ప్రాచీన సాహిత్యం లో కాల విభజన
ప్రాచీన సాహిత్యం లో కాల విభజన
ఒకప్పుడు భారతీయ వైద్యశాస్త్రం
(ఆయుర్వేదం) ఎన్నో మందులను మూలకలను తెలుసుకోగలిగింది. క్రమంగా ఆ విజ్ఞానం గూడ మౌఢ్యం బారినపడి, ఇవాళ్టి ఆయుర్వేద వైద్యులు ఏ మూలిక దేనికి పనికొస్తుందో చెప్పలేని స్థితిలో వున్నారు.
ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబందించిన స్థలాల గురించి, విషయాల గురించి తెలుసుకోవాలంటే, టోలమీ వంటి గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞులుమీద, అరబ్బు వర్తకుల మీద, చైనా యాత్రికుల మీద ఆధారపడాలి. మన సాహిత్యంలో పౌరాణిక గాధలు తప్ప వేరే ఏమీ దొరకవు.వాటిల్లో స్థలం కాలాదులుండవు. స్వయంపోషక గ్రామాల్లో ఉద్భవించిన నాటి బ్రాహ్మణ మతానికి( నేటి హిందూ మతానికి) రుతుచక్రంతోనే తప్ప కాల ప్రవాహంతో ప్రమేయం లేదు కాబట్టే అది మనకు చరిత్ర లేకుండ చేసింది. కాలం సహితం కాలచక్రం అయింది.
గుండ్రంగా తిరిగే ఈ చక్రంలో దేనికి మొదలు లేదు. అన్ని అనాది కాలం అయి పోయాయి. కాలం గురించి చెప్పిన విషయాలు కూడా అతిశయోక్తులతో నిండి
ప్రాచీన సాహిత్యం నుండి చరిత్రను నిర్ధారించలేదు పోతున్నాం.
పూర్వం ప్రాచీన ఆర్యులు ఉత్తర ధృవంలో నివసించారని ష్యిం (pyim) అనే పండితుడు, బాల గంగాధర తిలక్ చెప్పారు. "ఉత్తర ధృవం అతి ప్రాచీన కాలంలో సమ శీతోష్ణమై మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆర్యులు అక్కడ ఉన్నారని, తర్వాత కొంత కాలానికి సంభవించిన మంచు యుగం వల్ల ఆ ప్రాంతమంతా మంచుతో నిండిపోగా మరణించిన వారు మరణించగా మిగిలిన వారు దక్షిణ భాగానికి వలస వచ్చారని భూగర్భ శాస్త్ర పరిశోధనల వల్ల తెలుస్తుంది. ఉత్తర ధృవ ఆర్యులకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి అన్న విషయం వేదాలలోని ఎన్నో వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
"ఏకం వా ఏత దేవానామహః యత్సంవత్సరహః”
మనకు ఏది ఒక సంవత్సరమో అది వారికి ఒక రోజు అని తైత్తరీయ బ్రాహ్మణం (3-9-22-1) చెప్తుంది.
"మానవ సంవత్సరం దేవతలకు ఒక పగలు ఒక రాత్రి. దానిలో పగలు ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం" అని మనుస్మృతి (1-67) చెప్తుంది. అంటే ఉత్తర ధృవంలో నివసించిన ఆర్యులను దేవతలుగా భావించినట్టు అర్థమవుతుంది.
ఇదే విషయాన్ని మహా భారతం కూడా వర్ణి స్తుంది.. "ఉత్తర దిక్కున తేజోవంతమైన మేరువు ఉంది. ఈ మేరువు చుట్టూ సూర్య చంద్రులు ప్రదక్షిణాలు చేస్తారు. ఇక్కడున్న వారి ఒక పగలు ఒక రాత్రి కలిసి మనకు సంవత్సరంతో సమానం"
"జీవనం అనువుగాని ఆ 6 నెలల దీర్ఘరాత్రిని చూస్తే నాటి ఆర్యులకు భయం దీన్ని చూసి పురాతన కాలంలో బ్రాహ్మణులు భయపడ్డారు" అంటూ వేదంలోని ఒక మంత్రం చెప్తుంది. అందుకే "గాఢాంధకారంతో నిండిన దీర్ఘరాత్రులు వ్యాపించకుండు గాక అనీ (తై.స), "దేని ఆవల ఒడ్డు కనిపించుటలేదో అట్టి రాత్రిలో ప్రపంచమంతా చీకటిగా ఉంది. ఓ రాత్రీ! మేము ఎటువంటి ప్రమాదం లేకుండా నిన్ను దాటేదము కాక (అధర్వణ వేదం 19-47-2)", "మేము ఒక్కో రాత్రిని చూస్తూ మా బిడ్డలతో దీర్ఘరాత్రిని దాటెదము కాక అథ.. 19-50-3)" అని చేసిన ప్రార్ధనలు కనిపిస్తాయి. అటువంటి దీర్ఘరాత్రి వారికొక భయం. ఆ 6 నెలల రాత్రి గడచి సూర్యోదయం అవుతుందంటే అది వారికి ఒక పండుగ, సంబరం.
ఆర్యులు మొదట అంటే క్రీ.పూ. 8000 సంవత్సరాల కాలంలో ఉత్తర ధృవంలో నివసించారని, అక్కడి నుండి భారతదేశానికి క్రీ.పూ. 2000 నాటికి వలస వచ్చారనే వాదన బాల గంగాధర్ తిలక్ వల్ల వ్యాప్తిలోకి వచ్చింది. ఆర్యులు మొదట ఉత్తరధృవంలో నివసించేవారని నిరూపిస్తూ తిలక్ "ఆర్కిటిక్ హెూం ఇన్ వేదాస్" అనే గొప్ప పరిశోధనా గ్రంథం రాసారు. వీరు కాలానికి సంబంధించి చెప్పిన విషయాలు వేదాలలో ఉపనిషత్తులలో మహాభారతం లో కనిపిస్తాయి.
నిమేష కాలం
క్రీ.పూ.1500కు సంబంధించిన వేదాలలో కాలవిభజన ఉంది. అందులో అత్యంత సూక్ష్మమైన విభాగం ‘నిమేషం’. దీన్నే వాడుకలో ‘నిమిషం’ అన్నారు. నిమేషం అంటే రెప్పపాటు కాలం. రుగ్వేదంలో ఈ పదాన్ని కాలానికి సంకేతంగా కాకుండా ‘రెప్పపాటు లేనివారు (దేవతలు)’ అనే అర్థంలో వాడారు. మాండూక్యోపనిషత్తులో
‘కలా ముహూర్తాః కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః । అర్ధమాసా మాసా రుతవస్ సంవత్సరశ్చ కల్పంతాం।।’ - అంటూ కాలవిభజన గురించి చెప్పారు.
మహాభారతం శాంతిపర్వంలోని ‘కాష్ఠా నిమేషా దశ పంచ చైవ....’ అనే శ్లోకం ఉంది. ఇవి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కాలవిభజను దాదాపుగా సమానంగా ఉండే ప్రామాణికాలను గురించి చెబుతాయి.
దీని ప్రకారం...
1 నిమేషం = రెప్పపాటు కాలం
15 నిమేషాలు = 1 కాష్ఠం
30 కాష్ఠాలు = 1 కళ
30 కళలు = 1 ముహూర్తం
30 ముహూర్తాలు = 1 దివారాత్రి (ఒక రోజు)
30 దివారాత్రులు = 1 మాసం
12 మాసాలు = 1 సంవత్సరం
మనుధర్మశాస్త్రం, అర్ధశాస్త్రంలో కూడా ఇదే రకమైన విభజన ఉంది.
సూర్య సిద్ధాంత కాల విభజన
ఇప్పుడు వాడుకలో ఉన్న కాలవిభజనకు సూర్య సిద్ధాంతం పరమ ప్రామాణికం. ఇది కాలాన్ని మరింత సూక్ష్మంగా వివరిస్తోంది. ‘మూర్త’, ‘అమూర్త’ అనే రెండు రకాల కాలమానాలు ఈ సిద్ధాంతంలో ఉన్నాయి. ఈ రెండూ వాటి స్వభావాన్ని ప్రకటిస్తాయి.
ప్రాణ కాలం
మూర్త కాలమానంలో పేర్కొన్న కాలాంశాలను మనం కంటితో చూడొచ్చు లేదా అనుభూతి చెందొచ్చు. ఇందులో అతిచిన్న ప్రమాణం ‘ప్రాణ’. పది దీర్ఘాక్షరాలు పలికే సమయాన్ని ‘ప్రాణ’ అంటారని సూర్యసిద్ధాంతం చెబుతుంది. దీన్నే ఆంగ్లంలో ‘బ్రీతింగ్ పీరియడ్’ అంటారు. అంటే ఒకసారి శ్వాస తీసుకునే సమయం.
‘ప్రాణ’ ప్రమాణం ఆధారంగా మరికొన్ని కాలవిభాగాలను తయారు చేశారు.
త్రుటి కాలం
అమూర్త కాలమానంలో పేర్కొన్న ప్రమాణాలు అతిసూక్ష్మమైనవి. వీటిని భౌతిక దృష్టికోణంతో అనుభూతి చెందటానికి అవకాశం లేదు. ఈ కాలమానం ప్రకారం ‘త్రుటి’ అనేది అతిచిన్న ప్రమాణం. సూర్యసిద్ధాంత గ్రంథంలో త్రుటి గురించి మరే ఇతర వివరాలు లేవు. అయితే, 12వ శతాబ్దానికి చెందిన భాస్కరుడు తన సిద్ధాంత శిరోమణి గ్రంథంలో త్రుటి అనే కాలవిభాగానికి కొన్ని వివరణలు ఇచ్చారు. దీనిప్రకారం రోజులో 2916000000 వంతును , సెకనులో 33750వ వంతును సమయం 'త్రుటి' అన్నారు.
ఈ సిద్ధాంతం ప్రకారం
6 ప్రాణ కాలాలు = 1 విఘడియ
60 విఘడియలు = 1 ఘడియ
60 ఘడియలు = 1 అహోరాత్రం (ఒక రోజు)
అహోరాత్రులు శ్రమిస్తే అంటే కొన్ని రోజులు శ్రమిస్తే అని అర్థం.
రుతువులు
ప్రకృతిలో వచ్చే మార్పే రుతువు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అనే ఆరు రుతువులు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఒక్కో రుతువు రెండు నెలలు ఉంటుంది.
యజుర్వేదంలో అహోరాత్రం, అర్ధమాసం, మాసం, రుతువులు, సంవత్సరాల వివరాలు తెలిపే కవితలున్నాయి.
‘అర్ధమాసాస్తే కల్పంతాం, మాసాస్తే కల్పంతాం । రుతవస్తే కల్పతాం సంవత్సరస్తే కల్పతాం।’ (యజుర్వేదం 27:45)
యజుర్వేదంలోని నాలుగు, ఏడు కాండల్లో రుతువుల ప్రస్తావన వస్తుంది. శతపథ బ్రాహ్మణంలో కూడా రుతువుల ప్రస్తావన ఉంది. ఇందులో ఏడు రుతువుల్ని ప్రస్తావించారు.
3500 సంవత్సరాల క్రితం వచ్చిన రుగ్వేదంలో వసంతం, గ్రీష్మం, శరత్ అనే మూడు రుతువుల ప్రస్తావన మాత్రమే ఉంది. కృష్ణయజుర్వేదంలో ఐదు రుతువుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత తైత్తిరీయ సంహితలో మొదటిసారిగా ఆరు రుతువుల ప్రస్తావన కనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చైత్రం, వైశాఖం, జ్యేష్టం అనే 12 మాసాల పేర్లు కాకుండా మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఇష, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అనే పేర్లు ఇందులో ఉపయోగించారు.
యుగవిభజన
యుగాలు, యుగవిభజన ప్రస్తావన మొదటిసారిగా మహాభారతంలో కనిపిస్తుంది.ఈ మహాభారతాన్ని బుద్దుని తరువాత సాధారణ శకం ముందు(BCE) 400 నుండి సాధారణ శకం(CE) వరకు రాశారని చరిత్ర కారులు చెపుతున్నారు. ఇందులో
కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలతో పాటు కల్ప, మహాకల్ప విభజన కూడా వ్యాసుడు ప్రస్తావించాడు. మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీతలో ‘కల్పక్షయే పునస్తాని...’, ‘కాలః కలయతామహం..’ మొదలైన శ్లోకాల ద్వారా మహాభారత కాలానికి సంబంధించిన స్పష్టమైన కాలవిభజన చేశారు.
(సేకరణ కుమారస్వామి 9490122229)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి