పెన్నా నది పై నిర్మించిన ప్రాజెక్టులు
పెన్నా నది పై నిర్మించిన ప్రాజెక్టులు.
"ఇదే పెన్న ఇదే పెన్న
నిదానించి నడు
వట్టి ఎడారి తమ్ముడు"
"ఇదే పెన్న ఇదే పెన్న
నిదానించి నడు
వట్టి ఎడారి తమ్ముడు"
అంటూ విద్వాన్ విషయం వర్ణించిన ఒకే ఒక అజీవనది పెన్నా . ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఏకైక నది. పెన్నా నది కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని నందికొండలలో (Nandi Hills) వద్ద 1,500 మీటర్ల ఎత్తున పుట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు వద్ద బంగాళా ఖాతంలో కలుస్తుంది. పెన్నా నది మొత్తం పొడవు 597 కి.మీ. ఇది అక్కడ నుండి 69 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లా పరిగి మండలంలో ప్రవేశిస్తుంది. అక్కడినుంచి 37 మండలాలో 267 కి.మీ. ప్రవహిస్తూ తాడిపత్రి మండలం నుంచి నిష్క్రమించి కడప జిల్లా గండికోటకు చేరుకుంటుంది. జిల్లాలో నది ప్రవేశించే చోట సముద్ర మట్టానికి 635 మీటర్లు ఉంటే, గండికోటకు చేరేటప్పటికి 220 మీటర్లకు తగ్గిపోతుంది. పెన్నా నది వాలు ఎక్కువగా ఉంటుంది. సగటున ప్రతి కి.మీ. కు 50 అడుగుల మేర ఎత్తు తగ్గుతూ ఉంటుంది. అందుకే Mysuru plateau లో నదుల వాలు ఎక్కువగా ఉంటుందని ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన ఆత్మకథలో రాసుకున్నారు.
దీనికి ప్రధాన ఉపనదులు పాపాఘ్ని, చిత్రావతి, కుందు, చెయ్యేరు, మదనపల్లె వాగు
చిత్రావతి నది కూడా గతంలో అనంతపురం జిల్లాలో ఒక ప్రాంతాన్ని బాగా ఆదుకున్న చరిత్ర ఉన్నది.ఈ జిల్లాలో పెద్ద చెరువులైన బుక్కపట్నం, ధర్మవరం చెరువులు చిత్రావతి మీదనే ఉన్నాయి.
జిల్లా భౌగోళికంగా ఏటవాలుగా ఉండడం చేత పెన్నానది వర్షాల కాలంలో మెరుపువేగంతో ప్రవహిస్తుంది. అందుకే విద్వాన్ విశ్వం దీనిని పీనుగుల పెన్నా అని పేర్కొన్నారు. ఈ నదిలో నీరు ప్రవహించడం 20- 25 సంవత్సరాలకు ఒకసారి కనబడే అరుదైన సన్నివేశం. 2022 సంవత్సరంలో కనులకు ఇంపుగా పెన్నా నది ప్రవహించింది. అయితే ప్రభుత్వ అసమర్థత వల్ల వరద నీరంతా సముద్రం పాలయ్యింది. కడప జిల్లాలో గండికోట తర్వాత నది నెల్లూరు జిల్లాలో సముద్రం లో కలిసేంత వరకూ యర్రమల, శేషాచలం కొండల మీద కురిసిన వర్షాలతో ఏర్పడిన నదులు పెన్నా లోకి నీటిని తెస్తాయి. గండికోట ఎగువన ఉన్న అప్పర్ పెన్నా అంతా మనకు ఒట్టిపోయిన పెన్నాగానే కనబడుతుంది.కడప జిల్లాలో గండికోట కోట నుంచి కలిసే ఉప నదులు పెన్నానదికి నీళ్ళు ఇస్తాయి. అవి నెల్లూరు జిల్లాకు మాత్రమే ఉపయోగపడుతాయి.
ఏ 20 ఏళ్లకో, 25 ఏళ్లకో ఒక్క సారి పారే నది ఇది. గాలేరు-నగరి & హంద్రీ-నీవా ప్రాజెక్టులు కడప, అనంతపురం ప్రాంతాల సాగుకు దోహదం చేస్తున్నాయి. 2021 లో కురిసిన అధిక వర్షాలతో 30 సంవత్సరాల తరువాత పెన్నా నది దాని ఉప నదులు నిండుగా పారినాయి.
మన రాష్ట్ర ప్రభుత్వం ఎండిన నదులను పునరుజ్జీవింప చేయడానికి 2021 ఒక పథకాన్ని ప్రకటించింది. రాయల సీమ నాలుగు జిల్లాల తో పాటు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో ఒక్కో జిల్లాలో ఒక్కో నదిని ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మన జిల్లాలో పెన్నా నదిని ఎంపిక చేశారు. మూడేళ్లలో ఒక్కో నది మీద 50-70 కోట్ల ఖర్చుతో నది వెంబడి వర్షపు నీటి నిల్వలు, సబ్ సర్ఫేస్ డ్యాములు, పర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం చేపడతామని చెప్పారు. ఒక స్వచ్ఛంద సంస్థ తోఒప్పందం కుదుర్చుకున్నట్లు గా, మే మాసం నుంచే పనులు మొదలు పెడుతున్నట్లుగా చెప్పారు.(1) అయితే ఆ పథకం ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తి అయినా ఇంతవరకూ పనుల జాడ లేదు. ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వచ్చి వెంటనే పెన్నా నదిని పురుజ్జీవింప చేయాల్సి వుంది.
పెన్నా నది పుట్టుక నుంచి కడప జిల్లా గండికోట వరకూ అప్పర్ పెన్నా గా పిలుస్తారు. ఈ అప్పర్ పెన్నా పైన కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. అవి
1. పెన్నా కుముద్వతి ప్రాజెక్ట్
పెన్నా నదిలో కుముద్వతి నది కలిసేచోట 1952లో హిందూపురం వద్ద నిర్మించిన ఆనకట్ట ఇది. దీని ద్వారా 18 గ్రామాలకు సంబంధించిన 6126 ఎకరాలకు, 7 చెరువులకు నీళ్లు అందించడానికి ఉద్దేశించబడింది. దీని సామర్థ్యం 1.30 టీఎంసీలు. పరిగి, హిందూపురం మండలాలకు ఉపయోగం. పెన్నాపారక పోవడం వల్ల ఇది పురావస్తు కట్టడంగా మిగిలిపోయింది.
2. అప్పర్ పెన్నా (పేరూరు ప్రాజెక్ట్)
1959 లో 1.8 టీఎంసీల సామర్థ్యంతో 10,052 ఎకరాలకు నీరందించేదానికి పేరూరు వద్ద నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. ఒక్కసారి మాత్రమే ఈ ప్రాజెక్టు నిండిందని చెబుతారు. ఆలనా పాలనా లేక ప్రాజెక్టు నిండా కంపచెట్లు పెరిగాయి. విశేషమేమంటే ఎవరూ పట్టించుకోక పోయినా ప్రాజెక్టు ఈనాటికీ చెక్కుచెదరకుండా సగర్వంగా నిలిచి ఉండడం విశేషం. గత సంవత్సరం హంద్రీనీవా కాలువ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీరు అందించారు.. ఈ ప్రాజెక్టు లోనికి నీరు వస్తే 2- 3 మండలాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి.
(3) యోగివేమన ప్రాజెక్టు
ముదిగుబ్బ మండలంలోని అడవి బ్రాహ్మణపల్లి వద్ద 2001లో నిర్మించిన ప్రాజెక్టు ఇది. 0.900 టీఎంసీల సామర్థ్యంతో చిత్రావతికి ఉపనది అయిన మద్దిలేరు మీద నిర్మించారు. దీనికి 13 గ్రామాల 12880 ఎకరాల ఆయకట్టు ఉంది. నిర్మించిన తర్వాత ప్రభుత్వానికి మనసురాక 2017 వరకూ దీనిని ప్రారంభించలేదు. గత సంవత్సరం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండడం ఒక సంతోషకరమైన విషయం.
(4) చెన్న రాయస్వామి గుడి ప్రాజెక్టు (సిజి ప్రాజెక్టు)
తనకల్లు మండలంలో పాపాఘ్ని నది మీద (పెన్నా ఉపనది) 900 ఎకరాలకు నీరందించడానికి 1960లో నిర్మించిన అతి చిన్న ప్రాజెక్టు ఇది. దీని సామర్థ్యం 0.170 టీఎంసీలు. ప్రాజెక్టు స్థలం వద్ద చాలా తక్కువ వెడల్పుతో లోతుగా ప్రవహిస్తుంది. చూడటానికి ఒక మడుగు మాదిరి కనబడుతుంది. పైన కర్ణాటకలో చెక్ డ్యాములు నిర్మించడం వల్ల దీనిలోకి నీరు రావడం లేదు. అనంతపురం జిల్లాలో నీళ్ళు లేకుండా కనిపిస్తోన్న ఈ నది, చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలతో కలిసి కడప జిల్లాలో పెన్నానదికి చెప్పుకోదగ్గ విధంగా నీటిని అంద చేస్తుంది. పెన్నాలో కలిసే ఈ నీరంతా నేరుగా నెల్లూరు జిల్లాకు మాత్రమె ఉపయోగ పడుతుంది.. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు మేలు జరుగక పోగా నదికి అటు ఇటు గ్రామాల మధ్య రాక పోకలు నిలిచి పోతాయి.. నీరున్నప్పుడు చిన్న తెప్పలతో నదిని దాటుతారు. ప్రాజెక్టు చాలా అందంగా ఉంది. ఎత్తైన రాతి స్తంభం మీద జాతీయ చిహ్నాలు చెక్కడం ఒక అందం.
లోయర్ పెన్నా
గండికోట నుంచి నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతం లో కలిసెంతవరకూ "లోయర్ పెన్నా" అని పిలుస్తారు. లోయర్ పెన్నా (Lower Pennar) దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధాన ఉపనది వ్యవస్థగా ప్రసిద్ధి పొందింది. లోయర్ పెన్నా కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కవర్ చేస్తుంది. ఇది ఎక్కువగా వర్షాధార నది (Rain-fed River). అయినప్పటికీ ఈ నదిపై ఆధారపడి రైతులు ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న, నువ్వులు, పత్తి సాగు చేస్తుంటారు. పెన్నా నది ద్వారా సాగునీరు సరిపోకపోవడంతో రైతులు భూగర్భ జలాలు (Groundwater) పై ఎక్కువ ఆధారపడుతున్నారు.
లోయర్ పెన్నా పై 3 ప్రాజెక్టులు నిర్మించారు. అవి
1. సోమశిల డ్యామ్
సోమశిల ప్రాజెక్టును నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై 1971లో నిర్మించారు. దీని పూర్తి సామర్థ్యం 70 టీఎంసీలు. అయితే, 2024 జూలై నాటికి, డ్యామ్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా, అప్రాన్ ప్రాంతం ధ్వంసమైందని, ఎర్త్ డ్యామ్, సిల్ప్‌వే, జనరల్ మెయింటెన్స్‌కు సిబ్బంది లేకుండా పోయారని నివేదికలు సూచిస్తున్నాయి. సోమశిల ప్రాజెక్టు కు మరమ్మతులు నిర్వహిస్తే అది పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికివీలవుతుంది.
2.గండికోట రిజర్వాయర్
గండికోట రిజర్వాయర్ ను వైయస్సార్ కడప జిల్లాలో గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు.
దీనికి కృష్ణా నది నుండి 10,900 క్యూసెక్కుల నీటి ప్రవాహం అందుతున్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. దీని ద్వారా కడప, అన్నమయ్య జిల్లాల్లో మూడు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించబడుతోంది.
గండికోట రిజర్వాయర్ నిండితే సర్వరాయ సాగర్ ప్రాజెక్ట్, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లకు నీటి విడుదల సాధ్యమవుతుంది. ఈ రిజర్వాయర్ కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చబడుతున్నాయి.
3. శ్రీ పొట్టి శ్రీరాములు బ్యారేజ్
. శ్రీ పొట్టి శ్రీరాములు బ్యారేజ్ . దీన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై 1882-86 మధ్య బ్రిటిష్ సర్కార్ నిర్మించింది.దీన్ని నెల్లూరు బ్యారేజ్ అని కూడా పిలుస్తారు.
4. సంగం బ్యారేజి
సంగం బ్యారేజ్ కొత్తది. ఈ బ్యారేజ్ ని 2022 లో సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మించారు.ఈ ప్రాజెక్ట్‌కు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారు. దీని ద్వారా దిగువన ఉన్న గ్రామాలకు ముంపు ముప్పు తగ్గింది. ఈ బ్యారేజ్‌పై 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించారు.ఇది సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు సులభతరం అయ్యాయి.వెతివంక ప్రాజెక్ట్ ను కూడా దీనికి అనుసంధానం చేశారు.
నెల్లూరు, కడప పరిసరాల్లో పారిశ్రామిక వ్యర్థాల వల్ల పెన్నా నీరు కలుషితమవుతోంది.
ప్రత్యేకించి పొన్నలూరు, గూడూరు, శ్రీహరికోట ప్రాంతాల్లో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంది.
లోయర్ పెన్నా ప్రధానంగా వర్షాధార నది, కాబట్టి గోదావరి, కృష్ణా లాంటి నదుల్లా 12 నెలలు నీటి ప్రవాహం ఉండదు. దీని కారణంగా రైతులు కరవుతో ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం – పెన్నా లింక్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా, గోదావరి నీటిని పెన్నా నదికి మళ్లించాలని యోచిస్తున్నారు.
నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పెన్నా నది నీరు పరిశ్రమలకు ఉపయోగపడుతోంది.
శ్రీహరికోట (ISRO) కేంద్రం కూడా ఇందులో భాగం. ఈ నది తీర ప్రాంతాల్లో చేపల పెంపకం (Aquaculture) అభివృద్ధి చెందుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి