కరువు






అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 27 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు  చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ. మాత్రమే. జిల్లాలో సగటు ఆవిరి నష్టం 1850 మిల్లీమీటర్లు.

భూమి మీద పడిన నీరు ఆవిరై పోతుంది. జిల్లాలో ఏ మండలంలో కూడా సహజమైన నీటివనరులు లేవు.మొత్తం గ్రామాలన్నీ తాగునీటి కోసం బయటి నుంచి వచ్చే నీటి మీద ఆధారపడా ల్సిందే.జిల్లాలోని రిజర్వాయర్ల సామర్థ్యం 24 టీఎంసీలు మాత్రమే. చెరువులు కుంటలది 16టిఎంసిలు.   అంటే 25 లక్షల ఎకరాల్లో వర్షాధారం మీద ఆధారపడే రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఈ సాగుభూమికి ఆరుతడి కింద ఒక పంటకు నీళ్లు ఇవ్వాలంటే 250 టిఎంసిల నీళ్లు కావాలి. తాగునీటి కోసం కనీసం 30 టీఎంసీల నీరు కావాలి .ఇది ఈ జిల్లా అవసరం.

               అనంతపురం జిల్లాలోని పెన్నార్ పరివాహక ప్రాంతంలో అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్, చిత్రావతి, తడకలేరు, కుందేరు, పాపాగ్ని, సగిలేరు, చెయ్యేరు, లోయర్ పెన్నేరు అని పది నదులున్నాయి. అయితే గడిచిన దశాబ్దకాలంలో చూస్తే నీరు ప్రవహించిన దాఖలాల్లేవు.

పేరుకు నదులే గాని ఇందులో నీళ్లుండవు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా వచ్చే 22 టిఎంసిలే జిల్లాకు ఏకైకా జలాధారంగా ఉంటోంది. అరకొరగా కురిసిన

వర్షాలతో నిండే చెరువులు, కుంటలు, భూగర్భజలాలే జిల్లాకు సాగునీటి వనరుగా ఉంటున్నాయి. అందుకే జిల్లా అంతా అడుగంటిన భూగర్భ జలాలు పచ్చదనం కానరాని కొండలు మనకి కనిపిస్తూ ఉంటాయి.

       జిల్లాలో సగటున పడే వర్షపాతం  550 మి.మీ. ఇది     కూడా సక్రమంగా పడడం లేదు. వాగులు వంకలు పారవు.

దీంతోతరచూ కరువులు ఏర్పడుతున్నాయి. గడిచిన 17 సంవత్సరాల్లో 14 సం.లు కరువొచ్చింది.గత నాలుగు సంవత్సరాలుగా కరువే.


     కరువుతో కేవలం తిండి కొరత,నీటి కొరత మాత్రమే ఏర్పడవు.అది జీవించేందుకు అనేక అమానవీయ పరిస్థితులు ఉత్పన్నం చేస్తుంది.దీని వలన జిల్లాలో రెండు సామాజిక సమస్యలు ముందుకు వచ్చాయి. ఒకటి వలసలు. రెండు మహిళల అక్రమ తరలింపు. వ్యవసాయం తిరోగమనం చెందడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో దళిత బలహీన వర్గాలకు జీవనోపాధి కరువైంది. దాంతో వలస మార్గం చేపట్టారు.కొంతమంది కేరళకు అడుక్కోవడానికి వెళ్లారు.మరికొంతమంది బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ లాంటి నగరాలకు పనులకోసం వెళ్లారు. ముస్లిం కుటుంబాల నుంచి ఆ తర్వాత వెనుకబడిన కులాల నుంచిపూనే,ముంబయి నగరాలకు  అమ్మాయిల    తరలింపు మొదలైంది. ఆర్థిక సంక్షోభాలను నివారించవచ్చు లేదా రూపుమాపవచ్చు కానీ దిగజారిపోయిన సాంఘిక విలువలను, జీవన పరిస్థితులను మెరుగు పరచడం సులభమైన విషయం కాదు.

  ప్రతి ఏటా వచ్చే కరువులను పారద్రోలడానికి బ్రిటీష్ వారు ప్రయత్నంచేశారు.అనంతపురం, కడపజిల్లాలలో ప్రవహించే పెన్నా బేసిన్ లో నీళ్ళు లేవు కనుక పెన్నా బేసిన్కు నీరు మళ్ళించాలని మద్రాసు ప్రభుత్వం 1901లో సర్ కాలిన్. సి. స్కాట్ అధ్యక్షతన ఇరిగేషన్ కమిషన్ ను నియమించింది.ఈ కమిషన్ మల్లేశ్వరం వద్ద తుంగభద్ర నది మీదుగా ఓ పెద్ద ఆనకట్ట కట్టి కృష్ణా పెన్నా బేసిన్లు కలపాలని సమగ్రమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది.

దీంతో కల్నల్ మెకంజీ  300 టీఎంసీల సామర్థ్యంతో మల్లేశ్వరం వద్ధనూ, 60టిఎంసిలతో కడప జిల్లాలోని గండికోట వద్దనూ రిజర్వాయర్లను నిర్మించి

కృష్ణా నీటిని తరలించాలని ప్రణాళిక రచించారు. 1905_06 లో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నది మీద ఆనకట్ట నిర్మించాలని కూడా ఆయన ప్రతిపాదించాడు. ఇవి అమలై ఉంటే జిల్లాకు 60 నుంచి 70 టీఎంసీలు  నమ్మకంగా వచ్చేవి.

        తుంగభద్ర జలాశయాన్ని  1951 లో నిర్మించిననాటినుండి 1993 వరకు ప్రవాహములో కొట్టుకొని వచ్చిన ఒండ్రు మట్టి పూడిక వల్ల దాని నిల్వ సామర్థ్యం133 టి.యం.సి. నుంచి 119 టి.ఎం.సిలకి తగ్గింది. 1993 లో జరిపిన సర్వేలో దాని సామర్థ్యం 111.5 టి.ఎం.సి.లు.అందువల్ల దానిలో నీటి లభ్యత 212 టి.యం.సి.ల నుండి 170 టి.యం.సి.లకు తగ్గిపోయింది. ఈ ఒండ్రుమట్టి పేరుకొనడం నిరంతరం కొనసాగడం వలన ప్రతి సంవత్సరం రిజర్వాయర్ పరిమాణం 0.50 టి.ఎం.సి.లు తగ్గుతూ వస్తున్నది. నీటి లభ్యత తగ్గుతుండటం వలన జిల్లా కు రావలసిన నీటి కోటా తగ్గి ప్రస్తుతం ఎగువకాలువకు రావలసిన 32.50 టి.ఎం.సి.ల నుంచి 26. 50 టి.ఎం.సి.కి తగ్గించబడింది.      

         తుంగభద్ర జలాశయం నుంచి 212 టి.ఎం.సి.లు నీరు కూడా రాష్ట్రానికి కేటాయించిన కృష్ణాజలాలలో ఇమిడి ఉంది. అందులో 73 టి.ఎం.సి.లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు,  139 కర్నాటక కు   కేటాయించారు.

తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 32 టీఎంసీలు ఈ జిల్లాకు కేటా యించామని చెప్తున్నారు. కానీ ఇందులో వచ్చేది మాత్రం 20టి ఎంసి లు మాత్రమే. దాంట్లో కూడా ఆరు టిఎంసిలు కడప కర్నూలు కు పోతాయి. అంటే 14 టిఎంసిలే

అనంతపురానికి మిగిలేది.1950 లో ఈ పథకం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేశారు.అప్పట్లో మన ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కి ప్రాధాన్యత నిచ్చి ఎక్కువ విద్యుత్ ను తీసుకుని,దానికి బదులుగా తక్కువ నీటికి అంగీకరించింది.అది కూడా మనకు నీటి లభ్యత తగ్గి పోవడానికి కారణం.

         అనంతపురం జిల్లా 1050-1100 ఎం.ఎస్.ఎల్ ఎత్తైన ప్రాంతంలో ఉంది. మనకన్నా కృష్ణానది లోతట్టులో పారుతోంది. కృష్ణానీటిని మళ్ళించుకోవాలంటే ఎత్తిపోతల పథకాలు అమలు చేయాలి. కానీ తుంగభద్ర జలాశయం మనకన్నా ఎత్తులో ఉంది. దాదాపు 500 ఎం.ఎస్.ఎల్. తేడా వుంది. ఆ ప్రాంతం 633 ఎం.ఎస్.ఎల్ లో వుంది. నీటిని గురుత్వాకర్షణ ద్వారా మనం సులభంగా పొందవచ్చు. తుంగభద్ర, భీమా, హంద్రి, దిండి, మూసి ఉపనదులు ఉన్నాయి. కృష్ణాకు అధిక నీరందించే ఉపనది తుంగభద్ర మాత్రమే. కృష్ణానదికి 2390 టి.ఎం.సి అడుగుల నీరు లభిస్తున్నట్లు బచావత్ ట్రిబ్యునల్ లెక్కవేసింది. నాలుగు రాష్ట్రాలకూ కృష్ణానది నీటిని కేటాయించేందుకు బచావత్ నేతృత్వంలో కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఉంది. లభిస్తున్న నీటిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా 2060 టి.ఎం.సి. అడుగుల నీరు నికరంగా లభిస్తున్నట్లు లెక్కకట్టారు. ఇందులో తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు విడుదల చేస్తున్న 212 టి.ఎం.సి.లనీరు కూడా ఇందులో ఉంది. మిగులు జలాల కింద 330 టీ.ఎం.సి.ల నీటిని అంచనా వేశారు. ఈ నీటికి 25 శాతం విశ్వసనీయత ఉంటుంది. ఈ నీరు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మిగులు జలాలను ఏ ప్రాజెక్టుకు కేటాయించలేదు. అందువల్ల మిగులు జలాలు ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు లభించింది.

కృష్ణానది నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టి.ఎం.సి.లు, కర్నాటకకు 700, మహారాష్ట్రకు 560 టి.ఎం.సి.ల చొప్పున కేటాయించారు. 

విభజన ఒప్పందం ప్రకారం 66:34నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు 512టిఎంసిలు, తెలంగాణ కు 299టిఎంసిలు పంచాలి.   

అయితే ఇంతవరకు మిగులు జలాలను ఉపయోగించు కోవటంలో మన రాష్ట్ర గత ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. 30 ఎళ్ళు గడిచిపోతున్నా, బచావత్ గడువు మీరిపోయినా ఆనీటిని ఇప్పటికీ సద్వినియోగం చేసుకోలేక పోయాము. ఆ నీటిని వినియోగించుకొని సాగునీటి పథకాలను సాగునీటి పథకాలను చేపట్టివుంటే నీటిపై హక్కు లభించేది. మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటైతే సమీక్ష చేసినప్పుడు ఆ ప్రాజెక్టులకు నీటికేటాయింపు లభించేది.

రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా మిగులు జలాలను ఉపయో గించుకుని గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎస్.ఎల్.బి.సి., నెట్టెంపాడు, భీమా తదితర సాగునీటి పథకాలను రూపొందించింది. ఈ పథకాలన్నీ అమలు చేసినా కేవలం 240 టి.ఎంసి.ల మిగులు జలాలను మాత్రమేవినియోగించుకోవటం

సాధ్యమయ్యేది. కానీ ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోలేదు. ఈ విధమైన పరిస్థితి ఏర్పడడానికి  కారణం

ఇక్కడి ప్రజా ప్రతినిధులు అసలు  పట్టించుకోకపోవడమే.

హంద్రీనీవా పథకం ఈ జిల్లాలో సాగుతోంది. రాయలసీమ జిల్లాలకు 40 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం డ్యాంలో చేరిన వరద నీటిని లిఫ్ట్ ద్వారా ఈ నీళ్ళు ఇవ్వాలన్నారు. కానీ రాయలసీమకు వరద  నీరు ఒక టీఎంసీ నీరు కూడా   రావట్లేదు.ఈజిల్లాకు  కనీసం 250 టీఎంసీల నీరు వస్తే ఒక పంటైనా రైతులు పండించు కుంటారు.   దీనికోసం కృష్ణా నది నీటి కేటాయింపు పునః పంపిణీ చేయాలి.  సర్కారు వారు మూడు పంటలకు సరిపడా నీళ్లు తీసుకుంటు న్నారు.రెండు పంటలు కూడా నోచుకోని ఈ జిల్లాకు 100 టీఎంసీల నికర జలాలు ఇవ్వడానికి సిద్ధపడాలి. తుంగభద్ర డ్యాం నుండి 50 టీఎంసీల నీరు జిల్లాకు మళ్ళించే ప్రణాళిక అమలు చేయాలి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుంచి 30 టీఎంసీల నీరు అడిగి తీసుకోవాలి. చెరువులు కుంటల్లో పూడికలు తీయాలి.

అప్పుడు కొంతలో కొంత బాగుపడే అవకాశం ఉంది.


__పిళ్లా కుమారస్వామి

           9490122229


కడప జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని పాతతరం వారిని మీ వయస్సు ఎంత?అని అడిగితే గంజి కరువు, లేదంటే మరో కరువులో పుట్టామని చెప్పడం నేటికీ కనబడుతుంది. కరువులు ఇక్కడి జనజీవనంలో అంతర్భాగమై పోయాయన్నవిషయం దీన్నిబట్టి స్పష్టమౌతుంది. కరువులు, రోగాలు, ఆకలి మరణాలు, వలసలు,నేరాలు, ఘోరాలు ఎన్నో... కలబంద గడ్డలు, దేదారాకు తిని ప్రాణం పట్టుకున్నకాలాలు ఎన్నెన్నో... విజయనగర పాలన మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులు గంజి కేంద్రాలు, కరువు పనులు, రెమిషన్లు, కమిషన్లు, యాగాలు, వగైరాలు మినహా శాశ్వత కరువు నివారణకు చేపట్టిన కార్యక్రమాలు స్వల్పం. చరిత్రను ఓమారు అవలోకిస్తే...


          1791 - 92లో దక్కన్ పీఠభూమి అంతటా కరువు తాండవించింది . రాయలసీమ ప్రాంతం మరీతల్లడిల్లి పోయింది . 

       1810 - 13 ( ఫసలీ 1220 -1222 ) లో జిల్లా కరువుతో వణికింది . వరుణదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు కోసం దేవాలయాల్లో యాగాలు నిర్వహించడానికి కడప కలెక్టర్ రాస్ నిధులు మంజూరు చేశారు . 

       ‌‌1822 నుంచి 1824 వరకు మరో కరువు జిల్లాను 

కాటువేసింది . ఐదు శేర్ల బియ్యం ఒక్కరూపాయి , ఆరు శేర్ల జొన్నలు ఒక్క రూపాయి ధర పలికాయి . అప్పట్లో ఆ ధర చాలా ఎక్కువ . వర్షాలు కురవాలని నాటి కలెక్టర్ హన్బరి 300 వరహాలు మంజూరు చేయించుకుని పుష్పగిరి దేవాలయంలో వరుణ యాగాలు చేయించారు . ఎంత పరాయిపాలకులై నప్పటికీ ఇక్కడి ప్రజల విశ్వాసాలను గౌరవించక తప్పలేదు . 


*' నందన ' లో పెను విషాద కరువు*


1832 - 33లో ఒక భయంకరమైన కరువు సంభవించి జిల్లాలో పెనువిషాదాన్ని సృష్టించింది . నందన నామ సంవత్సరంలో వచ్చింది గనుక దీన్ని నందన కరువుగా పిలుస్తారు . దీని తీవ్రతను గుర్తించడం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి ఇష్టం లేదు . కరువు అనే పదప్రయోగాన్నే వారు జీర్ణించుకోలేక పోయారనడానికి ఒక ఉదాహరణ గురించి ఇక్కడ చెప్పుకోవాలి . సరిగ్గా నందన కరువు సమయంలో 1832 డిసెంబర్ 21వ తేది సి . పి . బ్రౌన్ గుంటూరు జిల్లా 

యాక్టింగ్ కలెక్టర్‌గా డబ్ల్యు . మేసన్ నుంచీ బాధ్యతలు స్వీకరించారు . కరువు కష్టాలు , ఆకలి చావుల గురించి ప్రజలు సమర్పించే అర్జీల ద్వారా బ్రౌన్ తెలుసుకున్నారు . కరువులో నేరాల సంఖ్య పెరగడం సహజం . గుంటూరు జిల్లాలో 

కూడా దొంగతనాలు , దోపిడీలు పెరిగాయి . కలెక్టర్‌గా వీటికి అడ్డుకట్ట వేయడం ఆయన బాధ్యత . అందుకనే 1833 జనవరి 16వ తేది చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో . . . 

           ప్రస్తుతం నెలకొన్న ' కరువు ' ( ఫ్యామిన్ )కారణంగా దొంగతనాలు పెరిగినందున పోలీసు శాఖకు అవసరమైన మందు గుండు సామాగ్రి సరఫరాచేయండంటూ కోరారు . బ్రౌన్ రాసిన లేఖలోని ' కరువు ' ( ఫ్యామిన్ ) అనే పదాన్ని చూసిన చీఫ్ సెక్రటరీకి ఎక్కడో కాలింది . ఎందుకంటే అప్పటి దాకా ఏ కలెక్టర్ కూడా ' FAMINE ' అనే పదాన్ని ఉపయోగించలేదు . అందరూ DROUGHT , In 

SCARCITY , DISTRESS , ADVERSE SEASON వంటి పదాలనే ఉపయోగించారు. ఇప్పటికీ కలెక్టర్లు కమిషనర్ ఫర్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ కు పంపే ప్రతిపాదనల్లో  

ADVERSE SEASONAL CONDITIONS & DROUGHT అనే రాస్తున్నారు . ' కరువు ' అనే తీవ్రమైన పదాన్ని ఉపయోగించే బదులు ' కొరత ' ( Scarcity ) అని 

రాయచ్చు కదా అంటూ బ్రౌన్ ను మందలిస్తూ ఆనాటి చీఫ్ సెక్రటరీ సంజాయిషీ అడిగారు . కరువే నిజమైతే ధరల పరిస్థితి ఎలా ఉందో తెలుపాలని ఆదేశించారు . బ్రౌన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అన్ని వివరాలు పంపారు .


*ది గ్రేట్ ఫ్యామిన్ 1876 - 78* 


              1876లో అతిపెద్ద కరువు సంభవించింది . మద్రాసు ప్రెసిడెన్సీలోని 14 జిల్లాలను కబళించగా , అందులో 8 జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి . ఈ కరువు రాకాసి మూడున్నర మిలియన్ల జనాభాను పొట్టన పెట్టుకుంది . ప్రాణాలు వదిలేసిన పశు సంపదకు లెక్కేలేదు . ఇందులో కడప జిల్లా కూడా ఒకటి . 

              వరుసగా సంభవిస్తున్న అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా 1874 నుంచే కరువు ఛాయలు పొడచూపుతూ వచ్చాయి . 1876 జులై నాటికి తీవ్రతరం 

కావడం ప్రారంభమైంది . తొలుత పులివెందుల , కమలాపురం , బద్వేల్ తాలూకాలు దెబ్బతిన్నాయి . సెప్టెంబర్ ద్వితీయా ర్థానికి జిల్లా అంతటా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి . ఏప్రిల్ లోనే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కరువు ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పిలిపించి రానున్న రోజుల్లో చేపట్టాల్సిన రిలీఫ్ పనులపై ప్రతిపాదనలు స్వీకరించింది . కరువులో పేద ప్రజలను ఆదుకోవడం కోసం 25 వేల రూపాయలు మంజూరు 

చేయాలని ఆనాటి కడప కలెక్టర్ జె . ఆర్ . డేనియల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూను కోరారు . కాగా 10 వేల రూపాయలు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది . భవిష్యత్ గురించి ఆలోచించిన వ్యాపారులు , కొందరు రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని 

మార్కెట్లోకి విడుదల చేయకుండా నిల్వ ఉంచుకున్నారు . అక్టోబర్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి . కూలీ రేట్లు దారుణంగా పడిపోయాయి . 

ప్రజలు ఆకలి బాధ తాళలేక నాగజెముడు ( నాగదారి - Prickly Pear ) , వివిధ రకాల అడవి మొక్కలు , దేవదారి ఆకులు ( The leaves of Sethia Indica ) , కలబంద 

గడ్డలు తింటూ కాలాన్ని భారంగా వెళ్లదీశారని నాటి శానిటరీ కమిషనర్ డాక్టర్ కార్నిష్ పేర్కొనడం చూస్తే ప్రజలు ఎంతటి దారుణ పరిస్థితులు అనుభవించారో తెలుస్తుంది . ప్రభుత్వం రిలీఫ్ వర్క్స్ చేపట్టింది . డిసెంబర్ 16వ తేదీ నాటికి 

జిల్లాలో 1,02,340 మందికి పనులు కల్పించారు . ఇందులో పురుషులు 42,078 , మహిళలు 46,833 కాగా చిన్నపిల్లలు సైతం 13,429 మంది ఉండటం గమనార్హం . ఇంకా 3,308 మందికి గ్రాట్యూషస్ రిలీఫ్ అందించారు . కడప , కర్నూలు , బళ్లారి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం డిపోలు ఏర్పాటుచేసింది . ఈ జిల్లాల గ్రెయిన్ ఏజెంట్ గా థార్న్ హిల్ అనే అతన్ని నియమించారు . ఆయన బళ్లారి కేంద్రం చేసుకోగా , మిగిలిన జిల్లాల్లో డివిజనల్ అధికారులు నియమితులయ్యారు . పశుగ్రాస సమస్య తీవ్రరూపం దాల్చింది . నాగదారి ( నాగజెముడు ) మొక్కలను పశువులకు గ్రాసంగా 

ఉపయోగించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది . ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్క ఆకులు మందంగా , గుండ్రంగా ఉండి వాటి పై బాకుల్లాంటి పదునైన ముళ్లు ఉంటాయి . ఈ మొక్కకు కాసే ఎర్రటి పండ్లు రుచికరంగా కూడా ఉంటాయి . ఒకప్పుడు జిల్లాలో ఎక్కడపడితే అక్కడ విస్తారంగా ఉండిన ఈ మొక్కలు ప్రస్తుతం అంతగా కనిపించడం లేదు . ఈ మొక్కలను పశుగ్రాసంగా 

వినియోగించాలన్న నాటి ప్రభుత్వ ప్రయోగం పాక్షికంగానే విజయవంతమైంది . 

                పశువులను పోషించలేక నామమాత్రపు ధరలకే అమ్ముకున్నారు . పశువులకు జబ్బులు విపరీతమయ్యాయి . 1877 జనవరి రెండవ వారానికి ఇలా రోగాల బారినపడి 

1460 మృతిచెందాయని అధికారిక గణాంకాలు చెబుతున్నా యంటే , ఇక వాస్తవంగా ఎన్ని పశువులు చనిపోయి ఉంటాయో ఊహించుకోవచ్చు . అదేనాటికి కలరా కాటుకు 564 మంది మృతిచెందారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి . ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంట్లు , కరువు పనులు జరిగే ప్రదేశాల్లో జనం పిట్టల్లా రాలిపోయారు . గ్రామాలు స్మశాన వాటికలను తలపించాయి.


గంజితో ప్రాణం పట్టుకుని . . . . 


ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గంజి తాగి ప్రాణం పట్టుకున్న రోజులవి . ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లెకు చెందిన వీరనాల పెద్దసుబ్బయ్య అనే శత వృద్ధుడు 1957లో విద్వాన్ కట్టా నరసింహులుకు తెలిపిన వివరాలు . . . 

“ రాణెమ్మ ( విక్టోరియా మహారాణి ) కాలంలో పాటి మీద తోపు ( మామిడి తోట ) లో గంజి కాచి పోసేవాళ్లు . రంగూన్ నుంచి తెప్పించిన బియ్యంతో గంజి తయారు చేసేవాళ్లు . ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కొక్కరికి 

ఒక మట్టి ముంత గంజి , ఒక ఎరగడ్డ పంపిణీ చేసేవాళ్లు . రోజూ ఒక ముంత గంజి తాగుతూ ప్రాణాలు పట్టుకున్నాం ” 


        *గంజి కరువు 1951 - 52* 

స్వాతంత్ర్యానంతరం వచ్చిన తొలి అతి పెద్దది గంజి కరువు . ప్రభుత్వం ఏర్పాటు చేసిన ' రిలీఫ్ కిచెన్స్ ' ల్లో ప్రజలు గంజితాగి ప్రాణాలు కాపాడు కున్నారు . అందుకే దీన్ని గంజి కరువు అని పిలుస్తారు . నాటి భయానక కరువుకు సజీవ సాక్షులు నేటికీ ఉన్నారు . 

            1947 - 48 నుంచీ రుతుపవనాలు విఫలమౌతూ వచ్చాయి . దీంతో 1951-52 నాటికి పరిస్థితి ఉగ్రరూపం దాల్చింది . పంటల సాగు దారుణంగా పడిపోయింది . 

అక్కడక్కడా సాగైన పంటలు కూడా వరాలు లేక నిలువునా ఎండిపోయాయి . ప్రజలకు చేయడానికి పనులు లేకుండా పోయాయి . చేతిలో చిల్లిగవ్వ లేనందున కుటుంబాల పోషణ చాలా భారంగా మారింది . ఆకలి బాధను తాళలేక ఎందరో 

ప్రాణాలు వదిలారు . తాగేందుకు గుక్కెడు నీరుకూడా కరువైంది . కలరా మహమ్మారి విజృంభించి ఎందరినో బలితీసుకుంది . 1952 జూన్లో కలరాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టింది . దేదారాకు , కలబంద గడ్డలు ఉడికించుకుని తింటూ ఎందరో ప్రాణాలు కాపాడుకున్నారు . గడిలేక ఎన్నో పశువులు 

మరణించగా , వాటి మూగ వేదన చూడలేని రైతులు అయినకాడికి కబేళాలకు తెగ నమ్ముకున్నారు . గంజి కేంద్రాల ఏర్పాటు ప్రజల ఆకలి తీర్చి వారి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర , రాష్ట్ర నిధులతో ప్రభుత్వం గంజి కేంద్రాలు ఏర్పాటుచేసింది . అనధికారులతో కూడిన కమిటీలకు వీటి నిర్వహణ బాధ్యతను అప్పగించారు . అధికార యంత్రాంగం వీటిని పర్యవేక్షిస్తుండేది . 1952 ఆగస్ట్ నాటికి వీటి సంఖ్య 420కి చేరింది .

                 చేనేత కార్మికుల కోసం ప్రత్యేకించి 19 గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు . ప్రభుత్వం చౌక ధరల దుకాణాలను ఏర్పాటుచేసి ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది . 


ప్రధాని నెహ్రూ జిల్లా సందర్శన 


ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1952 అక్టోబరు 7వ తేదీ రాయచోటిని సందర్శించి ప్రజల దైన్యాన్ని కళ్లారా చూశారు . రిలీఫ్ కిచెన్స కు వెళ్లి ఆయన స్వయంగా గంజి సేవించారు . ఆకలి బాధ తీర్చుకోవడానికి గంజి కేంద్రాల 

వద్ద బీదా బిక్కి పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు.

రాష్ట్ర గవర్నర్ శ్రీ ప్రకాష్, ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలచారి,కేంద్ర ఆహార శాఖ మంత్రి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప ప్రధాని వెంట జిల్లా పర్యటనలో పాల్గొన్నారు.


(సేకరణ: పిళ్లా కుమారస్వామి, 9490122229

(ఫణి రాసిన భూ పరిపాలన,కడప గ్రంథం నుండి)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి