నవీన శిలాయుగం (Neolithic Period)
రాయలసీమలో
నవీన శిలాయుగపు (Neolithic Period) అవశేషాలు
*రాయలసీమలో నవీన శిలాయుగపు (Neolithic Period) అవశేషాలు*
విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న 'నవీన శిలాయుగం (నియోలిథిక్ ఏజ్)ను గార్డన్ ఛైల్డ్ (Gordon Childe)అనే శాస్త్రవేత్త What Happened in History లో 'Neolithic Revolution'( 'నాగరికత విప్లవం' ) అని పిలిచాడు. సర్ జాన్ లుబ్బాక్ 'neolithic' అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. దీనినే కొత్త రాతి యుగం ( "న్యూ స్టోను ఏజి") అని కూడా పిలుస్తారు.ఇది రాతి యుగంకు చివరి భాగం. ఇది సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.
ఈ కాలంలోనే మానవుడు ఆహారాన్ని వేటాడే దశను ముగించి ఆహార ఉత్పత్తి దశకు పరివర్తన చెందినాడు. వ్యవసాయాన్ని ప్రారంభించాడు. వ్యవసాయం చేయడానికి శిలాపనిముట్లను ఉపయోగించాడు. దీంతో సంచార జీవితం అంతమైంది. స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.
మొట్టమొదటిసారిగా గ్రామీణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాబోవు నాగరికతకు ఈ కాలంలోనే పునాదులు పడ్డాయి. ఈ యుగం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో ప్రారంభమైంది. ఉత్తర ఐరోపాలో కొత్తరాతియుగం క్రీ.పూ 1700 వరకు కొనసాగింది. చైనాలో ఇది క్రీ.పూ 1200 వరకు విస్తరించింది. భారతదేశంలో మధ్య శిలాయుగానికి, తామ్ర శిలాయుగానికి, సింధు నాగరికత( క్రీ.పూ. 6000-2000)కు సమకాలీనంగా కొనసాగింది. భారతదేశంలో టేలర్ అనే బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్త కర్ణాటకలోని లింగ్ సుగూర్ లో తొలి నవీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో నవీన శిలాయుగం క్రీ.పూ.2000 తరువాత మాత్రమే కనిపిస్తుంది. ఈ కాలంలోని మానవుడు అరగదీసి, నునుపుచేసిన రాతి గొడ్డళ్ళను (polished hand axes) ను ఉపయోగించాడు. రాబర్ట్ బ్రూస్ఫుట్ అనంతపురంజిల్లాలో 25 స్థావరాల్లో త్రవ్వకాలు జరిపి ఈ యుగానికి చెందిన ఆధారాలు వెలికితీశాడు.అందుకే రాబర్ట్ బ్రూస్ఫుట్ ను చరిత్రపూర్వయుగానికి పితామహుడిగా పేర్కొంటారు.
గుంటూరు జిల్లాలోని వడ్డమాను గ్రామం వద్ద రాబర్ట్ బ్రూస్ఫూటే ఈ కాలం నాటి రాతి గొడ్డలిని కనుగొన్నాడు.
నవీన శిలాయుగ ప్రజలు ఛెర్ట్ రాయితో చేసిన బ్లేడులను విరివిగా ఉపయోగించారు. ఈ కాలానికి చెందిన ఉట్కూరు (తెలంగాణ), పాలవాయి (అనంతపురం జిల్లా), కర్ణాటకలోని కుపల్, పిక్లిహాల్లో బూడిద కుప్పలు (ash mounds) లభించాయి. ఇవి పశువుల పేడను కుప్పగా కాల్చడం వల్ల ఏర్పడినాయి. ఆ బూడిద కుప్పలను ధర్మోలు మినిసెన్స్ పద్ధతి ద్వారా సుమారు క్రీ.పూ 2000 కాలంలో కాల్చినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనిని బట్టి అప్పటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణపైన ఆధారపడ్డారని తెలుస్తోంది. ఈ కాలంలో జొన్నలు, రాగులు, ఉలవలు, పెసరలు మొదలైన పంటలు పండించారు. కర్నూలు జిల్లాలో రామాపురంలో బార్లీ, మినుములను ఎక్కువగా పండించారు.ఈ కాలం నాటి వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం జిల్లాలోని పాలవాయి, లత్తవరం, కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో కనిపించాయి.
వ్యవసాయం చేయడానికి పశువులు అవసరం అయ్యాయి. దానికోసం గేదెలు(ఎనుములు), ఆవులు, మేకలు, గొర్రెలు, పందులను పెంచారు. కుక్క, ఎద్దు, మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన వేల్పుమడుగు గ్రామప్రాంతంలో మూపురం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం లభ్యమైంది.తెనగల ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు లభించాయి.
బేతంచర్ల (కర్నూలు జిల్లా), వీరాపురం, నాగార్జునకొండ, గిద్దలూరు, తాడిపత్రి మొదలైన ప్రాంతాల్లో నవీన శిలాయుగపు పనిముట్లు లభించాయి. బండి చక్రాన్ని కూడా ఈ యుగంలోనే కనుగొని బండ్లను తయారు చేసుకున్నాడు. పిడికర్ర పెట్టేందుకు చెక్కిన రాతి ముక్క లభించినది
గిడుగనూరు వద్ద ఒకవిధమైన పాలరాతితో చేసిన కత్తులు లభించినవి. తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా లోని కదంబాపూర్ లో కొత్తరాతియుగ కాలం నాటి పనిమట్లు తయారు చేసే కేంద్రం బయటపడింది.
ఈ యుగంలో మానపుడు కుండలు తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. తొలి కాలపు కుండలను చేతితో తయారు చేసి పట్టుకొని కాల్చాడు.అందువలన ఆ కుండ అడుగు భాగం కాలి ఎర్రగా వున్నది. పై భాగం కాలకుండా నల్లగా ఉన్నది. చేతి గుర్తులు కూడా ఉన్నవి. తరువాత కుమ్మరి సారెను కనుగొని కుండలతో పాటు అన్ని రకాల పాత్రలను తయారు చేసుకున్నాడు.రాతి విగ్రహాలను కూడా తయారు చేశాడు.
ఈ యుగపు ఆనవాళ్గు గుంటూరు జిల్లాలోని అమరావతి, నాగార్జునకొండ, ఉట్నూరు, ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, వేమవరం, పూసలపాడు, కురిచేడు, రాయలసీమ లోని అనంతపురం జిల్లా పాలవాయి, కర్నూలు జిల్లా పాతపాడు, బస్తిపాడులలో లభించాయి.
నైపుణ్యత మరియు వైవిధ్యం కలిగిన పనిముట్లను ఉపయోగిం చారు. ప్రధానంగా గొడ్డలి, సుత్తి, ఉలి అనే పనిముట్లు ఉపయోగించారు. వీటికొరకు నల్లశాణం, బసాల్ట్, చెర్ట్ శిలను వాడారు. ఆయుధాలు డోలమైట్ తో తయారుచేశారు.
వలయాకృతిలో రాళ్లను పేర్చి కర్రలను కడ్డీలుగా అమర్చి, రెల్లుగడ్డితో కప్పును వేసుకున్నారు.ఇంటి వెనుక నుండి జంతువులు దాడి చేయడానికి వీలు లేకుండా, ఇళ్ళను ఒకదానికి మరొకటి అనించి నిర్మించుకున్నారు.ఇటువంటి ఇళ్ల ఆనవాల్లు అనంతపురం జిల్లాలోని హుళికల్లు, లత్తవరం, మహబూబ్నగర్ జిల్లాలోని చినమారూరులో కనిపించాయి.గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద గల గండ్లూరు గ్రామంలో భూమిలో ఒక పెద్ద రాతి బండ ఉన్నది. ఆ రాతి బండను తొలిచి గుహలలో ఉండే విధంగా 8 ఇళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ఒక ఇంటి మధ్యలో కుండలో శిశువు కళేబరాన్ని పెట్టి సమాధి చేయబడింది.టెక్కల్‌కోట (కర్ణాటక) వద్ద
3 మీటర్ల నుండి 5 మీటర్ల వ్యాసం కలిగిన
చిన్న వృత్తాకార 19 గుడిసెల అవశేషాలు చేయబడ్డాయి. ఇవి 1780 బి.సి. నుండి 1540 B.C. కాలానికి చెందినవని గుర్తించారు. కడప జిల్లాలోని పెద్దముడియం
లో ఇలాంటి అవశేషాలు రెండు గుర్తించారు.
ఇవి 1540 В.С.,1100 В.С.కాలానికి చెందినవిగా రేడియో కార్బన్ ద్వారా నిర్ధారించారు.ఈ ఆధారాల వల్లనే కొత్త రాతి యుగపు బూడిద దిబ్బలనే పదాన్ని సాహిత్యంలో ఉపయోగించేందుకు దారితీశాయి. ఈ యుగంలోనే మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయి. పురుషాధిక్యత మొదలైంది. రాబర్ట్ బ్రూస్పూట్ ప్రకారం ఈ యుగ కాలంలో మొదటగా 'రాయచూరు'లో
'లింగ ఆరాధన' మొదలైంది. శ్రమ విభజన కూడా జరిగింది.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని చింతగుంట గ్రామ ప్రాంతంలో "విల్లంబులు ధరించిన మనిషి చిత్రాలు” లభించాయి.
___ పిళ్లా కుమారస్వామి
References:
An outline of Indian Prehistory__D K Bhattacharya
(ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి__డా. యం. అబ్దుల్ కరీం)
(ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర__
డా॥పి. జోగినాయుడు)
ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి__ సయ్యద్ రాజా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి