రాయదుర్గం చారిత్రక నేపథ్యం

                  courtesy: trawell.in

రాయదుర్గం చారిత్రక నేపథ్యం

         అనంతపురం నుండి 100కిలోమీటర్ల దూరంలో, గుంతకల్ నుండి 98 కి.మీ.దూరంలో,బెంగళూరు నుండి 270 కి.మీ దూరంలో ఉన్న రాయదుర్గంకు వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంఉంది. 
             చరిత్ర పూర్వ యుగం నుంచి జన నివాసం ఇక్కడ ఉండేది. నూతన శిలాయుగం, లోహ యుగం నాటి అవశేషాలు రాయదుర్గం సమీపంలోని అడగుప్ప గొల్లపల్లి,బాదనహాల్ సమీపంలోని
కర్నాటక రాష్ట్రం బ్రహ్మగిరి వద్ద పురాతత్వ
శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయట పడ్డాయి. వీటి ఆధారంగా ఆదిమానవుల వికాస పరిణామంలో వివిధ దశలను ఈ అవశేషాలు తెలుపుతాయి. చిన్న రాతి సమాధులు, గుంతల మాదిరి సమాధులు గొల్లపల్లి, అడుగుప్ప వద్ద 19వ శతాబ్ది చివరిలో కనుగొన్నారు. ఇలాంటి సమాధులు సుమారు 700 వరకు ఉన్నాయి. వీటిని కిస్తవాన్లు అని పిలిచేవారు.   
 
వంద సంవత్సరాల క్రితం ఈ సమాధులకు
ఉపయోగించిన రాళ్లు, బండలను అప్పటి
తహసిల్దార్ రాయదుర్గానికి తరలించి ప్రభుత్వ
భవనాల నిర్మాణాలకు ఉపయోగించినట్లు తెలుస్తోంది.
         
          మౌర్య వంశ చక్రవర్తి అశోకుని సామ్రాజ్యం రాయదుర్గం వరకు విస్తరించి ఉండేది. తరువాత శాతవాహనులు, రాష్ట్రకూటులు, విజయనగర రాజులు రాయదుర్గాన్ని పరిపాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి. 
        రాయదుర్గం పేరు వింటే చాలు రాయల ఏలుబడిలో ఉన్న ప్రాంతం అనే భావనను కలిగిస్తుంది.రాయదుర్గ లేదా “రాయల దుర్గం”  16వ శతాబ్ధంలో విజయనగర రాజులు నిర్మించిన కోట. ఈ విషయం ఆర్కిటెక్చర్‌ ఆధారాలు చెబుతున్నాయి .మహామంత్రి తిమ్మరుసు తమ్ముడు గోవిందామాత్యుడు కూడా పాలించినట్లు కొన్ని శాసనాలు సూచిస్తున్నాయి. 
     తళ్లికోట యుద్ధం (1565) తరువాత విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. ఆ యుద్దంలో రామరాయలు (శ్రీకృష్ణదేవరాయల అల్లుడు) దక్కన్ సుల్తానుల చేతిలో పరాజయం పాలయ్యాడు.  అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. రాయదుర్గం కూడా ఒక పాలెగార్ల కోటగా మారింది. దాని చుట్టూ రాజకీయ అస్థిరత ఏర్పడింది. 
     తరువాత కాలంలో ఈ దుర్గాన్ని  పాలెగాళ్లు గా ఉన్న బోయలు  పరిపాలించారు. కుందుర్పి పాలకుడు పెద్దకోనేటి నాయకుడు 1652 సంవత్సరంలో రాయదుర్గం పై దాడి చేసి పెద్ది బొమ్మనాయక్ ను జయించి ఆయన దుర్గం రాజుగా ప్రకటించుకున్నారు. బెలుగుప్ప సమీపంలోని హానకహాల్ గ్రామం వద్ద ఇందుకు సంబంధించిన శాసనం ఉంది. ఆయన అనంతరం వారసులు వెంకటపతి నాయకుడు, తిమ్మప్ప నాయకుడు, అతని తల్లి లక్ష్మమ్మ ఆ ప్రాంతాన్ని పాలించారు.
రాయదుర్గం వీర వనిత మహారాణి లక్ష్మమ్మ , చిత్రదుర్గం పాళెగాడు బరమప్ప నాయకున్ని తరిమికొట్టింది. ఈ దుర్గం నాయకులతో వియ్యం అందుకుని తెలుగు కన్నడ భాషలకు చుట్టరికం కలిపింది. 
    కోనేటి నాయకుడు ఆ తర్వాత సుల్తానుల దళాలను ఎదిరించి కొంతకాలం ఈ కోటను రక్షించాడు. అతని కుమారుడు వెంకటపతి నాయకుడు ఈ కోటను మరింత బలోపేతం చేశాడు.   
     18వ శతాబ్దంలో, మైసూరు సుల్తాన్ హైదర్ అలీ & టిప్పు సుల్తాన్ దక్షిణ భారతంలోని పలు కోటలను జయించారు. 1787లో టిప్పు సుల్తాన్ విజయనగర పాలకుల వారసుడు వెంకటపతి నాయకుడిని టిప్పు సుల్తాన్, రాయదుర్గం కోటను కూడా స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత, దాన్ని గుత్తి ప్రావిన్స్‌లో  చేర్చాడు. గుత్తి (Gooty) అప్పట్లో మైసూరు రాజ్యంలో ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా ఉండేది. కానీ 1799లో శ్రీరంగపట్టణం యుద్ధం తర్వాత టిప్పు మరణించాడు.దాని తర్వాత 1800లో ఈ ప్రాంతం దత్తమండలాలైన  బల్లారి, కర్నూలు, అనంతపురం, కడప లలో భాగంగా  హైదరాబాదు నిజాము  Asaf Jah II   పాలనలో కొనసాగాయి.
 
    1800లో జరిగిన బ్రిటీష్–నిజాం సంధి ద్వారా నిజాం ఈ ప్రాంతాలను  ఆంగ్లేయులకు
దత్తత ఇచ్చాడు. దాంతో రాయదుర్గం బ్రిటిష్ పాలనలోకి వెళ్లి పోయింది.
        దత్త మండలాల్లో భాగంగా రాయదుర్గం తొలుత బళ్లారి జిల్లాలోనూ, మద్రాసు ప్రెసిడెన్సీలో, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అంతర్భాగమయింది.
     రాయదుర్గం కోట రాయదుర్గం పట్టణంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. కోటలో ఎక్కువ భాగం నేటికీ బలంగా ఉంది.ఈ  కోటను  2727 అడుగుల ఎత్తులో నిర్మించారు. బలిష్టమైన గిరి దుర్గంగా ఆనాటి రాజులు దీనిని నిర్మించారు. రాయదుర్గాన్ని ఆలయాల దుర్గంగా పిలుస్తారు. ఈ కోటలో దసభుజ గణపతి ఆలయం అని పిలువబడే అద్భుతమైన గణపతి ఆలయం ఉంది. దీనిని 4 మీటర్ల ఎత్తైన ఏకశిలా రాయితో చెక్కారు. హనుమంతుడు, ఎల్లమ్మ, ప్రసన్న వెంకటేశ్వర, వేణుగోపాల, జంబుకేశ్వర, వీరభద్ర మరియు కన్యకాపరమేశ్వరి లకు సంబంధించిన ఇతర దేవాలయాలు ఉన్నాయి. కోట కొండ మధ్యలో, కొన్ని మంచి శిల్పాలతో నాలుగు గుహలు ఉన్నాయి.18వ శతాబ్దంలో బ్రిటిష్ చిత్రకారులు ఈ కోట గురించి వేసిన పెయింటింగ్ ప్రస్తుతం బ్రిటిష్ లైబ్రరీలో ఉంది.
   
జైనుల ఆనవాళ్లు

       సిద్దేశ్వరాలయం ఆనాటి జైన విద్యాలయంగా విలసిల్లినట్లు అక్కడ ఉన్న సిద్దుల కొండపై రాతి గుహలలో చెక్కిన శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ గుహలలో జైనతీర్ధంకుల శిష్యులతో కూడిన గురువుల విగ్రహాలు కనిపిస్తున్నాయి.సిద్దుల కొండలోని సిద్దేశ్వరాలయంలో ప్రతి ఏడాది ఉగాది సందర్భముగా రథోత్సవం, సిడిమాను ఉత్సవం వైభవంగా జరుగుతుంది.
ఇది మూడు విభాగాలతో కూడిన జైన విశ్వవిద్యాలయం అని పిలవబడుతోంది.
ఇక్కడ యాపనీయ జైన సాంప్రదాయం కొనసాగిందని భావిస్తున్నారు.
    ఉరవకొండ దగ్గర ఉన్న కొనకొండ్లలో నివాసం ఉన్న కుందాచార్యులు ఈ విద్యాలయాన్ని స్థాపించినట్లు తెలుస్తోంది.  బౌద్ధ,జైన,శైవ, వైష్ణవ మతాలు ఈ ప్రాంతంలో సామరస్యంతో వెల్లివిరిశాయి.
        ప్రసన్న వెంకటరమణ స్వామి, దశబుజ గణపతి, వేణుగోపాల్ స్వామి ఆలయాలు కొండ దిగువన రాయదుర్గం పట్టణంలోని కోట ప్రాంతంలో ఉన్నాయి.
     కొండపై పల్నాడు యల్లమ్మ, మాధవరాయ స్వామి. పట్టాభి సీతారామ స్వామి,  నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి తదితర పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడి రామాలయం లో రామ లక్ష్మణ సీత ఆంజనేయ విగ్రహాలతో పాటు  భరతుని విగ్రహం కూడా ఉండటం విశేషం.
       ఈ కొండపై గల గజశాల, విశాలమైన కోనేరు ఉన్నాయి.  అనేక బావులు, సహజసిద్ధంగా ఏర్పడిన నీటి వనరులు కూడా మనం చూడవచ్చు. నిధుల వేటగాళ్లు తరచూ ఇక్కడ త్రవ్వకాలు జరిపి ప్రాచీన కట్టడాలను, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు.
         రాయదుర్గం పట్టణంలోని కోట ప్రాంతంలోకి ప్రవేశించే  కోటముఖ ద్వారo 2019 సంవత్సరంలో కురిసిన వర్షాలకు   ఒకవైపు దెబ్బతినింది. స్థానిక రాయదుర్గం ఇంటాక్ సంస్థ  విజ్ఞప్తి మేరకు ఈ ముఖద్వారం జీర్ణోద్ధరణకు నిధులు కేంద్ర పురావస్తు శాఖ మంజూరు చేసింది. అయితే ముఖద్వారం ఆనుకుని ఉన్న మురికి కాలువను పురపాలక సంఘం దారి మళ్ళించకపోవడం వల్ల నిర్మాణం పనులు చేపట్టలేదు.
కేంద్ర మరియు రాష్ట్ర పురావస్తు శాఖలు పర్యాటకశాఖలు, రాయదుర్గం ప్రాముఖ్యతను గుర్తించి దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
      రాయదుర్గం ప్రాచీన చరిత్ర ఔన్యత్యాన్ని కాపాడడానికి కేంద్ర పురావస్తు శాఖ కేవలం రెండు ఆలయాల వద్ద మాత్రమే ప్రాచీన స్మారక చిహ్నాల నోటీసు బోర్డులను ఏర్పాటు చేసింది.మాధవరాయ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ గావించింది.కొండ పై ప్రజలు వెళ్లి వచ్చేందుకు అనువైన రహదారిని, పర్యాటకులు అక్కడికి వెళ్లి వచ్చేందుకు కనీస అవసరాలు, తాగునీరు, వీధి దీపాలను కల్పించడం చేస్తే పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందని ఇంటాక్ సంస్థ కోరుతోంది.

___ పిళ్లా కుమారస్వామి,9490122229

ఆధారాలు
1.సాక్షి దిన పత్రిక
2. వికీపీడియా 
3. ప్రజాశక్తి దినపత్రిక 
4.ap.gov.in website 
5. సోషల్ మీడియా 
6. Trawell.in







 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి