మల్లెం కొండ కడపకద్దిన కాశ్మీరం
మల్లెం కొండ కడపకద్దిన కాశ్మీరం
కొండ గాలుల, సంగీత సవ్వడులను తలపిస్తూ గల గల దూకే జలపాతాలు, పక్షుల కిల కిలా రావాలు, ప్రకృతి సంగీతాన్ని ఆలపించే నిశ్శబ్ధ స్వరాలు, స్వచ్ఛమైన వినీలాకాశపు నిర్మలత్వం మనసును మైమరిపించే మల్లెం కొండ అందాలు,అనుభూతులు కాశ్మీర్ సోయగాలకు
ఏ మాత్రం తీసిపోవు అనిపిస్తుంది.కురిసిన వర్షాలకు అడవంతా పచ్చని చీరకట్టుకున్నట్లుంది. దారి పొడవునా అక్కడక్కడా మట్టి కొట్టుకుపోయి ఎగుడుదిగుళ్లు, వాగులు, వంకల్లో రాళ్లు ఇంటిలో రాయిలా తగిలినా ఆ అందాల వీక్షణ అవన్నీ మరచేటట్లు చేస్తుంది.
మల్లెం కొండ కడప ( వైఎస్సార్) జిల్లా లోని బద్వేలుకు 5కి.మీ.దూరంల ఉన్న గోపవరం మండలంలో ఉంది. ఈ కొండ గురించి మెఖంజీ కైఫియత్తు ఉంది. కైఫియత్తు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం గ్రామాధికారి రాసిన ఒక రికార్డు.
మెఖంజీ కైఫియత్తు ప్రకారం పెదవీరమల్లుడు చినవీరమల్లుడు అనే సోదర రాజులు మల్లెం కొండ ప్రాంతంలో వేటకు వచ్చారు. వీరు ఏ ప్రాంతపు రాజులో తెలుపలేదు. పెదవీరమల్లుడు నిండు చూలాలుగా వున్న అడవి పందిని వేటాడాడు. అది పరిగెత్తి ఆ కొండ మీద నుండి కోనలో దూకి ప్రాణాలు విడిచింది. దాని కడుపు పగిలి ఐదు లింగాలు బయటపడ్డాయి.అది శివుని మహిమగా భావించి ఆ సోదరులు ఆ లింగాలను ప్రతిష్టించారు. ఆ ప్రాంతం పంచలింగాల కోన అయ్యింది. ఆ ప్రాంతంలోనే ఆ సోదరులు కోట కట్టుకున్నారు అదే లింగాల కోట అన్నారు.
ఆ రాజులిద్దరికీ మేనల్లుడు ఏరువరాజు. అతను కోటకు తూర్పున విస్తరించి వున్న ఏపి, రేల చెట్లను నరికి ఏపెరేల అనే గ్రామం నిర్మించాడు. దాన్నే ప్రస్తుతం ఎప్పిరాలని పిలుస్తున్నారు. బహుశా ఆ చెట్ల వలన ఆ గ్రామానికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. ఆ ఎప్పిరాల ఇప్పుడు సోమశిల ప్రాజెక్టు కింద మునకలో కలిసిపోయింది.
కొంత కాలానికి నెల్లూరు సిద్ధిరాజుకు పొత్తపి పాలకుడు మల్లదేవ సోమదేవులకు దొంగలసాని(ప్రస్తుతం ఒంటిమిట్ట మండలం లో ఉంది) ప్రాంతంలో యుద్ధం జరిగింది. సిద్ధిరాజుకు సహాయంగా పెదవీరమల్లుడు యుద్ధంలో పాల్గొన్నాడు. వారిద్దరూ యుద్ధంలో అన్నదమ్ములిద్దరూ మరణించారు. వారికి సంబంధించిన శివమహాదేవరాజు లింగాల కోట దొరతనం చేస్తూ వున్నాడు.ఆయన తన మేనత్త కొడుకు రామవద్దేవరాజుకు తన తోబుట్టువునిచ్చి పెళ్ళి చేసినాడు. వారికి గంగరాజనే కుమారుడు జన్మించాడు.
పూర్వం పెద మరియు చినవీరమల్లులకు మండువ కోట పాలకుడు మండువతాతతో వైరం వున్న కారణంగా, అప్పటి ఆ పగని తీర్చుకోవడానికి శివమహాదేవరాజు మండువ కోటపై దాడికి గంగరాజుని పంపాడు .మండువ కోటపై విజయం సాధించిన గంగరాజు మండువతాతను బందీగా పట్టుకొన్నాడు. కానీ యుద్దంలో తగిలిన గాయాల వల్ల కోలుకోలేక పోయిన గంగరాజు కొంతకాలానికి కైవల్యం చెందాడు.
లింగాల కోట వద్ద పట్నంలో ప్రజలు గంగరాజు శిలను నిలిపారు. గుర్రం మీద స్వారీ చేస్తూ గొడుగు పట్టబడి ఒక చేతిలో కత్తి వున్నట్లు ఆ శిల మీద చెక్కారు. ఆ శిల్పాన్ని మల్లెం కొండ అనే పర్వతం మీదుంచారు. ఆ గంగరాజు విగ్రహానికి మల్లెం కొండయ్య అని పూజలు చేయడం మొదలెట్టారు. ఈ పూజలు ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి, జనం వచ్చి మల్లెం కొండయ్యను దేవుడిగా పూజిస్తూ పొంగళ్ళు పెడుతూ దేవాలయం కట్టించి మాన్యాలు యేర్పాటు చేసి తిరుణాల్లు చేస్తూ వున్నారు. కాకపోతే ఇంటాక్ సభ్యులు అడవాల శేషగిరి రాయుడు అక్కడున్న విగ్రహం గంగరాజు కాదని చిన్న వీరమల్లుడుదని భావిస్తున్నారు.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
ఆధారం : 1.మెఖంజీ కైఫియత్తులు (కడప జిల్లా నాలుగో భాగం)
2.అడవాల శేషగిరి రాయుడు గారి సోషల్ మీడియా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి