. 12వ శతాబ్దానికి చెందిన సూఫీ సన్యాసి హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ దర్గా కూడా ఇక్కడే ఉంది.
శ్రీకృష్ణదేవరాయల ప్రధానమంత్రి తిమ్మరసును కొంతకాలం జైలులో ఉంచిన స్థలం “తిమ్మరసు జైలు” కూడా ఇక్కడే ఉంది. అలాగే రాణి వాసంగా ఉపయోగించిన గగన్ మహల్ కోటలోనే ఉంది.
అలసాని పెద్దన మనుచరిత్రలో పెనుకొండ పరిసరాలు, అక్కడి ద్రాక్ష తోటలు, రాజభవనాల దృశ్యాలు ఆయన మనసులో నింపుకుని వర్ణించారని
భావిస్తారు. ఆయన తన రచనల్లో పెనుకొండను “విజయనగర సామ్రాజ్య రత్నం”గా పేర్కొన్నాడని చెబుతారు. పెనుకొండను అతను ధైర్యం, ధనం, ధర్మం కలిసిన గిరిదుర్గంగా వర్ణించాడు.
పెనుకొండ కోట కేవలం ఒక దుర్గం కాదు — అది దక్షిణ భారత చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, కళా వైభవానికి ప్రతీక. ఈ కోట రాళ్లలో, గోడలలో, గోపురాలలో విజయనగర శిల్పకళ ఘనత ఇంకా మ్రోగుతూనే ఉంది.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి