అన్నమయ్య జిల్లా నందలూరు లో బౌద్ధ ఆరామాలు


అన్నమయ్య జిల్లా నందలూరు లో బౌద్ధ ఆరామాలు

నందలూరు చేయ్యేరు పశ్చిమ ఒడ్డున ఉంది. రాయలసీమలో ఇది ఒక ప్రముఖ బౌద్ధ కేంద్రం. ఇక్కడ 1913 లో బౌద్ధ గుహలు, విహారాలు ఉన్నాయి.

కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా లోని రాజుల మందగిరిలోనూ దొరికిన క్రీస్తు పూర్వం 274–236 కాలం నాటి అశోక చక్రవర్తి వేయించిన శాసనాల ద్వారా కడప జిల్లా చరిత్ర తెలుస్తుంది.
      క్రీస్తుపూర్వం 3నుంచి 11వ శతాబ్దాల మధ్య అన్నమయ్య జిల్లాలోనీ నందలూరులో బహుదానది ఒడ్డున బౌద్ధారామాలు విరాజిల్లాయని.. దక్షిణ భారతదేశ పర్యటన చేసిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ప్రపంచానికి తెలియజేశారు. 
 ‘‘చు-లి-య’’ దేశపు రాజధానికి ఆగ్నేయ దిశలో అశోక చక్రవర్తిచే నిర్మించబడిన బౌద్ధ స్థూపం వున్నట్లు చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ పేర్కొన్నాడు. ఈ స్థూపమే కడప జిల్లా అడపూరు (నందలూరు) లో వున్న బౌద్ధ స్థూపంగా గుర్తించబడినది.

     క్రీస్తు శకం 7లో హ్యూన్ త్సాంగ్ తన భారతదేశ పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశానికి వచ్చిన పుడు, రేనాటి చోళుల రాజ్యం నుంచి కాంచీ పట్టణానికి వెళ్తూ, బౌద్ధ సంఘారామాలను గుర్తించారు. రాజధాని నగరానికి ఆగ్నేయ దిశలో అశోక చక్రవర్తి ఈ బౌద్ధ స్థూపం నిర్మించినట్లు ఆ చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ విశదీకరించారు. 
         అన్నమయ్య జిల్లా ఆడపూరు (నందలూరు) సమీపంలోని బహుదా నదీతీరంలో కొండ మీద వున్న ఆ బౌద్ధ స్థూపాలను 1913లో గుర్తించారు.1963లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొంతమేర తవ్వకాలు చేపట్టినారు. తర్వాత పురావస్తుశాఖవారు 1978–1980 మధ్యకాలంలో తవ్వకాలు జరిపించారు. ఈ తవ్వకాలలో 20 ఎకరాల స్థలంలో రాయలసీమ లోనే ఎక్కడా లేని రీతిలో అపురూపమైన స్థూపం బయటపడింది. కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిశోధకులు కూడా నందలూరు వద్ద గౌతమ బుద్ధుడి స్థూపాలు, ఆరామాలపై పరిశోధన చేశారు. 
          పురావస్తుశాఖ తవ్వకాల ఫలితంగా వెలుగులోకి వచ్చిన కట్టడాలలో చైత్య గృహం, రాళ్లతో నిర్మించబడి సున్నపు పూత కల్గివున్న అనేక వలయాకార స్థూపాలు, సోపానాలు, బుద్ధ పాదం, శాతవాహనులకు సంబంధించిన సుమారు 1600 సీసపు నాణేలు, మృణ్మయ శకలాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బుద్ధ పాదంపై బ్రహ్మీ శాసనం రాయబడివున్నది.

భారత దేశంలో బౌద్ధులు రెండు రకాల స్థూపాలు నిర్మించారు. ఒకటి ‘శారీరక స్థూపాలు’, రెండోవి ‘ఉద్దేశిక స్థూపాలు’. గౌతమ బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన శారీరక అవశేషాలపై నిర్మించి ఆవిష్కరించబడినవే ‘శారీరక స్థూపాలు’. కృష్ణా జిల్లా ఘంటసాలలోనూ, అమరావతి లోనూ ‘శారీరక స్థూపాలు’ ఉన్నాయి. ఇక ప్రత్యేక సందర్భాలలో నిర్మించబడిన స్థూపాలు ‘ఉద్దేశిక స్థూపాలు’. నందలూరులోనివి ఉద్దేశిక స్థూపాలు కావడం 
కడప జిల్లాకు గర్వకారణం.
         కడప జిల్లాలో బౌద్ధ సూచక గ్రామాలుగా అడపూరు, బూదవాడ, బౌద్ధ సూచక వ్యక్తి నామ గ్రామాలుగా బొజ్జాయిపల్లి వున్నాయి. నందలూరు గుట్టపై బయల్పడిన మహాచైత్యం 156 అడుగుల చుట్టుకొలత కల్గివుండి, 8 అడుగుల ఎత్తు కలిగి, చుట్టూ ప్రదక్షిణా పదం కల్గివున్నది. దీనికి ఒక ప్రక్కన వరుసగా 15 ఉద్దేశిక స్థూపాలున్నాయి. 24×7 అడుగుల గజపృష్టాకార చైత్యము నిర్మించబడింది. స్థూపాలకు సున్నపు గారతో పూత పూయడమైనది. పర్వతంలో వాలుతలంలో తొలిచిన 5 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కల్గివున్న నాలుగు గుహ చైత్యాలు వున్నాయి. గుట్టకు దక్షిణం వైపున ప్రవహిస్తున్న చెయ్యేరు నదిలో స్నానించి, స్థూపం వద్ద ధ్యానమాచరించి, గ్రంథ పఠనం కావించి, గుహలలో బౌద్ధులు జీవనం చేసేవారు.

ఆంధ్రప్రదేశ్ లోనే ప్రధాన ఉద్దేశిక స్థూపాలున్న ఈ బౌద్ధారామాల ప్రాధాన్యతను బట్టి, తవ్వకాలలో బయల్పడిన సామాగ్రి, కట్టడాలు మొదలగు వాటిని బట్టి థేరవాద బౌద్ధానికి చెందిన నందలూరు బౌద్ధ క్షేత్రం క్రీస్తు పూర్వం 3 నుండి క్రీస్తు శకం 11 శతాబ్ది వరకు బహుదా నది సాక్షిగా బ్రహ్మాండంగా వర్ధిల్లిన అపురూపమైన బౌద్ధ క్షేత్రం అని తెలుస్తుంది. 

అన్నమయ్య జిల్లాలో నందలూరు బౌద్ధ స్థూపాలు బుద్ధుడి మధుర జ్ఞాపకాలు.భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. అన్నమయ్య జిల్లాను కూడా ‘బౌద్ధ పర్యాటకం’లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసి ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి