సీ.పీ. బ్రౌన్ గ్రంథాలయం పరిశోధకులకు అనుకూలంగా, పాఠకులకు విజ్ఞానాన్ని పంచుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 2006 నవంబరు 1వ తేదీన 20 వేల పుస్తకాలు, 20 లక్షల రూపాయల నిధి, 3 అంతస్తుల భవనంలో ఉన్న గ్రంథాలయం యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దీని అభివృద్ధిలో వేగం పెరిగింది. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా రూపాంతరం చెంది వివిధ వర్గాల నుంచి, విద్యాంసుల నుంచి ఆరు సంవత్సరాల్లో పుస్తకాల సంఖ్య 50 వేలకు పైగా పెరిగింది. దీంతో పాటు 200 తాళపత్ర గ్రంథాలను సేకరించి, శుద్ధిచేసి, స్కాన్ చేసి భద్రపరిచారు.
వివిధ విశ్వవిద్యాలయాలకు పరిశోధకులు సమర్పించే సిద్ధాంత గ్రంథాల రాతప్రతులను దాదాపు 200 ప్రతులను సేకరించి పరిశోధకుల కోసం భద్రపరిచారు. ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో సర్వేయర్ జనరల్‌గా పనిచేసిన కల్నల్ మెకంజీ సేకరించిన కైఫీయత్తులు అనబడే స్థానిక చరిత్రలను, కడప జిల్లాకు సంబంధించిన వాటిని ఇప్పటి వరకు 6 సంపుటాలను ప్రచురించారు. దీంతో పాటు గ్రంథాలయ వికాస చరిత్రను తెలిపే ‘మొండిగోడల నుంచి మహాసౌధం దాక’ అన్న గ్రంథాన్ని ప్రచురించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి